Top 10 Busiest Airports In The World: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలు ఎక్కడున్నాయో తెలుసా?
దిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(దిల్లీ విమానాశ్రయం) 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 ఎయిర్‌పోర్ట్‌ల్లో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో అమెరికాలోని హార్ట్స్‌ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటిస్థానం దక్కించుకుంది. దుబాయ్, డాలస్ విమానాశ్రయాలు తర్వాతిస్థానాల్లో ఉన్నాయని ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) వరల్డ్ తెలిపింది.
అత్యంత రద్దీ వినాశ్రయాలు అక్కడే..
దిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి 2023లో 7.22 కోట్ల మంది ప్రయాణించారు. 2022లో రద్దీ పరంగా ఈ విమానాశ్రయం అంతర్జాతీయంగా 9వ స్థానంలో ఉంది. అయితే 2023లో మాత్రం 10స్థానానికి చేరింది. మొదటిస్థానంలోని హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 2023లో 10.46 కోట్ల మంది ప్రయాణించారు.
రెండో స్థానంలో నిలిచిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 8.69 కోట్లు, మూడో స్థానంలో ఉన్న డాలస్ ఫోర్త్ వర్త్ అంతర్జాతీయ విమాన్రాశయం నుంచి 8.17 కోట్ల మంది తమ గమ్యస్థానాలకు ప్రయాణించారు.
ప్రపంచంలోనే పది అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఐదు అమెరికాలోనే ఉండడం విశేషం. 2023లో అంతర్జాతీయంగా ప్రయాణించిన మొత్తం ప్రయాణికుల సంఖ్య సుమారు 850 కోట్లుగా ఉందని ఏసీఐ పేర్కొంది. 2022తో పోలిస్తే 27.2% వృద్ధి కనిపిస్తుందని తెలిపింది.
ప్రపంచంలోనే రద్దీ ఎయిర్‌పోర్ట్‌లు వరుసగా..
- హార్ట్స్‌ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం
- దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం
- డాలస్ ఫోర్త్ వర్త్ అంతర్జాతీయ విమాన్రాశయం
- లండన్ హీత్రో విమానాశ్రయం
- టోక్యో హానెడా
- డెన్వర్ విమానాశ్రయం
- ఇస్తాంబుల్ విమానాశ్రయం
- లాస్ ఏంజెలిస్ అంతర్జాతీయ విమానాశ్రయం
- షికాగో ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం
- దిల్లీ ఎయిర్‌పోర్ట్