TSPSC Paper Leak : నమ్మలేని నిజాలు ఎన్నో.. 42 మంది టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకు సిట్ నోటీసులు.. ఇంకా..
పేపర్ లీక్స్ కేసులో.. సిట్ దర్యాప్తులో ముందుకు వెళ్లే కొద్దీ.. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల జాతకాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న వాళ్లందరినీ సిట్ ప్రశ్నిస్తోంది. తాజాగా.. టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న 42 మంది ఉద్యోగులకూ సిట్ నోటీసులు జారీ చేసింది.
ప్రవీణ్, రాజశేఖర్‌లతో సంబంధాలు ఉన్న వాళ్లే..
సిట్ మార్చి 22వ తేదీన (బుధవారం) టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న 42 మందికి నోటీసులు జారీ చేసింది. వీళ్లలో పేపర్ లీక్స్ వ్యవహారంలో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌లతో సంబంధాలు ఉన్న వాళ్లే ఉన్నట్లు సమాచారం. దీంతో వాళ్లను ప్రశ్నించాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే కాన్ఫిడెన్షియల్ రూం అధికారిణి శంకర్ లక్ష్మిని రెండుసార్లు పిలిపించుకుని ప్రశ్నించింది సిట్. ఈమె సిస్టమ్ నుంచే పేపర్లు లీక్ అయ్యాయనే అనుమానాలు ఉన్నాయి. తాజాగా నోటీసులు ఇచ్చినవాళ్లలో.. టీఎస్‌పీఎస్సీలో టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌తో సంబంధం ఉన్నవాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఆధారాలే కీలకం..
ఇక.. ప్రధాన సూత్రధారి రాజశేఖర్ స్నేహితుడైన సురేష్ నడుమ సంబంధాలపై సిట్ ఆరా తీస్తోంది. సైబర్ క్రైమ్ టెక్నికల్ టీం వీళ్లిద్దరి మధ్య వాట్సాప్ ఛాటింగ్, కాల్ డేటా, లావాదేవీల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించింది. ఈ ఆధారాలను బట్టి.. రాజశేఖర్ టీఎస్‌పీఎస్సీ నుంచి పేపర్ తీసుకెళ్లి సురేష్‌కు ఇచ్చినట్లు గుర్తించింది సిట్. అయితే సురేష్ సైతం పేపర్‌ను లీక్ చేశాడా? చేస్తే ఎంత మందికి పేపర్ ఇచ్చాడు? అనే కోణంలో సిట్ దర్యాప్తు ఇప్పుడు ముందుకు సాగుతోంది.
☛➤ KTR : ఈ టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు.. మళ్లీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.. అలాగే అన్ని..
రేణుక, నిలేష్, గోపాల్‌ల నడుమ..
మరోవైపు పేపర్ లీకేజ్ కేసులో.. నేడు సిట్ దర్యాప్తు ఐదవ రోజు ముగిసింది. మొత్తం తొమ్మిది మంది నిందితులను ఏడు గంటలపాటు విచారణ చేపట్టింది సిట్. ప్రవీణ్, రాజశేఖర్ పెన్ డ్రైవ్‌లలోని ప్రశ్న పత్రాలు లీక్ కావడంపై నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించారు. అదే సమయంలో.. పలు అంశాలపై టెక్నికల్ ఆధారాలు సేకరించించింది సైబర్ క్రైమ్ టెక్నికల్ టీం. రేణుక, నిలేష్, గోపాల్‌ల నడుమ రూ. 14 లక్షల నగదు ట్రాన్‌జాక్షన్స్ జరిగినట్లు గుర్తించింది. ఈ లావాదేవీలపై సిట్ కూపీ లాగుతోంది. ఇక రాజశేఖర్ కాంటాక్ట్ లిస్ట్, వాట్సాప్ ఛాటింగ్ వివరాల ఆధారంగానే సిట్ నిందితులపై ప్రశ్నలు గుప్పిస్తోంది.