Current Affairs: దేశంలోనే టాప్‌లో ఏపీ... స్వచ్ఛ జల్ సే సురక్షలో రెండో స్థానం
‘స్వచ్ఛ జల్ సే సురక్ష’ పేరుతో గతేడాది అక్టోబర్ 2 నుంచి ఈ ఏడాది జనవరి 26 వరకు కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దేశంలోని అన్ని గ్రామాల్లో సురక్షిత నీటి వాడకంపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
పరిశీలించిన తర్వాతే మార్కులు
రాష్ట్రాల్లో రక్షిత తాగునీటి సరఫరాకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి మార్కులు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని తాగునీటి వనరులు(రక్షిత మంచినీటి పథకాలు, బోర్లు, బావులు తదితరాలు) వద్ద నీటి నాణ్యత పరీక్షల నిర్వహణను కేంద్ర జల శక్తి శాఖ పరిశీలించింది. అలాగే నీటిలో ఫ్లోరైడ్, నైట్రేట్ తదితర రసాయనాలతో పాటు ఈ–కోలి తదితర బ్యాక్టీరియా కారకాలను గుర్తించినప్పుడు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను పరిగణనలోకి తీసుకుంది.
568 మార్కులతో సెకండ్ ప్లేస్..
వర్షాకాలం ముందు, తర్వాత నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల సంఖ్యను.. స్కూళ్లు, అంగన్ వాడీ కేంద్రాల్లో తాగునీటి వసతి సౌకర్యాలను, నాణ్యత పరీక్షల నిర్వహణకున్న వసతులు, అందులో స్థానిక మహిళలకు తగిన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలను కూడా కేంద్ర జల శక్తి శాఖ పరిశీలించింది. వీటన్నింటి ఆధారంగా 900 మార్కులకు రాష్ట్రాలకు మార్కులు కేటాయించింది. ఈసారి 900 మార్కులకు గాను 598 మార్కులతో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్ 568 మార్కులతో రెండో స్థానం దక్కించుకుంది.
చదవండి: రెండు నెలల్లో వైజాగ్ రాజధాని... టార్గెట్ ఐటీ హబ్
96 శాతం నీటి వనరుల వద్ద నాణ్యత పరీక్షలు..
ఏపీలో 87 శాతానికి పైగా గ్రామాల్లో స్థానికంగానే తాగునీటి నాణ్యత పరీక్షల నిర్వహణకు అవసరమైన కిట్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచినట్లు కేంద్ర జలశక్తి శాఖ గణాంకాల్లో తేలింది. 18,393 గ్రామాలుండగా, 96 శాతానికి పైగా అంటే 17,772 గ్రామాల్లోని వనరుల వద్ద రెండు విడతల పాటు పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో 1.64 లక్షల తాగునీటి వనరుల వద్ద పరీక్షలు నిర్వహించగా, 21,193 చోట్ల వివిధ రకాల కాలుష్య కారకాలను గుర్తించారని తెలిపింది. అందులో 20,739 చోట్ల ఏపీ ప్రభుత్వం అప్పటికప్పుడే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రక్షిత మంచినీటి వనరులు కల్పించినట్లు కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది.
చదవండి: గూగుల్‌కు మూడినట్లే... సవాల్ చేస్తోన్న చాట్‌జీపీటీ...