TSPSC Group-1 Prelims Exam: పరీక్షకు ముందు అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. ఇవి పాటించకపోతే...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరిగే గ్రూప్-1 పరీక్షకు మరో మూడు రోజుల సమయమే ఉంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈనెల(అక్టోబర్) 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. ఇప్పటి వరకు పరీక్షకు సన్నద్ధమైన అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌కు తుది మెరుగులు దిద్దుకోవాలి. నేర్చుకున్న అంశాలను మరోమారు రివిజన్ చేసుకోవాలి. పరీక్ష ముందు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలి. గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షకు ముందు అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు..
పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల్లో చాలా మంది పరీక్ష సమయం దగ్గరపడగానే అనవసర ఆందోళనకు గురవుతుంటారు. ప్రిపరేషన్ పూర్తిచేయలేదని కుంగిపోతుంటారు. వారు ఒక్క విషయాన్ని గమనించాలి. ఎంత చదివినా ఇంకా చదవాల్సిన అంశాలు మిగిలే ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు ఈ విషయంలో ఆందోళన చెందొద్దు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన మనసుతో పరీక్షకు హాజరవడంపైనే∙దృష్టి సారించాలి. ఈ సమయంలో కొత్త అంశాలను చదవకుండా ఇప్పటివరకు నేర్చుకున్న అంశాలనే రివిజన్ చేసుకోవాలి.
చదవండి: TSPSC: గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో బయోమెట్రిక్ హాజరు.. అభ్యర్థులకు ముఖ్య సూచనలు..
క్లిష్టతపై కంగారొద్దు
రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో ప్రశ్నల సరళి, కాఠిన్యతపై అభ్యర్థులు కంగారు పడొద్దు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గత పరీక్షల మాదిరి ప్రశ్నల సరళి, ప్రామాణికత ఉంటుందని కచ్చితంగా చెప్పలేం. పరీక్షలో అడిగే 150 ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు దాదాపు అభ్యర్థులందరికీ కఠినంగానే ఉంటాయి. అలాంటప్పుడు మార్కులతోపాటు కటాఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లిష్టమైన ప్రశ్నలను చూసి అభ్యర్థులు ఆందోళన చెందొద్దు. తమను తాము తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఆత్మన్యూనత భావన నుంచి బయటపడాలి. ఆత్మవిశ్వాసంతో పరీక్షకు హాజరుకావాలి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు ప్రయత్నించాలి.
ఆప్షన్లపై అప్రమత్తం
బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నల్లో ఆప్షన్లు గందరగోళానికి గురిచేసేవిగా ఉంటాయి. అభ్యర్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు అత్యంత సారూప్యమున్న ఆప్షన్లను ఇస్తారు. కాబట్టి అభ్యర్థులు ప్రశ్నను చదవగానే సమాధానాన్ని ఊహించుకోవద్దు. ఆప్షన్లను అప్రమత్తతతో పరిశీలించాలి. వాటిని అర్థం చేసుకుని సరైన సమాధానాన్ని ఎంచుకోవాలి.
చదవండి: TSPSC Group 1 Preparation Tips: వంద రోజుల్లో.. ప్రిలిమ్స్ నెగ్గేలా!
తెలిసిన ప్రశ్నలకు ముందుగా
ప్రశ్నపత్రంలో బాగా తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు గుర్తించాలి. క్లిష్టమైన ప్రశ్నలకు తర్వాత సమయాన్ని కేటాయించాలి. సబ్జెక్టు విషయంలో జనరల్‌స్టడీస్‌కు సంబంధించిన ఎకానమీ, జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తదితర సబ్జెక్టులు ఒకదానికొకటి అనుసంధానాన్ని కలిగి ఉంటాయి. వాటిల్లోంచి అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు సమకాలీన అంశాలను పరిగణనలోకి తీసుకుని జవాబులను గుర్తించాలి.
వ్యూహాత్మకంగా ఆలోచించాలి
పరీక్షలో కొన్ని తెలియని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేటప్పుడు అభ్యర్థులు వ్యూహాత్మకంగా ఆలోచించాలి. అంటే.. తెలిసిన అంశాల ఆధారంగా తెలియని ప్రశ్నలకూ సమాధానాలు రాబట్టాలి. ఉదాహరణకు కేంద్రంలో ఎంపీలపై అనర్హత వేటు సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం సలహా మేరకు రాష్ట్రపతి చర్యలు తీసుకుంటారు. అలాగే రాష్ట్రంలో శాసన సభ్యుల అనర్హత విషయంలో ఎవరి సలహా మేరకు గవర్నర్ చర్య తీసుకుంటారనే ప్రశ్నకు చాలామంది అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం అని పొరపాటు పడే అవకాశం ఉంది. కానీ ఇటువంటి ప్రశ్నల విషయంలో అభ్యర్థులు తెలివిగా వ్యవహరించాలి. 1993కు ముందు రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఏర్పడకముందు ఎవరి సలహా తీసుకునేవారు అని ఆలోచించాలి. దాంతో రాష్ట్రంలోనూ కేంద్ర ఎన్నికల సంఘం సలహా మేరకే రాష్ట్ర శాసన సభ్యులపై అనర్హత వేటు వేసేందుకు గవర్నర్‌కు అధికారాలుంటాయనే తెలివైన గెస్సింగ్ ద్వారా సమాధానాన్ని గుర్తించవచ్చు.
చదవండి: TSPSC AEE Notification 2022: 1540 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష విధానం, ప్రిపరేషన్.. ఇలా
మరిన్ని జాగ్రత్తలు..
- పరీక్ష హాల్ టికెట్, బ్లూ/బ్లాక్ పెన్నులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. హాల్ టికెట్‌పై సూచనలను చదివి అవసరమైన వాటిని సిద్ధం చేసుకోవాలి.
- పరీక్షా కేంద్రాన్ని ముందు రోజే సందర్శించి నిర్ధారణ చేసుకోవాలి.
- పరీక్ష ముందు రోజు తగినంత నిద్ర పోవాలి. ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి.
- పరీక్ష హాల్లోకి కాలిక్యులేటర్లు, ఫోన్, బ్లూటూత్, పెన్‌డ్రైవ్‌లు, వాచ్ తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అనుమతించరు. వాటిని తీసుకొచ్చి ఆందోళన చెందడం కంటే తీసుకురాకుండా ఉండటం మేలు.
- పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను రెండు గంటల ముందునుంచే అనుమతిస్తారు. 15 నిమిషాల్లో పరీక్షల ప్రారంభం అవుతుందనగా గేట్ మూసివేస్తారు. అభ్యర్థులు వీలైనంత తొందరగా కేంద్రానికి చేరుకుంటే పరీక్ష హాల్లో ప్రశాంతంగా ఉండొచ్చు.
- ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు ఇచ్చే సమయంలో దానిపై పొందుపరిచిన హాల్ టికెట్ నంబరు, టెస్ట్ బుక్‌లెట్ నంబరు తదితర సమాచారాన్ని నిర్ధారించుకోవాలి.
చదవండి: TSPSC& APPSC Groups: గ్రూప్స్‌లో గెలుపు బాట కోసం.. ప్రముఖ సబ్జెక్ట్ నిపుణుల సూచనలు- సలహాలు ..
నిర్లక్ష్యం చేయొద్దు
అభ్యర్థులు చిన్న చిన్న విషయాలపైనా జాగ్రత్తగా వ్యవహరించాలి. వేటినీ నిర్లక్ష్యం చేయొద్దు. ప్రశ్నపత్రంపై టెస్ట్ బుక్‌లెట్ సిరీస్‌కు బదులు ఆరు అంకెల టెస్ట్ బుక్‌లెట్ నంబరును ముద్రించనున్నారు. ఓఎంఆర్ షీట్‌లోనూ ఈ ఆరంకెల టెస్ట్ బుక్‌లెట్ నంబరునే బబ్లింగ్ చేయాలి. అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన మోడల్ ఓఎంఆర్ షీట్‌ను పరిశీలించి అవగాహన ఏర్పరచుకోవాలి.
- బి.కృష్ణా రెడ్డి, సబ్జెక్టు నిపుణులు.
చదవండి: TSPSC 833 Engineering Jobs: ఏఈ, జేటీఓ పోస్ట్‌లు .. విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్..