TSPSC Group-1 2023: మెయిన్‌లో మార్పులు.. మెరిసే మార్గాలు ఇవే!!
- » ‘మెయిన్’ పోటీలో 25,050 మంది అభ్యర్థులు
- » జూన్‌లో మెయిన్ పరీక్షలు ఉంటాయని ప్రకటన
- » ప్రశ్న పత్రం నమూనాను విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ
- » విశ్లేషణ, విషయ పరిజ్ఞానం విజయానికి మార్గమంటున్న నిపుణులు
గ్రూప్–1, సివిల్స్ ప్రిలిమ్స్‌లో విజయం సాధించారంటే..సగం విజయం సాధించినట్లే! ఎందుకంటే.. ప్రిలిమ్స్‌లో అర్హత పొందడం ఎంతో క్లిష్టం. కాబట్టి మెయిన్‌కు ఎంపికైన అభ్యర్థులు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తే.. మెయిన్స్‌లో విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మెయిన్ పరీక్షలు జూన్‌లో జరిగే అవకాశముంది. అంటే.. ఇప్పటి నుంచి ఐదు నెలల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయాన్ని సరైన విధంగా సద్వినియోగం చేసుకుంటే.. మెయిన్స్‌లో మంచి మార్కులు సాధించే దిశగా అడుగులు వేయొచ్చు.
Also read: History Notes for Groups: శాతవాహనులు–సంస్కృతి
ప్రశ్న పత్రం నమూనా విడుదల
- అభ్యర్థుల సౌలభ్యం కోసం టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో గ్రూప్–1 మెయిన్ పేపర్‌ల వారీగా సెక్షన్లు, ప్రశ్నల సంఖ్య, ఛాయిస్ వంటి వివరాలను పొందుపరిచారు.
- ప్రతి పేపర్‌లో మూడు సెక్షన్లు ఉన్నాయి. ఒక్కో సెక్షన్ నుంచి అయిదు ప్రశ్నలు చొప్పున మొత్తం 15 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
- ఒక్కో ప్రశ్నకు 10 మార్కులు చొప్పున ప్రతి పేపర్‌ను 150 మార్కులకు నిర్వహించనున్నారు. అయితే ఇంటర్నల్ ఛాయిస్ బాగా తగ్గింది.
- ప్రతి పేపర్‌లోని ప్రతి సెక్షన్‌లో అభ్యర్థులు మొదటి రెండు ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం రాయాలి. మూడు నుంచి అయిదో ప్రశ్న వరకు ఇంటర్నల్ ఛాయిస్ ఇచ్చారు.
- పేపర్–5 సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో.. డేటా ఇంటర్‌ప్రిటేషన్ సబ్జెక్ట్ నుంచి రెండు మార్కుల ప్రశ్నలు 30 అడుగుతారు. అభ్యర్థులు 25 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు.
డిస్క్రిప్టివ్ విధానం
మెయిన్ పరీక్ష వ్యాస రూప(డిస్క్రిప్టివ్) విధానంలో ఉంటుంది. నిర్దేశించిన ఆరు పేపర్లలోనూ అభ్యర్థులు వ్యాసరూప సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అర్హత పేపర్‌గా నిర్దేశించిన ఇంగ్లిష్ సైతం డిస్క్రిప్టివ్‌లోనే ఉంటుంది. దీంతో ప్రిపరేషన్ సమయంలోనే అభ్యర్థులు ఆయా అంశాలను విశ్లేషణాత్మక ధృక్పథంతో అధ్యయనం చేయాలి. అదే విధంగా ప్రశ్న అడిగిన తీరు, ఉద్దేశాన్ని గ్రహించి.. దానికి తగినట్లుగా సమాధానం రాసే నైపుణ్యం పెంచుకోవాలి. సబ్జెక్ట్‌పై పూర్తి పట్టు సాధించడంతోపాటు ముఖ్యాంశాలతో సొంతంగా నోట్స్ రాసుకోవాలి.దీంతోపాటు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి.
Also read: TSPSC తెలంగాణ చరిత్ర ఆన్‌లైన్ పరీక్షలు; 19 టాపిక్స్ నుండి 1200+ ప్రశ్నలు
సొంత నోట్స్ ఎంతో మేలు
అభ్యర్థులు ప్రిపరేషన్ సాగించే సమయంలో.. సదరు అంశానికి సంబంధించిన ముఖ్యాంశాలతో నోట్స్ రాసుకోవడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో సదరు సబ్జెక్ట్‌కు సంబంధించి ముఖ్యమైన, ప్రశ్నార్హమైన అంశాలు ఉండేలా చూసుకోవాలి. ప్రతి టాపిక్‌లోని అంశాలు, వాటి ఉద్దేశం, ప్రభావంతో నోట్స్ రాసుకోవాలి. సొంత నోట్స్ ద్వారా ముఖ్యమైన అంశాలను వేగంగా రివిజన్ చేసుకునే వీలు కలుగుతుంది.
- సమకాలీన పరిణామాలకు సంబంధించి కూడా ముఖ్యమైన వాటిపై వివిధ కోణాల్లో నోట్స్‌లో రాసుకోవాలి. అభ్యర్థులు పత్రికలను చదువుతూ పరీక్ష కోణంలో అందులోని ముఖ్యాంశాలను గుర్తించే నైపుణ్యం అలవరచుకోవాలి. సంఘటన ప్రాధాన్యం, ఉద్దేశం, ప్రభావం వంటి వాటిపై స్పష్టత ఏర్పరచుకోవాలి.
రైటింగ్ ప్రాక్టీస్ స్కిల్స్
అభ్యర్థులు రైటింగ్ ప్రాక్టీస్ కోసం ప్రతి రోజూ కొంత సమయం కేటాయించాలి. పరీక్షలో ఆయా ప్రశ్నలకు సమాధానం రాసేందుకు లభించే సగటు సమయాన్ని గుర్తించాలి. దానికి అనుగుణంగా నిర్దిష్ట సమయంలో ప్రశ్నలకు సమాధానం రాసేలా ప్రాక్టీస్ చేయాలి. ఇందుకోసం పాత ప్రశ్న పత్రాలను సాధన చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. మోడల్ ప్రశ్న పత్రాలు, మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా మేలు చేస్తుంది. చదువుతున్నప్పుడే రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే సమయం ఆదా అవుతుంది.
Also read: DAO Grade 2 Syllabus: డీఏఓ గ్రేడ్-2 రాతపరీక్ష సిలబస్ ఇదే.. వీటిపై పట్టు ఉంటే విజయం మీదే..
సినాప్సిస్ ఎంతో ముఖ్యం
మెయిన్స్‌లో మేలు చేసే మరో సాధనం.. సినాప్సిస్ రాసుకునే విధానం. ఏదైనా ఒక టాపిక్ చదువుతున్నప్పుడు దానికి సంబంధించి నిర్వచనం, ప్రాథమిక భావనలు, ఉద్దేశం, సమకాలీన పరిణామాలు, ప్రభావం వంటి అంశాలతో సంక్షిప్తంగా సినాప్సిస్ రాసు కోవాలి. ఈ విధానం వల్ల సమాధానం రాసేటప్పుడు మొత్తం విషయం జ్ఞప్తికి వచ్చే అవకాశం ఉంటుంది.
సమయ పాలన
అభ్యర్థులు ప్రతి రోజు సబ్జెక్ట్ వారీగా సమయ పాలన పాటించాలి. ప్రతి రోజు అన్ని సబ్జెక్ట్‌లు, పేపర్లు చదివేలా చూసుకోవాలి. చాలామంది అభ్యర్థులు తమకు క్లిష్టమైన సబ్జెక్ట్‌లు లేదా టాపిక్స్‌ను తర్వాత చదవచ్చనే భావనతో ఉంటారు. క్లిష్టమైన టాపిక్స్‌పైనా కనీస అవగాహన పొందేలా ప్రయత్నించాలి. తద్వారా కష్టమైన ప్రశ్నలకు కొంతమేరకైనా సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా అభ్యర్థులు ప్రతి రోజు తాము అంతకుముందు రోజు చదివిన అంశాలను ఒకసారి అవలోకనం చేసుకోవాలి.
ఇంగ్లిష్ అర్హత మాత్రమే
పేపర్–ఎగా పేర్కొన్న ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ కేవలం అర్హత పేపర్ మాత్రమే. ఇందులో పొందిన మార్కులను మెరిట్ జాబితాలో కలపరు. ఇందులో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం; బీసీ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల విభాగాలకు చెందిన వారు 30 శాతం మార్కులు సొంతం చేసుకోవాలి.
Also read: Current Affairs: దేశంలోనే టాప్‌లో ఏపీ... స్వచ్ఛ జల్ సే సురక్షలో రెండో స్థానం
పేపర్ వారీగా ప్రిపరేషన్ ఇలా
పేపర్–1 జనరల్ ఎస్సే
- జనరల్ ఎస్సేలో రాణించేందుకు సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు, ఆర్థిక వృద్ధి, భారత చారిత్రక, వారసత్వ సంపద, సైన్స్ అండ్ టెక్నాలజీలో తాజా పరిణామాలు తదితర అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
- జనరల్ ఎస్సేలో విషయావగాహన, సమకాలీన పరిణామాలపై పట్టు, సృజనాత్మకత వ్యక్తీకరణం చాలా ముఖ్యం. జనరల్ ఎస్సే ఉద్దేశం కూడా ఇదే రీతిలో ఉంటోంది. కాబట్టి అభ్యర్థులు ఏ విషయంపై వ్యాసం రాస్తున్నా.. సంబంధిత లక్ష్యం నెరవేరేలా వ్యాసాన్ని ప్రెజెంట్ చేయడం మేలు చేస్తుంది.
పేపర్–2: హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ
- చరిత్రలో తెలంగాణలో రాజులు, ముఖ్య యుద్ధాలు, ఒప్పందాలు, తెలంగాణలోని కవులు–రచనలు; కళలు; ముఖ్య కట్టడాలు–వాటిని నిర్మించిన రాజులు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అదే విధంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రమేయం ఉన్న సంఘటనలపై అవగాహన పెంచుకోవాలి. భారత చరిత్రకు సంబంధించి.. ఆధునిక భారత దేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమం, భారత చరిత్ర, సంస్కృతి; అదే విధంగా తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం వంటి అంశాలను చదవాలి. వీటితోపాటు భారతదేశం, అలాగే తెలంగాణ రాష్ట్ర భౌగోళిక అంశాలపై పట్టు సాధించాలి.
- జాగ్రఫీలో.. తెలంగాణలోని ముఖ్యమైన నదులు–పరీవాహక ప్రాంతాలు; ముఖ్యమైన పంటలు; భౌగోళిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం విస్తీర్ణం, జనాభా వంటి అంశాలపై అవగాహన అవసరం.
Also read: TSPSC Group 3 Exam Pattern : 1365 గ్రూప్-3 ఉద్యోగాలు.. పరీక్షా విధానం ఇదే..
పేపర్–3: ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, పాలన
ఈ పేపర్ కోసం భారత రాజ్యాంగం, పాలనా వ్యవస్థ, భారత సమాజం, సమస్యలు, సాంఘిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి. ఆర్టికల్స్, సవరణలు, రాజ్యాంగ వ్యవస్థలు, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థల స్వరూపం, అధికారాలు, విధులు వంటి అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా ఇటీవల కాలంలో పాలన పరంగా అనుసరిస్తున్న నూతన విధానాలపై దృష్టి పెట్టాలి.
పేపర్–4: ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
ఈ పేపర్ కోసం భారత, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ–అభివృద్ధి, అభివృద్ధి, పర్యావరణ సమస్యల గురించి అవగాహన పెంచుకోవాలి. ఎకానమీలో తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి, ముఖ్యమైన పథకాలు, 2011 జనాభా గణాంకాలు; ముఖ్యమైన పరిశ్రమలు–ఉత్పత్తిదాయకత, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై పట్టుసాధించాలి. అదే విధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి మైక్రో, మ్యాక్రో ఎకనామిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. కోర్ అంశాలతోపాటు ఆర్థిక వ్యవస్థలో తాజా పరిణామాల వరకు అన్నింటిని అధ్యయనం చేయాలి.
Also read: Groups Preparation 2023: సొంత నోట్సు.. సక్సెస్‌కు రూటు
పేపర్–5: సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్
- ఈ పేపర్ కోసం సామాజిక అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ దోహదపడుతున్న తీరు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆధునిక పద్ధతుల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. అదే విధంగా భారత అంతరిక్ష కార్యక్రమం, ఈ–గవర్నెన్స్, బయో డైవర్సిటీ, ఎకాలజీ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. దీంతోపాటు కోర్ సైన్స్ అంశాలు ప్రధానంగా వ్యాధులు–బ్యాక్టీరియాలు వంటివి తెలుసుకోవాలి. వైరస్‌లు, వాటి నివారణకు అందుబాటులోకి వస్తున్న వ్యాక్సీన్‌లపై పట్టు సాధించాలి.
- పేపర్–5లోనే మూడో విభాగంగా పేర్కొన్న.. డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం గణితంలో ప్రాథమిక అంశాలపై దృష్టిపెట్టాలి. మౌలికాంశాలైన.. సంఖ్యలు–సంఖ్యామానాలు; ప్రాథమిక గణిత పరిక్రియలు, కారణాంకాలు, గుణిజాలు, క.సా.గు.; భిన్నాల కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారం, సాధారణ భిన్నం, మిశ్రమ భిన్నం; సమీకరణాలు–సాధన; ఘాతాంకాలు –ఘాతాలపై అవగాహన పెంచుకోవాలి. ఇందుకోసం 6,8వ తరగతి పుస్తకాలు పరిశీలించాలి. ఈ అంశాలపై పట్టు సాధించాక వీలైనంతగా ప్రాక్టీస్ చేయాలి. అప్లికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. ఒక మోడల్‌ను అంచెలవారీగా సాల్వ్ చేసే ప్రాక్టీస్ అవసరం.
పేపర్–6: తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్–1 సిలబస్‌లో కొత్తగా చేర్చిన పేపర్ ఇది. అభ్యర్థులు తెలంగాణ ఆలోచన(1948–1970), ఉద్యమ దశ(1971–1990), తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం(1991–2014)) అంశాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. ముఖ్యంగా సిలబస్‌లో నిర్దేశించిన ప్రకారం–1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు–వాటి సిఫార్సులు వంటి వాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్ వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా పొందుపరచిన అంశాలు; తెలంగాణ రాష్ట్రానికి కల్పించిన హక్కులపై దృష్టి సారించాలి. తెలంగాణకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి వంటి అంశాలపై మరింత ప్రత్యేక దృష్టితో అభ్యసనం సాగించాలి. ఆర్థిక వనరుల అభివృద్ధి, రాష్ట్రంలో వ్యవసాయ, సాగు పరిస్థితులు, పారిశ్రామిక విధానాలు వంటి అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
మెయిన్స్ ప్రిపరేషన్ ముఖ్యాంశాలు
- విజయంలో కీలకంగా నిలిచే అనలిటికల్, ప్రజెంటేషన్ స్కిల్స్.
- ప్రిపరేషన్ సమయంలో నోట్స్, రివిజన్ ఎంతో ఆవశ్యకం.
- ముఖ్యమైన కాన్సెప్ట్‌లు, నిర్వచనాలతో సినాప్సిస్‌లు రాసుకోవాలి.
- ప్రతి టాపిక్‌ను చదవడం తప్పనిసరి.
- క్లిష్టమైన టాపిక్స్ విషయంలో ప్రాథమిక భావనలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
- ప్రిపరేషన్ సమయంలో మోడల్ టెస్ట్‌లు, ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ సాధన చేయాలి.
Also read: Groups Preparation Tips: గ్రూప్స్..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్ కొట్టేలా!