Skip to main content

APPSC Group 1&2 Notification: 597 పోస్ట్‌లు.. సిలబస్‌పై పట్టు.. కొలువుకు మెట్టు

గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఉద్యోగాలంటే.. ఎంతో క్రేజ్‌! రాష్ట్ర స్థాయిలో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలివి!! అందుకే వీటిని దక్కించుకునేందుకు లక్షల మంది పోటీపడుతుంటారు. ఇలాంటి అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రూప్‌1లో 89 పోస్టులు, గ్రూప్‌ 2లో 508 పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కారు తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో ఏపీలో త్వరలోనే గ్రూప్‌–1, గ్రూప్‌–2 పోస్ట్‌ల భర్తీకి నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ గ్రూప్‌–1, గ్రూప్‌–2 పోస్టులకు ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌ తదితర వివరాలు..
appsc group 1 2 notification 2023 and exam pattern and syllabus and preparation tips
  • త్వరలో గ్రూప్‌–1, 2 పోస్ట్‌ల భర్తీకి సన్నాహాలు
  • రెండు కేటగిరీల్లో కలిపి మొత్తం 597 పోస్ట్‌లకు ఆమోదం
  • డిగ్రీ ఉత్తీర్ణతతో గ్రూప్స్‌కు పోటీ పడే అర్హత
  • విశ్లేషణాత్మక అధ్యయనంతోనే సక్సెస్‌కు మార్గం

గత నాలుగేళ్లుగా నిరంతరం ఏదో ఒక నోటిఫికేషన్‌తో ఉద్యోగార్థులను పలకరిస్తున్న ఏపీపీఎస్సీ.. తాజాగా గ్రూప్స్‌ అభ్యర్థులకు ఆనందం కలిగించే కబురు చెప్పింది. మరికొద్ది రోజుల్లోనే గ్రూప్‌–1, గ్రూప్‌–2 పోస్ట్‌ల భర్తీకి సన్నాహాలు ప్రారంభిస్తామని కమిషన్‌ వర్గాలు పేర్కొన్నాయి.

మొత్తం 597 పోస్ట్‌లు
ఏపీ ప్రభుత్వం ఆమోదించిన ప్రకారం–త్వరలో విడుదల చేయనున్న గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 597 పోస్ట్‌లు భర్తీ చేయనున్నారు. గ్రూప్‌–1లో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, సీటీఓ తదితర 89 ఉన్నత స్థాయి పోస్ట్‌లు.. గ్రూప్‌–2లో డిప్యూటీ తహశీల్దార్, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3 వంటి 508 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడనుంది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

సిలబస్‌పై అవగాహన

  • మరికొద్ది రోజుల్లోనే ఏపీపీఎస్సీ గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్లు రావడం ఖాయమని స్పష్టమైంది. కాబట్టి ప్రిపరేషన్‌కు ఉపక్రమించే ముందు అభ్యర్థులు సిలబస్‌పై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలి. తాము పోటీ పడదలచుకుంటున్న పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను లోతుగా పరిశీలించాలి. గత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయాలి. ఆ తర్వాత ప్రిపరేషన్‌ ప్రణాళిక రూపొందించుకోవాలి. 
  • ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహించే గ్రూ­ప్‌–1ను లక్ష్యంగా చేసుకునే అభ్యర్థులు మరింత పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగాలి. ముందుగా ప్రిలిమ్స్, మెయిన్‌ సిలబస్‌ను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఆ తర్వాత ఆయా అంశాలకు కల్పిస్తున్న వెయిటేజీని గమనించాలి. దీనికి అనుగుణంగా ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకొని దీర్ఘకాలిక ప్రిపరేషన్‌ ప్రారంభించాలి.

మూడు దశల్లో గ్రూప్‌ 1

  • గ్రూప్‌–1 ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయి­న్స్, ఇంటర్వ్యూ ఉంటాయి. ప్రిలిమ్స్‌ రెండు పేపర్లుగా ఉంటుంది. ప్రతి పేపర్‌లో 120 ప్రశ్నలు–120 మార్కులు చొప్పున మొత్తం 240 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండు గంటలు. ప్రిలిమ్స్‌లో అర్హత పొందిన వారిని మెయిన్‌కు అనుమతిస్తారు. మెయిన్‌ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో అయిదు పేపర్లుగా 750 మార్కులకు నిర్వహిస్తారు.మెయిన్‌లో పొందిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో చివరి దశ పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు 75 మార్కులు ఉంటాయి. మెయిన్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

చ‌ద‌వండి: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

గ్రూప్‌ 2 ఇలా
గ్రూప్‌–2 పరీక్షను రెండు దశలుగా(స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామ్‌) నిర్వహిస్తారు. పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. మొదటి దశ స్క్రీనింగ్‌ టెస్ట్‌ 150 మార్కులకు ఉంటుంది. స్క్రీనింగ్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి 1:50 నిష్పత్తిలో రెండో దశ మెయిన్‌ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌లో ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటుంది.

సమన్వయం అవసరం

  • గ్రూప్‌–1, గ్రూప్‌–2 సిలబస్‌లో దాదాపు 80 శాతం ఉమ్మడి అంశాలే! కాబట్టి అభ్యర్థులు గ్రూప్‌–1 ఓరియెంటేషన్‌తో, డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌తో ప్రిపరేషన్‌ సాగిస్తే... గ్రూప్‌–2 సిలబస్‌పైనా పట్టు లభించే అవకాశం ఉంది. ఆయా టాపిక్‌లను చదివేటప్పుడు కోర్‌ సబ్జెక్ట్‌ను విస్తృతంగా అన్ని కోణాల్లో చదువుతూ.. సమకాలీన పరిణామాలతో సమన్వయం చేసుకోవాలి. తద్వారా ఏకకాలంలో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2ల్లో రాణించేందుకు వీలవుతుంది. 

విశ్లేషణాత్మక అధ్యయనం
గ్రూప్స్‌ అభ్యర్థులు విశ్లేషణాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమ్స్‌ నుంచే ఆయా అంశాలను విశ్లేషించుకుంటూ చదవాలి. సమకాలీన అంశాలపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమైన టాపిక్స్‌కు సంబంధించి సినాప్సిస్, నేపథ్యం, ప్రభావం, ఫలితం, పర్యవసానాలు.. ఇలా అన్ని కోణాల్లో పట్టు సాధించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. ముఖ్యంగా నవరత్నాలు, లక్షిత వర్గాలు, బడ్జెట్‌ కేటాయింపులు తదితర వివరాలను అవపోసన పట్టాలి. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో అమలవుతున్న ఆర్థిక విధానాలు, వాటిద్వారా జరుగుతున్న అభివృద్ధిపై దృష్టి సారించాలి. దీంతోపాటు జాతీయ స్థాయిలో తాజా రాజ్యాంగ సవరణలు, నూతన జాతీయ విద్యా విధానం, ఇటీవల కాలంలో కీలకమైన తీర్పుల గురించి అవగాహన పెంచుకోవాలి.

అప్లికేషన్‌ అప్రోచ్‌
గ్రూప్స్‌ అభ్యర్థులు ప్రతి అంశాన్ని చదివేటప్పుడు అన్వయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ముఖ్యంగా సమకాలీన అంశాలు సమ్మిళితంగా ఉండే ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఇది ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది. అదే విధంగా చదివే సమయంలోనే రైటింగ్‌ ప్రాక్టీస్‌ చేయాలి. నిరంతరం తమ సామర్థ్యాలను అంచనా వేసుకునేందుకు మోడల్‌ టెస్ట్స్‌కు హాజరు కావడం మేలు చేస్తుంది.

ప్రీవియస్‌ పేపర్స్‌
గ్రూప్స్‌ అభ్యర్థులు ప్రిపరేషన్‌ ప్రారంభించే ముందు గత ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. గత ప్రశ్న పత్రాల ద్వారా పరీక్షలో సదరు అంశాలకు లభిస్తున్న వెయిటేజీపై అవగాహన లభిస్తుంది. అంతేకాకుండా ప్రశ్నలు అడుగుతున్న తీరు తెలుస్తుంది. ఆయా టాపిక్స్‌పై తమకున్న పట్టు, ఇంకా మెరుగుపరచుకోవాల్సిన విషయాల్లోనూ స్పష్టత లభిస్తుంది.

చ‌ద‌వండి: Groups Preparation Tips: గ్రూప్స్‌..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్‌ కొట్టేలా!


