TSPSC Group-4 : పది లక్షల మంది పోటీ... ఈ మెలకువలు పాటిస్తే విజయం సాధ్యం!
టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ ప్రకారం–మొత్తం 8039 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో వివిధ విభాగాల్లో జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అడిటర్, వార్డ్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి.
అర్హతలు
- టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని రకాల పోస్టులకు మాత్రం బీకామ్ అర్హతగా పేర్కొన్నారు.
- వయసు: 01.07.2022 నాటికి 18–44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు లభిస్తుంది.
గ్రూప్–4 పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ఇందులో పేపర్ 1లో జనరల్ నాలెడ్జ్–150, పేపర్–2లో సెక్రటేరియల్ ఎబిలిటీస్ 150 మార్కులకు ఉంటుంది. పీవో, క్లరికల్ వంటి బ్యాంకింగ్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులతోపాటు, మ్యాథ్స్ నేపథ్యం ఉన్న వారు కొద్దిగా కష్టపడితే పేపర్–2లో మంచి స్కోర్ చేయొచ్చు. అలాగే ఉన్న తక్కువ సమయాన్ని సరైన ప్రణాళికతో సద్వినియోగం చేసుకోగలిగితే.. పేపర్–1లో కూడా మంచి మార్కులు సాధించొచ్చు.
Also read: TSPSC Group-1 2023: మెయిన్‌లో మార్పులు.. మెరిసే మార్గాలు ఇవే!!
పేపర్–1 జనరల్ స్టడీస్
ఈ పేపర్‌లో మొత్తం 11 విభాగాల్లో తెలంగాణకు సంబంధించి.. తెలంగాణ భౌగోళిక అంశాలు, తెలంగాణ ఉద్యమం, సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం, పాలన విధానాలు, ఆర్థిక వ్యవస్థ తదితరాలపై ప్రశ్నలు అడుగుతారు.
భారత రాజ్యాంగం
ఈ విభాగం నుంచి 10–15 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఎక్కువ మార్కులు సాధించే అవకాశమున్న విభాగం ఇది. కరెంట్ ఆఫైర్స్‌ను అనుసంధానించుకుంటూ, చాప్టర్ల వారీగా చదవాలి. అలాగే గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. కొన్ని సందర్భాల్లో అవి రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంది. వీటితోపాటు మాక్ టెస్ట్‌లు రాయాలి.
జాగ్రఫీ
భారతదేశ భౌగోళిక అంశాలపై ప్రశ్నలుంటాయి. బేసిక్ స్థాయిలోనే వీటిని అడిగే అవకాశం ఉంటుంది. ప్రిపరేషన్‌లో స్కూల్, డిగ్రీ స్థాయి పుస్తకాలకు ప్రాధాన్యం ఇవ్వడం మేలు చేస్తుంది.
Also read: Groups Preparation 2023: సొంత నోట్సు.. సక్సెస్‌కు రూటు
భారత ఆర్థిక వ్యవస్థ
ఈ విభాగం నుంచి 10–15 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. పాఠశాల స్థాయి బేసిక్ అంశాలతో ప్రారంభించి, భారత ఆర్థిక సర్వే, బడ్జెట్లపైన స్థూలంగా అవగాహన పెంచుకోవాలి. స్థూల గణంకాలపై అవగాహన ఉండాలి. ప్రణాళిక వ్యవ«స్థ, నీతి ఆయోగ్, సాంఘిక ఆర్థిక సమస్యలైన నిరుద్యోగం,పేదరికం, మౌలిక భావనలు తెలుసుకోవాలి. వాటిని నిర్మూలనకు ప్రభుత్వం తీసుకునే చర్యలు, ప్రస్తుతం అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విత్త, ద్రవ్య వ్యవస్థలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
ఆధునిక భారతదేశ చరిత్ర–జాతీయోద్యమం
ఈ విభాగం నుంచి 10–15 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇందులో ఎక్కువ శాతం ప్రశ్నలు భారత జాతీయోద్యమం నుంచి ఉంటాయి. సంవత్సరాల వారీగా ఉద్యమంలోని వివిధ దశలు, వాటి ఫలితాలు, ఉద్యమాన్ని నడిపిన వ్యక్తుల జీవిత చరిత్ర, జాతీయోద్యమం నాటి గవర్నర్ జనరల్స్, ఆ కాలంలో విడుదలైన బ్రిటిష్ చట్టాలు, వాటిపై భారతీయుల స్పందన, జాతీయోద్యమ కాలంలో తెలంగాణలో జరిగిన సంఘటనలు వంటి వాటిపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముంది. జాతీయోద్యమ చరిత్రకు సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలు ఉపయోగపడతాయి.
Also read: TSPSC Group 3 Exam Pattern : 1365 గ్రూప్-3 ఉద్యోగాలు.. పరీక్షా విధానం ఇదే..
జనరల్ సైన్స్
- ఈ విభాగంలో సైన్స్ అనువర్తనాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం పాఠశాల స్థాయి భౌతిక, జీవ, రసాయన శాస్త్ర అనువర్తనాలను చదువుకుంటే సరిపోతుంది. పాఠ్యపుస్తకాల్లోని సైద్దాంతిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా.. మౌలిక అంశాలను చదువుకుని అనువర్తనాలపై దృష్టి పెట్టాలి.
- సైన్స్ అండ్ టెక్నాలజీ: ఈ విభాగాన్ని సిలబస్‌లో పేర్కొనపోయినప్పటికీ ప్రశ్నలు అడిగే అవకాశముంది. కరెంట్ ఆఫైర్స్‌లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నలు వస్తాయి. నిత్యజీవితంలో అంతర్భాగంగా సైన్స్ టెక్నాలజీపై ప్రశ్నలు ఎదురవుతాయి.
పర్యావరణం–విపత్తుల నిర్వహణ
ఈ రెండు అంశాలపై 10 వరకు ప్రశ్నలు అడిగే వీలుంది. కొంతవరకు పాఠశాల స్థాయి పాఠ్యపుస్తకాలతోపాటు 12వ తరగతి స్థాయి విపత్తు నిర్వహణ, పర్యావరణ అంశాలు చదివితే మంచి ఫలితం సాధించవచ్చు.
Also read: TSPSC Jobs Notification 2022: 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు
అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
మన దేశానికి ఇతర దేశాలతో ఉన్న సంబంధాలపై ప్రధానంగా ప్రశ్నలు అడిగే విభాగం ఇది. ఇందులో ముఖ్యంగా సరిహద్దు దేశాలతో భారతదేశానికి ఉన్న సత్సంబంధాలపై ప్రశ్నలు వచ్చే వీలుంది. అంతర్జాతీయ సంఘటనలు, ప్రపంచ వేదికల్లో భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేయాలి. కరెంట్ అఫైర్స్ అనుసంధానించుకొని చదివితే మేలు. వివిధ అంతర్జాతీయ వేదికలు, వాటి ప్రారంభం, పలు అంతర్జాతీయ వేదికలపై భారతదేశ పాత్ర, ఆయా వేదికల సభ్య దేశాలు, వాటి పూర్వ, ప్రస్తుత అధ్యక్షులు, తాజా సమావేశాలు, రష్య–ఉక్రెయిన్ యుద్ధం తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
కరెంట్ అఫైర్స్
ఈ విభాగంలో పరీక్ష తేదీకి ముందు 6 నుంచి 9 నెలల కాలానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్‌ను చదవాలి. ప్రశ్నలు ఏ విధంగా అడిగినా.. సమాధానాలు గుర్తించేలా ప్రిపరేషన్ సా«గించాలి.
Also read: Group 4 Preparation Tips: 9,168 గ్రూప్-4 పోస్టులపై.. గురిపెట్టండిలా!
పేపర్–2(సెక్రటేరియల్ ఎబిలిటీస్)
శ్రద్ధగా ప్రాక్టీస్ చేస్తే పేపర్–2లోఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశముంది. ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు మంచి స్కోర్ చేయొచ్చు. అలాగే ప్రతి రోజు రెండు, మూడు గంటల ప్రాక్టీస్ ద్వారా తాజా అభ్యర్థులు కూడా అధిక మార్కులు సాధించవచ్చు. పేపర్–2లో ఐదు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
మెంటల్ ఎబిలిటీ
కోడింగ్, డీకోడింగ్, రక్త సంబంధాలు, పజిల్స్, వర్గీకరణ, అనాలజీ, అసర్షన్–రీజన్, వెర్బల్–నాన్ వెర్బల్, రీజనింగ్ తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నల్లో ఉన్న లాజిక్, సమస్య పరిష్కార పద్దతిని తెలుసుకుంటే.. మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. సైద్ధాంతిక భావనలను అర్థం చేసుకొని, విస్తృత స్థాయిలో సాధన చేస్తే ఈ విభాగంలో రాణించవచ్చు.
న్యూమరికల్, అర్థమెటికల్ ఎబిలిటీస్
వడ్డి లెక్కలు, కాలం–పని, కాలం–వేగం, నిష్పత్తులు, వాటాల లెక్కింపు మొదలైన పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ప్రశ్నలు అర్థం చేసుకుంటే.. సమాధానాలు సులువే. ఇందుకోసం వీలైనన్నీ ఎక్కువ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. దత్తాంశ విశ్లేషణ, సాంఖ్యక శాస్త్ర పాఠ్యాంశాల సగటు, మధ్యమం, బహుళకం తదితర అంశాలను సాధన చేయడం ద్వారా.. వాటిపై వచ్చే ప్రశ్నలకు సులభంగా సమాధానాలను గుర్తించవచ్చు. బోడ్‌మాస్, అంకెల మధ్య ఉండే సహసంబంధాలు, అంకెల వరుసక్రమాలు మొదలైన సూత్రాల మీద ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి.
Also read: Groups Preparation Tips: 'కరెంట్ అఫైర్స్'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!
కాంప్రహెన్షన్
సమాచారాన్ని ఒక పేరాగ్రాఫ్‌లో ఇస్తారు. దాన్ని చదివి వివిధ రకాలైన ప్రశ్నలకు సమాధానం గుర్తించాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు ప్రాక్టీస్ బిట్స్ కలిగిన పేరాగ్రాఫ్‌లు చదివి సాధన చేయాలి. పేరాను వేగంగా ఏకాగ్రతతో చదవడం, అర్థం చేసుకోవడం, సంక్షిప్తీకరించుకోవడం అనే అంశాలపై ఆధారపడి ఈ విభాగంలో మంచి మార్కులు పొందవచ్చు.
సెంటెన్స్ రీ–అరేంజ్‌మెంట్
ఈ విభాగం కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సిన అవసరం లేదు. వరస మార్చిన వివిధ వాక్యాలను అర్థవంతమైన రూపంలో తిరిగి అమర్చాలి. ఎక్కువ ప్రాక్టీస్ ద్వారా ఇందులో సులభంగా మార్కులు సాధించొచ్చు.
Also read: TSPSC Group-1 Cut Off Marks : గ్రూప్-1 మెయిన్స్‌లో నిలవాలంటే ఎన్ని మార్కులు సాధించాలంటే..
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేది: 30.01.2023
- పరీక్ష తేదీలు: ఏప్రిల్/మే 2023
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.tspsc.gov.in