Skip to main content

Industry 4.0: బ్రాంచ్‌ ఏదైనా.. ఈ స్కిల్స్‌పై పట్టు సాధిస్తేనే అవకాశాలు

Must have Skills for B Tech Students to stay relevant in the Industry 4.0
Must have Skills for B Tech Students to stay relevant in the Industry 4.0

ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ సంస్థలు మొదలు తయారీ కంపెనీల వరకూ.. అన్నీ ఆన్‌లైన్, ఆటోమేషన్‌ విధానాల వైపు మొగ్గు చూపుతున్నాయి. లేటెస్ట్‌ స్కిల్స్‌ ఉంటేనే ఉద్యోగ ఎంపికలో ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌పై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), మెషిన్‌ లెర్నింగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), రోబోటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ సర్వీసెస్, 3–డి డిజైన్, ఆటోమేషన్, డేటాసైన్స్‌ వంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి.
ఆటోమేషన్‌

  • బీటెక్‌లో చేరే విద్యార్థుల లక్ష్యం..చక్కటి కొలువు సొంతం చేసుకోవడం అనేది నిస్సందేహం. ఏ బ్రాంచ్‌ విద్యార్థులైనా ఇదే లక్ష్యంతో చదువు కొనసాగిస్తారు. అందుకోసం విద్యార్థులు.. తమ బ్రాంచ్‌కు అనుగుణంగా ఉద్యోగాలు కల్పించే సంస్థలు కోరుకుంటున్న లేటెస్ట్‌ టెక్నాలజీ గురించి అవగాహన పెంచుకోవాలి.
  • ప్రస్తుతం కోర్‌ ఇంజనీరింగ్‌ విభాగాలకు సంబంధించి 40 శాతం మేర ఉద్యోగాలు ఆటోమేషన్‌ వైపు మళ్లుతున్నాయి. ఇదే ధోరణి రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
  • ఇప్పుడు బీటెక్‌లో చేరిన విద్యార్థులు నాలుగేళ్ల తర్వాత జాబ్‌ మార్కెట్లో అడుగు పెట్టే సమయానికి ఆటోమేషన్‌ హవా 70 శాతానికిపైగా ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. 
  • నాస్‌కామ్, డెలాయిట్, పీడబ్ల్యూసీ తదితర సంస్థల అంచనా ప్రకారం–2025 నాటికి అన్ని రంగాల్లోనూ ఆటోమేషన్‌ ఆధారిత కార్యకలాపాలు కనీసం 60 శాతం మేర ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే ఆటోమేషన్‌ స్కిల్స్‌ను అలవర్చుకుంటూ ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు. 

కొత్త బ్రాంచ్‌లు!

కంపెనీల అవసరాలను పరిగణనలోకి తీసుకొని.. ఇప్పుడు బీటెక్‌ స్థాయిలోనే ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌ అందించే బ్రాంచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌–మెషిన్‌ లెర్నింగ్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌–సైబర్‌ సెక్యూరిటీ,కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌–డేటా సైన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, కంప్యూటర్‌ సైన్స్‌–నెట్‌వర్క్స్, కంప్యూటర్‌ సైన్స్‌–ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌.. ఇలా పలు సరికొత్త బ్రాంచ్‌లను ఇన్‌స్టిట్యూట్‌లు ప్రవేశపెడుతున్నాయి.

ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు

ఆయా కొత్త బ్రాంచ్‌ల్లో చేరే విద్యార్థులు సదరు కాలేజీల్లో సంబంధిత మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ వంటివి ఉన్నాయో లేదో పరిశీలించాలి. ఈ బ్రాంచ్‌లన్నీ సీఎస్‌ఈ ఆధారితంగా ఉండటంతో.. అదే బ్రాంచ్‌ ఫ్యాకల్టీతోనే అధిక శాతం కళాశాలలు బోధన సాగిస్తున్నాయి. అలా కాకుండా సంబం«ధిత విభాగాల్లో నిపుణులైన, అర్హులైన ఫ్యాకల్టీ ఉంటేనే చేరడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా తగిన రీతిలో కంప్యూటర్‌ ల్యాబ్స్, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేదా అనే విషయాన్ని కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మేలు. 

బ్రాంచ్‌ ఏదైనా!

  • సీఎస్‌ఈ, ఈసీఈలతోపాటు సివిల్, మెకానికల్, ఈఈఈ తదితర విభాగాల విద్యార్థులు సైతం ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌ పెంచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
  • మెకానికల్‌ ఇంజనీరింగ్‌ రంగంలో అధిక శాతం కార్యకలాపాలు రోబోటిక్‌ ఆధారంగా సాగుతున్నాయి. దీంతో మెకానికల్‌ బ్రాంచ్‌ విద్యార్థులు రోబోటిక్స్, ఆటోమేషన్‌ అంశాలను నేర్చుకోవడం మేలు చేస్తుంది. 
  • అదే విధంగా సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు 3–డీ డిజైన్‌ టెక్నాలజీస్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ను అవపోసన పట్టాలి. 
  • ఇలా..ఏ బ్రాంచ్‌ విద్యార్థులైనా 4.0 ఇండస్ట్రీ స్కిల్స్‌పై పట్టు సాధిస్తేనే..భవిష్యత్తు అవకాశాలు మెరుగ్గా ఉంటాయనేది నిపుణుల సలహా!!


చ‌ద‌వండి: పెట్రోలియం కోర్సు పూర్తి చేస్తే కెరీర్‌ స్కోప్‌.. రూ.5లక్షల ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు..

Published date : 23 Oct 2021 03:52PM

Photo Stories