Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర అవుతున్న అభర్థులకు అన్ని అంశాలపై పట్టు ఉండాలి. ఒక్క తెలంగాణ ఉద్యమమే కాదు.. దాంతోపాటు జాతీయ, అంతర్జాతీయ అంశాలపైనా అవగాహన పెంపొందించుకోవాలి.
ముఖ్యంగా దేశంలో, రాష్ట్రంలో సాంఘిక పరిస్థితులు, సామాజిక సమస్యలు, ఇతర అంశాలపై పట్టు సాధించాలి. కొత్త రాష్ట్రంలో ఉద్యోగాలు అనగానే.. ఇప్పుడు అంతా ఒక్క తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం అంశాలపైనే చర్చిస్తున్నారు. కానీ పోటీ పరీక్షల్లో అదొక్కటే కాదు. అది ఒక భాగం మాత్రమే. మిగతా సబ్జెక్టులు ఉన్నాయి. పోటీ పరీక్షలో అన్ని సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు సిలబస్‌లోని అంశాలను ప్రణాళిక ప్రకారం విభజించుకొని, వాటికి అవసరమైన పుస్తకాలు తీసుకొని, నోట్స్ సిద్ధం చేసుకొని ముందుకు సాగాలి. ప్రస్తుతం వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అవుతున్న నేపథ్యంలో అభ్యర్థులు ఎలా సిద్ధం కావాలన్న వివిధ అంశాలపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ వైస్ చైర్మన్, టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ ఎస్.మల్లేశ్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం..
టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ ప్రీవియస్‌పేపర్స్ కోసం క్లిక్ చేయండి
స్కోరింగ్ పేపర్లు ఇలా..
గ్రూప్-1లో తెలంగాణకు సంబంధించిన విషయాలే కాదు.. స్కోరింగ్ పేపర్లు మరో ఐదు ఉన్నాయి. అన్నింటికీ సమాన విభజనతో మార్కులున్నాయి. తెలంగాణపై 150 మార్కుల పేపరు ఉంది. మిగతా 5 పేపర్లలో ఒక్కో దానికి 150 మార్కులు ఉంటాయి. తెలంగాణకు సంబంధించిన అన్ని కోణాల్లో అవగాహన ఉంటే సరిపోతుంది. మొన్నటి ఏఈఈ జనరల్ స్టడీస్ పేపరు చూస్తే తెలిసిపోతుంది. సకల జనుల సమ్మె ఎప్పుడు జరిగింది? దాంతో సంబంధం ఉన్న అన్ని అంశాలపై అవగాహన తెచ్చుకోవాలి. ఇక గ్రూప్-1లోని ఆరు పేపర్లలో జనరల్ ఎస్సే కూడా ఒకటి. అందులో పూర్తిగా తెలంగాణకు సంబంధించినవే ఉండవు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర అంశాలు ఉంటాయి. ఇతర పోటీ పరీక్షల జనరల్ స్టడీస్‌లోనూ అన్ని అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
నోట్స్ తయారు చేసుకొవాలి..
సమకాలీన సామాజిక అంశాలు, సాంఘిక సమస్యలపై గ్రూప్-1లో ప్రత్యేకంగా పేపరు ఉంది. దీనికి సంబంధించి పుస్తకం ఎవరు రాసినా, అందులోని అంశాలను తీసుకొని పాయింట్ల వారీగా నోట్స్ తయారు చేసుకొని చదవాలి. అన్ని సబ్జెక్టుల్లోనూ అలాగే చేయాలి. ఉదాహరణకు సెక్యులరిజం తీసుకుంటే.. సెక్యులరిజం అంటే ఏంటి? ఆ పదం ఎక్కడ్నుంచి వచ్చింది, దానిపై చర్చ ఎందుకు వచ్చింది? రాజ్యాంగపరంగా సెక్యులర్ స్టేట్‌గా తీసుకురావడానికి కారణాలు ఏంటి? సెక్యులర్ స్టేట్‌కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అనేది పాయింట్ల వారీగా అంశాలపై జవాబులు రాసుకోవాలి. దానివల్ల ప్రత్యేకంగా డిస్క్రిప్టివ్‌కు, ఆబ్జెక్టివ్‌కు వేర్వేరుగా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. రెండింటికి ఉపయోగపడతాయి. ఈ పద్ధతిలో సిద్ధమైతే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 అన్నింటికీ ఉపయోగంగా ఉంటుంది.
ఈ అంశాలపై సంపూర్ణ అవగాహన తెచ్చుకోవాలి..
సోషల్ ఇష్యూస్ తీసుకుంటే మతాలు, సామాజిక వర్గాలు, గిరిజన సమస్యలు, ప్రాంతీయ సమస్యలు ఉన్నాయి. వాటిపై చాలా పుస్తకాలు ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా గతంలో జరిగిన విషయాలు, ప్రస్తుత సమస్యలు తీసుకోవాలి. వాటన్నింటిపై అవగాహన పెంపొందించుకోవాలి. కులం అనగానే.. ఎన్ని కులాలు ఉన్నాయని కాదు.. వాటి పుట్టుక, పెరుగుదల, కులం చుట్టూ ఉన్న రాజకీయ సమస్యలు, కులంతో మత సంబంధాలు, కులం అంటరానితనం, కులం సామాజిక సమస్య, మహిళలపై హింస వంటి అంశాలపై సంపూర్ణ అవగాహన తెచ్చుకోవాలి.
జాతీయ అంశాలపై..
జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సామాజిక సమస్యలు, వాటిపై ప్రభుత్వాలు చేసిన విధానాలపై కచ్చితంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ విధానాలపై ప్రభుత్వ డాక్యుమెంట్లు ఉన్నాయి. వీటిపై కచ్చితంగా అవగాహన పెంపొందించుకోవాలి. ఇందులో మహిళా సాధికారత వంటివి ముఖ్యమైనవి. మహిళల సాధికారత కోసం జాతీయస్థాయిలో రకరకాల పథకాలు తెచ్చారు. మైనారిటీ, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమం కోసం విధానాలు తెచ్చారు. పర్యావరణం తీసుకుంటే జాతీయ స్థాయిలో ఇందుకు ప్రత్యేక శాఖనే ఉంది. పాలసీల్లో వస్తున్న మార్పులను తెలుసుకోవాలి. ఉదాహరణకు జాతీయ స్థాయిలో రాజీవ్ గాంధీ హయాంలో నూతన విద్యావిధానం తీసుకువచ్చారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఈ పరిస్థితుల్లో గతంలో వచ్చిన నూతన విద్యా విధానం లక్ష్యాలు ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? ఫలితాలు ఏంటి? వైఫల్యాలు ఏంటి? అనేది తెలిసి ఉండాలి. ఇక ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న నూతన విద్యా విధానం ఉద్దేశం ఏంటి? అందులో ప్రధానాంశాలు ఏంటి? దాని లక్ష్యాలు ఏంటి? అన్నది తెలిసి ఉండాలి.
ప్రధాన అంశాలైన నీళ్లు.. నిధులు.. నియామకాలపై..
కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ప్రభుత్వం తీసుకువస్తున్న విధానాలపై కచ్చితంగా అవగాహన ఉండాలి. పోటీ పరీక్షల్లో వీటిపై ప్రశ్నించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాలసీ అనగానే తెలంగాణ ఉద్యమం డిమాండ్లు ఏంటి? ఎందుకు తెలంగాణను కోరుకున్నారు? డిమాండ్లలో ప్రధాన అంశాలైన నీళ్లు.. నిధులు.. నియామకాలు.. వంటి అంశాలపై ఎలాంటి విధానాలు తెచ్చారన్నది తెలుసుకోవాలి. తెలంగాణ పాలసీపై అవగాహన ఉండాలంటే ఉద్యమ సమయంలో చేసిన డిమాండ్లు ఏంటి? ప్రస్తుతం వాటిపై ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాలు ఏంటన్నది తెలుసుకోవాలి. డిస్క్రిప్టివ్‌లో రాసేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అభ్యర్థి తాను ఏం అనుకుంటున్నాడో రాయొద్దు. పాలసీల్లో ఏముందన్నది మాత్రమే రాయాలి. ఇక మహిళా సాధికారత విషయానికి వస్తే రాష్ట్రంలో దాదాపు అన్ని పథకాలు మహిళల కేంద్రంగానే తెచ్చారు. వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, గిరిజనులకు సంబంధించిన విధానాలపై ఏ పథకాలు తెచ్చారో తెలుసుకోవాలి. పర్యావరణంపై తెలంగాణకు హరితహారం పాలసీ తెచ్చారు. ఇక రాష్ట్రంలో ఉన్నత విద్యలో పాలసీలు చూస్తే ఇంటర్మీడియెట్‌ను ఉచిత విద్యగా మార్చారు. ప్రభుత్వ కాలేజీల్లో చేరే విద్యార్థి నుంచి పైసా వసూలు చేయడానికి వీల్లేదు. ఇదీ పాలసీలో భాగమే. అంతేకాదు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా పాలసీలో భాగమే. ఇలాంటి అంశాలన్నింటిపై అవగాహన తెచ్చుకోవాలి.
