Sri Lankaలో అఖిలపక్ష ప్రభుత్వం
కల్లోల శ్రీలంకలో అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో కూడిన మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు ప్రధాన ప్రతిపక్షాలు అంగీకరించాయి. అధ్యక్షుడు గొటబయా రాజపక్స జూలై 13న రాజీనామా చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది. శ్రీలంక అఖిలపక్ష నేతలు జూలై 10న సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుత ఆర్థిక, రాజకీయ సంక్షోభం, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. గొటబయా రాజీనామా తర్వాత మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు, సంక్షోభాన్ని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సంప్రదింపులు జరిపారు. అన్ని పార్టీల భాగస్వామ్యం కలిగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయానికొచ్చినట్లు అధికార శ్రీలంక పొడుజనా పెరమునా పార్టీ(ఎస్‌ఎల్‌పీపీ) నేత విమల్ వీరవాస్నా చెప్పారు. కొత్త ప్రభుత్వం పరిమిత కాలమే అధికారంలో ఉంటుందని, తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నామని ప్రధాన ప్రతిపక్షం సమాగీ జన బాలవేగయా పార్టీ ప్రధాన కార్యదర్శి రంజిత్ బండారా తెలిపారు. అధికార మార్పిడి ప్రక్రియ, పార్లమెంట్ సమావేశాలపై చర్చించేందుకు సమావేశం కావాలని అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు. అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేస్తే పార్లమెంట్ స్పీకర్ అబేయవర్దనే తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులవుతారు. ఎంపీలు నూతన అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.
also read: Top 8 Facts About Droupadi Murmu
ప్రెసిడెంట్ హౌస్ టూరిస్టు స్పాట్
గొటబయా రాజపక్స అధికారిక నివాసం ఇప్పుడొక ప్రధాన పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. నిరసనకారుల కోలాహలంతో ప్రాంగణమంతా సందడిగా మారింది. ప్రాంగణంలోనే వంటలు చేసుకుంటున్నారు. అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా తర్వాతే ఇక్కడి నుంచి వెళ్లిపోతామంటున్నారు. ప్రధాని విక్రమసింఘే ఇంటికి నిప్పు పెట్టిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరిని అరెస్టు చేస్తామన్నారు.
Also read: GK Economy Quiz: 2021 సంవత్సరంలో క్రిప్టో లాభాల పరంగా భారతదేశ స్థానం?
లంక ప్రజలకు భారత్ అండ
శ్రీలంక ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. ప్రజాస్వామ్య మార్గాల్లో అభివృద్ధి సాధించడానికి భారత్ తన వంతు సాయం తప్పకుండా అందిస్తుందని వెల్లడించారు. శ్రీలంకలో పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం క్రెడిట్ లైన్ కింద ఆదివారం 44,000కు పైగా మెట్రిక్ టన్నుల యూరియాను శ్రీలంకకు అందజేసింది.
also read: Telangana History for Competitive Exams: కాకతీయానంతర యుగం.. విద్యారణ్యుడి ప్రేరణతో విజయనగర రాజ్యస్థాపన
రహస్య బంకర్ నుంచి గొటబయా పరారీ!
ప్రెసిడెంట్ ప్యాలెస్‌ను జనం ముట్టడించబోతున్నట్లు ముందుగా∙గుర్తించిన అధ్యక్షుడు గొటబయా రాజపక్స శుక్రవారమే పరారయ్యారు. ప్యాలెస్ కింద ఉన్న రహస్య బంకర్ గుండా ఆయన క్షేమంగా బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇక్కడ బంకర్ ఉన్న మాట నిజమేనని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం నిర్ధారించింది. బంకర్‌కు బలమైన ఉక్కు ద్వారం ఉంది. లిఫ్ట్ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఎక్కడున్నారో తెలియని గొటబయా అధికారిక బాధ్యతలు యథావిధిగా నిర్వర్తిస్తున్నారు. 3,740 మెట్రిక్ టన్నుల వంటగ్యాస్ విదేశాల నుంచి ఆదివారం శ్రీలంకకు చేరుకుందని, దాన్ని ప్రజలకు సక్రమంగా పంపిణీ చేయాలంటూ జూలై 10న ఆదేశాలు జారీ చేశారు.
also read: GST: ఐదేళ్లుగా దేశమంతా ఒకే మార్కెట్
గొటబయా నివాసంలో 1.78 కోట్లు
శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స అధికారిక నివాసాన్ని నిరసనకారులు పూర్తిగా దిగ్బంధించారు. వదిలివెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. అధ్యక్షుడు, ప్రధానమంత్రి రాజీనామా చేసేదాకా తమ పోరాటం ఆగదని తేల్చిచెబుతున్నారు. రాజధాని కొలంబోలోని ఈ భవనంలో 1,78,50,000 శ్రీలంక రూపాయలు జూలై 10న తమకు లభించాయని నిరసకారులు చెప్పారు. ఈ నోట్లను లెక్కిస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ నగదును స్థానిక పోలీసులకు అప్పగించారు. వేలాది మంది జనం శనివారం ప్రెసిడెంట్ హౌస్‌ను చుట్టుముట్టి, స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రధాని విక్రమసింఘే ప్రైవేట్ నివాసానికి నిప్పుపెట్టారు. ప్రజాగ్రహానికి తలొగ్గిన అధ్యక్షుడు, ప్రధాని తమ పదవులకు రాజీనామా చేసేందుకు అంగీకరించారు.