Skip to main content

KGBV Teachers: కేజీబీవీల్లో ప్రత్యామ్నాయం.. తాత్కాలిక టీచర్ల నియామకానికి చర్యలు

మెదక్‌జోన్‌: జిల్లావ్యాప్తంగా 19 కస్తూర్బా (కేజీబీవీ)లు ఉండగా.. అందులో సుమారు 6,000 పైచిలుకు విద్యార్థినులు చదువుకుంటున్నారు.
Alternate in KGBV Teachers

వాటిలో నాలుగు విద్యాలయాల్లో 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు తరగతులు కొనసాగుతుండగా.. మిగితా 15 విద్యాలయాల్లో 6 నుంచి పది వరకు తరగతులు కొనసాగుతున్నాయి. కాగా జిల్లాలో సమగ్ర శిక్షా ఉద్యోగులు మొత్తం 600 వరకు ఉండగా, వారిలో కేజీబీవీల్లో 120 మంది విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. మిగితా 480 మంది డీఈఓ, ఎంఈఓ తదితర శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా తమను పర్మనెంట్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో వారంతా విధులు బహిష్కరించి సుమారు 25 రోజులుగా సమ్మెబాట పట్టారు. దీంతో కేజీబీవీల్లో బోధన పూర్తిగా నిలిచిపోయింది. కాగా ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఉండగా, మార్చి 5వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు ఉన్నాయి. అలాగే మార్చి 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేజీబీవీల్లో సిలబస్‌ ఇప్పటికీ పూర్తికాలేదు. కాగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, మోడల్‌ స్కూల్స్‌, ప్రభుత్వ కళాశాలల్లో ఇప్పటికే పది, ఇంటర్మీడియెట్‌ సిలబస్‌ పూర్తి చేసి విద్యార్థులతో రివిజన్‌ చేయిస్తున్నారు. అంతే కాకుండా పది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు సైతం ప్రారంభించారు. కేజీబీవీల్లో మాత్రం పాతికరోజులుగా బోధన నిలిచిపోవడంతో సిలబస్‌ పూర్తికాక విద్యార్థుల చదువు అటకెక్కింది.


విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు

కేజీబీవీల్లో చదువుతున్న బాలికలు నష్టపోకుండా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ నుంచి డీఈఓకు ఇటీవలే స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు, మోడల్‌ స్కూల్స్‌లో బోధించే సిబ్బందిని తాత్కాలికంగా కేజీబీవీల్లో నియమించి బోధన కొనసాగేలా ఆగమేఘాల మీద చర్యలు చేపట్టారు.

ఇందుకోసం 120 మంది సిబ్బంది అవసరం కాగా.. ఇప్పటికే 10వ తరగతి, మోడల్‌ స్కూల్స్‌లో సిలబస్‌ పూర్తయిన పాఠశాలల ఉపాధ్యాయులను గుర్తించినట్లు తెలిసింది. అలాగే పర్యవేక్షణకు ముగ్గురు ప్రత్యేక అధికారులను సైతం నియమించారు.

చదవండి: Teachers: విధులకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్న టీచర్లపై వేటు

రెండు రోజుల్లో బోధన ప్రారంభం

కేజీబీవీల్లో పనిచేసే సిబ్బంది సమ్మెలో ఉండడంతో బోధన పూర్తిగా కుంటుపడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి తాత్కాలిక బోధన సిబ్బందిని నియమించాలనే ఆదేశాలు రావడంతో వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను నియమిస్తున్నాం. మరో రెండు, మూడు రోజుల్లో బోధన ప్రారంభిస్తాం.

– రాధాకిషన్‌, డీఈవో మెదక్‌
 

Published date : 06 Jan 2025 03:35PM

Photo Stories