పోటీ పరీక్షల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
ఇలాంటి స్టాండర్డ్ పుస్తకాలను..
ఇంగ్లిషులో ఉందని ఆందోళన పడొద్దు. మొదట ఇంగ్లిషులో ఉన్నా చదవాలి. విషయం అర్థం అవుతుంది. ఆ తర్వాత తెలుగులో అంశాలను చూసుకున్నప్పుడు తేడాలు అర్థమైపోతాయి. మొండిగా నాకు ఇంగ్లిషు అర్థం కాదని అనుకోవద్దు. ఇలాంటి స్టాండర్డ్ పుస్తకాలు కచ్చితంగా చదవాలి. యూనివర్సిటీలు, యూనివర్సిటీల ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్లు రాసినవి, ప్రచురించినవి చదవాలి. వారిని అడిగినా గైడ్ చేస్తారు. విషయాలపై అవగాహన ఉంటే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 వేరుగా సిద్ధం కావాల్సిన అవసరం లేదు. గ్రూప్-1 స్థాయిలో ప్రిపేర్ అయితే గ్రూప్-2, గ్రూప్-3లో విజయం సాధించడం సులభం అవుతుంది. అన్ని పేపర్లకు సమాన సమయం కేటాయించి, నోట్స్ సిద్ధం చేసుకొని చదవాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు వివిధ కోణాల్లో చూడాలి. ఒక అంశాన్ని తీసుకుంటే అది ఎందుకు వచ్చింది. దాని ప్రభావం ఏంటి? దానివల్ల ఏయే మార్పులు వస్తాయన్న కోణంలో అవగాహన తెచ్చుకోవాలి. అప్పుడే గ్రూప్-1 వంటి పరీక్షలో డిస్క్రిప్టివ్‌లో సమాధానం రాయగలుగుతారు. గ్రూప్-2, గ్రూప్-3లో ఆబ్జెక్టివ్‌లోనూ రాయగలుగుతారు. గ్రూప్-2 పరీక్షకు సిద్ధం కావడంలో ఇంకా ఆబ్జెక్టివ్ విధానంలోనే చదవాలన్న ఆలోచనల్లో ఉన్నారు. విషయాలను అవగాహన చేసుకోవడమే ముఖ్యం. సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా గురించి అడిగితే వాటిపై బిట్స్ బ్యాంకులను చదవద్దు. మొత్తంగా చదివితే ఏ కోణంలో ప్రశ్న అడిగినా జవాబు రాయగలుగుతారు. గ్రూప్-3లోనూ అంతే.
గ్రూప్స్ పరీక్షల్లో నెగ్గాలంటే..ఇవి తప్పక చదవాల్సిందే..
ఈ పుస్తకాల జోలికి అసలు వెళ్లవద్దు..
తెలంగాణ విద్యార్థులు ఒక రకమైన భయాందోళనలో ఉన్నారు. సిలబస్‌లో ఏమైన మార్పులు జరిగే అవకాశం ఉందని..! ముందుగా గందరగోళం నుంచి బయటకు రండి. ప్రశాంతతతో కూడిన మనస్సు ఉంటే తప్ప బాగా చదువుకోలేరు. సిలబస్‌లో మార్పులు కొద్ది మాత్రమే ఉండోచ్చు..!తెలంగాణకు సంబంధించిన అంశాలు మినహా జాతీయ, అంతర్జాతీయ అంశాలు ఇది వరకు ఉన్నట్లుగానే ఉంటాయి. కాబట్టి ఆందోళన అక్కర్లేదు. కేవలం పరీక్షల కోసం మార్కెట్‌లోకి వేల పుస్తకాలు వచ్చాయి. పుస్తకాలు తీసుకునేప్పుడు జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఆబ్జెక్టివ్ టైప్ పుస్తకాలకు వెళ్లవద్దు. 90 శాతం షూర్ అంటూ అమ్ముతుంటాయి. వాటి జోలికి వెళ్లవద్దు. వాటిల్లో నాలుగు రకాల ప్రమాదం ఉంటుంది. ప్రశ్న ఇవ్వడమే తప్పుగా ఉండొచ్చు. జవాబులు తప్పుగా ఉండొచ్చు. ప్రశ్నకు ఇచ్చిన జవాబుల్లో రెండూ ఉండొచ్చు. లేదా జవాబు ఉండకపోవచ్చు. అలాంటి వాటి జోలికి వెళ్లవద్దు. యూనివర్సిటీలు ప్రచురించినవో, ప్రొఫెసర్లు రాసినవో, తెలుగు అకాడమీ ముద్రించినవో తీసుకొని చదువుకోవాలి. ప్రణాళికే ప్రధానం. అది సరిగ్గా ఉంటే పరీక్షకు 50 శాతం సిద్ధం అయిపోయినట్లే.
ఇలాంటి కోచింగ్ సెంటర్లను నమ్మొదు..:
గ్రూప్-2కు ఆబ్జెక్టివ్‌లో చదువుకుంటే నష్టపోతారు. విషయంపై సంపూర్ణ అవగాహన లేకపోతే ఆబ్జెక్టివ్‌లో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేరు. కోచింగ్ కేంద్రాలు చెబుతున్నట్లుగా కాకుండా సొంతంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని చదువుకోవాలి. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలి. అప్పుడే సబ్జెక్టుపై అవగాహన పెరుగుతుంది. ఏ పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నా ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ కచ్చితంగా చదవాలి.
గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థులు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు..:
➤ పిన్సిపుల్స్ ఆఫ్ సోషియాలజీ- సీఎన్ శంకర్‌రావు
➤ ఇంట్రడక్టరీ సోషియాలజీ- ఎన్. జయరామ్
➤ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్- ఎం.ఎన్. శ్రీనివాసన్
➤ ఇండియన్ సొసైటీ- ఎస్‌సీ దూబే
➤ ఇన్‌ఈక్వాలిటీ అండ్ ఇట్స్ పర్సెప్షియేషన్- విక్టర్ ఎస్ డిసౌజా
➤ ఇండియన్ సోషల్ చేంజెస్- యోగిందర్‌సింగ్
➤ ఎకనామిక్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్- ఎస్‌కే మిశ్రా, వీకే పురి
➤ రూరల్ సోషియాలజీ- ఏఆర్ దేశాయ్
➤ సోషల్ మూవ్‌మెంట్స్ ఇన్ ఇండియా- ఘన్‌శ్యామ్
➤ పాలిటిక్స్ ఇన్ ఇండియా- రజని కొఠారీ
➤ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్- కే ఆర్ ఆచార్య
➤ పొలిటికల్ ఐడియాస్ ఇన్ యాన్షియెంట్ ఇండియా- ఆర్‌ఎస్ శర్మ
➤ తెలంగాణ విమోచనోద్యమం, సాహిత్యం- డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ
➤ తెలుగు అకాడమీ పుస్తకాలు
➤ డిగ్రీ పుస్తకాలు
తెలంగాణలో భర్తీ చేయనున్న గ్రూప్స్ ఉద్యోగాలు ఇవే..
➤ గ్రూప్-1 పోస్టులు: 503
➤ గ్రూప్-2 పోస్టులు : 582
➤ గ్రూప్-3 పోస్టులు: 1,373
➤ గ్రూప్-4 పోస్టులు : 9,168
టీఎస్‌పీఎస్సీ ద్వారా గ్రూప్ –1 పోస్టులు :
➤జిల్లా బీసీ అభివద్ధి అధికారి–2
➤అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్–40
➤అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్–38
➤ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(వైద్యారోగ్యశాఖ)–20
➤ డీఎస్పీ– 91
➤ జైల్స్ డిప్యూటీ సూపరిండెంట్–2
➤ బఅసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్–8
➤డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్–2
➤జిల్లా మైనారీటీ వెల్ఫేర్ ఆఫీసర్–6
➤మునిసిపల్ కమిషనర్ గ్రేడ్–2(35)
➤ఎంపీడీవో(121)
➤డీపీవో(5)
➤కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్(48)
➤డిప్యూటీ కలెక్టర్(42)
➤అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్(26)
➤జిల్లా రిజిస్ట్రార్(5)
➤జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్(3)
➤ఆర్టీవో(4)
➤ జిల్లా గిరిజన సంక్షేమాధికారి(2)
మొత్తం: 503
Telangana: భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్కడి నుంచి చదవాల్సిందే..