Skip to main content

TSPSC & APPSC Groups: గ్రూప్స్‌లో విజయానికి జనరల్ సైన్సే కీలకం.. ఇలా చ‌దివితే..

గ్రూప్ -1, గ్రూప్-2 మొదలైన పరీక్షల్లో జనరల్ స్టడీస్ పేపర్ కామన్‌గా ఉంటుంది. ఇందులో జనరల్ సైన్స్‌, సైన్స్‌ అండ్ టెక్నాలజీ కీలకమైనవి.
General Science Topics for Competitive Exams
General Science Topics for Competitive Exams

150 మార్కుల పేపర్‌లో 30-45 ప్రశ్నలు ఈ విభాగాల నుంచి వస్తున్నాయి. అభ్యర్థులు ఈ విభాగం ప్రాధాన్యతను తెలుసుకొని అవగాహన పెంచుకుంటే మంచి స్కోరు చేయవచ్చు. ఇందు కోసం ప్రాథమిక అంశాలతో పాటు సమకాలీన విషయాలపై పట్టు సాధించాలి.

జనరల్ సైన్స్‌లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలు భాగంగా ఉంటాయి. వీటిలో వ్యాధులు, రసాయనాలు, మందులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తదితర అంశాలను సమకాలీన దృక్పథంతో చదవాలి.

బయాలజీ స‌బ్జెక్ట్‌ను ఇలా చ‌దివితే..

Biology


మానవ శరీర ధర్మశాస్త్రం, పోషణ (న్యూట్రిషన్), జంతువులు, మొక్కలు, వ్యాధులు, మైక్రోబయాలజీ లాంటి విభాగాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. శరీరంలో కీలక అవయవాలు, పనితీరు, వాటికి వచ్చే వ్యాధులపై దృష్టి పెట్టాలి. మనిషి శరీర ధర్మ శాస్త్రంలో భాగమైన జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, నాడీ, ప్రత్యుత్పత్తి, అంతఃస్రావిక వ్యవస్థల గురించి వివరంగా తెలుసుకోవాలి. ఈ మధ్య కాలంలో పౌష్టికాహార లోపాలు మళ్లీ తీవ్రమవుతున్న దృష్ట్యా పోషణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఆహారంలోని పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, వాటి ఆవశ్యకత తెలుసుకోవాలి. దీంతో పాటు ఇవి ఏయే మోతాదుల్లో అవసరం.. ఇవి లోపిస్తే సంభవించే నష్టాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. జీవ వైవిధ్యానికి వాటిల్లుతున్న ముప్పు అధికమవుతున్న దృష్ట్యా జంతు, వృక్ష వైవిధ్యంపై దృష్టి పెట్టాలి. ప్రమాదంలో ఉన్న జంతు, వృక్ష జాతులు, జాతీయ, రాష్ట్ర‌ జంతువులు, వాటి లక్షణాలను తెలుసుకోవాలి. ప్రత్యేకమైన జంతు జాతులపై దృష్టి సారించాలి. పులులు, సింహాలు, ఏనుగుల గణన లాంటి అంశాలు ముఖ్యమైనవి. జాతీయ పార్కులు, అభయారణ్యాలు, బయోస్పియర్ రిజర్వులు, టైగర్ రిజర్వుల పేర్లతోపాటు అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి.

పర్యావరణ కాలుష్యం, కాలుష్య కారకాలు ప్రభావాలు, నివారణ చర్యలు, జాతీయ స్థాయిలోని పర్యావరణ కాలుష్య నివారణ చట్టాలు, అంతర్జాతీయ స్థాయి ఒప్పందాలు ముఖ్యమైనవి. మైక్రోబయాలజీ విభాగంలో వైరస్‌లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రొటిస్టా లాంటి సూక్ష్మజీవుల గురించి తెలుసుకోవాలి. సూక్ష్మజీవుల ఉపయోగాలు, వాటి ద్వారా సంభవించే వ్యాధులు, తీసుకోవాల్సిన మందులు, జాతీయ స్థాయి, రాష్ర్ట స్థాయి కార్యక్రమాల సమాచారాన్ని సేకరించాలి.

ముఖ్యంగా రసాయన శాస్త్రంలో..

Chemistry


ఇందులో ఆవర్తన పట్టిక, పరమాణు నిర్మాణం, అకర్బన, కర్బన పదార్థాలు, ఆమ్లాలు - క్షారాలు లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆవర్తన పట్టికలోని మూలకాలు, వాటి ప్రాధాన్యం, ఉపయోగాలు, ప్రత్యేకతలు తెలుసుకోవాలి. దైనందిన జీవితంలో వాడే టూత్‌పేస్ట్‌లు, సబ్బులు, వాషింగ్ పౌడర్, షేవింగ్ క్రీమ్‌లు, లూబ్రికెంట్స్, బ్యాటరీలు, క్లీనింగ్ ఏజెంట్స్ లాంటి పదార్థాల రసాయన సమ్మేళనాల సమాచారాన్ని తెలుసుకోవాలి. ఇలాంటి అంశాలపై ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. వీటి నుంచే.. హానికర పదార్థాలు, వాటి ప్రభావాల గురించి కూడా తెలుసుకోవాలి.

