Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్
పోటీ పరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్ పాత్ర ఎంతో కీలకం. ఈ విభాగం ఏదో ఒక సబ్జెక్టుకు పరిమితం కాకుండా.. పలు సబ్టెక్టులకు సంబంధించిన తాజా అంశాలతో మిళితమై ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నిరంతరం నదీప్రవాహంలా ప్రిపరేషన్ కొనసాగిస్తూ.. ఈ విభాగంపై పట్టు సాధించాలి. ప్రతిరోజూ తమ చుట్టూ జరిగే అంశాలను జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్‌కు అనుసంధానం చేస్తూ పరీక్షలకు సన్నద్ధమవ్వాలి. టీఎస్‌పీఎస్‌సీ, ఏపీపీఎస్‌సీ గ్రూప్–1, గ్రూప్–2 వంటి పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యత, అభ్యర్థుల ప్రిపరేషన్‌కు సంబంధించి సూచనలు...
ప్రామాణికతే ప్రధానం
అభ్యర్థులు వర్తమాన అంశాలను పలుచోట్ల నుంచి సేకరించి చదివేటప్పుడు జాగ్రత్త వహించాలి. వాటిలో కొన్నిసార్లు తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రామాణిక అంశాలపైనే ఆధారపడాలి. ఏదైనా అంశంపై సందేహం తలెత్తితే ఒకటికి రెండుసార్లు ఆ అంశాన్ని, అందులోని వాస్తవాలను నిర్ధారణ చేసుకోవాలి. కాన్సెప్ట్స్‌తోపాటు ఆ అంశానికి సంబంధించిన నేపథ్యంతో కలిపి చదవాలి. అప్పుడే దానిపై పూర్తిస్థాయిలో పట్టు లభిస్తుంది. అంతేకాకుండా ఎక్కువ కాలం ఆ అంశాలు గుర్తుంటాయి. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్‌ను అభ్యర్థులు తమ దినచర్యలో భాగం చేసుకుని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలి.కొత్త విషయాలను తెలుసుకోవాలనే కుతూహలం, ఆతృత పెంపొందించుకోవాలి.
చదవండి: TS History
చరిత్రను అప్‌డేట్ చేసుకోవాలి
ప్రతి సబ్జెక్టులోనూ నిత్యం కొత్త కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. చాలామంది చరిత్ర అనగానే జరిగిపోయిన విషయాల గురించి చదివే సబ్జెక్టుగా పరిగణిస్తారు. కానీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి చరిత్రతో ముడిపడిన ఒక్కో అంశంపై తాజా సమాచారాన్ని సైతం క్రమం తప్పకుండా అప్‌డేట్ చేసుకోవాలి. ఉదాహరణకు తవ్వకాల్లో బయటపడిన కొత్త విషయాలు, చారిత్రక ప్రదేశాలపై నెలకొన్న వివాదాస్పద అంశాలు, చరిత్రలో గుర్తింపు పొందిన వ్యక్తులపై ప్రత్యేక సందర్భాల్లో వచ్చే తాజా వివరాలను అప్‌డేట్ చేసుకుని దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
ఎలా చదవాలి?
ఇటీవల కాలంలో సింధూ నాగరికతకు సంబంధించిన కట్టడాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. దీనికి సంబంధించిన ప్రశ్న రానున్న పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది. ప్రస్తుత తవ్వకాల్లో బయటపడిన కట్టడం గురించి లేదా సింధు నాగరికత పట్టణాలకు సంబంధించిన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు స్టాటిక్ సబ్జెక్ట్‌ను డైనమిక్ అంశాలతో కలిపి నేర్చుకోవాలి. ఇక వ్యక్తుల విషయానికొస్తే టిప్పుసుల్తాన్‌కు సంబంధించి ఇటీవల కాలంలో చాలా వార్తలు వస్తున్నాయి. ఈ అంశాలన్నీ చదివేటప్పుడు టిప్పుసుల్తాన్ గురించి మాత్రమే చదవకుండా.. సమకాలీన రాజులు, రాజవంశాల గురించి కూడా నేర్చుకోవాలి. ఇటీవల జరిగిన శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహావిష్కరణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దీనిని చదివేటప్పుడు శ్రీ రామానుజాచార్యులు బోధించిన తత్వంతోపాటు ఇతర వ్యక్తులు బోధించిన తత్వ సిద్ధాంతాలు, ప్రత్యేకతలను నేర్చుకోవాలి. మనకు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక వివాదాల విషయానికొస్తే.. మలబార్ రెబెలియన్ ప్రముఖులు హాజీ, అలీ ముసలియర్ వంటి నాయకుల పేర్లను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించాలా? వద్దా? అనే వాటిపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
‘భూగోళ’ మార్పులపై ప్రత్యేక శ్రద్ధ
జాగ్రఫీ సబ్జెక్టుకు సంబంధించిన చాలా ప్రదేశాలు/ప్రాంతాలు వార్తల్లో నిలుస్తుంటాయి. ఇటీవల మౌంట్ ఎవరెస్ట్ నూతన ఎత్తు చర్చనీయాంశమైంది. ఈ అంశం చదివేటప్పుడు ఎవరెస్ట్ భౌగోళిక ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అలాగే ఏయే ఖండంలో ఏయే శిఖరాలు ప్రపంచంలో ఎల్తైనవిగా గుర్తింపు పొందాయో నేర్చుకోవాలి. వార్తల్లో నిలిచిన విపత్తు సంబంధిత ప్రదేశాలపై సమగ్ర సమాచారం తెలుసుకోవాలి. ఉదాహరణకు ఇటీవల టోంగా అగ్ని పర్వతం బద్ధలై సమస్యాత్మకంగా మారింది. దీని కారణంగా దక్షిణ అమెరికా ఖండంలోని పెరు దేశం ప్రభావితమైంది. చివరికి పర్యావరణ అత్యయిక స్థితి విధించే పరిస్థితి ఏర్పడింది. ఈ అంశాలను చదివేటప్పుడు వాటికి సంబంధించిన ప్రాథమిక భావనలపై కూడా దృష్టి సారించాలి. ఉదాహరణకు అగ్నిపర్వతం అంటే ఏమిటి? అది ఏర్పడడానికి కారణాలు ఏంటి? క్రియాశీలక అగ్నిపర్వతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి ప్రభావం ఎలా ఉంది? ఇలా.. అధ్యయనం చేస్తూ చదవాలి. ఇటీవల ఇండోనేషియాలో నుసంతార అనే కొత్త రాజధాని ప్రతిపాదన వచ్చింది. దానికి కారణం ఏంటి? వాతావరణ మార్పు, సముద్ర నీటి మట్టం పెరుగుదల అనే అంశాలు ఇండోనేషియా నూతన రాజధాని విషయంలో వార్తల్లోకి వచ్చాయి. కాబట్టి ఈ కాన్సెప్ట్‌ను పూర్తిగా చదవాలి. ఇలా సీ ఆప్ మార్మరా, సులవేసి ద్వీపం తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇక వీటితోపాటు రామ్సార్ సైట్స్, టైగర్ రిజర్వ్‌లు, రిపోర్టులను చదవాలి. ఫారెస్ట్ రిపోర్ట్ 2021లోని ప్రతి అంశాన్ని అడవులు అంశానికి అప్‌డేట్ చేసుకోవాలి.
చదవండి: Latest Current Affairs
కరెంట్ పాలిటీపై పట్టు
పాలిటీకి సంబంధించి ఎక్కువగా వర్తమాన అంశాలు మనకు వార్తల్లో కనిపిస్తాయి. అందులో దేశవ్యాప్తంగా సంచలనం అయిన హిజాబ్ వివాదం, లవ్ జిహాద్ తదితర వివాదాలపై అవగాహన పెంచుకోవాలి. ఈ అంశాలను చదివేటప్పుడు వివాదాలను మాత్రమే కాకుండా..దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగం ఏం చెబుతోంది? న్యాయస్థానాలు ఏయే అంశాల ప్రాతిపదికన తీర్పులు ఇస్తున్నాయో క్షుణ్నంగా పరిశీలించాలి. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలిచింది. 8వ షెడ్యూల్‌కి వచ్చిన సవరణలు, మార్పులు కొత్త భాషల చేరిక, ప్రస్తుత డిమాండ్... ఇలా ఒక విషయాన్ని చరిత్ర నుంచి ప్రస్తుత చర్చ వరకు.. అన్ని కోణాల్లో నేర్చుకోవాలి. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వార్తల్లో నిలిచిన రాజ్యాంగ ప్రకరణల(ముఖ్యంగా ప్రకరణ 164 (4))పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. మరోసారి చర్చల్లోకి వచ్చిన ప్రకరణ 44 గురించి క్షుణ్ణంగా నేర్చుకోవాలి.
