Competitive Exams Preparation Tips: జనరల్ ఎస్సేకు ఇలా సన్నద్ధమైతే.. కొలువు కొట్టడం సులువే!
- విషయం, విశ్లేషణ, అభిప్రాయాల సమ్మేళనంగా!
- పోటీ పరీక్షల్లో జనరల్ ఎస్సేకు ప్రాధాన్యం
- సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్ పరీక్షల్లో జనరల్ ఎస్సే
- ప్రత్యేక వ్యూహాలతో సన్నద్ధమవ్వాల్సిన ఆవశ్యకత
జనరల్ ఎస్సే ద్వారా ఒక అంశం పట్ల అభ్యర్థికున్న అవగాహన, విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా దానిని వ్యక్తీకరించే విషయంలో అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. దీంతోపాటు అభిప్రాయాలను వ్యక్తం చేసే నైపుణ్యాలను గుర్తించడం కూడా జనరల్ ఎస్సే ప్రధాన ఉద్దేశంగా ఉంటోంది. ఎంతోమంది అభ్యర్థులు.. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా.. ప్రజెంటేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ లేక ఇబ్బంది పడుతున్నారు.
సూటిగా స్పష్టంగా..
- సివిల్స్, గ్రూప్–1 మెయిన్స్ వంటి పరీక్షల్లోని జనరల్ ఎస్సే పేపర్‌లో అడుగుతున్న ప్రశ్నలను, అభ్యర్థుల నుంచి ఆశిస్తున్న సమాధానాలను పరిగణనలోకి తీసుకుంటే.. నిర్దిష్టంగా ఒక అంశంపై సుదీర్ఘంగా విశ్లేషణాత్మకంగా వ్యాసాన్ని రాయాల్సి ఉంటుంది.
- ఉదాహరణకు..సివిల్స్ మెయిన్స్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. జనరల్ ఎస్సే పేపర్‌లో రెండు వ్యాసాలను 1000 నుంచి 1200 పదాల నిడివి చొప్పున రాయమని అడుగుతున్నారు. ఒక్కో వ్యాసానికి 125 మార్కులు కేటాయిస్తున్నారు.
- గ్రూప్–1 మెయిన్స్‌లో పదాల నిడివి నిబంధన విధించకపోయినా.. మూడు వ్యాసాలను రాయాలని.. ఒక్కో వ్యాసానికి 50 మార్కులు ఉంటాయని పేర్కొంటున్నారు.
- అంటే..సంబంధిత అంశానికి సంబంధించి అభ్యర్థులకు ఉన్న అవగాహనను అన్ని కోణాల్లో పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటున్నాయని చెప్పొచ్చు. వీటికి సమాధానాలు ఇచ్చే క్రమంలో అభ్యర్థులు ప్రశ్న–సమాధానం విధానంలో కాకుండా.. విశ్లేషణాత్మక వ్యక్తీకరణతో జవాబులు రాయాలి.
చదవండి: Civils Prelims Guidance
విశ్లేషణ.. ఇలా
జనరల్ ఎస్సే రాసే సందర్భంలో అభ్యర్థులు నిర్దేశిత నమూనాను అనుసరించడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సమాధాన క్రమాన్ని మూడు భాగాలుగా విభజించుకోవాలి. అవి..– ఉపోధ్ఘాతం,– విషయ వివరణ,–ముగింపు.
- ఉపోద్ఘాతం: ఉపోద్ఘాతం.. అంటే.. వ్యాసం ప్రారంభంలో ఏడెనిమిది వాక్యాల నిడివితో ఒక పేరా రూపంలో ఒక అంశానికి సంబంధించి నేపథ్యాన్ని వివరించడం. అంశానికి తగ్గట్లుగా భావించే కొటేషన్లు, ప్రముఖుల వ్యాక్యలను జోడిస్తూ ఉపోద్ఘాతాన్ని రాయొచ్చు. అయితే ఇది ఎంతో సరళమైన భాషలో ఉండేలా చూసుకోవాలి. వాస్తవానికి అభ్యర్థులు రాస్తున్న వ్యాసానికి సంబంధించి సంపూర్ణ స్వరూపం, స్వభావం, ప్రాముఖ్యం అనేవి ఉపోద్ఘాతంలోనే ఎగ్జామినర్‌కు ఆసక్తి కలిగేలా ఉండాలి.
- విషయ వివరణ: వ్యాసంలో రెండో భాగంగా దీన్ని ప్రారంభించాలి. వ్యాసంలో చెప్పదలచుకున్న లేదా చర్చించదలచుకున్న అంశాలన్నింటిని స్పృశిస్తూ.. రెండో పేరాగా రాయడం ప్రజెంటేషన్ పరంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పేరాలో పొందుపరిచిన అంశాలను తర్వాత క్రమంలో.. ఒక్కో అంశంపై ఒక్కో పేరాలో వేర్వేరుగా విశ్లేషించాలి. ఎస్సే విషయంలో విశ్లేషణ.. చర్చ, లేదా వ్యాఖ్యానం.. ఏవైనా.. మూడు పేరాలుగా రాసుకోవచ్చు. ఎస్సే రాసే సమయంలో గణాంకాలు పొందుపర్చడం కూడా మేలు చేస్తుంది. ఇవి.. ఎగ్జామినర్‌ను గందరగోళానికి గురి చేయని రీతిలో ఉండేలా చూసుకోవాలి.
- ముగింపు: జనరల్ ఎస్సేలో అత్యంత కీలకమైన దశ.. వ్యాసం ముగింపు. అంతకుముందు పేరాల్లో పొందుపర్చిన విషయ వివరణ లేదా విశ్లేషణలకు సంబంధించి సమీక్షగా ముగింపు భాగాన్ని పేర్కొనొచ్చు. ఈ ముగింపు హేతుబద్ధంగా, తర్కబద్ధంగా ఉండాలి. సానుకూల, ఆశావాహ విధానంలో ఉండేలా చూసుకోవాలి. దీనికి భిన్నంగా విమర్శనాత్మకంగా ముగించడం సరికాదు. ఒకవేళ అడిగిన అంశమే ఒక ప్రతికూలమైనదైతే.. దానికి పరిష్కారాలు చూపేలా అభిప్రాయాలు వ్యక్తం చేయడం మేలు.
ఆ పద్ధతికి స్వస్తి
జనరల్ ఎస్సే విషయంలో అభ్యర్థులు ప్రధానంగా.. ప్రశ్న–సమాధానం అనే విధానానికి స్వస్తి పలకాలి. ఒక అంశాన్ని అడిగిన తీరును క్షుణ్నంగా పరిశీలించి అందులో ఉద్దేశాన్ని గ్రహించాలి. దానికి అనుగుణంగా.. అందులో పొందుపర్చాల్సిన అంశాలను విశ్లేషణాత్మకంగా రాయాలి. ఉదాహరణకు.. తాజాగా జరిగిన యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్–2021 జనరల్ ఎస్సే పేపర్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. గత కొన్నేళ్ల శైలికి భిన్నంగా.. అభ్యర్థులు ఏ మాత్రం ఊహించని రీతిలో ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటికి సమాధానం రాయాలంటే.. ముందుగా అభ్యర్థులు అడిగిన ప్రశ్నలో ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే కానీ సాధ్యం కాని పరిస్థితి.
సృజనాత్మకత, సమకాలీనత
జనరల్ ఎస్సేలో రాణించేందుకు అభ్యర్థులు మూడు లక్షణాలను తప్పనిసరిగా సొంతం చేసుకోవాలి. అవి.. సృజనాత్మకత, అవగాహన, వర్తమాన–సమకాలీన అంశాలపై పరిజ్ఞానం. జనరల్ ఎస్సే ఉద్దేశం కూడా ఇదే రీతిలో ఉంటోంది. కాబట్టి అభ్యర్థులు ఏ విషయంపై వ్యాసం రాస్తున్నా.. సంబంధిత లక్ష్యం సాధించేలా వ్యాసాన్ని ప్రెజెంట్ చేయడం మేలు చేస్తుంది. సమాధానం ప్రజెంటేషన్‌లో భాగంగా తమ భావం అర్థమయ్యేలా రాయగలిగే నేర్పు సొంతం చేసుకోవాలి.
భాష, పదాలపై పట్టు
జనరల్ ఎస్సే రాసే అభ్యర్థులు ప్రధానంగా భాష, పదజాలంపైనా దృష్టిపెట్టాలి. సరళమైన, వాడుక భాషలో వ్యాసం రాసినా ఫర్వాలేదు. పదాడంబరం, పద పాండిత్యాలు చూపాల్సిన అవసరం లేదని గుర్తించాలి. వీలైనంత మేరకు సంబంధిత విషయాన్ని స్పష్టంగా, çసూటిగా చెప్పగలిగే పదాలను ఉపయోగించాలి. అందరూ క్లిష్టంగా భావించే పదాలను రాస్తే తమకు నాలెడ్జ్ ఉందని ఎగ్జామినర్ భావిస్తారనే అభిప్రాయం ఏ మాత్రం సరికాదు. సమాధానాలు రాసే సమయంలో వ్యక్తిగత భావాలను ప్రతిబింబించే పదాలను రాయకూడదు. ప్రభుత్వ చర్యలు,పథకాలకు సంబంధించి సానుకూల అంశాలపై ప్రశంసాత్మక అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు. అదే విధంగా విమర్శనాత్మక సమాధానాల విషయంలోనూ నేర్పుగా వ్యవహరించాలి. ఉదాహరణకు ఏవైనా పథకాలు, ప్రాజెక్ట్‌లకు సంబంధించి సమర్థవంత అమలుకు తగిన సూచనలు చేయొచ్చు. అంతే తప్ప వాటిని పూర్తిగా విమర్శిస్తూ సమాధానాలు. పదాలు రాయడం సరికాదు.
చదవండి: Previous Papers Exams
ఆకట్టుకునేలా.. అర్థమయ్యేలా
ఎస్సే ప్రజెంటేషన్ విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాసం రాయడానికి నిర్దేశించిన పదాల నిడివి, అందుబాటులో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ సమాధానం రాయాలి. ప్రతి పేజీలో రైటింగ్ ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలి. ఒక్కో పేజీలో 16 నుంచి 18 లైన్లతో సమాధానం రాస్తే.. ఎగ్జామినర్‌కు చదవడానికి సులువుగా ఉంటుంది. ఎస్సే రైటింగ్‌లో చాలామంది అభ్యర్థులు చేసే పొరపాటు సమాధానాలు పలు రూపాల్లో హైలైట్ చేయడం. ఎస్సే రైటింగ్‌లో సైడ్ హెడ్డింగులు, సమాధానంలోని వాక్యాలను అండర్ లైన్‌లు చేయడం వంటి పద్ధతులకు స్వస్తి పలకాలి. రంగుల స్కెచ్‌లు, రంగుల పెన్‌లు ఉపయోగించకూడదు. మొత్తంగా చూస్తే ఒక వ్యాసాన్ని ఉపోద్ఘాతం, విషయం/విశ్లేషణ, ముగింపు అనే మూడు భాగాలతో సాధారణ పేరాల రూపంలో రాస్తే సరిపోతుంది.
సన్నద్ధత ఇలా
- జనరల్ ఎస్సేకు సన్నద్ధమయ్యే విషయంలోనూ అభ్యర్థులు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి.
- ముందుగా సిలబస్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. తర్వాత ప్రతి విభాగం నుంచి ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ.. ఏఏ ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో వాటికి సంబంధించి అవగాహన ఏర్పరచుకోవాలి.
- ఆయా అంశాలకు సంబంధించి ఏఏ కాల నేపథ్యాల నుంచి ప్రశ్నలు అడగవచ్చో అంచనా వేసుకోవాలి.
- ఇలా గుర్తించిన అంశాలకు సంబంధించి ముఖ్య గణాంకాలను సేకరించుకోవాలి.
- అంశానికి సంబంధించి సమకాలీన నేపథ్యంపై అవగాహన ఏర్పరచుకోవాలి.
- సంబంధిత సమస్యలను గుర్తించాలి.
- సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించాలి.
- ఈ తరహా అధ్యయనంతో ఆయా విభాగాల నుంచి కనీసం పది వ్యాసాలపై అయిన పట్టు సాధించాలి.