లోహాలు, మిశ్రమ లోహాలు, ధాతువులు, వాటి నుంచి సంగ్రహించే లోహాలు; విస్ఫోటక పదార్థాలు, రకాలు, వాటి రసాయన సమ్మేళనాలు; ప్లాస్టిక్స్, పాలిమర్‌‌స, కంపొజిట్స్ గురించి తెలుసుకోవాలి. ఆటోమొబైల్స్, విమానాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వంట సామగ్రిలో వాడే మిశ్రమ లోహాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

భౌతిక శాస్త్రంపై ఇలా దృష్టి పెడితే..

Physics


ఈ విభాగంలో గతిశాస్త్రం, ఉష్ణం, విద్యుత్, అయస్కాంతత్వం, కాంతి లాంటి అంశాలను అధ్యయనం చేయాలి. వీటికి సంబంధించిన సూత్రాల అనువర్తనాలపై దృష్టి సారించాలి. ఆధునిక భౌతిక శాస్త్రంపై పట్టు పెంచుకోవాలి. రసాయన శాస్త్రంలోని పరమాణు నిర్మాణం గురించి ప్రాథమిక అవగాహనకు రావాలి. తద్వారా ఆధునిక భౌతిక శాస్త్రంపై పట్టు పెంచుకోవచ్చు. కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సంలీనం, రేడియో ధార్మికత లాంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక, సామాజిక రంగాల్లో రేడియో ధార్మిక ఐసోటోపుల వినియోగం గురించి తెలుసుకోవాలి. వివిధ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ పరికరాలు పనిచేసే సూత్రాలను తెలుసుకోవాలి. ఎల్‌ఈడీ, సీఎఫ్‌ఎల్ లైట్లు వాటి సూత్రాలు, శక్తి, సామర్థ్యంపై దృష్టి సారించాలి.

సైన్స్‌ అండ్ టెక్నాలజీలో..

science and technology


అంతరిక్ష రంగంలో ఇస్రో ప్రయోగిస్తున్న ఉపగ్రహాలు, వాటి బరువు, అవి ఏ దేశానికి చెందినవి, వాహక నౌక తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఇస్రో అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహాలు, రాకెట్‌ల వివరాలు తెలుసుకోవాలి. ఇతర దేశాలతో భారత్ కుదుర్చుకుంటున్న అంతరిక్ష ఒప్పందాలు, చంద్రయాన్-1, చంద్రయాన్-2, మంగళయాన్‌పై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు ప్రయోగించే ఉపగ్రహాల గురించి కూడా అవగాహన ఉండాలి. రక్షణ రంగంలో క్షిపణి వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. క్షిపణి రకాలు, వాటి పరిధిపై ప్రశ్నలు వస్తాయి. యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, తదితర రక్షణ వ్యవస్థలకు సంబంధించిన సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాలి. ఇటీవల కాలంలో జరిగిన క్షిపణి ప్రయోగాలు, అభివృద్ధిపై దృష్టి సారించాలి.

శక్తి రంగంలో సంప్రదాయ, సంప్రదాయేతర శక్తి వనరులు, దేశంలో వాటి అభివృద్ధి, వినియోగంపై సమాచారం సేకరించాలి. సౌర, పవన, జీవశక్తి వనరులతో పాటు దేశంలో బొగ్గు వనరుల లభ్యత, ఉత్పాదన, స్థాపిత శక్తిపై దృష్టి పెట్టాలి. హైడ్రోజన్ శక్తి, జియోథర్మల్, సముద్ర తరంగ శక్తి లాంటి నవీన శక్తి వనరుల గురించి తెలుసుకోవాలి. అణుశక్తి రంగానికి ప్రాధాన్యతనిస్తూ శక్తి రంగం గురించి తెలుసుకోవాలి. జాతీయ అణుశక్తి కార్యక్రమంలోని మూడు దశల రియాక్టర్ల రకాలు, వాటి ఉత్పాదనపై సమాచారం అవసరం. నిర్మాణంలో ఉన్న, నిర్మించబోయే రియాక్టర్ల వివరాలను సేకరించాలి.
బయోటెక్నాలజీలో భాగంగా మూలకణాలు, వాటి వినియోగం; జీవ ఎరువులు, జీవక్రియ సంహారకాలు, జీవ ఇంధనాలు, క్లోనింగ్, టీకాలు, వ్యాధి నిర్ధారణ పద్ధతుల గురించి తెలుసుకోవాలి. శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డిజిటల్ ఇండియా), బయో ఇన్ఫర్మేటిక్స్, రోబోటిక్స్, బయోనిక్స్, డీఎన్‌ఏ, ఫింగర్ ప్రింటింగ్ మొదలైన అంశాల మౌలిక భావనలపై అవగాహన పెంచుకోవాలి.

జనరల్ స్టడీస్ కోసం చదవాల్సిన పుస్తకాలు ఇలా..
➤ తెలుగు అకాడమీ ప్రచురించిన ఆరు నుంచి పదో తరగతి సోషల్, సైన్స్ పుస్తకాలు
➤ కరెంట్ అఫైర్స్ కోసం సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌, ప్రామాణిక దినపత్రికలు
➤ తెలంగాణ ప్రభుత్వ పథకాల వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్స్
➤ యోజన, కురుక్షేత్ర మ్యాగజీన్లు

గతంలో అడిగిన ప్రశ్నలు : 
1. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి?
ఎ) అడ్రినల్
బి) పిట్యుటరీ
సి) కాలేయం
డి) థైరాయిడ్

2. థోరియం అధికంగా లభించే ప్రదేశం?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) కేరళ
సి) కర్ణాటక
డి) తమిళనాడు

3. ఎల్‌పీజీ (వంటగ్యాస్)లో ఉండేది?
ఎ) పెంటేన్
బి) బ్యూటేన్
సి) మీథేన్
డి) హెప్టేన్

4. భారతదేశంలో మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను ఎక్కడ నెలకొల్పారు?
ఎ) తారాపూర్
బి) రామగుండం
సి) జైపూర్
డి) కుడంకుళం

5. నవంబర్ 2009లో నాసా ప్రయోగించిన అంతరిక్ష నౌక?
ఎ) అట్లాంటిస్
బి) చాలెంజర్
సి) కొలంబియా
డి) డిస్కవరి

6. ఏప్రిల్ 2012లో భారత నౌకాదళంలో చేరిన న్యూక్లియర్ సబ్‌మెరిన్?
ఎ) ఐఎన్‌ఎస్ చక్ర
బి) ఐఎన్‌ఎస్ విక్రాంత్
సి) ఐఎన్‌ఎస్ శ్రీచక్ర
డి) పైవేవీకాదు

7. చికెన్‌పాక్స్ కారకం?
ఎ) వారిసెల్ల వైరస్
బి) అడెనో వైరస్
సి) ఎస్‌వి 40 వైరస్
డి) బ్యాక్టిరియోఫేజ్

8. 22 క్యారట్ల బంగారంలో ఉండే రాగి భార శాతం ఎంత?
ఎ) 12.8 శాతం
బి) 10.8 శాతం
సి) 9.4 శాతం
డి) 8.4 శాతం

9. దేన్ని కొలవడానికి కెల్విన్ కొలమానం (స్కేల్) వాడతారు?
ఎ) కాంతి శక్తి
బి) ఉష్ణోగ్రత
సి) ధ్వని తీవ్రత
డి) ఉష్ణశక్తి

10. ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఎవరు?
ఎ) బిల్‌గేట్స్
బి) రాస్ లెవిన్ సోహ్
సి) మార్‌‌క జుకెన్‌బర్‌‌గ
డి) టిమోతికుక్

11. ఆరోగ్యవంతుడైన మానవుని రక్తపు ఞఏ (ఉదజని సూచిక) ఎంత?
ఎ) 13.0
బి) 7.4
సి) 4.8
డి) 0.0

12. విటమిన్ బి12లో ఉండే లోహం ఏది?
ఎ) కోబాల్ట్
బి) జింక్
సి) మెగ్నీషియం
డి) ఇనుము

13. ఆప్టికల్ ఫైబర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
ఎ) సంపూర్ణ కాంతి శోషణ
బి) కాంతి సంపూర్ణ అంతర పరావర్తన
సి) కాంతి వివర్తన
డి) కాంతి పరిక్షేపణ

14. సముద్రపు నీటి నుంచి ఉప్పును తొలగించి మంచి నీరుగా మార్చడంలో వాడే ప్రక్రియ?
ఎ) ఆస్మాసిస్
బి) రివర్‌‌స ఆస్మాసిస్
సి) ఎలక్ట్రోలైసిస్
డి) ఎలక్ట్రోఫోరిసిస్

సమాధానాలు : 
1) సి    2) బి     3) బి     4) ఎ      5) సి      6) ఎ      7) ఎ
8) డి    9) బి    10) సి    11) బి    12) ఎ    13) బి    14) బి

Published date : 22 Apr 2022 06:01PM

Photo Stories