సిలబస్‌పై పట్టు.. కొలువుకు మెట్టు

  • చరిత్ర: రాష్ట్ర చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. ప్రాచీన చరిత్ర మొదలు ఆధునిక చరిత్ర వరకూ..ముఖ్యమైన అంశాలపై సంపూర్ణ అవగాహన అవసరం. జాతీయోద్యమంలో ఆంధ్రప్రదేశ్‌ పాత్ర గురించి అధ్యయనం చేయాలి. అదేవిధంగా భారత దేశ చరిత్రకు సంబంధించిన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. 
  • భౌగోళిక శాస్త్రం: దీనికి సంబంధించి రాష్ట్రంలోని భౌగోళిక వనరులు, అడవులు, జీవ సంపద, వ్యవసాయ వనరుల గురించి తెలుసుకోవాలి. వీటిని తాజా పరిస్థితులతో అన్వయం చేసుకోవాలి. గత ఏడాది కాలంలో చేపట్టిన వ్యవసాయ, నీటి పారుదల ప్రాజెక్ట్‌లు.. వాటి ద్వారా లబ్ధి చేకూరే ప్రాంతాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
  • పాలిటీ: రాజనీతి శాస్త్రం, రాజ్యాంగానికి సంబంధించి ప్రాథమిక అంశాలు, భావనలు మొదలు తాజా పరిణామాల(రాజ్యాంగ సవరణలు వాటి ప్రభావం) వరకూ అన్నింటినీ తెలుసుకోవాలి. గవర్నెన్స్, లా, ఎథిక్స్‌కు సంబంధించి సుపరిపాలన దిశగా చేపడుతున్న చర్యలు, పబ్లిక్‌ సర్వీస్‌లో పాటించాల్సిన విలువలు, ప్రజాసేవలో చూపించాల్సిన నిబద్ధత, అంకిత భావం వంటి విషయాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. న్యాయపరమైన అంశాలపైనా పట్టు సాధించాలి. ప్రాథమిక హక్కులు, విధులు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు.. వీటికి సంబంధించి న్యాయ వ్యవస్థకున్న అధికారాల గురించి తెలుసుకోవాలి. అదే విధంగా సివిల్, క్రిమినల్‌ లా, కార్మిక చట్టాలు, సైబర్‌ చట్టాలు, ట్యాక్స్‌ లాస్‌ గురించి అధ్యయనం చేయాలి.
  • ఎకానమీ: మౌలిక భావనలు మొదలు తాజా వృద్ధి రేట్ల వరకూ.. గణాంక సహిత సమాచారం సేకరించుకుని పరీక్షకు సన్నద్ధం కావాలి. ఇటీవల కాలంలో చేపట్టిన ప్రధాన ఆర్థిక సంస్కరణలు, వాటిద్వారా లబ్ధి చేకూరే వర్గాలు; జాతీయ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తాజాగా తీసుకొచ్చిన విధానాలపై పట్టు సాధించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌­లు, ఎకనామిక్‌ సర్వేలపై అవగాహన పొందాలి.
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమలవుతున్న కొత్త విధానాలు, ప్రధాన సంస్థలు, రాష్ట్ర స్థాయిలో ఐసీటీ విధానాలు, ఇండియన్‌ స్పేస్‌ ప్రోగ్రామ్, డీఆర్‌డీఓ, ఇంధన వనరులు, విపత్తు నిర్వహణకు అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. దీంతోపాటు పర్యావరణ సంబంధిత అంశాలపైనా దృష్టి సారించాలి. అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తున్న చట్టాలు, విధానాలపై పట్టు సాధించాలి.
  • సంక్షేమ పథకాలు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లక్షిత వర్గాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. నవరత్నాలు.. వాటి పరిధిలో అమలు చేస్తున్న పథకాలు, లబ్ధిదారులు, కేటాయించిన నిధులు వంటి వాటిపై గణాంక సహిత సమాచారంతో సన్నద్ధమవ్వాలి.

పునర్విభజన చట్టం
గ్రూప్స్‌ అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన మరో కీలక అంశం.. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014. జనరల్‌ స్టడీస్, ఎకానమీ, హిస్టరీ పేపర్లు అన్నింటిలోనూ.. ఈ చట్టం నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది. కాబట్టి అభ్యర్థులు ఈ చట్టాన్ని ప్రత్యేక దృష్టితో చదవాలి. విభజన తర్వాత ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు.. వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి అవగాహన పెంచుకోవాలి.

Published date : 06 Sep 2023 10:28AM

Photo Stories