ప్రాక్టీస్ ఎంతో ప్రధానం
జనరల్ ఎస్సే విషయంలో మేలు చేసే మరో అంశం.. ప్రాక్టీస్ చేయడం. అంటే.. పరీక్షలో ఒక వ్యాసానికి లభించే సగటు సమయాన్ని గుర్తించి, దానికి అనుగుణంగా ప్రిపరేషన్ సమయంలోనే నిర్దేశిత వ్యవధిలో ఒక సంపూర్ణ వ్యాసం రాయడాన్ని ప్రాక్టీస్ చేయడం కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తూ రాసిన వ్యాసంపై సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోవడం ఉపకరిస్తుంది. దీనివల్ల అభ్యర్థులు ఊహించని విధంగా ప్రశ్న వచ్చినా..సమర్థంగా ప్రతిస్పందించే లక్షణం అలవడు తుంది.
పరిగణించాల్సిన అంశాలివే
వ్యాసం రాసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు..
- ఒక అంశంపై సమకాలీన నేపథ్యం
- సమస్య–పలు కోణాలు
- కారణాలు –ప్రభుత్వ చర్యలు
- ప్రస్తుత స్థితి
- పరిష్కార మార్గాలు
- నిర్మాణాత్మక సూచనలు.
చదవండి: Bank Exams Guidance
బ్యాంకు పరీక్షలకు ఇలా
ఇటీవల కాలంలో సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షలతోపాటు బ్యాంకు పీఓ, ఆపై స్థాయి నియామక పరీక్షల్లోనూ మెయిన్ ఎగ్జామ్‌లో డిస్కిప్ట్రివ్ టెస్ట్ పేరుతో లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ విభాగాలను అడుగుతున్నారు. ఎస్సే రైటింగ్ విషయంలో అభ్యర్థులు ప్రధానంగా సమకాలీన అంశాలపై పట్టు సాధించాలి. సివిల్స్, గ్రూప్స్ తరహాలోనే ఎస్సే రైటింగ్ విధానం ఉండేలా చూసుకోవాలి. తక్కువ పదాలు, నిడివితో మరింత సూటిగా, స్పష్టంగా రాసే నేర్పు సొంతం చేసుకోవాలి.
లెటర్ రైటింగ్
లెటర్ రైటింగ్ విషయంలో పర్సనల్ లెటర్స్, బిజినెస్ లెటర్స్, అఫిషియల్ లెటర్స్ నమూనాలపై అవగాహన పొందాలి. లెటర్ రైటింగ్‌కు సంబంధించి నిర్దిష్టంగా ఉండే స్వరూపంపై అవగాహన పొందాలి. పంక్చుయేషన్స్ నియమాలను కచ్చితంగా అనుసరించాలి. ప్రతి లెటర్ విషయంలో సబ్జెక్ట్ నియమాన్ని పాటించాలి. ఒక లెటర్‌లో సబ్జెక్ట్‌లో పేర్కొన్న సమాచారం ఆధారంగానే.. ఆ లెటర్ ఉద్దేశం అర్థమవుతుంది. కాబట్టి కచ్చితంగా సబ్జెక్ట్ పార్ట్‌ను పేర్కొనాలి.
ఉద్దేశం తెలుసుకుని.. స్పష్టత
జనరల్ ఎస్సేలో అభ్యర్థులు సదరు ప్రశ్న వెనుక ఉద్దేశాన్ని తెలుసుకుని.. దానికి తగిన సమాధానాన్ని సూటిగా, స్పష్టంగా, సరళంగా రాసే నేర్పు సొంత చేసుకోవాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ విషయంలో అడిగిన ప్రశ్నకు అనుగుణంగా కోర్,కాంటెంపరరీ అంశాల కలయికతో సమాధానం రాయొచ్చు. సమాధానం ఇచ్చే సమయంలో ఒక వ్యాసానికి ఉండాల్సిన స్వరూపం(ఉపోద్ఘాతం, వివరణ, ముగింపు) కచ్చితంగా పాటించాలి. అభిప్రాయాలను వ్యక్తీకరించే సమయంలో బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. పూర్తి సానుకూల లేదా పూర్తి ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేయడం సరికాదు.అభ్యర్థులు తమకున్న అభిప్రాయాన్ని సహేతుక పద్ధతిలో ప్రజెంట్ చేయాలి.
– బాలలత, సివిల్స్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్
చదవండి: Competitive Exams: సివిల్స్, బ్యాంక్స్.. ఇలా.. పరీక్షలు ఏవైనా.. జనరల్ స్టడీస్‌లో రాణిస్తేనే విజయం..