Nursing Officer Job in AIIMS: మూడు వేలకుపైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు.. 80 శాతం పోస్టులు మహిళలకే..
- మూడు వేలకుపైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ!
- నోటిఫికేషన్ విడుదల చేసిన ఎయిమ్స్
- ఎన్‌ఓఆర్‌సీఈటీలో ప్రతిభతో ఎంపిక
ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 18 ఎయిమ్స్ క్యాంపస్‌లలో నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. మూడు వేలకు పైగా పోస్ట్‌లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎయిమ్స్–మంగళగిరి, ఎయిమ్స్–బీబీనగర్‌లలోనూ ఖాళీలు ఉంటాయి. జాతీయ స్థాయి పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
అర్హతలు
- బీఎస్సీ నర్సింగ్/బీఎస్సీ నర్సింగ్ ఆనర్స్ ఉత్తీర్ణత ఉండాలి. లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులవ్వాలి(లేదా) జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. దీంతోపాటు 50 పడకల ఆసుపత్రిలో కనీసం రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి.
- విద్యార్హతలతోపాటు రాష్ట్ర/జాతీయ నర్సింగ్ కౌన్సిల్స్‌లో నర్స్‌లు లేదా మిడ్ వైఫ్‌లుగా నమోదు చేసుకుని ఉండాలి.
- వయసు: ఆగస్ట్ 25, 2023 నాటికి 18 –30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
చదవండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్ భటిండాలో 35 పోస్టులు
ఎన్‌ఓఆర్‌సీఈటీ
ఎయిమ్స్ క్యాంపస్‌లలోని నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి జాతీయ స్థాయిలో నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(ఎన్‌ఓఆర్‌సీఈటీ) నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా నియామకాలు ఖరారు చేస్తారు. ఎన్‌ఓఆర్‌సీఈటీ.. ప్రిలిమ్స్, మెయిన్స్ అనే రెండు దశలుగా ఉంటుంది.
100 మార్కులకు ప్రిలిమ్స్
ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమ్స్‌ను 100 ప్రశ్నలు–100 మార్కులకు నిర్వహిస్తారు. వీటిలో 20 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ అండ్ ఆప్టిట్యూడ్ నుంచి, మిగిలిన 80 ప్రశ్నలను నర్సింగ్ కోర్సులోని సబ్జెక్ట్‌ల నుంచి అడుగుతారు. పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కును నెగెటివ్ మార్కుగా పరిగణిస్తారు. పరీక్షకు కేటాయించిన సమయం గంటన్నర.
రెండో దశ మెయిన్స్
మొదటి దశ ప్రిలిమ్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు అయిదుగురిని చొప్పున(1:5 నిష్పత్తి) రెండో దశ మెయిన్ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తారు.అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధించాలనే నిబంధన విధించారు.జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50 పర్సంటైల్; ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 40 పర్సంటైల్‌ను సాధించాలి. ఈ కనీస అర్హత మార్కులు పొందిన వారినే మెయిన్స్ జాబితా రూపకల్పనకు పరిగణనలోకి తీసుకుంటారు.
చదవండి: AIIMS 5th NORCET 2023 Notification: ఎయిమ్స్ న్యూఢిల్లీలో నార్‌సెట్–5 నోటిఫికేషన్ విడుదల..
మెయిన్స్.. సబ్జెక్ట్ పరీక్షగా
మెయిన్స్‌ను సబ్జెక్ట్ పరీక్షగా నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో నర్సింగ్ కోర్సు సబ్జెక్ట్‌లోని అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. కేస్ ఆధారిత ప్రశ్నలు కూడా ఉంటాయి. మెయిన్స్ పరీక్ష కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. 1/3 వంతు మార్కు చొప్పున నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. పరీక్షకు లభించే సమయం గంటన్నర.
మెయిన్ ఆధారంగా మెరిట్ లిస్ట్
మెయిన్ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి ఎయిమ్స్ క్యాంపస్‌లతోపాటు ఎన్‌ఐటీఆర్‌డీ, జాతీయ స్థాయిలో ఇతర వైద్య విజ్ఞాన సంస్థల్లోని నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తమకు ఆసక్తి ఉన్న ఎయిమ్స్ క్యాంపస్‌లను ప్రాధాన్యత క్రమంలో పేర్కొనాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో నిలిచిన వారికి నియామకాలు ఖరారు చేస్తారు.
