SBI Notification 2023: 6,160 అప్రెంటీస్ ట్రైనీ పోస్టులు.. బ్యాంకింగ్ కెరీర్ అభ్యర్థులకు చక్కటి అవకాశం
- 6,160 అప్రెంటీస్ నియామకాలకు ఎస్‌బీఐ నోటిఫికేషన్
- ఆంధ్రప్రదేశ్‌లో 390, తెలంగాణలో 125 ఖాళీలు
- ఎంపికైతే నెలకు రూ.15 వేల స్టయిఫండ్
- బ్యాంకులో జూనియర్ అసోసియేట్ పోస్టుల్లో ప్రాధాన్యం
- బ్యాంకింగ్ కెరీర్ అభ్యర్థులకు చక్కటి అవకాశం
మొత్తం అప్రెంటీస్ ఖాళీలు 6,160
ఎస్‌బీఐ అప్రెంటీస్ తాజా నోటిఫికేషన్ ప్రకారం–జాతీయ స్థాయిలో మొత్తం 6,160 అప్రెంటీస్ ట్రైనీలను నియమించనుంది. రాష్ట్రాల వారీగా, ఆయా రాష్ట్రాల్లో జిల్లాల వారీగా అప్రెంటీస్ పోస్ట్‌ల సంఖ్యను పేర్కొంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్‌లో 390 పోస్ట్‌లు, తెలంగాణలో 125 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు
- 2023, ఆగస్ట్ 1 నాటికి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
- వయసు: 01.08.2023 నాటికి 20 – 28 ఏళ్లు ఉండాలి.
- రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
చదవండి: SBI Recruitment 2023: ఎస్‌బీఐలో 6160 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
రూ.15వేల స్టయిపెండ్
అప్రెంటీస్ ట్రైనీగా నియమితులైన అభ్యర్థులు వారికి కేటాయించిన బ్రాంచ్‌లలో ఏడాది పాటు ట్రైనీగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.15 వేలు చొప్పున స్టయిపెండ్ అందిస్తారు.
రాత పరీక్ష ద్వారా ఎంపిక
ఎస్‌బీఐ అప్రెంటీస్ ట్రైనీలను ఎంపిక చేసేందుకు రాత పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా అప్రెంటీస్ ట్రైనీగా నియామకం ఖరారు చేస్తారు. అభ్యర్థులు తాము ఏ రాష్ట్రానికి దరఖాస్తు చేసుకుంటున్నారో.. ఆ రాష్ట్రానికి నిర్దేశించిన భాషలో పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణ విద్యార్థులు తెలుగు, ఉర్దూ భాషలో పరీక్షకు హాజరు కావచ్చు.
100 మార్కులకు రాత పరీక్ష
ఎస్‌బీఐ అప్రెంటీస్ ట్రైనీ రాత పరీక్షను నాలుగు విభాగాల్లో 100 ప్రశ్నలు–100 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు–25 మార్కులకు; జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు–25 మార్కులకు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25 ప్రశ్నలు–25 మార్కులకు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 25 ప్రశ్నలు–25 మార్కులకు పరీక్ష జరుగుతుంది.పరీక్ష సమయం 60నిమిషాలు.
పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్ అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4వంతు మార్కు తగ్గిస్తారు.
ప్రాంతీయ భాష పరీక్ష కూడా
ఎస్‌బీఐ అప్రెంటీస్ నియామక ప్రక్రియలో రాత పరీక్షతో పాటు అభ్యర్థులు ప్రాంతీయ భాష పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. రాత పరీక్షలో మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాలో నిలిచిన వారికి ఈ ప్రాంతీయ భాష పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న ప్రాంతీయ భాషను ఎంచుకోవాలి. పదో తరగతి, ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులో సదరు ప్రాంతీయ భాషను అభ్యసించి ఉంటే వారికి పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. ఆన్‌లైన్ పరీక్షతోపాటు ప్రాంతీయ భాషలోనూ ఉత్తీర్ణత సాధించి ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో నిలిచిన అభ్యర్థులకు తుది దశలో మెడికల్ టెస్ట్ నిర్వహించి అప్రెంటీస్ ట్రైనీగా నియామక పత్రం అందిస్తారు.
ట్రేడ్ టెస్ట్
ఏడాది వ్యవధిలోని అప్రెంటీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి.. స్కిల్ ఎవాల్యుయేషన్ టెస్ట్ పేరుతో ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఎస్‌బీఐ–ఎన్‌ఎస్‌డీసీ/బీఎఫ్‌ఎస్‌ఐ–సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌లు సంయుక్తంగా అప్రెంటీస్‌షిప్ సర్టిఫికెట్ అందిస్తారు. ఈ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారినే అప్రెంటీస్ పూర్తి చేసుకున్న వారిగా పరిగణిస్తారు.
కెరీర్ అవకాశాలు
- ఎస్‌బీఐలో అప్రెంటీస్ ట్రైనింగ్‌ను విజయంవంతంగా పూర్తి చేసుకున్న వారికి.. బ్యాంకు చేపట్టే జూనియర్ అసోసియేట్స్ నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తారు. అప్రెంటీస్ ట్రైనీ సమయంలో చూపిన ప్రతిభ, పనితీరు వంటి వాటిని పరిశీలించి ప్రతి ఒక్క అప్రెంటీస్‌కు సంబంధించి ప్రత్యేక రికార్డ్ నిర్వహిస్తారు.
- ఎస్‌బీఐ అప్రెంటీస్ ట్రైనీగా శిక్షణ పొందిన వారికి భవిష్యత్తులో బ్యాంకింగ్ రంగంలో ఉజ్వల కెరీర్ సొంతం చేసుకునేందుకు ఆస్కారం లభించనుంది. ఎందుకంటే.. ప్రముఖ బ్యాంకులో శిక్షణ పొందిన వారికి ప్రైవేటు రంగ బ్యాంకులు నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తుంటాయి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 21.09.2023
- రాత పరీక్ష: అక్టోబర్/నవంబర్‌లో నిర్వహించే అవకాశం.
- తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్: చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://bank.sbi/web/careers, https://www.sbi.co.in/careers
విజయం సాధించండిలా
- జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్: ఈ విభాగంలో రాణించాలంటే.. తాజా బ్యాంకింగ్ రంగం పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్‌కు సంబంధించి చట్టాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటిపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్జ్ కోణంలోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాలు(ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు ప్రాధాన్యం ఇవ్వాలి.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్: ఈ విభాగంలో ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటెన్స్ రీ అరేంజ్‌మెంట్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌పై పట్టు సాధించాలి. గ్రామర్‌కే పరిమితం కాకుండా.. జనరల్ ఇంగ్లిష్ నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: దీనికి సంబంధించి అర్థమెటిక్ అంశాలు(పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ–నష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ నియమాలు)పై పట్టు సాధించేలా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లపై ఫోకస్ చేయాలి.
- రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్: రీజనింగ్‌లో మంచి మార్కుల సాధనకు కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్ విభాగాలను ప్రాక్టీస్ చేయాలి. కంప్యూటర్ ఆప్టిట్యూడ్ విభాగంలో రాణించాలంటే.. కంప్యూటర్ ఆపరేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్ షాట్ కట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాలు(సీపీయూ, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర) గురించి తెలుసుకోవాలి.
చదవండి: NABARD Recruitment 2023: నాబార్డ్లో 150 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Qualification | GRADUATE |
Last Date | September 21,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |