Skip to main content

Civils Preliminary Examination Preparation: ముప్ఫై రోజుల్లో.. మెరిసేలా!

Civils Preliminary Examination Preparation
Civils Preliminary Examination Preparation

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌–2022.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లతోపాటు..19 కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో.. పోస్ట్‌ల భర్తీకి నిర్వహిస్తున్న ఎంపిక ప్రక్రియ! మూడు దశలుగా ఉండే.. ఈ ఎంపిక ప్రక్రియలో.. అత్యంత కీలకమైన దశ.. తొలి దశగా పేర్కొనే.. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌! కారణం.. దాదాపు అయిదు లక్షల మంది హాజరయ్యే.. ప్రిలిమ్స్‌లో నెగ్గితేనే.. మలి దశ మెయిన్స్‌కు అర్హత! అంతేకాకుండా.. ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు ఎంపికయ్యే వారి సంఖ్య.. సుమారు పదకొండు వేలు మాత్రమే! అంటే.. లక్షల మంది పోటీ పడే ప్రిలిమ్స్‌ నుంచి వేల సంఖ్యలోని జాబితాలో చోటు సాధించి.. మలి దశకు అర్హత పొందాలంటే.. ప్రిలిమ్స్‌లో చూపే ప్రతిభ ఎంతో కీలకం! సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌–2022కు సంబంధించి తొలి దశ ప్రిలిమ్స్‌ జూన్‌ 5న జరగనుంది. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నెల రోజుల సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై విశ్లేషణ...

  • జూన్‌ 5న సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష
  • ఎంపిక ప్రక్రియలో తొలి దశగా ప్రిలిమ్స్‌
  • ఇందులో విజయమే అత్యంత కీలకం
  • సగటున అయిదు లక్షల మంది హాజరు
     
  • మొత్తం సర్వీసులు: 19  
  • మొత్తం పోస్ట్‌లు: 861
  • ప్రిలిమ్స్‌కు హాజరయ్యే వారి సంఖ్య అంచనా: దాదాపు అయిదు లక్షలు
  • మెయిన్స్‌కు అర్హత సాధించే వారు: ఒక్కో పోస్ట్‌కు 12నుంచి 13మంది అంటే..సుమారుగా 11వేలు.
  • ప్రిలిమ్స్‌ను వడపోత పరీక్ష అని పేర్కొనొచ్చు. కానీ ఇందులో అర్హత సాధించడం చాలా కీలకం. ఎందుకంటే.. ప్రిలిమ్స్‌లో విజయం సాధిస్తేనే మెయిన్స్‌కు అవకాశం లభిస్తుంది. ప్రిలిమ్స్‌లో రాణించేందుకు అభ్యర్థులు అత్యంత శక్తియుక్తులతో కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో ప్రతి క్షణాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని సలహా ఇస్తున్నారు.

ప్రిలిమ్స్‌ జూన్‌ 5న

సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌–2022ను జూన్‌ 5న నిర్వహించనున్నారు. అంటే.. అభ్యర్థులకు సరిగ్గా ముప్ఫై రోజుల సమయం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ముప్ఫై రోజుల సమయం.. ప్రిలిమ్స్‌లో ప్రతిభ చూపి తర్వాత దశ మెయిన్స్‌కు ఎంపికయ్యేందుకు దోహదపడుతుంది. అభ్యర్థులు ఎంతో విలువైన ఈ సమయంలో విశ్లేషణాత్మక అధ్యయనం, పునశ్చరణ, సమయ పాలన, ప్రాక్టీస్‌ వంటి వాటితో నిరంతరం తమ ప్రిపరేషన్‌కు పదును పెట్టుకోవాలి. ఫలితంగా ప్రిలిమ్స్‌లో విజయావకాశాన్ని పెంచుకుని మెయిన్స్‌కు అర్హత పొందే వీలుంటుంది.