గ్రూప్–బి హోదాలో కొలువు
ఎన్‌ఓఆర్‌సీటీలో ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో చోటు సొంతం చేసుకుని.. నియామకం ఖరారు చేసుకున్న వారికి ఎయిమ్స్ క్యాంపస్‌లలో గ్రూప్–బి హోదాలో నర్సింగ్ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. పే లెవల్–7 మేరకు రూ.9,300 –రూ. 34,800 శ్రేణిలో ప్రారంభ వేతనం ఉంటుంది. 2019 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
80 శాతం మహిళలకు
ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తం ఖాళీల్లో 80 శాతం పోస్ట్‌లను మహిళలకు, మిగతా 20శాతం పోస్ట్‌లను పురుషులకు కేటాయిస్తున్నారు.
చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ హోదాకు
నర్సింగ్ ఆఫీసర్ కొలువులో చేరిన వారు భవిష్యత్తులో చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. సిస్టర్ గ్రేడ్–1, సిస్టర్ గ్రేడ్–2, అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్,నర్సింగ్ సూపరింటెండెంట్, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్‌లకు పదోన్నతులు పొందొచ్చు. ఒక్కో హోదాలో కనీసం ఆరేళ్లు పని చేసిన తర్వాత పదోన్నతులకు పరిగణనలోకి తీసుకుంటారు.
విజయానికి అడుగులు ఇలా
జనరల్ నాలెడ్జ్ అండ్ ఆప్టిట్యూడ్
మొదటి దశ ప్రిలిమ్స్‌లో ఉండే ఈ విభాగంలోని 20ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చేందుకు కరెంట్ అఫైర్స్, పాలిటీ, జాగ్రఫీ, ముఖ్య ప్రదేశాలు, సదస్సులు, సమావేశాలు, జనరల్ సైన్స్ అంశాలు, భారత చరిత్రలోని ముఖ్యాంశాలు, దేశాలు– రాజధానులు, రాజ్యాంగ వ్యవస్థపై దృష్టి పెట్టాలి. ఆప్టిట్యూడ్ విభాగంలో ప్రశ్నల కోసం నంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, ప్రాబబిలిటీ, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, రేషియోస్, పర్సంటేజెస్, బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ అంశాలపై పట్టు సాధించాలి.
సబ్జెక్ట్ ప్రశ్నలకు ఇలా
ప్రిలిమ్స్‌లో 80 మార్కులకు, మెయిన్స్‌లో 100 మార్కులకు ఉండే నర్సింగ్ సబ్జెక్ట్‌లకు సంబంధించిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చేందుకు అభ్యర్థులు బ్యాచిలర్ స్థాయిలోని నర్సింగ్ సబ్జెక్ట్‌లను, వాటిలోని ముఖ్యమైన అంశాలను అవలోకనం చేసుకోవాలి. ప్రధానంగా డ్రగ్ స్టోరేజ్ మేనేజ్‌మెంట్, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, మిడ్ వైఫరీ అండ్ గైనకాలజికల్ నర్సింగ్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఫార్మసీ, హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, నర్సింగ్ మేనేజ్‌మెంట్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, మెడికల్ సర్జికల్స్ ఆఫ్ నర్సింగ్, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, సైకాలజీ, మెంటల్ హెల్త్, టాక్సికాలజీ, ఫస్ట్ ఎయిడ్ విధానం, కంప్యూటర్స్ ఇన్ నర్సింగ్, పిడియాట్రిక్ నర్సింగ్‌లకు సంబంధించి అన్ని అంశాలను క్షుణ్నంగా చదవాలి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 25.08.2023
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ అవకాశం: ఆగస్ట్ 26–28, 2023
- ఎన్‌ఓఆర్‌సీఈటీ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 17, 2023
- ఎన్‌ఓఆర్‌సీఈటీ మెయిన్ ఎగ్జామ్ తేదీ: అక్టోబర్ 7, 2023
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ.
- వివరాలకు వెబ్‌సైట్: https://www.aiimsexams.ac.in/
- ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: http://norcet5.aiimsexams.ac.in/
చదవండి: Andhra Pradesh Govt Jobs: 2,635 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 25,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |