Asian Wrestling Championships: ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన రీతిక
Sakshi Education
ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో మార్చి 27వ తేదీ భారత్‌కు మూడు పతకాలు లభించాయి.

రీతిక హుడా (76 కేజీలు) రజత పతకం సొంతం చేసుకోగా.. మాన్సి లాథెర్ (68 కేజీలు), ముస్కాన్ (59 కేజీలు) కాంస్య పతకాలను సాధించారు. 76 కేజీల విభాగం ఫైనల్లో రీతిక 6-7 పాయింట్ల తేడాతో ఐపెరి మెదెత్ కిజీ (కిర్గిస్తాన్) చేతిలో ఓడిపోయింది. ఒకదశలో 6-2తో ఆధిక్యంలో నిలిచిన రీతిక చివరి పది సెకన్లలో ఐదు పాయింట్లు కోల్పోయి రజతంతో సంతృప్తి పడింది.
22 ఏళ్ల రీతిక ఫైనల్ చేరే క్రమంలో 10-0తో సెయోన్ జియోంగ్ (దక్షిణ కొరియా)పై, 10-0తో నొడోకా యామమోటో (జపాన్)పై ఏకపక్ష విజయాలు సాధించింది. రెండేళ్ల క్రితం కజకిస్తాన్లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో రీతిక కాంస్య పతకాన్ని సాధించింది. ఇతర కాంస్య పతక బౌట్లలో మాన్సి 12-2తో ఇరీనా కబిలినా (కజకిస్తాన్)పై, ముస్కాన్ 4-0తో అల్తిజిన్ టొగ్టక్ (మంగోలియా)పై గెలుపొందారు.
Published date : 29 Mar 2025 09:10AM