TSPSC& APPSC Groups: గ్రూప్స్‌లో గెలుపు బాట కోసం.. ప్రముఖ సబ్జెక్ట్ నిపుణుల సూచనలు- సలహాలు ..
ఇలాంటి సమయంలో గ్రూప్స్‌లో విజయం సాధించడం కోసం అభ్యర్థులు ఎంతో కష్టపడుతు ఉంటారు. సిలబస్, ప్రిపరేషన్ పరంగా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి కోసం ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు అందిస్తున్న సలహాలు- సూచనలు మీకోసం..
TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్టడం ఎలా? ఎలాంటి బుక్స్ చదవాలి..?
స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి.. వీటిపై..
అభ్యర్థులు ప్రతి అంశాన్ని పూర్తిగా చదవాలి. అంతేకాకుండా ఆయా టాపిక్స్‌పై సంపూర్ణ అవగాహన కోసం స్టేట్‌మెంట్స్ ఆధారిత ప్రిపరేషన్ సాగించాలి. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్ష శైలి ఏదైనా.. స్టేట్‌మెంట్ ఆధారిత ప్రిపరేషన్ ద్వారా సంబంధిత అంశంపై సమగ్ర అవగాహన లభిస్తుంది. పోటీ పరీక్షల్లో స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. మూడు, నాలుగు స్టేట్‌మెంట్స్ ఇచ్చి వాటిలో సరైంది ఏది అని అడుగుతున్నారు. ఇలాంటి ప్రశ్నల ముఖ్య ఉద్దేశం.. ఆయా టాపిక్స్‌పై అభ్యర్థికున్న సమగ్ర అవగాహనను తెలుసుకోవడమే! కాబట్టి విద్యార్థులు ఒక టాపిక్‌కు సంబంధించి నిర్వచనం మొదలు తాజా పరిణామాలకు వరకూ..సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి. ఉదాహరణకు ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన డీ-మానిటైజేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. నల్లధనం నిర్వచనం? అది ఏ రూపంలో ఉంటుంది? దానివల్ల ఆర్థిక, సామాజిక వ్యవస్థపై ప్రభావం? గురించి తెలుసుకోవాలి. డీ-మానిటైజేషన్‌తో నల్లధనం సమస్యకు ఎంత మేరకు పరిష్కారం లభిస్తుంది? వాస్తవంగా ఇది సాధ్యమేనా? ప్రస్తుతం డీ-మానిటైజేషన్ వల్ల కలిగిన ఫలితాలు, తదనంతర పరిస్థితులపై అవగాహన పొందాలి. అభ్యర్థులు పరీక్షలో విజయం కోసం నిర్ణయాత్మక సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యం పెంచుకోవాలి. ముఖ్యంగా డిస్క్రిప్టివ్ తరహాలో ఉండే గ్రూప్-1 మెయిన్స్‌లో ఈ నైపుణ్యాలు ఎంతో అవసరం. ఒక ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు అంశానికి సంబంధించిన పూర్వాపరాలు, ప్రస్తుత పరిస్థితి అన్నీ తెలుసుకోవాలి. అదేవిధంగా ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని సులభంగా పరిష్కరించే మార్గాల గురించి అవగాహన పొందేలా ప్రిపరేషన్ సాగించాలి. ఒక టాపిక్‌ను ఒకటికి నాలుగుసార్లు చదివితే సబ్జెక్ట్ నైపుణ్యం లభిస్తుంది. దీన్ని వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే విధంగా పరిణతి సాధించాలి. ఇందుకోసం లాజికల్ థింకింగ్, కామన్‌సెన్స్, రీజనింగ్, నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి. అన్ని పరీక్షలను లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు హై-లెవల్ థింకింగ్‌తో ప్రిపరేషన్‌ను సాగించాలి. అప్పుడే కింది స్థాయి పరీక్షలకు కూడా సంసిద్ధత లభిస్తుంది. ఇలా సబ్జెక్ట్ పరంగా, పరీక్ష పరంగా ప్రాధాన్యత క్రమం, సమస్యాపరిష్కారం, నాయకత్వ లక్షణాలు, నిర్ణయాత్మక సామర్థ్యంతో ముందుకు సాగితే ఒకే సమయంలో మూడు పరీక్షలను విజయవంతంగా ఎదుర్కోవచ్చు.
- ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్
గ్రూప్స్ పరీక్షల్లో నెగ్గాలంటే..ఇవి తప్పక చదవాల్సిందే..
వాటి నుంచే ప్రశ్నలు వస్తాయని భావించకూడదు..
ఎకానమీ పరంగా ఫ్యాక్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్‌పై అవగాహన పెంచుకోవాలి. తర్వాత విశ్లేషించుకుంటూ చదవాలి. పూర్తిగా గణాంకాలకే సమయం కేటాయించి వాటి నుంచే ప్రశ్నలు వస్తాయని భావించకూడదు. ఆబ్జెక్టివ్ పరీక్షలో సైతం ఫ్యాక్ట్స్‌ను ఆధారం చేసుకుంటూ విశ్లేషణాత్మకంగా సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎకానమీలో మౌలిక భావనల నుంచి తాజా పరిస్థితుల వరకు అధ్యయనం చేయాలి. జాతీయాదాయం, ప్రణాళికలు, జనాభా, బ్యాంకింగ్, ద్రవ్య విధానం, కోశ విధానం, పేదరికం-నిర్మూలన, నీతి ఆయోగ్‌లకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. సమ్మిళిత వృద్ధి, తాజా ఆర్థిక విధానాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. సమస్యలు- కారణాలు-ప్రభావాలు-పర్యవసానాలు-నివారణోపాయాలు అనే దృక్పథంతో చదవాలి. ఆయా ప్రణాళికలు-లక్ష్యాలు-విజయాలు- వైఫల్యాలు - కారణాలపై అవగాహన పెంచుకోవాలి. నీతిఆయోగ్, విజన్ డాక్యుమెంట్స్ వంటి తాజా ఆర్థిక పరిణామాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలి. పథకాలు, లక్ష్యాలను చదివేటప్పుడు వాటికి కేటాయించిన నిధులు, లక్షిత వర్గాలకు సంబంధించిన గణాంకాలకే పరిమితం కాకుండా.. కార్యాచరణ పరంగా అవి ఏ స్థాయిలో ఉన్నాయో విశ్లేషణాత్మకంగా చదవాలి. ఎకానమీలో కూడా మూడు పరీక్షలకు దాదాపు ఒకేవిధమైన సిలబస్ ఉంది. దీన్ని సానుకూలంగా మార్చుకుని డిస్క్రిప్టివ్ విధానంతో చదివితే ఆబ్జెక్టివ్ పరీక్షలకు సైతం సన్నద్ధత లభిస్తుంది. పంచాయతీ సెక్రటరీ పోస్టులకు గ్రామీణాభివృద్ధి పథకాల గురించి మరింత లోతుగా చదవాలి. ప్రాంతీయ స్థాయిలో అమలు చేస్తున్న పథకాలు, వ్యవసాయం, ఉపాధి వంటివాటిని అధ్యయనం చేయాలి. గ్రామీణ, కుటీర పరిశ్రమలు వంటి అంశాల్లో నిర్దిష్టంగా ఒక ఉత్పత్తి కేంద్రీకృతమైన ప్రాంతాలపై దృష్టిపెట్టాలి. ఆ ఉత్పత్తులు ఆ ప్రాంతంలోనే లభ్యం కావడానికి కారణాలను విశ్లేషించాలి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆర్థిక వ్యవస్థపై అవగాహన కోసం 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలి. ఆయా కమిటీలు ఇచ్చిన సిఫార్సులు, నివేదికలను చదవాలి. ఎకానమీ అంటే గణాంకాలు, సుదీర్ఘ అంశాలు అనే ఆందోళన వీడి.. వాటిని వాస్తవ పరిస్థితులతో అన్వయించుకునే దృక్పథంతో ముందుకు సాగాలి.
- టి.కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్
పోటీ పరీక్షల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
జాగ్రఫీలో పట్టు సాధించాలంటే..
జాగ్రఫీ ప్రత్యేకంగా ఒక యూనిట్‌గా లేదా ఒక పేపర్‌గా లేనప్పటికీ.. గ్రూప్-1, 2, 3 మూడింటిలోనూ జాగ్రఫీ సంబంధిత అంశాలున్నాయి. గ్రూప్-1 పేపర్-3లో సెక్షన్-1లో అయిదో యూనిట్, సెక్షన్-3లో రెండో యూనిట్‌లోని అంశాలు జాగ్రఫీ పరిధిలోవే. ఆయా యూనిట్లకు సంబంధించి పేర్కొన్న సిలబస్ అంశాలు ప్రస్తుతం భౌగోళికంగా, పర్యావరణ పరంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నవి. జాగ్రఫీలో పట్టు సాధించాలంటే.. అట్లాస్‌పై పరిపూర్ణ అవగాహన పొందాలి. ఇది అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ భౌగోళిక అంశాల పరంగా బేసిక్ నైపుణ్యాన్ని అందిస్తుంది. ఆ తర్వాత సిలబస్‌ను పరిశీలిస్తూ అందులోని ప్రాధాన్యత జాబితానూ రూపొందించుకోవాలి. దాని ఆధారంగా తమ ప్రిపరేషన్‌ను సాగించాలి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై ప్రధానంగా దృష్టి పెట్టాలి. విపత్తు నిర్వహణ విధానం, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కార్యకలాపాలు, ఇటీవల కాలంలో జాతీయ, అంతర్జాతీయంగా అత్యంత ప్రభావం చూపిన ప్రకృతి విపత్తుల గురించి తెలుసుకోవాలి. జాగ్రఫీలోనే అభ్యర్థులు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన మరో అంశం సహజ వనరులు, అవి నిక్షిప్తమై ఉన్న ప్రాంతాలు, అందుకు కారణాలను అధ్యయనం చేయాలి. అదేవిధంగా కొన్ని పంటలు కొన్ని ప్రాంతాల్లోనే అత్యధికంగా పండుతాయి (ఉదా: ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న ఎక్కువగా పండుతుంది). ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి తీర ప్రాంతం, ఆ ప్రాంతంలో సహజ వనరులు, సహజ వనరుల వెలికితీతకు చేపట్టిన చర్యలు గురించి తెలుసుకోవడంతోపాటు ప్రస్తుత పరిస్థితిపై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీ పోస్టుల ఔత్సాహికులు ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పంటలు, ప్రాంతాలు, జనాభా, నిష్పత్తి వంటి అంశాలను తప్పనిసరిగా ఔపోసన పట్టాలి. పర్యావరణం, పర్యావరణ కాలుష్యం, కర్బన ఉద్గారాలు, నివారణ చర్యలపైనా పట్టుసాధించాలి. జాతీయ స్థాయిలో తీసుకుంటున్న చర్యలు, కార్యాచరణ ప్రణాళికలు, వాటి లక్ష్యాలు (ఉదాహరణకు నేషనల్ ఎన్విరాన్‌మెంట్ పాలసీ - లక్ష్యాలు, కార్యాచరణలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల పాత్ర) గురించి అధ్యయనం చేయాలి. అంతర్జాతీయంగా పర్యావరణ పరిరక్షణ దిశగా పలు దేశాల మధ్య ఒప్పందాలు, ఐక్యరాజ్య సమితి వేదికగా జరిగిన ఒప్పందాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. జాగ్రఫీ, ఎకాలజీలో ప్రశ్న - సమాధానం కోణంలో కాకుండా డిస్క్రిప్టివ్ పద్ధతిలో ముందుకు సాగాలి.
- గురజాల శ్రీనివాసరావు, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్
చరిత్ర.. విశాల దృక్పథం అవసరం
అభ్యర్థులు ముందుగా.. చరిత్ర అంటే రాజులు- యుద్ధాలు- ఘట్టాలు అనే పరిమితమైన దృక్పథాన్ని వీడాలి. దీనికి భిన్నంగా ఆయా రాజ వంశాల పరిపాలన, వాటి వల్ల కలిగిన ఫలితాలు, అప్పటి ప్రజల జీవన విధానాలు, శిస్తు విధానాలు, నిర్మాణాలపై విస్తృత దృక్పథంతో ముందుకు సాగాలి.అయితే గ్రూప్-1, గ్రూప్-2లలో జనరల్ స్టడీస్‌తోపాటు ప్రత్యేకంగా రెండు వేర్వేరు పేపర్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఆబ్జెక్టివ్ + సబ్జెక్టివ్ ప్రిపరేషన్ సాగించాలి. విజయనగర సామ్రాజ్యం, శాతవాహనులు, తూర్పు (వేంగీ) చాళుక్యులు, రెడ్డి రాజులు, ఇక్ష్వాక రాజ వంశాలు, ఆయా రాజుల కాలంలోని కళలు, సంసృృతి, కట్టడాల పరంగా అందించిన సేవలు, చేపట్టిన కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఉదాహరణకు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతో కృషి జరిగింది. అష్టదిగ్గజాలుగా పేరొందిన కవులు శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉండేవారు. అదే విధంగా తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడు ఆస్థానంలో నన్నయ ఉన్నాడు. ఆయన సంస్కృత భారతాన్ని తెనుగీకరించాడు. ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి ప్రధానంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాయకుల పాత్రను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. స్వాతంత్య్రోద్యమ ఘట్టంలో పత్రికలు, జన సంఘాల పాత్ర, వాటి ప్రభావం, వాటిని నడిపించిన వారి గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశం ఆంధ్ర ప్రాంతంలో యూరోపియన్ల ప్రమేయం. యూరోపియన్లు ఆంధ్ర ప్రాంతంలో చేసిన వ్యాపారాలు, అభివృద్ది చేసిన ఓడ రేవులు, ఏ రాజుల కాలంలో ఎవరు ఎక్కువ వాణిజ్యం చేశారు అనే అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. గ్రూప్-1, 2, 3 ఏదైనా ఒక టాపిక్‌ను చదివేటప్పుడు ఎప్పటికప్పుడు ముఖ్యమైన పాయింట్లను నోట్స్ రాసుకోవాలి. గ్రూప్-1 కోణంలో ఆ పాయింట్లను విశ్లేషించుకుంటూ వివరణాత్మక దృక్పథంతో చదవాలి.
- ఎం.ఎ.కరీం, సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ ప్రీవియస్‌పేపర్స్ కోసం క్లిక్ చేయండి
తాజా పరిణామాలపై..
సైన్స్ అండ్ టెక్నాలజీ సమ్మిళితంగా కీలక పాత్ర పోషిస్తున్న రంగం. కాబట్టి బేసిక్ సైన్స్ టాపిక్స్ నుంచి లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ వరకూ.. అన్నింటిపైనా పట్టు సాధించేలా ప్రిపరేషన్ సాగించాలి. బేసిక్ సైన్స్‌లో ప్రధానంగా సూత్రాలు, భావనలు, నిర్వచనాలు చదవాలి. బయలాజికల్ సెన్సైస్‌లో వ్యాధులు, కారణాలు, వైరస్‌లు, బ్యాక్టీరియాలపై దృష్టిపెట్టాలి. ఉదాహరణకు జికా వైరస్. దీనికి మూలం? ఆ వ్యాధిగ్రస్తుల్లో లక్షణాలు? నివారణోపాయాలు? ఈ దిశగా రూపొందిస్తున్న ఔషధాలు? వాటికి సంబంధించి చేసిన/చేస్తున్న ప్రయోగాల గురించి తెలుసుకుంటే లోతైన అవగాహన ఏర్పడినట్లే. ఇటీవల ప్రయోగిస్తున్న ఉపగ్రహాలు, వాటి ఉద్దేశం, లక్ష్యం తెలుసుకోవాలి. అంతేకాకుండా వాటి స్వరూపం (ఆయా ఉపగ్రహాలు వాటి పేలోడ్, అవి కక్ష్యలోకి ప్రవేశించేందుకు ప్రయాణించిన వేగం తదితర) గురించి కూడా సంపూర్ణ అవగాహన పొందాలి. ముఖ్యంగా తాజాగా ఇస్రో పలు శాటిలైట్ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేస్తోంది. వీటిని పరిగణనలోకి తీసుకోవాలి. సామాజిక, ఆర్థిక అభివృద్ధిలోనూ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి సంబంధిత అంశాలపై అవగాహన పొందాలి. ఉదాహరణకు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఆధార్ అనుసంధాన ప్రక్రియను పరిగణనలోకి తీసుకుంటే ఇది కమ్యూనికేషన్ టెక్నాలజీలో కీలకమైన అంశంగా చెప్పొచ్చు. క్షిపణుల ప్రయోగాలు, జీవవైవిధ్యం పరంగా ఆయా ప్రాంతాల ప్రాధాన్యాలు తెలుసుకోవాలి. క్షిపణుల లక్ష్యం, దేశ భద్రత పరంగా వాటి ప్రాధాన్యం గురించిన అవగాహన అవసరం. దీంతోపాటు రక్షణ రంగ విధానాలు, రక్షణ రంగానికి కేటాయించిన నిధులపై అవగాహన పొందాలి. జీవ వైవిధ్యంలో జాతీయ అభయారణ్యాలు - ప్రాంతాలు - ఆ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయడానికి కారణాలు ఇలా మల్టీ డెమైన్షన్ దృక్పథంతో చదవాలి. బయోడైవర్సిటీ పార్క్‌లు, ఒక ప్రాంతాన్ని వన్యమృగ సంరక్షణ ప్రాంతంగా గుర్తించడానికి కారణాలను తెలుసుకోవాలి. కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా.. విశ్లేషణకు, అభిప్రాయ వ్యక్తీకరణకు ప్రాధాన్యం ఇచ్చేలా ముందుకు సాగాలి.
- సి.హెచ్. హరికృష్ణ, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్.
Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్
ఒకే సమయంలో మూడు పరీక్షలకు..
పాలిటీని విశ్లేషణాత్మక దృక్పథంతో అధ్యయనం చేయడం ద్వారా అభ్యర్థులు ఒకే సమయంలో మూడు పరీక్షల (గ్రూప్-1, 2, 3 (పంచాయతీ సెక్రటరీ))కు సన్నద్ధత పొందొచ్చు. రాజ్యాంగం మొదలు తాజా రాజకీయ పరిణామాల వరకు సమ్మిళిత ప్రిపరేషన్ కొనసాగించడం లాభిస్తుంది. రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ పరిషత్-ఎన్నికలు-చైర్మన్, డ్రాఫ్ట్ కమిటీలపై తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. ఆ తర్వాత క్రమంలో రాజ్యాంగ పీఠిక-సవరణలు గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల నిర్మాణ శైలి, ప్రస్తుతం వాటి పనితీరు, అవి వివాదాస్పదం అవుతున్న సంఘటనలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆర్డినెన్స్‌లు దుర్వినియోగం అవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాత్ర గురించి అధ్యయనం చేయాలి. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న, వివాదాస్పదంగా మారుతున్న అంశాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది(ఉదాహరణకు పార్టీ ఫిరాయింపుల చట్టంనే పరిగణనలోకి తీసుకుంటే.. సభాధ్యక్షుడే నిర్ణయం తీసుకుంటున్న పరిస్థితిపై అభిప్రాయం అడిగే విధంగా ప్రశ్నలు ఎదురుకావొచ్చు). కాబట్టి పార్టీ ఫిరాయింపుల చట్టం, దాని నేపథ్యం, రాష్ట్రప్రతి, గవర్నర్‌ల పాత్ర, ఎన్నికల కమిషన్ పాత్ర.. ఇలా అన్ని కోణాల్లోనూ స్పృశించి సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో తరచుగా న్యాయ వ్యవస్థ, శాసనశాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం; ఈ రెండు వ్యవస్థల మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడటానికి కారణాలు తెలుసుకోవాలి. న్యాయవ్యవస్థ పనితీరుకు సంబంధించి కేశవానంద భారతి కేసు పూర్వాపరాలు సమీక్షించాలి. దాంతోపాటు రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు, క్రమేణా వాటి పరిధి విస్తృతమవుతున్న తీరును అధ్యయనం చేయాలి. ఉదాహరణకు నిర్బంధ విద్యా హక్కు చట్టం. వాస్తవానికి ఇది రాజ్యాంగంలో పొందుపరచని ప్రాథమిక హక్కు. తర్వాత క్రమంలో ప్రజా సంక్షేమం, సామాజిక అభివృద్ధి కోణంలో ఈ చట్టాన్ని రూపొందించారు. అదేవిధంగా సమాచార హక్కు చట్టం. పాలిటీ పరంగా అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించాల్సిన మరో అంశం స్థానిక స్వపరిపాలన సంస్థలు. వీటి ఏర్పాటు దిశగా చేసిన 73, 74 సవరణలు, వీటికి సంబంధించి బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ, అశోక్మెహతా కమిటీ సూచనలపై పట్టు సాధించాలి. గ్రామ సభల ప్రాధాన్యత, గిరిజన ప్రాంతాల్లో ప్రాజెక్ట్‌ల నిర్మాణం సమయంలో నిర్వాసితులుగా మిగులుతున్న ప్రజల స్థితిగతులు, అందుకు దారితీస్తున్న కారణాలను తెలుసుకోవాలి. ఈ క్రమంలో PESA (Panchayati Raj Extension Services Act) యాక్ట్ గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. పంచాయతీ సెక్రటరీ పోస్టుల ఔత్సాహికులు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థలు, స్వయం సహాయక సంఘాలు - వాటి పనితీరు, పూర్వాపరాలను క్షుణ్నంగా పరిశీలించాలి. రాష్ట్ర విభజనకు దారితీసిన రాజకీయ, సామాజిక కారణాలు తెలుసుకోవడమే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన, ఉద్యోగుల పంపిణీ-విభజన విషయంలో కమలనాథన్ కమిటీ సిఫార్సులు తెలుసుకోవాలి. మొత్తం మీద పాలిటీ పరంగా అభ్యర్థులు కేవలం బిట్స్ ప్రిపరేషన్‌కే పరిమితం కాకుండా.. ఆయా అంశాలకు సంబంధించి నేపథ్యం, కారణం, ప్రస్తుత పనితీరు కోణంలో విస్తృత దృక్పథంతో విశ్లేషణాత్మకంగా చదవాలి. స్క్రీనింగ్ టెస్ట్‌కు సన్నద్ధమయ్యే సమయంలోనే మెయిన్ పరీక్ష కోణంలో చదవడం మేలు. సమకాలీనంగా ప్రాధాన్యం సంతరించుకున్న రాజకీయపరమైన నిర్ణయాలుగా పేర్కొనే పథకాల (ఉదా: స్మార్ట్ సిటీ, అమృత్ సిటీ కాన్సెప్ట్స్ తదితర)పై అవగాహన పెంచుకుంటే.. పాలిటీలో పట్టు లభించడమే కాకుండా పరీక్షలోనూ మెరుగ్గా సమాధానాలు ఇచ్చే నైపుణ్యం లభిస్తుంది. చదివే ప్రతి భాగంలోని ముఖ్యమైన అంశాలను బిట్స్ రూపంలో పొందుపర్చుకుంటే గ్రూప్-1 మెయిన్స్‌తోపాటు ఆబ్జెక్టివ్ తరహాలో గ్రూప్-1 ప్రిలిమ్స్, గ్రూప్-2, గ్రూప్-3 స్క్రీనింగ్, మెయిన్ టెస్ట్‌లకు సన్నద్ధత ఏర్పడుతుంది.
- డాక్టర్.బి.జె.బి.కృపాదానం, సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ
Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!
తెలంగాణలో భర్తీ చేయనున్న గ్రూప్స్ ఉద్యోగాలు ఇవే..
➤ గ్రూప్-1 పోస్టులు: 503
➤ గ్రూప్-2 పోస్టులు : 582
➤ గ్రూప్-3 పోస్టులు: 1,373
➤ గ్రూప్-4 పోస్టులు : 9,168
ఏపీ గ్రూప్–1, 2 పోస్టుల భర్తీ ఇలా..
గ్రూప్–1లో 110, గ్రూప్–2లో 182 పోస్టులు భర్తీ చేయనున్నారు. గతంలో ప్రకటించిన జాబ్ క్యాలండర్ కంటే అధికంగా పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్ 1, 2 విభాగాల్లో 292 ఉద్యోగాలను ప్రకటించారు. ఆ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతినివ్వడంతో త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ, ఆర్టీవో, సీటీవో, మున్సిపల్ కమిషనర్లు, డీఎఫ్‌వో, ఎంపీడీవో వంటి పోస్టులు ఉండగా, గ్రూప్–2లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి.
గ్రూప్–1 పోస్టులు :
విభాగం |
పోస్టులు |
డిప్యూటీ కలెక్టర్లు |
10 |
రోడ్ ట్రాన్స్ పోర్టు ఆఫీసర్లు (ఆర్టీవో) |
07 |
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు (సీటీవో) |
12 |
జిల్లా రిజిస్ట్రార్ (స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు) |
06 |
జిల్లా గిరిజన సంక్షేమ అధికారి |
01 |
జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి |
01 |
జిల్లా బీసీ సంక్షేమ అధికారి |
03 |
డీఎస్పీ (సివిల్) |
13 |
డీఎస్పీ (జైళ్లు –పురుషులు) |
02 |
జిల్లా అగ్రిమాపక అధికారి (డీఎఫ్‌వో) |
02 |
అసిస్టెంట్ లేబర్ కమిషనర్ |
03 |
మున్సిపల్ కమిషనర్ |
01 |
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–2 |
08 |
డిప్యూటీ రిజిస్ట్రార్ (కోపరేటివ్ డిపార్ట్‌మెంట్) |
02 |
లే సెక్రటరీ అండ్ ట్రెజరర్ గ్రేడ్–2 |
05 |
ఏటీవో/ఏఏవో (ట్రెజరీస్ డిపార్ట్‌మెంట్) |
08 |
ఏఏవో (డీఎస్‌ఏ) (స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్) |
04 |
ఏవో (డైరెక్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) |
15 |
ఎంపీడీవో |
07 |
మొత్తం |
110 |
గ్రూప్–2 పోస్టులు..
విభాగం |
పోస్టులు |
డిప్యూటీ తహసీల్దార్ |
30 |
సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–2 |
16 |
అసిస్టెంట్ రిజిస్ట్రార్, కోపరేటివ్ |
15 |
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3 |
05 |
ఏఎల్‌వో (లేబర్) |
10 |
ఏఎస్‌వో (లా) |
02 |
ఏఎస్‌వో (లేజిస్లేచర్) |
04 |
ఏఎస్‌వో (సాధారణ పరిపాలన) |
50 |
జూనియర్ అసిస్టెంట్స్ (సీసీఎస్) |
05 |
సీనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ) |
10 |
జూనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ) |
20 |
సీనియర్ అడిటర్ (స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్) |
05 |
ఆడిటర్ (పే అండ్ అలవెన్స్ డిపార్ట్‌మెంట్) |
10 |
మొత్తం |
182 |