Skip to main content

1673 PO Jobs in SBI: ఎస్‌బీఐ పీఓ నోటిఫికేషన్‌ వివరాలు.. ఎంపిక ప్రక్రియ, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌...

SBI PO 2022 Notification

దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్కేల్‌-1 హోదాలో.. మొత్తం 1,673 పీఓ  ఖాళీల భర్తీకి ఎస్‌బీఐ ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. బ్యాచిలర్‌ డిగ్రీ మొదలు, ప్రొఫెషనల్, టెక్నికల్‌ ఇలా.. అన్ని డిగ్రీల అభ్యర్థులు పోటీ పడేందుకు అర్హులే!! ఈ నేపథ్యంలో.. ఎస్‌బీఐ పీఓ నోటిఫికేషన్‌ వివరాలు.. ఎంపిక ప్రక్రియ, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌... 

  • 1,673 పీఓ కొలువులకు ఎస్‌బీఐ నోటిఫికేషన్‌
  • ఎంపికైతే ప్రారంభంలోనే బేసిక్‌ పే రూ.41,960
  • మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహణ
  • ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు

ఎస్‌బీఐ తాజా నోటిఫికేషన్‌ ద్వారా రెగ్యులర్‌ ప్రాతిపదికగా 1,600 పోస్ట్‌లను, బ్యాక్‌లాగ్‌ వేకెన్సీ కేటగిరీలో 73 పోస్ట్‌లకు నియామక ప్రక్రియ చేపట్టనుంది. గతేడాదితో పోల్చితే ఖాళీల సంఖ్య తగ్గడం గమనార్హం. గత ఏడాది రెండు వేలకు పైగా పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయగా, ఈ ఏడాది ఆ సంఖ్య 1,673గానే ఉంది.

అర్హతలు

  • బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • వయసు: ఏప్రిల్‌ 1, 2022 నాటికి 21-30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు అయిదేళ్లు, ఓబీసీ వర్గాలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
  • ఎంపికైన వారికి ప్రారంభ బేసిక్‌ పే:రూ.41,960 గా ఉంటుంది. 

మూడంచెల ఎంపిక ప్రక్రియ

ఎస్‌బీఐ పీఓ ఎంపిక ప్రక్రియలో ఫేజ్‌-1, ఫేజ్‌-2, ఫేజ్‌-3.. ఇలా మూడంచెల విధానం ఉంటుంది. ఫేజ్‌-1(ప్రిలిమినరీ పరీక్ష), ఫేజ్‌-2 (మెయిన్‌ ఎగ్జామినేషన్‌), ఫేజ్‌-3 సైకోమెట్రిక్‌ టెస్ట్‌ (ఇంటర్వూ్వ/గ్రూప్‌ ఎక్సర్‌సైజెస్‌).

ప్రిలిమినరీకి 100 మార్కులు

ఎంపిక ప్రక్రియలో తొలి దశ ఫేజ్‌-1ను ప్రిలిమినరీ పరీక్షగా పేర్కొంటారు. ఈ పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో, ఆబ్జెక్టివ్‌ తరహాలో వంద మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు-30 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 35 ప్రశ్నలు-35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులకు చొప్పున మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం ఒక గంట. ప్రిలిమ్స్‌లో కేటగిరీల వారీగా మెరిట్‌ లిస్ట్‌ను రూపొందించి మెయిన్‌కు అభ్యర్థులను ఖరారు చేస్తారు. ఒక్కో పోస్ట్‌కు పది మంది(1:10 నిష్పత్తిలో)ని ఎంపిక చేస్తారు.

చ‌ద‌వండి: Bank Jobs 2022: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో.. ఉద్యోగం కొట్టాలనుకుంటున్నారా..? అయితే మీకు సరైన మార్గం ఇదే..

ఫేజ్‌-2 మెయిన్‌

  • రెండో దశ మెయిన్‌లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ ఆన్‌లైన్‌ పరీక్ష, 50 మార్కులకు డిస్క్రిప్టివ్‌ పరీక్ష నిర్వహిస్తారు. 
  • ఆన్‌లైన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు-50 మార్కులు, డేటాఅనాలసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 30 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు-60 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 35 ప్రశ్నలు-40 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు. 
  • ప్రిలిమ్స్, మెయిన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. 

