TSPSC Groups Preparation Tips: ఉమ్మడి ప్రిపరేషన్.. గ్రూప్స్ గెలుపు!
- టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1, 2, 3 పరీక్షల తేదీలు ఖరారు
- ఉమ్మడి వ్యూహంతో రాణించేందుకు అవకాశం
- అనుసంధాన దృక్పథం కీలకమంటున్న నిపుణులు
టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ల ప్రకారం–గ్రూప్–1లో 563 పోస్ట్‌లు, గ్రూప్–2లో 783 పోస్ట్‌లు, గ్రూప్–3లో 1,388 పోస్ట్‌లు భరీ చేయనున్నారు. గ్రూప్ 1 పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్షలు ఉంటాయి.
జూన్ 9న గ్రూప్1 ప్రిలిమ్స్
టీఎస్‌పీఎస్సీ ఇటీవల గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 పరీక్షల తేదీలను ఖరారు చేసింది. గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9న, మెయిన్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నారు. అదేవిధంగా గ్రూప్–2 పరీక్ష నాలుగు పేపర్లుగా రెండు రోజుల్లో ఆగస్ట్ 7, 8 తేదీల్లో జరుగుతుంది. గ్రూప్–3 పరీక్షను మూడు పేపర్లుగా నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు.
చదవండి: TSPSC Group 2 Guidance: రివిజన్‌తోనే సక్సెస్ అంటున్న నిపుణులు!
పోటీ కూడా ఎక్కువగానే
గ్రూప్–1, 2, 3 పరీక్షలకు పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. గ్రూప్–1కు సంబంధించి మూడు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. గతంలో విడుదల చేసిన గ్రూప్–2 నోటిఫికేషన్‌కు 5.5 లక్షలు, గ్రూప్–3 నోటిఫికేషన్‌కు 5.3 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. దాదాపు 80 శాతం మంది అభ్యర్థులు మూడు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉమ్మడి సన్నద్ధత
గ్రూప్–1, 2, 3.. మూడు పరీక్షలను లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు.. మూడింటికీ సన్నద్ధత పొందేందుకు అవకాశముంది. అందుకోసం ఆయా అభ్యర్థులు ప్రధాన లక్ష్యమైన పరీక్షకు అధిక ప్రాధాన్యమిస్తూ.. ఆ ప్రిపరేషన్‌ను మిగతా రెండు పరీక్షలతో అనుసంధానం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సిలబస్.. ఒకే రీతి
మూడు సర్వీసులకు సిలబస్ దాదాపు ఒకే రీతిలో ఉండడం ఉమ్మడి ప్రిపరేషన్ అభ్యర్థులకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. గ్రూప్–1 అభ్యర్థులు ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే ప్రిలిమినరీ పరీక్షతోపాటు.. ఆ తర్వాత దశలో ఏడు పేపర్లుగా.. డిస్క్రిప్టివ్ పద్ధతిలో నిర్వహించే మెయిన్ ఎగ్జామ్స్‌కు సన్నద్ధత పొందాల్సి ఉంటుంది. గ్రూప్–1 మెయిన్స్‌కు ప్రిపరేషన్ సాగిస్తే..గ్రూప్–1 ప్రిలిమ్స్, మెయిన్స్‌తోపాటు గ్రూప్–2, 3లకు కూడా సన్నద్ధత పూర్తవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
గ్రూప్–2, 3 పరీక్షలు పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. గ్రూప్–2ను నాలుగు పేపర్లుగా, గ్రూప్–3ను మూడు పేపర్లుగా నిర్వహించనున్నారు. గ్రూప్–2లో నాలుగో పేపర్‌గా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావంపై పరీక్ష ఉంటుంది. ఈ అంశాలను గ్రూప్–3లోని పేపర్–2, పేపర్–3లతో సమ్మిళితం చేసుకునే అవకాశం ఉంది.
సిలబస్‌కు సరితూగే పుస్తకాలు
ఉమ్మడి ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు అందుకు అనుకూలమైన పుస్తకాలను మాత్రమే చదవాలి. ఆయా పరీక్షల సిలబస్ అంశాలన్నీ ఉన్న పుస్తకాలను ఎంచుకొని ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి. ప్రధానంగా తెలంగాణ ఉద్యమ దశలకు సంబంధించి ప్రత్యేక దృష్టితో చదవాలి. మార్కెట్లో ఈ అంశానికి సంబంధించి పదుల సంఖ్యలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. సిలబస్‌కు సరితూగే విధంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉన్న ఒకట్రెండు పుస్తకాలను ఎంచుకోవడం మేలు చేస్తుంది. అదే విధంగా అకాడమీ పుస్తకాలను చదవడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
చదవండి: TSPSC Group 2 Exam Preparation Tips: గ్రూప్–2.. సక్సెస్ ప్లాన్
విశ్లేషణాత్మక అధ్యయనం
గ్రూప్స్ అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌లో విశ్లేషణాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రూప్–1 ప్రిలిమ్స్, గ్రూప్–2, 3 పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలో, బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటాయి. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. ప్రిపరేష¯Œ మాత్రం డిస్క్రిప్టివ్ విధానంలోనే కొనసాగించాలి. తద్వారా ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో అవగాహన లభిస్తుంది. ఫలితంగా గ్రూప్–1 మెయిన్స్‌కు కూడా సన్నద్ధత పూర్తవుతుంది.
మెయిన్స్ స్థాయి ప్రిపరేషన్
గ్రూప్ 1 అభ్యర్థులు మెయిన్స్ స్థాయిని దృష్టిలో పెట్టుకుని అధ్యయనం సాగించాలి. మెయిన్స్‌లో ఏడు పేపర్లు(పేపర్–1 జనరల్ ఎస్సే; పేపర్–2 –హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ; పేపర్–3 ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, పరిపాలన; పేపర్–4 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్; పేపర్–5 సైన్స్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్; పేపర్–6 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం) ఉంటాయి. జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలు కూడా సిలబస్‌లో ఉన్నాయి. కాబట్టి గ్రూప్ 1–మెయిన్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ సాగిస్తే.. గ్రూప్–2, 3లకు కూడా సన్నద్ధత లభిస్తుంది. అదే విధంగా పేపర్–ఎ పేరుతో ఇంగ్లిష్ పేపర్ నిర్వహిస్తారు. ఇది అర్హత పేపర్ మాత్రమే.
అనుసంధాన దృక్పథం
ఉమ్మడి ప్రిపరేషన్‌లో భాగంగా అభ్యర్థులు అనుసంధాన దృక్పథం అనుసరించాలి. మూడు పరీక్షల్లోని ఉమ్మడి సిలబస్ అంశాలను గుర్తించి.. వాటిని అనుసంధానం చేసుకుంటూ చదవాలి. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్; భారత రాజ్యాంగం విధానం, పరిపాలన, ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్.. ఇలా అనేక అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదివే వీలుంది. అభ్యర్థులు ప్రతి రోజు సగటున 8 నుంచి 10 గంటల సమయం ప్రిపరేషన్‌కు కేటాయించేలా టైమ్ టేబుల్ రూపొందించుకోవాలి.
తెలంగాణకు ప్రాధాన్యం
ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు జాతీయం నుంచి తెలంగాణ ప్రాంత ప్రాధాన్యమున్న అంశాల వరకూ.. అన్నింటినీ ఔపోసన పట్టాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ఉద్యమ దశలు, తెలంగాణ ఆవిర్భావ దశ, మలిదశ ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా తెలంగాణ చరిత్రలో తెలంగాణ సామాజిక ముఖ చిత్రాన్ని తెలియజేసే అన్ని అంశాలను చదవాలి. సాహిత్యం, కళలు, కవులు, సంస్థానాలు, భౌగోళిక స్వరూపం, వనరులు, ప్రభుత్వ పథకాలు, రాష్ట్రంలో అమలవుతున్న కొత్త పథకాలు.. ఇలా అన్ని అంశాలపైనా దృష్టి పెట్టాలి.
