Skip to main content

TGPSC Group-1 Mains Exams Issue : గ్రూప్‌-1 పరీక్షలకు సుప్రీంకోర్టులోనూ...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోందని.. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది.
TGPSC Group1 Mains Exams Issue

మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసేందుకు కూడా త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం నిరాక‌రించింది. మెయిన్స్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో హైకోర్టు ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింద‌ని కోర్టు తెలిపింది. న‌వంబ‌ర్ 20లోగా విచార‌ణ పూర్తి చేయాల‌ని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్ప‌టికే అభ్య‌ర్థులు ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకున్న నేప‌థ్యంలో.. ఈ ద‌శ‌లో ప‌రీక్ష‌ల వాయిదాపై జోక్యం చేసుకోలేమ‌ని సుప్రీంకోర్టు పేర్కొంది.
 
జీవో-29 వల్ల...
గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ స్టేజ్‌లో రిజర్వేషన్లు పాటించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ అభ్యర్థులు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ‍గ్రూప్‌-1 అభ్యర్థులు జీవో-29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అందరికీ వర్తింపజేయాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఓపెన్‌ కేటగిరిలో మెరిట్‌తో అర్హత పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను రిజర్వేషన్‌ కేటగిరిగా పరిగణించడం పట్ల అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా రిజర్వేషన్‌ అందుకోలేకపోతున్నారు.  తక్కువ మెరిట్‌ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు. అయితే, ఇది గత సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకమని అభ్యర్థులు పిటిషన్‌లో తెలిపారు.

పకడ్బందీగా.. 
గ్రూప్‌–1 కొలువుల భర్తీకి సంబంధించిన మెయిన్స్‌ పరీక్షలు అక్టోబ‌ర్ 21వ తేదీ నుంచి (సోమవారం) ప్రారంభమవుతున్నాయి. అక్టోబ‌ర్‌ 27వ తేదీ వరకు వరుసగా జరిగే ఈ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్షా కేంద్రాలు కలిపి.. మొత్తం 46 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. 

31,383 మంది అభ్యర్థులు..
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేటి నుంచి 27వ తేదీ వరకు ఏడు రోజులు.. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 1.30 గంటలకు పరీక్షా కేంద్రాన్ని మూసివేస్తారు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులను లోనికి అనుమతించరు. మొత్తం 563 గ్రూప్‌–1 పోస్టుల కోసం 31,383 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

Published date : 21 Oct 2024 03:58PM

Photo Stories