Migratory Birds: తెలంగాణలో విదేశీ వలస పక్షుల కిలకిలావారాలు
ఇప్పటికే సంగారెడ్డి సమీపంలోని అభయారణ్యంతోపాటు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల సరస్సుకు విదేశీ పక్షులు వచ్చి సందడి చేస్తున్నాయి.
వాటిలో నార్తర్న్ షావెలర్.. నార్తర్న్ పిన్‌టైల్.. రెడ్ హెడ్ బంటింగ్.. బ్లాక్ హెడ్ బంటింగ్.. బ్లూత్రోట్.. రోజీ స్టార్లింగ్.. అ్రల్టామెరైన్ ఫ్లైక్యాచర్.. బ్లూథ్రోట్ బర్డ్, వెస్టర్న్ మార్ష్ హారియర్, లిటిల్ కంఫర్ట్ బర్డ్, కామన్ పోచార్డ్ తదితర పక్షులు ఉన్నాయి.
వెచ్చని వాతావరణం ఉండటంతో..
యూరప్, రష్యా, పశ్చిమాసియా దేశాల్లో మంచుచలికాలం నుంచి తప్పించుకోవడం కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య తెలంగాణ ప్రాంతానికి విదేశీ పక్షులు వస్తున్నాయి. అక్కడితో పోలిస్తే వెచ్చని వాతావరణం ఉండటంతోపాటు తగినంత ఆహారం లభిస్తుండటం, సంతానోత్పత్తికి అనువైన పరిస్థితులు ఉండటంతో రాష్ట్రంలోని అభయారణ్యాలు, సరస్సులకు విచ్చేస్తున్నాయి.
చిత్తడి నేలలు.. స్వచ్ఛమైన నీరు..
మంజీరా వన్యప్రాణుల అభయారణ్యంలో జీవవైవిధ్యమున్న చిత్తడి నేతలు, గడ్డి భూములున్నాయి. మంజీరా డ్యాం ఎగువన.. సింగూరు ప్రాజెక్టు దిగువన ఉన్న ఈ జలాశయంలో సుమారు 20 వరకు చిన్న దీవులున్నాయి. అవి స్థానిక పక్షులతోపాటు విదేశీ పక్షులకు గమ్యస్థానంగా మారాయి.
మరోవైపు పాకాల సరస్సు వద్ద లిటిల్ కోర్‌మోరెంట్, మైక్రో కార్బోనైజర్, ఇండియన్ కోర్‌మోరెంట్, ఫలక్రోకోరాక్స్, ఇండియన్ పాండ్ హెరాన్, ఏర్డియోలాగ్రై, గ్లోసీఇబీస్, ప్లెగడీస్ ఫాల్‌సినీలియస్ తదితర విదేశీ పక్షులు సంచరిస్తున్నాయి. ఈ సరస్సు కాలుష్యరహితం కావడంతో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది.
దీనిచుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో పచ్చని చెట్లు విదేశీ పక్షుల విడిదికి నిలయంగా మారాయి. పాకాల అభయారణ్యంలో ఎత్తయిన చెట్లతోపాటు సరస్సులో స్వచ్ఛమైన నీరు ఉండటం వల్ల ఈ ప్రాంతానికి విదేశీ పక్షులు వస్తున్నాయని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు.
వలసపక్షుల సంఖ్య తగ్గిపోతోంది..
మంజీరా అభయారణ్యంతోపాటు అమీన్‌పూర్ చెరువు, కిష్టారెడ్డిపేట్ చెరువు, పోచారం అభయారణ్యానికి విదేశీ పక్షులు వచ్చాయి. ఏటా సైబీరియా, చైనా, రష్యా వంటి దేశాల నుంచి ఈ పక్షులు వస్తుంటాయి. పట్టణీకరణ కారణంగా చెరువులు అన్యాక్రాంతం అవుతుండటంతో విదేశీ వలసపక్షుల సంఖ్య తగ్గిపోతోంది. వాతావరణంలో వస్తున్న మార్పులు కూడా ఇందుకు కొంత కారణమవుతున్నాయి.