ఫేజ్‌-2లోనే డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌

ఫేజ్‌-2 మెయిన్‌ పరీక్షలోనే 50 మార్కులకు డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్‌ అంశాలు ఉంటాయి. పరీక్ష సమయం 30 నిమిషాలు. కంప్యూటర్‌ ఆధారంగా తమ సమాధానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
 
పెరిగిన వెయిటేజీ

ఫేజ్‌-2 మెయిన్‌లో ఈ ఏడాది జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌కు వెయిటేజీ పెరిగింది. గతేడాది వరకు 40ప్రశ్నలతోనే ఉన్న ఈ విభాగంలో.. ఈ సంవత్సరం 50 ప్రశ్నలు ఉంటాయని పేర్కొన్నారు. 

తుది దశ

  • ఎంపిక ప్రక్రియలో తుది దశ(ఫేజ్‌-3)లో గ్రూప్‌ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. 
  • మెయిన్‌ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా.. ఒక్కో పోస్ట్‌కు ముగ్గురిని చొప్పున (1:3 నిష్పత్తిలో) తుది దశకు ఎంపిక చేస్తారు. 
  • మొత్తం 50 మార్కులకు నిర్వహించే చివరి దశ ఎంపిక ప్రక్రియలో గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 30 మార్కులు ఉంటాయి.

చ‌ద‌వండి: Exam Guidance: కొత్త సంవత్సరంలో.. వీటిపై ప‌ట్టు.. కొలువు కొట్టు !

గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌ అంటే

గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌కు ఎంపికైన అభ్యర్థులను బృందాలుగా విభజిస్తారు. ఒక్కో బృందంలో గరిష్టంగా అయిదుగురు ఉండేలా చూస్తారు. వీరికి నిర్దిష్టంగా ఒక అంశాన్ని ఇచ్చి.. దానిపై  అభ్యర్థుల అభిప్రాయం లేదా సమాధానాన్ని అడుగుతారు. అభ్యర్థులకు ఆయా సామాజిక అంశాలపై ఉన్న అవగాహన, టీమ్‌ స్కిల్స్‌ వంటి వాటిని పరిశీలిస్తారు.

పర్సనల్‌ ఇంటర్వ్యూ

గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా.. ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇందులో అభ్యర్థులకు ఉన్న బ్యాంకింగ్‌ నాలెడ్జ్, బ్యాంకింగ్‌ రంగంలో కెరీర్‌పై ఆసక్తి, లక్షణాలను పరిశీలిస్తారు.

తుది విజేతల ఖరారు

రెండో దశ మెయిన్, చివరి దశ(ఫేజ్‌-3) పర్సనల్‌ ఇంటర్వ్యూ, గ్రూప్‌ ఎక్సర్‌సైజెస్‌లలో చూపిన ప్రతిభ ఆధారంగా..నిర్దిష్ట అర్హత మార్కులను, ఖాళీలను, రిజర్వేషన్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది విజేతలను నిర్ణయిస్తారు. ఈ జాబితాలో నిలిస్తే ఎస్‌బీఐలో పీఓగా కొలువుదీరినట్లే. 

ఎంపికలో వెయిటేజీ విధానం

తుది విజేతల ఎంపిక విషయంలో ఎస్‌బీఐ వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తోంది. మెయిన్‌(250 మార్కులు)లో పొందిన మార్కులకు 75 శాతం; చివరి దశలోని గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ(50 మార్కులు)లో చూపిన ప్రతిభకు 25 శాతం వెయిటేజీ ఇస్తోంది. ఇలా మొత్తం వంద మార్కులకు అభ్యర్థులు పొందిన మార్కులను క్రోడీకరించి తుది విజేతలను నిర్ణయిస్తుంది. 