ఆర్థికంపై అవగాహన
ఎకానమీ విషయానికి వస్తే కచ్చితంగా చదవవలసిన రెండు ముఖ్యమైన అంశాలు... బడ్జెట్, ఆర్థిక సర్వే. అయితే బడ్జెట్ విషయంలో అభ్యర్థులు అందులోని గణాంకాలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ బడ్జెట్ ప్రత్యేకతలు, ఈ సంవత్సరం బడ్జెట్‌లో పేర్కొన్న కొత్త పథకాలు, ఈ సంవత్సరం బడ్జెట్‌కు పిల్లర్స్‌గా పేర్కొనే అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. సర్వే అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎదుర్కొన్న సవాళ్లు, పురోగతి సాధించిన రంగాలు, సమస్యలు ఎదుర్కొన్న రంగాలు పరిష్కార మార్గాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
జనరల్ సైన్స్‌లో వర్తమానం
జనరల్ సైన్స్‌లో ఎక్కువగా వర్తమాన అంశాలపై దృష్టి సారించాలి. గత రెండు సంవత్సరాలుగా ప్రపంచాన్నే ప్రభావితం చేసిన కరోనా వైరస్‌కు సంబంధించిన విషయాలను చదువుతూనే వైరస్ వల్ల వచ్చే వ్యాధులు, డీఎన్‌ఏ ఆధారిత వైరస్, ఆర్‌ఎన్‌ఏ ఆధారిత వైరస్‌లు అంటే ఏమిటి? వ్యాక్సిన్‌ల తయారీ, వైద్యశాస్త్రానికి సంబంధించి వార్తల్లో నిలిచిన ప్రముఖ సంస్థలు(ఐఎన్‌ఎస్‌ఏసీవోజీ, డీజీసీఐ), వ్యాక్సిన్ తయారీ సంస్థలు, వ్యాక్సిన్‌ల ప్రత్యేకతలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
ఆవిష్కరణలకు ప్రాధాన్యత
సైన్స్ అండ్ టెక్నాలజీలో.. ఇన్నోవేష¯Œ ్సకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇటీవల తరచూ ఐఐటీలు అధునాతన ఆవిష్కరణలు రూపొందించి వార్తల్లో నిలుస్తున్నాయి. వాటిపై దృష్టి సారించాలి. అలాగే ఇస్రో కార్యక్రమాలతోపాటు ఇన్‌స్పేస్, ఇస్రో ఇటీవల చేసిన ప్రయోగాలపై పట్టు పెంచుకోవాలి. ఉదాహరణకు పీఎస్‌ఎల్వీ–సి 52, డీఆర్‌డీవో ప్రయోగాలు, మిస్సైల్స్, వార్తల్లో నిలిచిన సూపర్ కంప్యూటర్లపై అధ్యయనం చేయాలి. చైనా కృత్రిమ సూర్యుడు టోకోమక్ ప్రత్యేకతలు,వివాదాస్పదమైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, అంతరిక్ష చెత్త నిర్వహణ కార్యక్రమాలు, మార్స్‌పై వివిధ దేశాలు చేస్తున్న పరిశోధనల అంశాలను నేర్చుకోవాలి.
అంతర్జాతీయ అంశాలపై అధ్యయనం
అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే రష్యా ఉక్రెయిన్ వివాదం, కారణాలు ప్రపంచ దేశాలపై ప్రభావం, నాటో విస్తరణ, ఈ వివాదం వల్ల వార్తల్లో నిలిచిన అంతర్జాతీయ సంస్థలపై దృష్టి సారించాలి. ఉదాహరణకు యూఎన్‌ఎస్‌సీ, ఐఏఈఏ, కౌన్సిల్ ఆఫ్ యూరోప్, అంతర్జాతీయ న్యాయస్థానం, యూఎన్‌హెచ్‌ఆర్‌సీ తదితర అంశాలను చదవాలి. ఏ అంతర్జాతీయ అంశాన్ని నేర్చుకుంటున్నా.. భారత్ పై దాని ప్రభావం అనే కోణంలో అధ్యయనం చేయాలి. ఇలా గత సంవత్సరంలో వార్తలో నిలిచిన వివాదాలు చాలా ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం, ఇజ్రాయిల్ పాలస్తీనా, అంతకుముందు అర్మేనియా అజర్‌బైజాన్ తదితర అంశాలను చదవాలి. భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వివిధ ఆపరేషన్లు.. ఆపరేషన్ దేవిశక్తి (అఫ్గానిస్తాన్), ఆపరేషన్ గంగ (ఉక్రెయిన్).. ఇలాంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. భారత విదేశాంగ విధానం, ఇటీవల వార్తల్లో నిలిచిన ముఖ్యమైన ఒప్పందాలతోపాటు చరిత్రాత్మక ఒప్పందాలను.. ప్రస్తుత ఒప్పందాలతో అనుసంధానం చేస్తూ చదవాలి. వీటితో పాటు ముఖ్యమైన నివేదికలు, సూచీలు, నౌకా, వైమానిక, సైనిక విన్యాసాలు తదితర అంశాలను ప్రత్యేంగా నేర్చుకోవాలి. ప్రామాణిక వార్తాపత్రికలు, అధికారిక వెబ్‌సైట్లు, మ్యాగజీన్ల ఆధారంగా సమాచారాన్ని సేకరించుకుంటూ.. పోటీ పరీక్షలకు సన్నద్ధమవ్వాలి.
సగటున వివిధ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్‌పై అడిగిన ప్రశ్నలు
పరీక్ష | ప్రశ్నలు |
యూపీఎస్సీ(సివిల్స్ ప్రిలిమ్స్) | 14 నుంచి 16 |
ఏపీపీఎస్సీ(గ్రూప్ 1 ప్రిలిమ్స్) | 30 |
టీఎస్‌పీఎస్సీ(గ్రూప్ 1 ప్రిలిమ్స్) | 25 నుంచి 30 |
ఇతర పోటీ పరీక్షల్లో దాదాపు | 15 శాతం |
– బాలలత, సబ్జెక్ట్ నిపుణులు