Skip to main content

Science & Technology Preparation: సబ్జెక్ట్‌ ఒకటే అయినప్పటికి.. అడిగే ప్రశ్నల తీరులో భేదం...

Science & Technology Preparation
Science & Technology Preparation

తెలుగు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు, ఇతర శాఖలు నిర్వహించబోయే.. అన్ని పోటీ పరీక్షల్లో.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణం, జనరల్‌ సైన్స్‌ వంటి అంశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రూప్‌–1, 2, 3, ఎస్‌ఐ లాంటి పరీక్షలతో పాటు సివిల్స్‌ లాంటి అత్యున్నత స్థాయి పరీక్షల్లో కూడా ఈ టాపిక్స్‌కు ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని ఎలా చదవాలో తెలుసుకుందాం...  

సబ్జెక్ట్‌ ఒకటే అయినప్పటికి.. అడిగే ప్రశ్నల తీరులో భేదం ఉంటుందని అభ్యర్థులు గమనించాలి. దానికి అనుగుణంగా ప్రిపేర్‌ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రసాంకేతిక రంగాల్లో నిరంతర మార్పు సర్వసాధారణం. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్‌ కొనసాగించాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే.. ఒక ప్రశ్నలో ప్రస్తుత అభివృద్ధి అంశాలు, వాటికి సంబంధించిన బేసిక్‌ అంశాలను జతచేర్చి అడగడం జరుగుతుంది. దీనివల్ల అభ్యర్థులు ప్రశ్నలకు జవాబులను సరైన రీతిలో గుర్తించలేకపోతున్నారు. 
ఉదాహరణకు ఈ కింది ప్రశ్నను గమనించండి?

  • ప్రశ్న: భారత అణుశక్తి నేపథ్యంలో కింది వాక్యాలను చదవండి.
    1. భారతదేశ రెండవ దశ రియాక్టర్‌ అడ్వాన్స్‌డ్‌ హెవీ వాటర్‌ రియాక్టర్‌.
    2. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఐటీఈఆర్‌..అణు సంలీనపు రియాక్టర్‌ నిర్మాణానికి         భారత్‌ క్రయోస్టాట్‌ అను కీలక భాగాన్ని సరఫరా చేసింది.
    పై వాటిలో ఏది/ఏవి సరైనవి?
    ఎ) 1మాత్రమే    బి) 2 మాత్రమే
    సి) 1 – 2    డి) ఏదీకాదు
    జవాబు: బి
  • భారత అణుశక్తి కార్యక్రమంలో 3 దశల/తరాల రియాక్టర్లు ఉంటాయి.
    పై ప్రశ్నలోని మొదటి స్టేట్‌మెంట్‌ తప్పు. ఎందుకంటే.. భారతదేశ అణుశక్తి కార్యక్రమంలో.. రెండవ దశ రియాక్టర్‌ అనేది ఒక ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్‌.
    పైన ఇచ్చిన అడ్వాన్స్‌డ్‌ హెవీ వాటర్‌ రియాక్టర్‌ అనేది మూడోదశ రియాక్టర్‌.అదే మొదటి దశను ప్రెషరైజ్డ్‌ హెవీ వాటర్‌ రియాక్టర్‌ అంటారు.
  • రెండోవ స్టేట్‌మెంట్‌ ప్రకారం– ITER అంటే.. International Thermonuclear Exper-imental Reactor. ఇది భారత్, చైనా, దక్షిణ కొరియా, అమెరికా, జపాన్, రష్యా, ఈయూ, యూకే దేశాలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఒక భారీ సంలీనపు రియాక్టర్‌(fusion reactor). దీనిని ఫ్రాన్స్‌లో నిర్మిస్తున్నారు. తన వంతుగా భారతదేశం బాహ్యభాగంలో ఉష్ణోగ్రతల నియంత్రణకు కీలకమైన ఒక క్రయోస్టాట్‌ను అందజేసింది. ఇది ఒక భారీ (30 మీటర్లు) వ్యాసం కలిగిన  STAINLESS STEEL HIGH VACUUM PRESSURE CHAMBER. 
  • ఇటీవలే భారత్‌కు చెందిన ఎల్‌ అండ్‌ టీ సంస్థ క్రయోస్టాట్‌పై భారీ లిడ్‌ను విజయవంతంగా అమర్చింది. ఇలా ఏ టాపిక్‌ తీసుకున్నా సరే.. ఒకవైపు బేసిక్స్, మరోవైపు ప్రస్తుత డెవలప్‌మెంట్స్‌ను గురించి తెలుసుకోవాలి. 

చ‌ద‌వండి: TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?​​​​​​​ 

రెండోవ ఉదాహరణ

  • కోవిడ్‌–19 నేపథ్యంలో.. ఎన్నో రకాల టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అసలు టీకా అంటే ఏంటి.. వివిధ రకాల టీకాల్లో ఏముంటుంది.. సాంప్రదాయ, ఆధునిక టీకాల మధ్య భేదాలు ఏంటి.. అనే విషయాలు తెలిస్తే కదా.. ఏ కోవిడ్‌ టీకా ఏ రకానికి చెందింది అనే విషయం అర్థమవుతుంది.
    ఈ ప్రశ్నను చదవండి.
  • భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ ఏ రకమైన టీకా?
    ​​​​​​​ఎ) డీఎన్‌ఏ టీకా        బి) MRNA టీకా
    సి) ఇనాక్టివేటెడ్‌ టీకా    డి) ఏదీకాదు
    జవాబు: సి
  • ఏ కంపెనీ ఏ టీకాను తయారు చేసింది. దేశీయ, విదేశీ టీకాలు ఏవి అని కూడా అడిగే ఆస్కారం ఉంటుంది. కొన్ని ప్రశ్నలు డైరెక్ట్‌గా, మరికొన్ని ప్రశ్నలు స్టేట్‌మెంట్స్‌ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్‌ఐ లాంటి పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. మారుతున్న ప్రశ్నల సరళిని దృష్టిలో పెట్టుకొని.. దానికి అనుగుణంగా చదువుకోవాలి. అలాకాకుండా కేవలం బిట్‌ ఓరియంటెడ్‌లో చదువుకోవడం ద్వారా అభ్యర్థులు పరీక్షల్లో నష్టపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని గమనించాలి.
  • గ్రూప్‌–2లో.. మరీ ముఖ్యంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, జనరల్‌ సైన్స్‌ వంటి అంశాలను తీసుకుంటే.. టెక్నాలజీ అనేది జనరల్‌ సైన్స్‌ ఆధారితంగా ఉంటుంది. ఉదాహరణకు జీవశాస్త్రంలో కణ జీవశాస్త్రం, డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ వంటి మూల అంశాలను చదువుకొని.. వాటిని బాగా అర్థం చేసుకుంటేనే బయోటెక్నాలజీ రంగంలో మూలకణాలు, కల్చర్డ్‌ మీట్, జన్యుమార్పిడి పంటలు, జీన్‌ ఎడిటింగ్‌ వంటి అంశాలు అర్థమవుతాయి. ఇలాంటి సాంకేతిక అంశాలకే నోబెల్‌బహుమతులు లభిస్తున్నాయి.
  • నోబెల్‌ బహుమతులు ఎవరెవరికి వచ్చాయి అని మాత్రమే చదువుకోకుండా.. ఎందుకు వచ్చాయి.. వారు కనుగొన్న ఆ ప్రక్రియ ఏంటి అనే దానిపైన దృష్టి పెట్టాలి. ఇలా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి ఏ అంశం తీసుకున్నా.. దానికి మూలాల దగ్గరి నుంచి అర్థం చేసుకోవాలి. ఇందుకు మరో ఉదాహరణ.. అణుశక్తి సాంకేతికత. పరమాణు నిర్మాణం, రేడియో ధార్మికత గురించి తెలుసుకుంటేనే.. కేంద్రక విచ్ఛితి, కేంద్రక సంలీనం.. అదే విధంగా అణు రియాక్టర్లు వంటి వాటిపై పట్టు లభిస్తుంది.
  • సాంకేతిక అంశాల ఆధారంగా దేశవిదేశాల్లో ఏ రకమైన పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో.. ప్రస్తుతం స్టార్టప్‌ల హవా కొనసాగుతోంది. సాంకేతికతలో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగానే స్టార్టప్‌ల విప్లవం కొనసాగుతుంది. భారతదేశం కూడా దీనిని ప్రోత్సహించే లక్ష్యంతో స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా కార్యక్రమాలను అమలు చేస్తుంది. దాదాపు అన్ని సాంకేతిక రంగాల్లో స్టార్టప్‌లు విస్తరించాయి. ఇప్పటికే దేశ అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లు భారీగా వచ్చాయి. ఇంకా పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కింది ప్రశ్నను గమనించండి.    
  • ప్రశ్న: ఇటీవల శకుంతల అనే ఒక ఉపగ్రహాన్ని ఫాల్కన్‌ 9 అనే రాకెట్‌ ద్వారా.. స్పేస్‌ ఎక్స్‌  ప్రయోగించింది. భారత్‌లోని ఏ అంతరిక్ష స్టార్టప్‌కు చెందినది ఈ ఉపగ్రహం?
    ​​​​​​​ఎ) స్కైరూట్‌ ఏరోస్పేస్‌    బి) పిక్సెల్‌
    సి) అగ్నికుల్‌    డి)ఏదీ కాదు
    జవాబు: బి (పిక్సెల్‌)
  • అంతరిక్ష కార్యక్రమం అన్నప్పుడు భారత అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా.. ఇస్రో ప్రయోగిస్తున్న ఉపగ్రహాలు, నౌకల గురించి మాత్రమే కాకుండా.. దేశ అంతరిక్ష స్టార్టప్‌లు, విదేశీ అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా.. నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలు, స్పేస్‌ ఎక్స్‌ వంటి ప్రైవేట్‌ సంస్థలు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయనే విషయాలను కూడా తెలుసుకోవాలి. ఇలా చదివితే పరీక్షల్లో అడిగే ఎటువంటి ప్రశ్నలకు అయినా సరే సులభంగా ఆన్సర్‌ చేయవచ్చు. ముఖ్యంగా ప్రిలిమినరీలో నెగిటివ్‌ మార్కింగ్‌ ఉన్నప్పుడు అభ్యర్థులకు అడిగిన అంశంపై ఖచ్చితత్వం ఉండాలి. అప్పుడు మాత్రమే జవాబును సరిగ్గా గుర్తించగలుగుతారు.
  • పెరుగుతున్న పోటీ దృష్ట్యా కేవలం ఎలిమినేషన్, గెస్సింగ్‌ మీద ఆధారపడి జవాబులను గుర్తించలేమని అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ సక్సెస్‌కు షార్ట్‌కట్‌ ఉండదు కానీ, స్మార్ట్‌ ప్రిపరేషన్‌ ఉంటుంది.

