Skip to main content

MBBS Seats Increased 2024 : మెడిక‌ల్‌ కాలేజీల్లో 4,115కి పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లు.. ఇకపై ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లుకు వీరికే..!

సాక్షి ఎడ్య‌కేష‌న్ : తెలంగాణ నీట్ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌. ఇక రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లలో జాతీయ కోటా మినహా మిగిలిన కన్వీనర్‌ కోటా సీట్లన్నీ రాష్ట్రంలోని విద్యార్థులకే దక్కనున్నాయి.
MBBS Seats Increased 2024 in Telangana

రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు పదేళ్ల వరకు అమలైన 15 శాతం అన్‌రిజర్వ్‌డ్‌ కోటా సీట్లు ఈ ఏడాది నుంచి రద్దయ్యాయి. రాష్ట్రంలో 2014కు ముందు ఏర్పాటైన అన్ని వైద్య కళాశాలల్లో 15 శాతం (అన్‌రిజర్వ్‌డ్‌) కోటా సీట్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు పోటీపడేవారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి కావడంతో కన్వీనర్‌ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులతోనే భర్తీ కానున్నాయి. ఈ ఏడాది నుంచి 9, 10, ఇంటర్‌ను (వరుసగా నాలుగేళ్లు) రాష్ట్రంలో చదివినవారినే ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల కేటాయింపులో స్థానిక విద్యార్థులుగా పరిగణనలోకి తీసుకుంటారు.

ఇదే మొదటిసారి..
ఈసారి తెలంగాణ నుంచి నీట్‌-యూజీ పరీక్షను 77,848 మంది విద్యార్థులు రాయగా.. 47,356 మంది అర్హత సాధించారు. ఈ ఐదేళ్లలో 60 శాతం మందికి పైగా విద్యార్థులు నీట్‌-యూజీలో అర్హత సాధించడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్‌ సీట్లకు పోటీ మరింత పెరిగింది.  

➤ AP & TS NEET UG Cutoff Marks 2024 : ఏపీ, తెలంగాణ నీట్‌ యూజీ -2024 కటాఫ్‌ మార్కులు ఇవే.. కౌన్సెలింగ్ తేదీలు ఇవే..!

ముఖ్య‌మైన తేదీలు ఇవే..
మరోవైపు రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీ ప్రక్రియకు కాళోజీ విశ్వవిద్యాలయం ఆగ‌స్టు 4వ తేదీ ఆదివారం రిజిస్ట్రేషన్లతో శ్రీకారం చుట్టింది. ఈ సీట్ల కోసం నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 13వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేస్తారు. ఆలిండియా కోటా సీట్ల భర్తీకి ఆగస్టు 14 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.మొదటి రౌండ్‌ సీట్ల కేటాయింపును ఆగస్టు 23న వెల్లడిస్తారు. 

8,315 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో..
రాష్ట్రంలో కొత్తగా అనుమతి వచ్చిన నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలు సహా మొత్తం 60 (30 ప్రభుత్వ, 30 ప్రైవేటు) కళాశాలల్లో 8,315 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో జాతీయ కోటా కింద 617 సీట్లు భర్తీ కానుండగా మిగిలిన సీట్లను రాష్ట్రంలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం భర్తీ చేయనుంది. రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 29 శాతం సీట్లు దక్కనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో 4,115కు పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లు. 

 NEET UG 2024 Counselling Schedule Out: ఈనెల 14 నుంచి నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌.. ఈ సర్టిఫికేట్స్‌ తప్పనిసరి

Published date : 06 Aug 2024 08:02AM

Photo Stories