చ‌ద‌వండి: Competitive Exams Preparation Tips: జనరల్ ఎస్సేకు ఇలా సన్నద్ధమైతే.. కొలువు కొట్టడం సులువే!

సమయపాలన

ప్రస్తుత సమయంలో సివిల్స్‌ అభ్యర్థులకు టైం మేనేజ్‌మెంట్‌ తప్పనిసరి. పేపర్‌–1 జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ సిలబస్‌లోని అన్ని విభాగాలకు సంబంధించిన సిలబస్‌కు సరితూగే ప్రతి సబ్జెక్ట్‌ను నిరంతరం అభ్యసించే విధంగా టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి. అదే విధంగా ప్రతిరోజు కనీసం ఎనిమిది నుంచి పది గంటల సమయం ప్రిపరేషన్‌ కోసం కేటాయించుకోవాలి. దీంతోపాటు ప్రతి వారం తాము పూర్తి చేసుకున్న సిలబస్‌లో.. తమకు లభించిన అవగాహనను స్వీయ విశ్లేషణ చేసుకునే విధంగా సెల్ఫ్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లు రాయడం కూడా ఉపకరిస్తుంది. 

సమకాలీన అంశాలతో సమ్మిళితం

ప్రస్తుత సమయంలో అభ్యర్థులు సిలబస్‌లో పేర్కొన్న కోర్‌ టాపిక్స్‌ను కరెంట్‌ అఫైర్స్‌తో సమ్మిళితం చేసుకుంటూ చదవాలి. ఎందుకంటే.. ఇటీవల కాలంలో ప్రిలిమ్స్‌ ప్రశ్నల శైలిని పరిగణనలోకి తీసుకుంటే.. ఆయా అంశాలకు సంబంధించి అడుగుతున్న ప్రశ్నలు కరెంట్‌ అఫైర్స్‌ సమ్మిళితంగా ఉంటున్నాయి. అభ్యర్థులు.. ఈ ఏడాది మే ముందు నుంచి ఏడాది, ఏడాదిన్నర కాలంలోని ముఖ్యమైన కరెంట్‌ ఈవెంట్స్‌పై దృష్టిపెట్టాలి. వీటిని సంబంధిత సబ్జెక్ట్‌ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. నేపథ్యం, ప్రభావం, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు అంచనా వంటి అంశాలను విశ్లేషించుకుంటూ చదవడం ఎంతో అవసరం.

సమన్వయం చేసుకుంటూ

ప్రిపరేషన్‌లో భాగంగా అభ్యర్థులు ఇప్పుడు సబ్జెక్ట్‌లను సమన్వయం చేసుకుంటూ అడుగులు వేయాలి. ఎకానమీ–పాలిటీ, ఎకానమీ–జాగ్రఫీ, జాగ్రఫీ–ఎకాలజీ;జాగ్రఫీ–సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ.. విభాగాలను అనుసంధానం చేసుకుంటూ.. చదివే వీలుంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే.. ప్రిపరేషన్‌ పరంగా కొంత సమయం కలిసొస్తుంది. ఈ సమయాన్ని తమకు క్లిష్టంగా భావించే ఇతర అంశాలపై దృష్టిపెట్టేందుకు వినియోగించుకోవచ్చు.

చ‌ద‌వండి: Geography Notes for Group 1, 2: రాణిగంజ్‌.. దేశంలోని అతిపెద్ద బొగ్గు క్షేత్రం​​​​​​​

ముఖ్యాంశాల పునశ్చరణ

  • ప్రస్తుత సమయంలో.. అభ్యర్థులు.. సబ్జెక్ట్‌ల వారీగా ముఖ్యాంశాలను గుర్తించి.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించడం ఎంతో మేలు చేస్తుంది. ఇందుకోసం ఇప్పటికే వారు రాసుకున్న సొంతనోట్స్‌ లేదా ఇతర మార్గాల ద్వారా పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. 
  • గత నాలుగైదేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించి.. అందులో ఆయా సబ్జెక్ట్‌ల నుంచి అడుగుతున్న ప్రశ్నల సంఖ్య.. ఏఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుందో గుర్తించి.. వాటికి ప్రిపరేషన్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
  • అంతర్జాతీయ పరిణామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వీటికి సంబంధించి ముఖ్యమైన పాయింట్లతో నోట్స్‌ సిద్ధం చేసుకోవాలి.

రెండుసార్లు పునశ్చరణ

ప్రస్తుత సమయంలో అభ్యర్థులు ప్రతి సబ్జెక్ట్‌ను కనీసం రెండుసార్లు పునశ్చరణ చేసుకునే విధంగా వ్యవహరించాలి. వాస్తవానికి ప్రిలిమ్స్‌ అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రిపరేషన్‌ను పూర్తి చేసుకుని ఉంటారు. ఇప్పుడు వారు పూర్తిగా రివిజన్‌కు సమయం కేటాయించడం మేలు చేస్తుంది. అంతేకాకుండా కనీసం రెండుసార్లు రివిజన్‌ చేసేలా టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి. రివిజన్‌ చేసేందుకు ఉపకరించే విధంగా ప్రిపరేషన్‌ సమయంలోనే షార్ట్‌నోట్స్‌ రూపొందించుకోవాలి.

చ‌ద‌వండి: Geography Notes for Group 1, 2: రాణిగంజ్‌.. దేశంలోని అతిపెద్ద బొగ్గు క్షేత్రం​​​​​​​ 

కొత్త అంశాలు.. కొంత సమస్య

సివిల్స్‌కు ప్రిపరేషన్‌ సాగించే క్రమంలో చాలామంది అభ్యర్థులు అన్ని అంశాలను చదవలేరు. కొన్నింటిని ముఖ్యమైనవి కావని భావించి విస్మరిస్తుంటారు. పరీక్షకు కొద్దిరోజుల ముందు వాటిని కూడా చదవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ప్రస్తుత సమయంలో అలా విస్మరించిన అంశాలను చదవడం సరికాదని సబ్జెక్ట్‌ నిపుణుల అభిప్రాయం. ఇలా కొత్త అంశాలపై దృష్టిపెడితే..అనవసరమైన ఆందోళన మొదలైంది. ఇది ఇతర అంశాల ప్రిపరేషన్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి అభ్యర్థులు ప్రస్తుత సమయంలో కొత్త అంశాల జోలికి వెళ్లకుండా.. ఇప్పటికే చదివిన వాటిని మరింత లోతుగా అధ్యయనం చేయడం మేలని సబ్జెక్ట్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త అంశాలను చదవాల్సిన పరిస్థితి ఏర్పడితే.. వాటికి సంబంధించి సినాప్సిస్, కాన్సెప్ట్‌లపై అవగాహన పొందడం మేలని అంటున్నారు. 

పేపర్‌–2కు కూడా సమయం

అభ్యర్థులు పేపర్‌–2(సీశాట్‌)కు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. అర్హత పేపర్‌గానే పేర్కొన్నప్పటికీ.. ఇందులో 33 శాతం మార్కులు సాధిస్తేనే పేపర్‌–1 మూల్యాంకన చేస్తారు. దాని ఆధారంగానే మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. కాబట్టి పేపర్‌–2లో అర్హత మార్కులు సాధించేందుకు ప్రధానంగా మ్యాథమెటిక్స్, లాజికల్‌ రీజనింగ్‌ స్కిల్స్, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి. 

దృష్టి పెట్టాల్సిన ముఖ్యాంశాలు
కరెంట్‌ అఫైర్స్‌

  • పోస్ట్‌–కోవిడ్‌ పరిణామాలు
  • అంతర్జాతీయంగా రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, ఆయా దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం
  • యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం 
  • అంతర్జాతీయంగా పలు సంస్థల నివేదికల్లో భారత్‌కు సంబంధించిన గణాంకాలు.

చ‌ద‌వండి: Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్‌ అఫైర్స్‌

చరిత్ర

  • ఆధునిక చరిత్ర; జాతీయోద్యమం; 
  • ప్రాచీన, మధ్యయుగ చరిత్రకు సంబంధించి సాహిత్యం, కళలు, మత ఉద్యమాలు, రాజకీయ–సామాజిక– ఆర్థిక చరిత్ర అంశాలు. 
  • ఆధునిక చరిత్రలో బ్రిటిష్‌ సామ్రాజ్య స్థాపన– పరిపాలన విధానాలు; బ్రిటిష్‌కు వ్యతిరేక తిరుగుబాట్లు–ఉద్యమాలు(ప్రధానంగా స్వాతంత్య్ర పోరాటం), సంస్కరణోద్యమాలు. 

చ‌ద‌వండి: History Notes for Groups: శాతవాహనులు–సంస్కృతి​​​​​​​

పాలిటీ

  • రాజ్యాంగం: రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ సవరణ ప్రక్రియ,పీఠిక,తాజా రాజ్యాంగ సవరణలు–వాటికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు.
  • రాజకీయ వ్యవస్థ: పార్లమెంటరీ వ్యవస్థ, రిపబ్లికన్‌ ప్రభుత్వం, అర్థ సమాఖ్య, రాష్ట్రపతి, గవర్నర్, పార్లమెంట్, రాష్ట్ర శాసన సభలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్నికల కమిషన్, ఆర్థిక కమిషన్, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు, అటార్నీ జనరల్, అడ్వకేట్‌ జనరల్‌ వాటికి సంబంధించి రాజ్యాంగ ప్రకరణలు.
  • పంచాయతీరాజ్‌ వ్యవస్థ: బల్వంత్‌రాయ్, అశోక్‌మెహతా, హన్మంతరావ్, జి.వి.కె. రావ్, సింఘ్వీ కమిటీల సిఫార్సులు, 73వ రాజ్యాంగ సవరణ చట్టం.
  • ప్రభుత్వ విధానం: విధాన రూపకల్పన జరిగే తీరు. విధానాల అమలు, వాటి సమీక్ష. 
  • ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ముఖ్య విధానపర నిర్ణయాలు. 
  • కేంద్ర–రాష్ట్ర సంబంధాలు.
  • గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారిన న్యాయ వ్యవస్థ క్రియాశీలత.

చ‌ద‌వండి: APPSC/TSPSC Groups Exams: పాలిటీ నుంచి 25-30 ప్రశ్నలు... పోటీ పరీక్షల్లో ప్రాధాన్యత, ప్రశ్నల స్థాయి–సరళి!​​​​​​​

ఎకానమీ

  • ఆర్థికాభివృద్ధిలో సహజ వనరులు–మూలధన వనరుల పాత్ర. 
  • ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ప్రగతి (వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం). 
  • ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో దేశంలో ఆర్థిక–సాంఘికాభివృద్ధి. 
  • పారిశ్రామిక తీర్మానాలు–వ్యవసాయ విధానం. 
  • బ్యాంకింగ్‌ రంగం ప్రగతి–సంస్కరణలు–ఇటీవల కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో స్కామ్‌లు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం.
  • తాజా మానవాభివృద్ధి, ప్రపంచ అభివృద్ధి నివేదికలు.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

  • గత ఏడాది కాలంలో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు. 
  • ఇటీవల కాలంలో సంభవిస్తున్న వ్యాధులు–కారకాలు. 
  • సైబర్‌ సెక్యూరిటీ యాక్ట్‌. 
  • రక్షణ రంగంలో కొత్త మిస్సైల్స్‌ ప్రయోగాలు. 
  • జాతీయ ముఖ్యమైన వన్యమృగ సంరక్షణ కేంద్రాలు. 
  • పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలు, చర్యలు. 
  • వివిధ ఐటీ పాలసీలు.