చ‌ద‌వండి: Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్‌ అఫైర్స్‌​​​​​​​

స్మార్ట్‌ ప్రిపరేషన్‌

  • స్మార్ట్‌ ప్రిపరేషన్‌లో ముఖ్యమైనది.. ఒక టాపిక్‌ తీసుకుంటే.. దాని పరిధిని గురించి మొదట తెలుసుకోవాలి. అలాగే తర్వాత దానికి సంబంధించిన బేసిక్స్‌ను అర్థం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆ అంశంపై ఎటువంటి న్యూస్‌ వస్తుందో తెలుసుకోవాలి. 
  • ప్రతి సబ్జెక్ట్‌లో సరైన మెంటార్‌ను గుర్తించి.. వారి సలహాలను తీసుకోవడం వంటివి అన్నీ కూడా స్మార్ట్‌ ప్రిపరేషన్‌లో భాగమే. గుడ్డిగా బిట్‌ బ్యాంక్‌లను ఫాలో కాకుండా.. సబ్జెక్ట్‌పై పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. అసలు ఏ ఫ్యాకల్టీకి సరైన అనుభవం ఉంది? ఎవరికి లేదు అని కూడా తెలుసుకోవాలి. అనుభవంలేని వారి గైడెన్స్‌ వల్ల మొదటికే మోసం అవుతుంది. 
  • చాలా మంది అభ్యర్థులు ప్రిపరేషన్‌ స్ట్రాటజీకి సంబంధించి..తప్పుడు మార్గం ఎంచుకుని తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు.

