Skip to main content

TGPSC Group 1, 2 Ranker Success Story : టీచ‌ర్ టూ... గ్రూప్-1 స్థాయి అధికారిగా అయ్యానిలా.. ఆ సంఘటన న‌న్ను కదిలించింది...

మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించి కన్నవారిని ఎలాంటి లోటూ లేకుండా చూసుకోవాలని పదో తరగతిలోనే నిర్ణయించుకున్నారు. అలాగే చిన్ప‌ప్పుడే.. అమ్మానాన్న పడుతున్న కష్టం చూసి.. అతనిలో ఉన్నత స్థానాలకు ఎదగాలన్న సంకల్పం బ‌లంగా నింపింది.
Mandadi Nagarjuna Reddy MRO, Group 1 Ranker

ఈ బ‌ల‌మైన ల‌క్ష్యంతోనే క‌ష్ట‌ప‌డి చ‌దివి... నేడు గ్రూప్‌-1, 2 అధికారిగా మారారు. ఈ నేప‌థ్యంలో మందాడి నాగార్జునరెడ్డి స‌క్సెస్   స్టోరీ మీకోసం...

కుటుంబ నేప‌థ్యం : 
మాది నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని బోయగూడెం. అమ్మానాన్న వ్యవసాయ పనులు చేస్తుంటారు. చిన్నప్పటి నుంచి వారు పడే కష్టాన్ని దగ్గర నుంచి చూశా. ప్రభుత్వ ఉద్యోగం సాధించి వారికి ఎలాంటి కష్టం లేకుండా చూసుకోవాలని పదో తరగతిలో ఉన్నప్పుడే నిర్ణయించుకున్నా.

నా ఎడ్యుకేష‌న్ :
నేను టెన్త్ వరకు రాజవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివా. ఇంటర్ తర్వాత టీటీసీ పూర్తిచేశా. ఇంటర్, డిగ్రీ హాలియాలో చదివా. 

టీచ‌ర్ టూ... గ్రూప్-1 స్థాయి అధికారి

Mandadi Nagarjuna Reddy MRO Group 1 Ranker Success Story

ఎడ్యుకేష‌న్ పూరైన త‌ర్వాత‌... నిరంతరం శ్రమిస్తూ తొలుత 2006లో టీచర్ ఉద్యోగం సాధించారు. అంతటితో ఆగిపోకుండా తర్వాత 2011లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, 2012లో డిప్యూటీ తహసీల్దార్ కొలువు సొంతంచేసుకున్నారు నల్లగొండ జిల్లాకు చెందిన మందడి నాగార్జున రెడ్డి. అలాగే హుజూర్ నగర్ ఎమ్మార్వోగా పనిచేస్తున్న మందాడి నాగార్జునరెడ్డి... 2025 మార్చి 10వ తేదీన తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇటీవ‌ల విడుద‌ల చేసిన గ్రూప్‌-1 మెయిన్స్ మార్కుల జాబితాలో... 900 మార్కులు గాను 488 మార్కులు సాధించారు. 

ప్రణాళికాబద్ధంగా, ఏకాగ్రతతో చదివితే ఎలాంటి పోటీ పరీక్షలోనైనా సులువుగా విజయం సాధించొచ్చని నాగార్జున రెడ్డి అన్నారు. అలాగే ప్ర‌స్తుతం ఒక విధులు నిర్వర్తిస్తూనే.. మ‌రో వైపు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు నియామక విధానం పట్ల అవగాహన కల్పిస్తున్నాను. అలాగే రాత పరీక్షలకు కూడా శిక్షణ ఇస్తున్నాను అన్నారు.

పుస్త‌కాల ఎంపిక‌లో...
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో.. మార్కెట్లో ఎన్నో పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే అభ్యర్థులు ఒక సబ్జెక్టుకు సంబంధించి ఒక ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకొని, వీలైనన్ని ఎక్కువ సార్లు చదవాలి. ఒక సబ్జెక్టు కోసం వేర్వేరు పుస్తకాలు చదవడం వల్ల సమయం వృథా తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే ఒకే పుస్తకాన్ని ఎంచుకొని వీలైనన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి. చాప్టర్ల వారీగా ముఖ్యమైన అంశాలను నోట్స్ రూపంలో రాసుకొని, పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. అకాడమీ పుస్తకాలు లేదా మార్కెట్లో దొరికే ప్రామాణిక మెటీరియల్‌ను చదవడం మంచిది.

ఇలా సొంతంగా చదవడమే మేలు..

Mandadi Nagarjuna Reddy MRO News in Telugu

కోచింగ్ తీసుకుంటేనే పోటీ పరీక్షల్లో విజయం సాధ్యమనే భావన చాలామంది అభ్యర్థుల్లో ఉంటుంది. ముందు దీన్నుంచి బయటపడాలి. కోచింగ్ ద్వారా ఏయే అంశాలు, ఎలా చదవాలో తెలుస్తుంది. ప్రస్తుతం పలు పోటీ పరీక్షలకు అందుబాటులో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని, అభ్యర్థులు సొంతంగా, ప్రణాళికాబద్ధంగా చదవడం మంచిది. అలాగే వీలైనన్ని మాక్‌టెస్టులు రాయాలి. వీటిద్వారా తాము ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నామో గుర్తించి, వాటిపై మరింత దృష్టిసారించాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి.

కోచింగ్‌, పుస్తకాల ద్వారా వచ్చిన డబ్బుతో..

mro nagauna reddy success story in telugu

తహశీల్దార్‌గా ఉద్యోగం చేస్తూ.. సాయంత్రం.. పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు ఆన్‌లైన్‌ క్లాసులు చెబుతారు. అలాగే రాత్రి.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం పుస్తకాలు రాస్తారు. కోచింగ్‌, పుస్తకాల ద్వారా వచ్చిన డబ్బుతో ‘మౌనిక ఫౌండేషన్‌’ ద్వారా పేదలకు సాయం చేస్తారు. సామాజిక మార్పే లక్ష్యంగా వైవిధ్యమైన మంత్లీ చాలెంజ్‌ నిర్వహిస్తున్న ఈ తహశీల్దారు.

ఆ సంఘటనతో..
నాగార్జున కోడలు క్యాన్సర్‌ వల్ల రెండేండ్ల క్రితం చనిపోయింది. ఆ సంఘటన ఆయనను కదిలించింది. వైద్యం చేయించుకునే స్తోమత లేక ఎవ్వరూ ప్రాణాలు పోగొట్టుకోవద్దనే ఉద్దేశంతో ‘మౌనిక ఫౌండేషన్‌’ స్థాపించారు. ఉదయం 10.30 నుంచి తహశీల్దారుగా ఆయన విధి నిర్వహణ ఆరంభం అవుతుంది. ఆ సమయానికంతా శిక్షణ తరగతులు పూర్తవుతాయి. పుస్తకాలు, యూట్యూబ్‌, కోచింగ్‌ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఫౌండేషన్‌కు కేటాయించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బోధన, పుస్తకాలు తనకు అత్యంత ఇష్టమైన వ్యాపకాలనీ, సేవ తన బాధ్యత అని అంటున్నారు నాగార్జున రెడ్డి. 

ఎంతో మందికి స‌హాయం చేస్తూ...
నైపుణ్యం ఉన్నా పేదరికం వల్ల ఎలాంటి ఉపాధీ లభించక ఇబ్బంది పడుతున్నవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. దీనికోసం ప్రతీనెల ‘మంత్లీ చాలెంజ్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నాగార్జున అండ్‌ ఫ్రెండ్స్‌. ప్రతీనెల ఒక కుటుంబాన్ని ఎంపికచేసి వారి అవసరాలు, సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆర్థిక, మానసిక భరోసా కల్పిస్తున్నారు. మంత్లీ చాలెంజ్‌ కాన్సెప్ట్‌ నచ్చి ప్రభుత్వ ఉద్యోగులు, స్నేహితులు తలా ఓ చేయి వేసేందుకు కలిసి వస్తున్నారు. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు అన్నది వారి నినాదం. ఇటీవల ఒక చిరుద్యోగి అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరాడు. విషయం తెలుసుకొని నాగార్జున రెడ్డి మిత్రబృందం ఆ కుటుంబానికి రూ.5 లక్షల సహాయం చేశారు. ఇలాంటి వితరణలు ఎన్నో చేశారు. ఇప్పుడు నాగార్జున రెడ్డి స‌క్సెస్ జ‌ర్నీ నేటి యువ‌త‌కు ఎంతో స్ఫూర్తినిస్తుంది. అలాగే గ్రూప్-1 ఫలితాలలో మంచి మార్కులు సాధించడంపై మిత్రులు, బంధువులు, గ్రామస్తులు అభినందనలు నాగార్జున రెడ్డి తెలిపారు.

నాగార్జున రెడ్డి ప్రొఫైల్ ఇదే.. :
☛ పదో తరగతి : 465 / 600
☛ ఇంటర్మీడియట్ :  885 / 1000
☛ గ్రూప్ -2 మార్కులు :  360 / 500
☛ గ్రూప్ -1 మార్కులు :  488/900

Published date : 12 Mar 2025 12:58PM

Photo Stories