చ‌ద‌వండి: Science & Technology Preparation: సబ్జెక్ట్‌ ఒకటే అయినప్పటికి.. అడిగే ప్రశ్నల తీరులో భేదం...​​​​​​​

జాగ్రఫీ

  • భౌగోళిక వనరులు, సహజ సంపద;
  • అత్యధిక, అత్యల్ప జనాభా ఉన్న రాష్ట్రాలు.
  • అత్యధిక, అత్యల్ప జన సాంద్రత గల రాష్ట్రాలు; స్త్రీ,పురుష నిష్పత్తి; స్త్రీ, పురుష అక్షరాస్యత శాతం;గత పదేళ్లలో జనన, మరణ రేట్లు.
  • పర్యావరణ సమస్యలు–ఎక్కువగా కేంద్రీకృతమైన ప్రాంతాలు, దేశాలు. 
  • సౌర వ్యవస్థ, భూమి అంతర్‌ నిర్మాణం, శిలలు, జియలాజికల్‌ టైం స్కేల్, రుతుపవనాలు, ప్రపంచ పవనాలు, చక్రవాతాలు, ఉష్ణోగ్రత విలోమం, భూకంపాలు, సునామీలు. 
  • మన దేశ పరిస్థితుల నేపథ్యంలో నగరీకరణ; ఆటవిక జాతులు; రుతుపవనాల భవిష్యత్‌ దర్శనం; మాన్‌సూన్‌ మెకానిజం; నదులు; జలాల పంపిణీ; వివాదాలు.

చ‌ద‌వండి: Geography Notes for Group 1, 2: రాణిగంజ్‌.. దేశంలోని అతిపెద్ద బొగ్గు క్షేత్రం​​​​​​​

సివిల్స్‌.. ప్రిలిమ్స్‌–2022 ముఖ్యాంశాలు

  • మొత్తం పోస్ట్‌లు: 861.
  • జూన్‌ 5న ప్రిలిమ్స్‌ పరీక్ష.
  • రెండు పేపర్లుగా 400 మార్కులకు పరీక్ష (ఒక్కో పేపర్‌కు 200 మార్కులు).
  • దాదాపు పది లక్షల మంది దరఖాస్తు.
  • ప్రతి ఏటా సగటున 50 శాతం హాజరు.
  • ప్రిలిమ్స్‌లో మెరిట్‌ ఆధారంగా 1:12 లేదా 1:13 నిష్పత్తిలో మలి దశ మెయిన్‌ ఎగ్జామినేషన్‌కు ఎంపిక.
  • తెలుగు రాష్ట్రాల్లో.. అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు.

పూర్తిగా ప్రిలిమ్స్‌కే

చాలామంది అభ్యర్థులు డిస్క్రిప్టివ్‌ దృక్పథంతో ప్రిలిమ్స్‌తోపాటు మెయిన్స్‌కు కూడా సన్నద్ధమవుతుంటారు. ఈ రెండింటిలోని ఉమ్మడి అంశాలను చదువుతూ ముందుకు సాగుతారు. ప్రస్తుత సమయంలో మాత్రం అభ్యర్థులు పూర్తి సమయాన్ని ప్రిలిమ్స్‌కే కేటాయించాలి. ఈ సమయంలో సబ్జెక్ట్‌ అంశాలను చదువుతూనే.. మాక్‌ టెస్ట్‌లు, మోడల్‌ టెస్ట్‌లకు హాజరు కావడం మేలు చేస్తుంది. అదే విధంగా షార్ట్‌ నోట్స్‌ విధానాన్ని అవలంభించడం వల్ల చివరి పది రోజుల్లో రెడీ రెకనర్స్‌గా ఉపయోగపడతాయి.
–శ్రీరంగం శ్రీరామ్, డైరెక్టర్, శ్రీరామ్స్‌ ఐఏఎస్‌ అకాడమీ

Published date : 05 May 2022 06:33PM

Photo Stories