ముఖ్యమైన టాపిక్స్‌

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో అభ్యర్థులు నిరంతరం అంతరిక్ష కార్యక్రమం, రక్షణ కార్యక్రమం, ముఖ్యంగా క్షిపణుల అభివృద్ధి, వాటి రకాలు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, ఎప్పటికప్పుడు జరగుతున్న డీఆర్‌డీఓ పరీక్షలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అందులో ముఖ్యంగా 4వ పారిశ్రామిక విప్లవానికి కారణమయ్యే బిగ్‌డేటా, డేటా సైన్స్, కృత్రిమ మేథ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, జన్యుమార్పిడి జీవులు, జీన్‌ ఎడిటింగ్, టీకాలు, వ్యవసాయం, ఆహార‡రంగంలో బయోటెక్నాలజీ ఉపయోగాలు, శక్తి వనరులు–రకాలు, ముఖ్యంగా సౌర, పవనశక్తి, హైడ్రోజన్, ఎలక్ట్రికల్‌ వాహనాలు, అణుశక్తి వంటి వాటితోపాటు బయో ఇన్ఫర్మేటిక్స్, బయోనిక్స్, కృత్రిమ గర్భం, కల్చర్డ్‌ మీట్‌ వంటి ఎమర్జింగ్‌ టెక్నాలజీలపై సరైన రీతిలో ప్రిపరేషన్‌ కొనసాగించాలి.

ఎమర్జింగ్‌ టెక్నాలజీ

  • ప్రస్తుతం ఇంకా అభివృద్ధి దశలోనే ఉంటూ.. భవిష్యత్తులో మనకు అందుబాటులోకి రానున్న సాంకేతికను ఎమర్జింగ్‌ టెక్నాలజీ అంటారు. వీటిపై మనకు స్పష్టమైన సమాచారం లేనప్పటికీ.. వీటి సూత్రాలను చదువుకోవాలి. ఇవి అభివృద్ధి చెంది అందుబాటులోకి వస్తే.. భవిష్యత్తులో మనిషి జీవితంలో విప్లవాత్మక మార్పులకు కారణమవుతాయి.
  • సబ్జెక్టులను క్షుణ్నంగా చదువుకోవడం ఎంత ముఖ్యమో.. అదేవిధంగా వాటిని ఎప్పటికప్పుడు రివైజ్‌ చేసుకోవడం కూడా అంతే ప్రధానం. రివిజన్‌ ద్వారా సబ్జెక్టుపై పట్టు లభించడంతోపాటు పరీక్షలో జవాబును గుర్తించే ఖచ్చితత్వం పెరుగుతుంది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో.. కరెంట్‌ అఫైర్స్‌ కోసం పరీక్ష ముందు వచ్చే ఏదో ఒక కరెంట్‌ అఫైర్స్‌ బుక్‌ తీసుకొని మొత్తం ఒకేసారి ప్రిపేర్‌ అవడం ద్వారా.. అభ్యర్థులు గందరగోళానికి గురవుతారు. కాబట్టి ఎప్పటికప్పుడు న్యూస్‌ పేపర్‌లోని రోజువారి డెవలప్‌మెంట్స్‌ను అర్థం చేసుకుని, నోట్‌ చేసుకోవాలి. ఇందుకోసం అభ్యర్థులు పరీక్ష ముందు వచ్చే కరెంట్‌ అఫైర్స్‌ పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలి.

– ఇ. హరికృష్ణ , సబ్జెక్ట్‌ నిపుణులు

చ‌ద‌వండి: TSPSC & APPSC Groups: గ్రూప్స్‌లో విజయానికి జనరల్ సైన్సే కీలకం.. ఇలా చ‌దివితే..​​​​​​​

Published date : 25 Apr 2022 05:12PM

Photo Stories