ప్రత్యేక అంశాలకు ఇలా
తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీలపై అభ్యర్థులు మరింత ఎక్కువగా దృష్టిపెట్టాలి. తెలంగాణలో శాతవాహనుల నుంచి అసఫ్ జాహీల వరకూ.. ఆయా రాజ వంశాలు, రాజకీయ చరిత్ర, ముఖ్య యుద్ధాలు, ఒప్పందాలు, తెలంగాణలోని కవులు–రచనలు; కళలు; ముఖ్య కట్టడాలు–వాటిని నిర్మించిన రాజులు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అదే విధంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రమేయం ఉన్న సంఘటనలపై అవగాహన ఏర్పరచుకోవాలి. తెలంగాణలోని ముఖ్యమైన నదులు–పరీవాహక ప్రాంతాలు; ముఖ్యమైన పంటలు; భౌగోళిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం, విస్తీర్ణం, జనాభా వంటివి తెలుసుకోవాలి. ఎకానమీలో తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి, ముఖ్యమైన పథకాలు, 2011 జనాభా గణాంకాలు; ముఖ్యమైన పరిశ్రమలు –ఉత్పత్తిదాయకత, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై అవగాహన పెంచుకోవాలి. తాజా బడ్జెట్ గణాంకాలు, ఆయా శాఖలు, పథకాలకు కేటాయింపులను తెలుసుకోవాలి.
జాతీయ ప్రాధాన్యం
జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సామాజిక సమస్యలు, వాటిపై ప్రభుత్వాలు చేసిన విధానాలకు సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిపై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా మహిళా సాధికారత, గిరిజనుల సమస్యలు వంటివి. మహిళల సాధికారత కోసం జాతీయ స్థాయిలో పలు పథకాలు తెచ్చారు. మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమం కోసం విధానాలు అమలు చేస్తున్నారు. అదే విధంగా పలు నూతన పాలసీలు రూపొందుతున్నాయి. వాటి గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలి.
సొంత నోట్స్
అభ్యర్థులు ఆయా సబ్జెక్టులను చదువుతున్నప్పుడే ముఖ్యమైన అంశాలను పాయింట్ల వారీగా నోట్స్ రాసుకోవాలి. ఒక అంశాన్ని చదివేటప్పుడు అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తూ ముఖ్యమైన పాయింట్లను నోట్ చేసుకోవాలి. ఉదాహరణకు సామాజిక వర్గాలనే పరిగణనలోకి తీసుకుంటే.. ఆ వర్గాల నిర్వచనానికే పరిమితం కాకుండా.. వాటి ఆవిర్భావ చరిత్ర, విస్తరణ, తాజా పరిస్థితులు.. ఇలా అన్నింటినీ చదవాలి. ఇలా చదువుతూ కీలకాంశాలతో సిద్ధం చేసుకున్న నోట్స్‌ను పరీక్ష రోజు వరకూ పదే పదే రివిజన్ చేస్తుండాలి.
ప్రాక్టీస్ టెస్ట్‌లకు హాజరు
గ్రూప్–1, 2, 3 అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో ప్రాక్టీస్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరవడం మేలు చేస్తుంది. దీనివల్ల ఆయా సబ్జెక్ట్‌లలో తమకు అప్పటి వరకు లభించిన పరిజ్ఞాన స్థాయిపై అవగాహన లభిస్తుంది. ఇంకా చదవాల్సిన అంశాల విషయంలో స్పష్టత వస్తుంది. అదే విధంగా తాము చేస్తున్న పొరపాట్లను విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకునే వీలుంటుంది. దీంతోపాటు పాత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం కూడా పరీక్ష కోణంలో ఉపయోగపడుతుంది.
Tags
- TSPSC
- TSPSC Study Material
- TSPSC Groups
- Competitive exam preparation
- Competitive Exams
- Top Exam Preparation Tips
- tspsc group notification 2024
- tspsc group syllabus
- telangana history
- Telangana Geography
- Telangana Economy
- Competitive Exams Bit Banks
- mocktests
- TimeManagement
- GeneralKnowledge
- Currentaffairs
- GovernmentJobs
- sakshieducation latest news