TSPSC Paper Leak Accused Renuka : పేపర్ లీక్ కోసం.. గాలం వేసిందిలా.. చివరికి తానే గాలానికి చిక్కుకుందిలా..
తమ్ముడి పేరుతో ప్రశ్నపత్రాలు సంపాదించేందుకు గురుకుల ఉపాధ్యాయిని ఎల్.రేణుక రాథోడ్ అలియాస్ రేణుక తెరవెనుక పెద్ద తతంగమే నడిపింది.
➤☛ TSPSC AE Exam Cancel 2023 : బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఏఈ పరీక్ష రద్దు.. మరోసారి రాత పరీక్షకు..
బేరం కుదుర్చుకుందిలా..
ముందుగానే అభ్యర్థులతో బేరం కుదుర్చుకొని రూ.లక్షలు కాజేసేందుకు వ్యూహరచన చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. తన సోదరుడు రాజేశ్‌నాయక్‌కు ఏఈ ప్రశ్నపత్రాలు కావాలంటూ రూ.10 లక్షలకు ప్రవీణ్‌తో బేరం కుదుర్చుకుంది. వాస్తవానికి అతను టీటీసీ చదివాడు. కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. ఏఈ పరీక్ష రాసేందుకు అర్హత లేదు. అయినా అతని కోసం ప్రశ్నపత్రం కావాలని చెప్పడం గమనార్హం. ప్రశ్నపత్రాలు సమకూరుస్తానంటూ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కె.నీలేష్‌నాయక్, పి.గోపాల్ నాయక్‌లతో రేణుక రూ.14 లక్షలకు బేరం కుదుర్చుకుంది. వారి వద్ద డబ్బు తీసుకుని ప్రవీణ్‌కు ఇచ్చింది. వాటిని అతను తన బ్యాంకు ఖాతాలో జమచేశాడు.
రాజమహేంద్రవరంలోని తన బాబాయికి రూ.3.5 లక్షలు ఆన్‌లైన్‌లో పంపినట్టు పోలీసులు గుర్తించారు. పొరుగుసేవల ఉద్యోగి రాజశేఖర్‌కు ప్రవీణ్ డబ్బు ఆశచూపి ప్రశ్నపత్రాలను సంపాదించాడు. రేణుక ఇచ్చిన రూ.10 లక్షల్లో కొంత ఇస్తానని చెబుతూ వచ్చాడు. ఇంతలోనే బండారం బయటపడటంతో రాజశేఖర్‌కు సొమ్ము అందలేదని పోలీసులు చెబుతున్నారు.
ఎస్సై కావాలనే ఆశతోనే..
మహబూబ్‌నగర్ జిల్లా మన్సూర్‌తల్లి తండాకు చెందిన కె.శ్రీనివాస్(30) 2020లో పోలీసు కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. ఎస్సై ప్రిలిమినరీ, దేహదారుఢ్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. మెయిన్స్‌కు సిద్ధమయ్యేందుకు ఫిబ్రవరి 1 నుంచి సెలవులో ఉన్నాడు. ప్రశ్నపత్రం విక్రయిస్తామంటూ రేణుక ఫోన్ చేసినప్పుడు తనకు అవసరం లేదని చెప్పాడు. ఏఈ పరీక్షలకు సిద్ధమవుతున్న కొందరు అభ్యర్థుల సమాచారం ఆమెకు ఇచ్చాడు. పోలీసు అయి ఉండి కళ్లెదుట జరుగుతున్న నేరం గురించి సమాచారం ఇవ్వకపోవడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా తీసుకున్నారు. అతడిపై సీపీ కార్యాలయానికి నివేదిక పంపినట్టు మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.
వాట్సప్‌లో..
2018లో టీజీటీ హిందీ పోస్టుకు రేణుక ఎంపికైంది. వనపర్తి జిల్లా బుద్ధారం గ్రామ పరిధిలోని బాలికల ఎస్సీ గురుకుల పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకునే రోజు వరకు రేణుక మొత్తం 16 రోజులు సెలవు పెట్టినట్లు తెలిసింది. జనవరిలో 23, 28, 31 తేదీల్లో, ఫిబ్రవరిలో 1వ తేదీ, 4 నుంచి 8 వరకు, 24న సెలవు పెట్టింది. ఈ నెల 4, 5 తేదీల్లోనూ (ఏఈ పరీక్ష జరిగిన రోజులు) సెలవు తీసుకుంది.
తన బాబుకు బాగా లేదని, సెలవు కావాలని ప్రిన్సిపల్‌కు 4న అర్ధరాత్రి ఒంటి గంటకు వాట్సప్ మెసేజ్ పెట్టింది. మార్చి 5వ తేదీన సీవోఈ ప్రవేశపరీక్షకు ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వర్తించేందుకు రావాలని కోరినా రాలేదని తెలిసింది. తమ మరిది చనిపోయారని, మూడు రోజుల సెలవులు కావాలని 10న వాట్సప్ ద్వారా కోరింది. దీంతో ప్రిన్సిపల్ 10, 11, 12 తేదీలను సెలవుగా మార్కు చేశారు. 13న ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా సెలవులో ఉన్నారని సిబ్బంది భావించారు. అదేరోజు సాయంత్రం ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం బయటపడింది. టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్(టీపీబీవో) పోస్టుల రాతపరీక్ష మార్చి 12న జరగాల్సి ఉండగా.. 10, 11, 12, 13 తేదీల్లో ఆమె సెలవులు పెట్టడం గమనార్హం. రేణుకను సస్పెండ్ చేయనున్నట్లు గురుకుల సొసైటీ వర్గాలు వెల్లడించాయి.
➤☛ TSPSC Paper Leak News : ప్రతిష్టకు దెబ్బ.. ఇక టీఎస్‌పీఎస్సీ పరిస్థితి ఏంటి..?
భర్త ఢాక్యానాయక్ కూడా..
రేణుక.. ఆమె తల్లి లక్ష్మీభాయి మన్సూర్‌పల్లి బీఆర్‌ఎస్ సర్పంచ్ కావడంతో కలిసొచ్చిన రాజకీయ బలం, గురుకుల ఉపాధ్యాయురాలిగా తనకు, టెక్నికల్ అసిస్టెంట్‌గా తన భర్త ఢాక్యానాయక్‌కు ఉన్నతస్థాయి అధికారులతో ఉన్న పరిచయాలను ఉపయోగించి ఆమె లీకేజీకి పూనుకున్నట్లు చర్చ సాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా గంఢీడ్ మండలానికి చెందిన రేణుక.
ఢాక్యా, రేణుక దంపతులకు ఇటు రాజకీయంగా, అటు అధికార వర్గాల్లో సంబంధాలు ఉండడంతో వారిని నమ్మి ఈ అభ్యర్థులు ఒక్కొక్కరు రూ.10 లక్షల చొప్పున ముట్టజెప్పినట్లు తెలిసింది.
ప్రవీణ్ ఫోన్‌లో 100 మందికి పైగా మహిళల..
ప్రశ్నపత్రాల లీకైనట్లు తెలియగానే టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోకి వచ్చే సిబ్బంది వివరాలను అధికారులు సేకరించారు. కంప్యూటర్లు, ల్యాన్ ఉన్న గదుల్లోకి ప్రవీణ్‌కుమార్ వచ్చినట్టు గుర్తించారు. కాన్ఫిడెన్షియల్ విభాగంలో ఉండే ప్రశ్నపత్రాలకు సంబంధించిన సమాచారం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపేవాడని, రహస్య వివరాలపై చర్చించాడని ఓ ఉద్యోగి చెప్పాడు.
➤☛ TSPSC AE Exam Paper Leak : అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష పేపర్ కూడా లీక్.. ఇంకా..
దీంతో అతనిపైనే అనుమానాలున్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ప్రవీణ్ ఫోన్‌లో 100 మందికి పైగా మహిళల ఫోన్ నంబర్లున్నాయి. 42 మంది మహిళల అర్ధనగ్న, నగ్న ఫొటోలు, వీడియోలు ఉన్నట్టు సమాచారం. ఇవన్నీ అంతర్జాలం నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నాడా? వారితో ఉన్నప్పుడు వీడియో తీశాడా? అనేది ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా నిర్ధారణ అవుతుందని ఓ పోలీసు అధికారి తెలిపారు.