TSPSC Group 1 Prelims Question Paper : బ్రేకింగ్ న్యూస్.. గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన ప్రవీణ్.. ఆ పేపర్ కూడా లీక్..?
టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏగా ఉంటూ ప్రవీణ్.. గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసినట్లు గుర్తించారు. అలాగే అక్టోబర్ 16వ తేదీన జరిగిన ఈ పరీక్షలో అతనికి 103 మార్కులు వచ్చాయి. దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ కూడా ప్రవీణ్ లీక్ చేశాడా అని సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక తానొక్కడే రాశాడా? ఇంకెవరికైనా పేపర్‌ను లీక్ చేశాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
అసలు ప్రవీణ్‌కి 150కి గానూ 103 మార్కులు వచ్చేంత సీన్ ఉందా.. ?
ప్రవీణ్ రాసిన పేపర్‌తో పాటు అతడికి వచ్చిన కోడ్ ప్రశ్నపత్రాన్ని పోలీసులు, టీఎస్‌పీఎస్సీ అధికారులు పరిశీలిస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలు వచ్చిన సర్వర్‌ను సైబర్ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పేపర్ లీక్ అయిందా? లేదా? అనే కోణంలో సైబర్ నిపుణులు తనిఖీ చేస్తున్నారు. అసలు ప్రవీణ్‌కి 150కి గానూ 103 మార్కులు వచ్చేంత ప్రతిభా పాటవాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాల్సి వస్తుందనే అనుమానం..?
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకులతో లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గ్రూప్ 1 అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాల్సి వస్తుందా అనే అనుమానం తలెత్తుతున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్‌కు 25 వేల మందికి పైగా అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. 1.50 నిష్పత్తిలో 25 వేల మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. మరోవైపు టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నా పత్రాల లీకేజీలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు.
➤☛ TSPSC AE Exam Paper Leak : అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష పేపర్ కూడా లీక్.. ఇంకా..
బీటెక్ పూర్తిచేసిన ప్రవీణ్..
ఏపీలోని రాజమండ్రికి చెందిన పి.హరిశ్చంద్రరావు కుమారుడు ప్రవీణ్‌కుమార్. హరిశ్చంద్రరావు ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీ కార్యాలయం ప్రెస్‌కు అదనపు ఎస్పీగా పనిచేశారు. ఆయన ఉద్యోగంలో ఉండగానే అనారోగ్యంతో మరణించడంతో కారుణ్య నియామకం కింద ప్రవీణ్‌కుమార్‌కు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. బీటెక్ పూర్తిచేసిన ప్రవీణ్ 2017 నుంచి టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తూ ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాలో కమిషన్ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రేణుక 2018లో టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్ష ద్వారా గురుకుల హిందీ టీచర్‌గా ఎంపికై.. ప్రస్తుతం వనపర్తిలో విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త లవుడ్యావత్ డాక్యా వికారాబాద్‌లోని డీఆర్‌డీఏలో పనిచేస్తున్నాడు. టీఎస్‌పీఎస్సీ పరీక్షకు సిద్ధమైన నాటి నుంచీ రేణుక, ప్రవీణ్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె తరచూ కమిషన్ కార్యాలయానికి వచ్చి ప్రవీణ్‌ను కలిసేది. ఈ నేపథ్యంలోనే టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ చేసేందుకు రేణుక, లవుడ్యావత్ డాక్యా, ప్రవీణ్ కలిసి పథకం వేశారు.