APPSC/TSPSC Groups Exams: పాలిటీ నుంచి 25-30 ప్రశ్నలు... పోటీ పరీక్షల్లో ప్రాధాన్యత, ప్రశ్నల స్థాయి–సరళి!
సివిల్ సర్వీసెస్ నుంచి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, ఎస్‌ఐ ఆఫ్ పోలీస్, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ తదితర అన్ని పోటీ పరీక్షలకు అవసరమైనది జనరల్ స్టడీస్. ఇందులో అతి ముఖ్యమైన విభాగం ఇండియన్ పాలిటీ లేదా భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ. పరీక్ష ప్రాముఖ్యతను బట్టి ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నల సంఖ్య మారుతూ ఉంటుంది. సాధారణంగా 25 నుంచి 30 ప్రశ్నలు రావచ్చు. ఈ నేపథ్యంలో.. టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్1, గ్రూప్ 2 వంటి పోటీ పరీక్షల్లో పాలిటీ ప్రాధాన్యత, అనుసరించాల్సిన ప్రిపరేషన్ వ్యూహంపై విశ్లేషణ...
గ్రూప్–2 పరీక్షలో ప్రత్యేకమైన సిలబస్ నిర్దేశించడం వలన ప్రశ్నల సంఖ్య 75 వరకు ఉంటుంది. అభ్యర్థులు సిలబస్ పరిధిని, ప్రశ్నల స్థాయిని, సరళిని గమనించి సిద్ధమైతే.. ఈ విభాగంలో గరిష్ట మార్కులు సాధించవచ్చు. జనరల్ స్టడీస్‌లో ఇండియన్ పాలిటీ విభాగానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సిలబస్ నిర్దేశించినప్పటికీ.. రాజకీయ, రాజ్యాంగ గతి విధినాలు నిరంతరం మారుతూ విస్తృతమవడం వల్ల ప్రతిసారి తాజా సమాచారాన్ని సేకరించుకోవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ప్రతి సమకాలీన రాజకీయ పరిణామం రాజ్యాంగంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా ఆ పోకడలను గమనించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
చదవండి: Indian Polity Practice Test
నిర్దేశిత సిలబస్
- ఇండియన్ పాలిటీలో సాధారణంగా ఈ కింది అంశాలను పొందుపరుస్తారు. రాజ్యాంగ చరిత్ర, రచన, రాజ్యాంగ ఆధారాలు, పీఠిక, పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, నిర్దేశిక సూత్రాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి, పార్లమెంటు నిర్మాణం, బిల్లుల రకాలు, శాసన నిర్మాణ ప్రక్రియ, పార్లమెంటు కమిటీలు, న్యాయవ్యవస్థ–సుప్రీంకోర్టు, హైకోర్టు, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, గవర్నర్, ముఖ్యమంత్రి, స్థానిక సంస్థలు–పంచాయతీ వ్యవస్థ, రాజ్యాంగ సంస్థలు, సంక్షేమ యంత్రాంగం, గవర్నెన్స్, రాజ్యాంగ సవరణ పద్ధతి మొదలగు అంశాలు ఉన్నాయి.
పరిపాలన–తాజా పరిణామాలు
పైన పేర్కొన్న అంశాలతో పాటు ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో రాజ్య విధులు, అధికారాలలో గుణాత్మకమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా పరిపాలన–సుపరిపాలన, ఈ–గవర్నెన్స్, హక్కుల సమస్యలు, అణగారిన వర్గాల వికాసం, సంక్షేమ పరిపాలన, అభివృద్ధి పరిపాలన, అంతర్జాతీయ తీవ్రవాదం, పౌరసమాజం, సుప్రీంకోర్టు తాజా తీర్పులు, పరిణామాలను కూడా అభ్యర్థులు అధ్యయనం చేయాలి.
ప్రశ్నల స్థాయి–సరళి
ప్రస్తుత పోటీ పరీక్షల్లో చాలా భాగం బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో ఉన్నాయి. ఒక ప్రశ్నకు నాలుగు సమీప సమాధానాలు ఇచ్చి.. వాటిలో సరైనదేదో, సరికానిదేదో గుర్తించమని అడుగుతారు. వీటికి సమాధానాలు గుర్తించాలంటే.. సబ్జెక్టుకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని చదివి అర్థం చేసుకుని.. దానిపై పట్టు సాధించాలి. ప్రశ్నల స్థాయిని బట్టి విషయాన్ని మరింత విస్తృతంగా చదువుతూ తర్కబద్ధంగా, విశ్లేషణాత్మకంగా,విచక్షణా జ్ఞానంతో అన్వయించడానికి ప్రయత్నం చేయాలి.సాధారణంగా ప్రశ్నల స్థాయిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..1.జ్ఞానాత్మకమైనవి లేదా పరిజ్ఞానాన్ని పరిశీలించేవి; 2. విషయ అవగాహనకు సంబంధించినవి;3. విషయ అనువర్తనకు సంబంధించినవి.
జ్ఞానాత్మకమైనవి లేదా పరిజ్ఞానాన్ని పరిశీలించేవి
ఈ తరహా ప్రశ్నల్లో ప్రధానంగా కంటెంట్‌కు సంబంధించి అభ్యర్థి జ్ఞాపక శక్తిని గుర్తించే పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలంటే.. విస్తృతమైన పఠనంతోపాటు పదే పదే పునశ్చరణ చేయాల్సి ఉంటుది. ఈ తరహా ప్రశ్నల సంఖ్య పరీక్ష స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. ఒక మేరకు తయారైన అభ్యర్థులు అందరూ ఇలాంటి సమాధానాలు గుర్తిస్తారు. ఉదాహరణకు ప్రశ్నలు.
- ఒక రాష్ట్రంలో పంచాయితీ లేదా మున్సిపాలిటీల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది? (ఎ)
ఎ. రాష్ట్ర ప్రభుత్వం; బి.కేంద్ర ప్రభుత్వం; సి. జిల్లా కలెక్టర్; డి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.
వివరణ: పై ప్రశ్నకు సమాధానం గుర్తించడం తేలిక. ఇందులో ఎలాంటి అవగాహన తర్కం ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. చదివిన అంశాన్ని గుర్తుంచుకుంటే చాలు.అయితే కొన్ని ప్రశ్నలు సమాచారానికి సంబంధించినవి అయినా రేర్ లేదా రిమోట్ అంశానికి సంబంధించినవి అయితే కొంత ఇబ్బంది ఉంటుంది. ఉదాహరణకు.. - ఈ క్రింది పేర్కొన్న ఏ రాజ్యాంగ నిపుణుడు బర్మా(మయన్మార్) రాజ్యాంగ రచనల్లో కూడా పాల్గొన్నారు? (బి)
ఎ.డా.బి.ఆర్.అంబేద్కర్; బి.డా.బి.ఎన్.రావు; సి.పొ.కె.టి.షా; డి.అల్లాడి కృష్ణస్వామి అయ్యర్.
వివరణ: అన్ని పేర్లూ అభ్యర్థికి తెలిసినవే. కానీ ఆ వ్యక్తులకు సంబంధించి లోతైన అంశం కనుక సాధారణంగా చదివి ఉండరు. ఇలాంటి ప్రశ్నలు విస్తృత పఠనంతో తెలుస్తాయి.
చదవండి: Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్
విషయ అవగాహనకు సంబంధించినవి
- కొన్ని ప్రశ్నల ద్వారా అభ్యర్థి అవగాహనను, తెలివితేటలను పరిశీలిస్తారు. అవగాహన, తెలివితేటలు అనేవి నిరంతర సాధన ద్వారా సాధ్యం అవుతాయి.
- ఈ కింది పేర్కొన్న వారిలో ఎవరు అత్యధిక ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు? (బి)
ఎ. పార్లమెంటు సభ్యులు; బి.రాష్ట్ర విధాన సభ సభ్యులు; సి.విధాన పరిషత్ సభ్యులు; డి. సాధారణ ఓటరు
వివరణ:పై ప్రశ్నకు సమాధానం గుర్తించాలంటే.. ఇచ్చిన నాలుగు ఐచ్చికాలలో ఒకదానికొకటి ఉన్న సంబంధం, వాటి విస్తృతిపై సమగ్ర అవగాహన ఉండాలి. ఎవరెవరు ఏ ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారో విశ్లేషించుకోవాలి. వెంటనే సమాధానాన్ని గుర్తించడం సాధ్యం కాదు. రాష్ట్ర విధాన సభ సభ్యులు రాష్ట్రపతి, రాజ్యసభ, రాష్ట్ర విధాన పరిషత్ సభ్యులను ఎన్నుకోవడమే కాకుండా.. సాధారణ ఓటరుగా లోక్‌సభ, విధాన సభ.. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓటర్లుగా ఉంటారు. విషయ అనువర్తనకు సంబంధించినది ఈ తరహా ప్రశ్నల్లో అభ్యర్థి అసాధారణ తెలివితేటలు ప్రదర్శించాలి. లోతుగా ఆలోచించాలి. సహజ ప్రతిభ, విచక్షణా శక్తి ఉపయోగించాలి. సమాచారం, అవగాహన ఉంటే సరిపోదు. - ద్రవ్య బిల్లుపై రాజ్యసభకు ఉన్న అధికారాలు(డి)
1. వాయిదా వేసే అధికారం; 2. సవరించే అధికారం; 3. సిఫార్సులు చేసే అధికారం; 4. ఓటు చేసే అధికారం.
