TSPSC Paper Leak Case: తండ్రి ఉద్యోగం రాకపోవడంతో... పేపర్లను లీక్ చేసి సొమ్ముచేసుకోవాలని చూసిన ప్రవీణ్
తండ్రి ఖాకీ ఉద్యోగం రాకపోవడంతో..
ప్రవీణ్ తండ్రి ఏపీ రాజమండ్రికి చెందిన పి.హరిశ్చంద్రారావు డీజీపీ కార్యాలయం ప్రెస్‌కు అదనపు ఎస్పీగా పని చేస్తూ అనారోగ్యంతో మరణించారు. కారుణ్య నియామకం కింద తనకు ఆ ఉద్యోగమే వస్తుందని భావించాడు. నిబంధనలు, అతడి అర్హత పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చింది. అయితే ఎలాగైనా డీఎస్పీ లేదా జైళ్ల శాఖలో సూపరింటెండెంట్ అయి యూనిఫామ్ వేసుకోవాలని భావించిన ప్రవీణ్ కుమార్ గ్రూప్–1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. రాజశేఖర్‌రెడ్డి సహాయంతో కస్టోడియన్ శంకర లక్ష్మి కంప్యూటర్‌ను యాక్సస్ చేసి గ్రూప్–1 పేపర్ తస్కరించాడు. అయితే ప్రవీణ్ కుమార్ తన ఓఎంఆర్ షీట్‌ను డబుల్ బబ్లింగ్ చేయడంతో తిరస్కరించిన కమిషన్ వాల్యూషన్ చేయలేదు.
చదవండి: లవర్ కోసం.. క్వశ్చన్ పేపర్‌ను రూ.6 లక్షలకు కొనుగోలు.. మరో ఇద్దరు ఆరెస్ట్
కనీసం సొమ్మైనా చేసుకుందామని...
డబుల్ బబ్లింగ్‌తో ‘ఖాకీ పోస్టుకు’అవకాశం కోల్పోయిన ప్రవీణ్‌కు పేపర్లు అమ్మి సొమ్ము చేసుకోవాలని దుర్భుద్ది పుట్టింది. ఈ నేపథ్యంలోనే మరో ఐదు పరీక్షలకు సంబంధించిన 14 పరీక్ష పత్రాలను రాజశేఖర్ సాయంతో చేజిక్కించుకున్నాడు. వీటిలో ఏఈ ప్రశ్నపత్రంలో పాటు డీఏఓ పేపర్‌ను ఐదుగురికి రూ.50 లక్షలుకు విక్రయించి రూ.29.45 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. మిగిలిన పేపర్లు విక్రయించే ప్రయత్నాల్లో ఉండగానే విషయం వెలుగులోకి రావడంతో కటకటాల్లోకి చేరాడు. తన మాదిరిగానే డబుల్ బబ్లింగ్ చేసిన వాళ్లు దాదాపు 8వేలమంది ఉన్నట్లు ప్రవీణ్ గుర్తించాడు. వీరిలో కొందరిని సంప్రదించి సహాయం చేస్తానని నమ్మబలికి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి టచ్‌లో ఉన్నాడు. సిట్ దర్యాప్తులో ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి.