Skip to main content

Jagananna Videshi Vidya Deevena: పేదల ఉన్నత చదువు కోసమే ‘విదేశీ విద్యా దీవెన’

Kurnool City Mayor BY Rama  Jagananna videshi vidya deevena scheme details  Jagananna Foreign Education Blessing Scheme

కర్నూలు(సెంట్రల్‌): పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నారని కర్నూలు నగర మేయర్‌ బీవై రామయ్య, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, డాక్టర్‌ జే.సుధాకర్‌ తెలిపారు. బుధవారం సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న విదేశీ విద్యా దీవెన, సివిల్స్‌ ప్రోత్సాహం పథకాల కింద ఎంపికై న అర్హులకు వారి ఖాతాల్లో నగదును ఆన్‌లైన్‌ ద్వారా బటన్‌ నొక్కి విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య, మేయర్‌, ఎమ్మెల్యేలతోపాటు డిప్యూటీ మేయర్‌ సిద్ధారెడ్డి రేణుక, గ్రంథాలయసంస్థ చైర్మన్‌ మద్దూరు సుభాష్‌ చంద్రబోస్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ సీహెచ్‌ శిరోమణిమద్దయ్య, విద్యార్థులు వీక్షించారు. ఈ సందర్భంగా మేయర్‌, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ...సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యలో అనేక సంస్కరణలు తెచ్చారన్నారు. 

చ‌ద‌వండి: Jagananna Videshi Vidya Deevena: విదేశీ విద్య కల సాకారం... 24 మంది లబ్ధిదారులు రూ.2.59 కోట్ల సాయం

నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయించారన్నారు. ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌తోపాటు అమ్మఒడి, జగనన్న విద్యా, వసతి దీవెన పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడం కోసం కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేయడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడాలన్నారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించడం కోసం వారికి ఉచితకోచింగ్‌తో పాటు ప్రోత్సాహకాల కింద ప్రిలిమినరీ పరీక్షలో ఎంపికై తే ఒక్కో విద్యార్థి లక్ష రూపాయలు, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఒక్కొక్కరికీ రూ.50 వేలు ఇస్తున్నారన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ఒక్కొక్కరికీ రూ.1.25 కోట్లు, ఇతరులకు ఒక్కొక్కరికీ రూ.కోటి రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నారన్నారు. దేశంలో ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలో లేదన్నారు. అనంతరం జేసీ మౌర్య మాట్లాడుతూ.. జిల్లాలో విదేశీ విద్యా దీవెనకింద ఒకరు ఎంపిక కాగా, ఆ విద్యార్థికి రూ.6.40 లక్షలు అందించామన్నారు. సివిల్‌ సర్వీసెస్‌లో ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన ఒక్కొక్కరికీ లక్ష చొప్పు రూ.3 లక్షలను ప్రోత్సాహకంగా మొత్తంగా రూ.9.40 లక్షలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.

Published date : 22 Dec 2023 12:24PM

Photo Stories