ఎ. పైవన్నీ సరైనవే; బి. 1, 2, 3 మాత్రమే సరైనవి; సి. 3,4 మాత్రమే సరైనవి; డి. 1,3 మాత్రమే సరైనవి
వివరణ: రాజ్యసభకు ద్రవ్య బిల్లుపై ఎలాంటి అ«ధికారం ఉంటుందో సమగ్రమైన అవగాహన ఉండాలి. అవగాహనతోపాటు ఇచ్చిన ఐచ్చిక అంశాల్లో సందర్భాన్ని బట్టి సరిపోయే అంశాలనే గుర్తించగలగాలి. ఇందుకు అభ్యర్థి స్వతహాగా విచక్షణతో నిర్ణయం తీసుకునే శక్తిని కలిగి ఉండాలి.
రాజ్యసభ ద్రవ్యబిల్లును 14రోజుల వరకు వాయిదా వేయవచ్చు. సిఫార్సులు చేయవచ్చు. కానీ సవరించే అధికారం, ఓటు చేసే అధికారం ఉండదు. - రాజ్యాంగంలో వితరణశీల న్యాయాన్ని పెంపొందించే ఆదేశిక నియమాలు?(బి)
ఎ. ప్రకరణ 39 ఎ–బి బి. ప్రకరణ 39 బి–సి
సి. ప్రకరణ 39 సి–డి డి. ప్రకరణ 39 yì –ఇ - హిజాబ్ వివాదంపై ఇటీవల తీర్పు వెలువరించిన హైకోర్టు?(ఎ)
ఎ. కర్ణాటక; బి. గుజరాత్;
సి. ఉత్తరప్రదేశ్; డి. తమిళనాడు
సిలబస్‌లోని అంశాల వారీగా విశ్లేషణ
- రాజ్యాంగ రచన ముఖ్య లక్షణాల విభాగంలో ప్రధానంగా ప్రశ్నలు సమాచారానికి సంబంధించి ఉంటాయి. సమావేశాలు, సంబం«ధిత తేదీలు, కమిటీలు, చైర్మన్లు, తీర్మానాలు వాటిపై నేరుగా ప్రశ్నలు వస్తాయి.
- ప్రవేశిక రాజ్యాంగ తత్వం అనే విభాగంలో ప్రశ్నలు.. ప్రవేశిక లక్ష్యాలు, ఆదేశాలు, వాటి అనువర్తనకు సంబంధించి ఉంటాయి. సుప్రీంకోర్టు తీర్పును కూడా గుర్తించుకోవాల్సి ఉంటుంది.
- ప్రాథమిక హక్కులు,నిర్దేశిక నియమాల పై వచ్చే ప్రతి ప్రశ్న ప్రకరణకు సంబం«ధించి ఉంటాయి. కాబట్టి ప్రకరణలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
- ప్రాథమిక హక్కులు, విస్తృతి, సుప్రీంకోర్టు తీర్పులు, తాజా పరిణామాలు, ప్రాథమిక హక్కులకు నిర్దేశిక నియమాలకు మధ్య వివాదాలు, అందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణలను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి.
- కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి విభాగంలో.. ఎన్నిక, ఎంపిక ప్రక్రియ, అర్హతలు, అధికార విధులు, వివిధ స్థాయిల్లో వాటి ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రికి సంబంధించి జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి అదనపు సమాచారాన్ని సేకరించుకోవాలి. ఉదాహరణకు..
- ఎంతమంది ముఖ్యమంత్రులు రాష్ట్రపతులయ్యారు?
- అవిశ్వాస తీర్మానాన్ని అత్యధికంగా ఎదుర్కొన్న ప్రధాని ఎవరు?
- కేంద్రంలో ఏ పదవి చేపట్టకుండా ప్రధాని అయినది ఎవరు? మొదలైన అంశాలతో కూడిన విశ్లేషణ సమాచారాన్ని సేకరించుకోవాలి.
- కేంద్ర శాసన సభ పార్లమెంటు, రాష్ట్ర శాసన సభ నిర్మాణం విభాగంలో.. ఎన్నిక, అనర్హతలు, వివాదాలు, బిల్లులు రకాలు, పార్లమెంటు కమిటీలు, పార్లమెంటు శాసనసభకు మధ్య పోలికలు, తేడాలు మొదలైన అంశాలను బాగా చదవాలి.
- భారత న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు, హైకోర్టు విభాగంలో.. నిర్మాణం, నియామకం, అధికార విధులు, తాజా పరిణామాలు, జాతీయ న్యాయ నియమకాల కమిషన్, సుప్రీంకోర్టు తాజా తీర్పులు మొదలైన అంశాలను విస్తృతంగా అధ్యయనం చేయాలి.
- భారత సమాఖ్య వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర సంబం«ధాలు విభాగంలో.. ఆర్థిక వనరుల విభజన, ముఖ్య ప్రకరణలు, కేంద్ర రాష్ట్ర సంబంధాల సమీక్షకు నియమించిన∙కమీషన్లు, వాటి సిఫార్సులు అధ్యయనం చేయాలి.
- నూతన పంచాయతీ వ్యవస్థ.. 73వ, 74వ రాజ్యాంగ సవరణ ప్రత్యేకతలు, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, స్థానిక సంస్థల పనితీరును, వాటి పరిమితులను సమగ్రంగా తెలుసుకోవాలి.
- రాజ్యాంగ సంస్థలు, చట్టపర సంస్థలు, రాజ్యాంగేతర, చట్టేతర సంస్థల గురించి విస్తృతమైన అధ్యయనం చేయాలి. వీటి నిర్మాణం, నియామకంపై సమాచార సంబంధమైన ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి.
ప్రతి అంశం సమకాలీనమే
రాజ్యాంగంలోని మూల సూత్రాలు, వివిధ వ్యవస్థలు, సమకాలీన రాజకీయాల వల్ల ప్రభావితం అవుతాయి. రాజ్యాంగ స్ఫూర్తికి, వాస్తవికతకూ గుణాత్మక తేడా ఉంటోంది. తాజా పరిణామాలు, సర్వోన్నత న్యాయస్థాన తీర్పులు, వ్యాఖ్యానాలు, సవరణలు మొదలైన అంశాలను జోడించి పాలిటీని చదవాలి. ఉదాహరణకు, తాజా వివాదాలు.. హిజాబ్ వివాదం, వాక్ స్వాతంత్య్రం, పార్లమెంటు సభ్యుల స్వాధికారాలు, అనుచిత ప్రవర్తన, సస్పెన్షన్, ఆంగ్లో ఇండియన్స్ నామినేషన్స్ ఉపసంహరణ, రాష్ట్ర విధాన మండలి పునరుద్ధరణ, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్, రాష్ట్ర రాజధానుల మార్పు, న్యాయ శాఖ క్రియాశీలత వివాదాలు, వివాహ వయస్సు పెంపు ప్రతిపాదన, స్థానిక సంస్థల నిర్బంధ ఓటింగ్, ప్రకరణ 370, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు, గ్రీన్ ట్రిబ్యునల్స్, లోక్‌పాల్, లోకాయుక్త వ్యవస్థ, ఉమ్మడి పౌర నియమావళి, మత ప్రార్థనా స్థలాల్లోకి మహిళల ప్రవేశం మొదలైన పరిణామాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. పోటీ పరీక్షలకు విస్తృత స్థాయిలో చదవాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా పుస్తకాలను ఎంపికచేసుకోవాలి. అలాగే రీడింగ్‌కు, రిఫరెన్స్‌కు మధ్య ఉన్న తేడాను గమనించాలి. ప్రాథమిక సమాచారం కోసం ఒకటి లేదా రెండు పుస్తకాలు చదివితే(రీడింగ్) సరిపోతుంది. విస్తృత అధ్యయనం కోసం ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోవాలి.
– బి. కృష్ణారెడ్డి, సబ్జెక్ట్ నిపుణులు
చదవండి: Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్
టీఎస్‌పీఎస్సీ ప్రివియస్ పేపర్స్
టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ టెస్ట్స్