కెరీర్‌ స్కోప్‌

ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కెరీర్‌ ప్రారంభించిన వారు పనితీరు, ప్రతిభ ఆధారంగా సీజీఎం, చైర్‌ పర్సన్‌ స్థాయిలకు సైతం చేరుకోవచ్చు. తొలుత పీఓగా ఎంపికైన వారికి రెండేళ్ల శిక్షణ తర్వాత స్కేల్‌-1 హోదా లభిస్తుంది. రెండేళ్ల శిక్షణ తర్వాత నిర్వహించే పరీక్షలో ప్రతిభ చూపితే నేరుగా స్కేల్‌-2 కేడర్‌లో డిప్యూటీ మేనేజర్‌ హోదా లభిస్తుంది. ఆ తర్వాత స్కేల్‌-3 మేనేజర్‌ స్థాయి హోదా; స్కేల్‌- 4: చీఫ్‌ మేనేజర్‌ హోదా; స్కేల్‌- 5: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌; స్కేల్‌- 6: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌; స్కేల్‌-7: జనరల్‌ మేనేజర్‌ హోదాలకు చేరుకోవచ్చు. 

చ‌ద‌వండి: Competitive Exams: సివిల్స్, బ్యాంక్స్.. ఇలా.. ప‌రీక్షలు ఏవైనా.. జనరల్‌ స్టడీస్‌లో రాణిస్తేనే విజయం..

ప్రిపరేషన్‌ పక్కాగా

  • రీజనింగ్‌ విభాగంలో రాణించేందుకు ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. విశ్లేషణ సామర్థ్యం, తార్కికత్వం పెంచుకునే విధంగా కృషి చేయాలి. సిరీస్, అనాలజీ, కోడింగ్‌-డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్‌ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌పై పట్టు సాధించాలి. 
  • డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌లో రాణించేందుకు కాలిక్యులేషన్‌ స్కిల్స్‌ను పెంచుకోవాలి. టేబుల్స్,డయాగ్రమ్స్, నంబర్‌ డేటా, లైన్‌ గ్రాఫ్, బార్‌ గ్రాఫ్‌ తదితర గ్రాఫ్‌ ఆధారిత డేటాలలోని సమాధానాన్ని క్రోడీకరించే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి.
  • ఈ ఏడాది వెయిటేజీ పెరిగిన జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌కు సంబంధించి మరింత ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. ఇటీవల కాలంలో జాతీయ ఆర్థిక రంగంలో పరిణామాలు, బ్యాంకుల విధి విధానాల్లో మార్పులు, అవి కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి.
  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ విభాగంలో రాణించేందుకు.. బేసిక్‌ గ్రామర్‌తో మొదలు పెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, జంబుల్డ్‌ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్‌ వంటి వాటిపై ప్రత్యక దృష్టి పెట్టాలి.
  • క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి అర్థమెటిక్‌పై పట్టు సాధించాలి. స్క్వేర్‌ రూట్స్, క్యూబ్‌ రూట్స్,పర్సంటేజెస్, టైం అండ్‌ డిస్టెన్స్, టైం అండ్‌ వర్క్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, రేషియోస్‌ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి.
  • గ్రూప్‌ ఎక్సర్‌సైజెస్, పర్సనల్‌ ఇంటర్వ్యూలో రాణించడానికి ఇంగ్లిష్‌ వ్యాకరణం, వాక్య నిర్మాణంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.
  • గ్రూప్‌ ఎక్సర్‌సైజెస్‌ కోసం దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర జనరల్‌ ఎస్సే పుస్తకాలు అభ్యసించడం ఉపయుక్తంగా ఉంటుంది.

ఎస్‌బీఐ పీఓ-2022 నోటిఫికేషన్‌.. ముఖ్య తేదీలు

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి:
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: సెప్టెంబర్‌ 22 - అక్టోబర్‌ 12.
  • ప్రిలిమినరీ పరీక్ష (ఆన్‌లైన్‌) తేదీలు: డిసెంబర్‌ 17, 18, 19, 20.
  • మెయిన్‌ ఎగ్జామినేషన్‌(ఆన్‌లైన్‌): 2023 జనవరి/ ఫిబ్రవరి. 
  • తుది ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి/మార్చి, 2023
  • వెబ్‌సైట్‌: https://bank.sbi/careers, https://www.sbi.co.in/careers

చ‌ద‌వండి: SBI PO Recruitment 2022: ఏదైనా డిగ్రీతో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 12,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories