Earthquake: దేశాన్నే పక్కకి జరిపిన భూకంపం... ఏకంగా 5 మీటర్లు జరిగిన టర్కీ
Sakshi Education
టర్కీలో ఫిబ్రవరి 6న సంభవించిన భూకంప విలయం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భూకంపం(7.8 తీవ్రత) ధాటికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ప్రకంపనల ధాటికి టర్కీ దేశమే కదిలిపోయింది.
భౌగోళికంగా భూకంప ప్రభావిత ప్రాంతాల కూడలిలో టర్కీ ఉంది. ఆ దేశంలో తరచూ భూకంపాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. అయితే తీవ్రత తక్కువగా ఉండడంతో వందల సంఖ్యలో భూకంపాలు చోటుచేసుకున్న పెద్దగా నష్టం ఏర్పడదు. తాజాగా చోటుచేసుకున్న భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఇళ్లు, భవనాలు పేకమేడల్లా కూలిపోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. లక్షల మంది కూడు, గూడు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే తాజా భూకంపంతో ఆ దేశం ఐదు నుంచి ఆరు మీటర్ల మేర పక్కకు కదిలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టర్కీలో ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ (భూమి పైపొరలోని ఫలకాలు) మధ్య రాపిడి కారణంగా ఈ కదలిక జరిగినట్లు తెలిపారు. తమ అంచనా ప్రకారం.. ఈ భూకంప తీవ్రతతో సిరియాతో పోలిస్తే టర్కీ 5–6 మీటర్ల పక్కకు జరిగినట్లు ఇటలీకి చెందిన సీస్మాలజిస్ట్ ప్రొఫెసర్ కార్లో డగ్లియాని వెల్లడించారు.
Published date : 09 Feb 2023 06:49PM