Skip to main content

Banking Technology Course: ఐడీఆర్‌బీటీలో బ్యాంకింగ్‌ టెక్నాలజీ కోర్సుల పూర్తి వివరాలు ఇవే..

ఐడీఆర్‌బీటీ.. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ. దీన్ని భారత కేంద్ర బ్యాంకు ఆర్‌బీఐ ఏర్పాటుచేసింది. ఐడీఆర్‌బీటీ.. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ(పీజీడీబీటీ) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సులో చేరిన అభ్యర్థులకు బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలకు అవసరమైన లేటెస్ట్‌ టెక్నాలజీపై శిక్షణ అందుతుంది. పీజీడీబీటీ కోర్సులను పూర్తిచేసుకున్నవారు బ్యాంకింగ్‌ రంగంలో ఉజ్వల అవకాశాలను అందుకునే వీలుంది. ఐడీఆర్‌బీటీ అందించే పీజీడీబీటీ కోర్సు పూర్తి వివరాలు..
Banking Technology Course in IDRBT

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)..1996లో హైదరాబాద్‌లో ఐడీఆర్‌బీటీని ఏర్పాటుచేసింది. ఈ సంస్థ భారతదేశంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అవసరమైన సాంకేతికతను అందించడంతోపాటు టెక్నాలజీపై పరిశోధనలు కొనసాగిస్తుంది. టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ రంగాలకు నైపుణ్యాలున్న  మానవ వనరులకు డిమాండ్‌ ఏర్పడింది. దీంతో 2016లో ఐడీఆర్‌బీటీ.. బ్యాంకింగ్‌ టెక్నాలజీ పీజీ డిప్లొమా కోర్సును ప్రారంభించింది. ఇప్పటివరకూ ఆరు బ్యాచ్‌లు పూర్తికాగా.. తాజాగా ఏడో బ్యాచ్‌లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఏడో బ్యాచ్‌ జూలైలో ప్రారంభం కానుంది.

మొత్తం సీట్లు
40(ఇందులో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు 10 స్పాన్సర్డ్‌ సీట్లు కేటాంచారు)

అర్హతలు
పీజీడీబీటీ కోర్సులో ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో బీటెక్‌ లేదా ఏదైనా సబ్జెక్టులో ప్రథమ శ్రేణిలో పీజీ ఉత్తీర్ణత సాధించాలి. 10+2+4 విధానంలో చదివిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ చదివే విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. అలాగే అభ్యర్థులు గేట్‌/క్యాట్‌/ జీమ్యాట్‌/జీఆర్‌ఈ/సీమ్యాట్‌/గ్జాట్‌/మ్యాట్‌/ఏటీఎంఏల్లో ఏదో ఒక పరీక్ష స్కోరు సాధించడం తప్పనిసరి.

చ‌ద‌వండి: RBI Recruitment 2023: ఆర్‌బీఐలో జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఎంపిక ఇలా
వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసి.. అనంత­రం గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి.. వాటిలో చూపిన ప్రతిభ ఆధారంగా కోర్సులోకి తీసుకుంటారు. కోర్సు మొత్తం ఫీజు రూ.ఐదు లక్షలు. నాలుగు విడతల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

కోర్సు స్వరూపం
పీజీడీబీటీ ఏడాది కోర్సు. ఫుల్‌టైం విధానంలో ఉంటుంది. మూడు నెలలకు ఒక టర్మ్‌ చొప్పున 4 టర్మ్‌లుగా కోర్సు ఉంటుంది. ఇందులో లెక్చరర్లు,సెమినార్లతోపాటు ఐటీ నిపుణులతో ఇంటరాక్టివ్‌ సెషన్స్‌ కూడా నిర్వహిస్తారు. కోర్సులో భాగంగా ప్రాక్టికల్‌ లెర్నింగ్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. మొత్తం నాలుగు టర్మ్‌ల్లో చివరి టర్మ్‌లో ప్రాజెక్ట్‌ కేటాయించారు. కోర్సులో భాగంగా టెక్నాలజీని ఉపయోగించి.. బ్యాంకింగ్, ఆర్థికసంస్థల ఉత్పాదకత పెరిగేలా బోధన ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉపయోగిస్తున్న టెక్నాలజీపై అవగాహన కల్పిస్తారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్, క్రిప్టోగ్రఫీ, ఐవోడీ, బిగ్‌డేటా, అనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, మొబైల్‌ బ్యాంకింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్, పేమెంట్, సిస్టమ్‌ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ప్రధానం చేస్తారు.

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌
ఈ కోర్సును పూర్తిచేసుకున్న వారు క్యాంపస్‌ స్థాయిలోనే ఉద్యోగావకాశాలను అందుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీబీఐ, బంధన్, కరూర్‌ వైశ్య, ఫెడరల్, కోటక్, సౌత్‌ ఇండియా, ఎన్‌పీసీఐ తదితరం సంస్థలు రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు సగటున రూ.9 లక్షల వార్షిక వేతనం అందుతోంది.

చ‌ద‌వండి: NABFID Recruitment 2023: ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 24.06.2023
  • వెబ్‌సైట్‌: https://www.idrbt.ac.in
Qualification GRADUATE
Last Date June 24,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories