Skip to main content

ఇంటర్‌తోనే.. ఐఐఎంల్లో ఎంబీఏ.. భవిష్యత్తు అవకాశాలు ఇలా!

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లు దేశంలో మేనేజ్‌మెంట్‌ విద్యకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు! వీటిలో చేరాలంటే.. బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో.. క్యాట్‌లో మంచి స్కోర్, ఆ తర్వాత నిర్వహించే ఎంపిక ప్రక్రియలో ¯ð గ్గాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు కొన్ని ఐఐఎంలు ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే.. ఎంబీఏలో చేరే అవకాశం కల్పిస్తున్నాయి. ఐఐఎం– జమ్ము, బో«ద్‌గయ క్యాంపస్‌లలో ఇంటిగ్రేటెడ్‌ మేనేజ్‌మెంట్‌ పీజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు జిప్‌మ్యాట్‌ –2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. జిప్‌మ్యాట్‌ పరీక్ష విధానం, ప్రవేశ నిబంధనలు, కోర్సు ద్వారా లభించే నైపుణ్యాలు, భవిష్యత్తు అవకాశాలు తదితర వివరాలు..
Only with Inter MBA in IIMs

రెండు క్యాంపస్‌లలో 260 సీట్లు

ఎన్‌టీఏ నిర్వహించే జిప్‌మ్యాట్‌(జాయింట్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌) స్కోర్‌ ద్వారా ఐఐఎం–జమ్ము, బో«ద్‌గయ క్యాంపస్‌లలో ప్రవేశాలు ఖరారు చేస్తారు. ఈ రెండు క్యాంపస్‌ల్లో ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌లో మొత్తం 260 సీట్లు భర్తీ చేస్తారు. జమ్ములో 140 సీట్లు, బో«ద్‌గయలో 120 సీట్లు ఉన్నాయి. వీటిలో చేరిన కోర్సు పూర్తి చేసుకున్న వారికి బీబీఏ+ఎంబీఏ పట్టా లభిస్తుంది. 

అర్హతలు

2023, 2024లో 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తుకు అర్హులు. 2025లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. 2021, ఆ తర్వాత పదో తరగతి పూర్తి చేసుకుని ఉండాలి.

400 మార్కులకు పరీక్ష 

జిప్‌మ్యాట్‌లో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 33 ప్రశ్నలు, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ విభాగంలో 33 ప్రశ్నలు, వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లో 34 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున మొత్తం 400 మార్కులకు పరీక్ష జరుగుతుంది. జిప్‌మ్యాట్‌లో పొందిన స్కోర్‌ ఆధారంగా.. అభ్యర్థులు జమ్ము, బో«ద్‌గయ క్యాంపస్‌లకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి.

చదవండి: Career Opportunities: మ్యాథమెటిక్స్‌ కోర్సులతో కెరీర్‌ అవకాశాలు..

వెయిటేజీ ఆధారంగా తుది జాబితా

ఐఐఎం–జమ్ములో జిప్‌మ్యాట్‌ స్కోర్‌కు 60 శాతం వెయిటేజీ, పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ మార్కులకు 15 శాతం వెయిటేజీ చొప్పున, పది శాతం జెండర్‌ వెయిటేజీ ఇచ్చి..అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా తుది జాబితా రూపొందించి ప్రవేశం ఖరారు చేస్తారు.
ఐఐఎం–బో«ద్‌గయలో జిప్‌మ్యాట్‌ స్కోర్‌కు 70 శాతం, పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ మార్కులకు 15 శాతం చొప్పున వెయిటేజీ కల్పిస్తారు. వాటిలో ప్రతిభ ఆధారంగా తుది ప్రవేశాలు ఖరారు చేస్తారు.

మేనేజ్‌మెంట్‌ లీడర్లను తీర్చిదిద్దేలా

ఐఐఎంలలోని ఇంటిగ్రేటెడ్‌ మేనేజ్‌మెంట్‌ పీజీ ప్రోగ్రామ్‌లు భవిష్యత్‌ మేనేజ్‌మెంట్‌ లీడర్లను తీర్చిదిద్దే విధంగా రూపొందించారు. కోర్సు తొలి సంవత్సరం నుంచే బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో రాణించేందుకు అవసరమైన కమ్యూనికేషన్‌ స్కిల్స్, బిజినెస్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్, అదే విధంగా మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫండమెండల్స్‌ను బోధించే విధంగా కరిక్యులంను సిద్ధం చేశారు. అదే విధంగా బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా నిలుస్తున్న అకౌంటింగ్, ఫైనాన్స్‌ తదితర సబ్జెక్ట్‌లకు కూడా తొలి ఏడాది నుంచే బోధన మొదలవుతుంది.

చదవండి: New Courses in IITs: మెషిన్‌ లెర్నింగ్‌, క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. ప్రవేశం విధానం, కెరీర్‌ అవకాశాలు ఇవే..

ఇంటర్న్‌షిప్స్‌

ఐపీఎం ప్రోగ్రామ్‌లో భాగంగా ఐఐఎంలు.. మూడో ఏడాది నుంచే ఇంటర్న్‌షిప్‌ను అమలు చేస్తుండటం ఈ కోర్సుల మరో ప్రత్యేకతగా పేర్కొనొచ్చు. ఫలితంగా విద్యార్థులకు 19, 20 ఏళ్లకే క్షేత్ర స్థాయి అవగాహన, నైపుణ్యాలు లభించే అవకాశం ఉంటుంది.

మూడేళ్ల తర్వాత ఎగ్జిట్‌ అవకాశం

ఐపీఎం ప్రోగ్రామ్‌లో చేరి.. మూడేళ్ల తర్వాత ఆ కోర్సును కొనసాగించడం ఆసక్తి లేని విద్యార్థులకు ఎగ్జిట్‌ అవకాశం కూడా అందుబాటులో ఉంది. మూడేళ్ల తర్వాత బీబీఏ సర్టిఫికెట్‌తో బయటికి రావొచ్చు. అయితే నాలుగో ఏడాది తర్వాత మాత్రం ఎగ్జిట్‌ అవకాశం ఉండదు.

ఎంబీఏ విద్యార్థులతో కలిపి

అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌లలో చేరిన విద్యార్థులు మూడేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత నాలుగో ఏడాది నుంచి ఎంబీఏ విద్యార్థులతో కలిపి బోధన నిర్వహిస్తారు. ∙దీంతో క్యాట్‌ స్కోర్‌ ఆధారంగా పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశించిన విభిన్న నేపథ్యాల విద్యార్థులతో కలిసి అభ్యసించే అవకాశం లభిస్తోంది. ఫలితంగా విద్యార్థులకు ఇంటర్‌ కల్చరల్, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌ అలవడుతున్నాయి.

స్పెషలైజేషన్‌.. నాలుగో ఏడాది నుంచి

మేనేజ్‌మెంట్‌ పీజీ అనగానే గుర్తొచ్చేది.. స్పెషలైజేషన్‌ అన్న విషయం తెలిసిందే. ఐపీఎంలో చేరిన విద్యార్థులు తమకు ఆసక్తి గల స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకుని నాలుగో సంవత్సరం నుంచి ఆ స్పెషలైజేషన్‌తో అభ్యసించే అవకాశం ఉంది. దాదాపు అన్ని స్పెషలైజేషన్లను ఇప్పుడు ఐఐఎం క్యాంపస్‌లు అందిస్తున్నాయి.

ఆకర్షణీయంగా ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌

అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ పూర్తి చేసుకున్న వారికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఆకర్షణీయ ఆఫర్లు లభిస్తున్నట్లు సదరు ఐఐఎం వర్గాలు పేర్కొంటున్నాయి. సగటు వేతనం రూ.22 లక్షలు కాగా.. గరిష్ట వేతనం రూ.40 లక్షలుగా నమోదవడం గమనార్హం. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2025, మార్చి 10.
  • దరఖాస్తు సవరణ అవకాశం: మార్చి 13 నుంచి 15 వరకు.
  • జిప్‌మ్యాట్‌ తేదీ: 2025, ఏప్రిల్‌ 26.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌.
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://exams.nta.ac.in/JIPMAT

జిప్‌మ్యాట్‌లో బెస్ట్‌ స్కోర్‌ ఇలా

కాన్సెప్ట్స్, ప్రాక్టీస్‌
జిప్‌మ్యాట్‌లో మెరుగైన స్కోర్, పర్సంటైల్‌ సాధించేందుకు అభ్యర్థులు తొలుత సిలబస్‌ను పరిశీలించి.. కాన్సెప్ట్‌లపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత ప్రామాణిక మెటీరియల్‌ను ఆధారంగా చేసుకుని ప్రిపరేషన్‌ సాగించాలి. దీంతోపాటు ప్రతి టాపిక్‌ పూర్తయిన తర్వాత ప్రాక్టీస్‌ చేయడం ఎంతో మేలు చేస్తుంది.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
మ్యాథమెటికల్, అర్థమెటికల్‌ స్కిల్స్‌ను పరీక్షించే విభాగం ఇది. ఇందులో రాణించేందుకు అర్థమెటిక్‌కు సంబంధించి పర్సంటేజెస్, రేషియోస్, డిస్టెన్స్‌–టైం వంటి అంశాలపై పట్టు సాధించాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి అల్‌జీబ్రా, మోడ్రన్‌ మ్యాథ్స్, జామెట్రీ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్‌ రీజనింగ్‌
ఇది విశ్లేషణాత్మక నైపుణ్యం, తార్కిక విశ్లేషణ నైపుణ్యాన్ని పరిశీలించే విభాగం. ఇందులో మెరుగైన స్కోర్‌ సాధించాలంటే.. టేబుల్స్, గ్రాఫ్స్, చార్ట్స్‌ ఆధారిత ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. లాజికల్‌ రీజనింగ్‌లో క్యూబ్స్, క్లాక్స్, నంబర్‌ సిరీస్, లెటర్‌ సిరీస్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ వంటి అంశాలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. 
వెర్బల్‌ ఎబిలిటీ,రీడింగ్‌ కాంప్రహెన్షన్‌
ఈ విభాగంలో రాణించాలంటే.. ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌లను పెంచుకోవడానికి కృషి చేయాలి. యాంటానిమ్స్, సినానిమ్స్, బేసిక్‌ గ్రామర్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా ఫ్యాక్ట్స్, ఇన్ఫరెన్సెస్, జంబుల్డ్‌ పారాగ్రాఫ్స్‌లను ప్రాక్టీస్‌ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్యాసే­జ్‌ ఆధారిత ప్రశ్నలు అడిగే రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ కోసం అసెంప్షన్, స్టేట్‌మెంట్స్‌పై పట్టు సాధించాలి.
కటాఫ్‌ పర్సంటైల్‌
ఐఐఎం–జమ్ములో మలి దశ ఎంపిక ప్రక్రియకు అభ్యర్థులను పిలిచేందుకు సెక్షనల్‌ కటాఫ్, ఓవరాల్‌ కటాఫ్‌లను పేర్కొంటున్నారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 50, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో 50, వెర్బల్‌ ఎబిలిటీలో 50 చొప్పున పర్సంటైల్‌ పొందాల్సి ఉంటుంది. సీటు ఖరారు చేసే క్రమంలో ప్రతి సెక్షన్‌లో అత్యధిక స్కోర్‌ సొంతం చేసుకున్న వారితో జాబితా రూపొందిస్తారు.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Current Affairs
Published date : 28 Feb 2025 09:10AM

Photo Stories