TSPSC Group 1 Preparation Tips: వంద రోజుల్లో.. ప్రిలిమ్స్ నెగ్గేలా!

టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1–(2022) తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెలువడిన తొలి నోటిఫికేషన్! రాష్ట్ర స్థాయిలో ఉన్నత కొలువులకు మార్గం వేసే పరీక్ష గ్రూప్–1. మూడు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. గ్రాడ్యుయేట్ల నుంచి పీహెచ్‌డీ స్కాలర్స్ వరకు ఎంతో మంది ప్రతిభావంతులు పోటీ పడుతున్న పరిస్థితి! తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ).. గ్రూప్–1 నియమాక ప్రక్రియలో తొలి దశగా పిలిచే.. ప్రిలిమినరీ పరీక్ష తేదీలను తాజాగా ప్రకటించింది. 503 పోస్ట్‌ల కోసం లక్షల మంది పోటీ పడుతున్న గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో విజయం సాధించడం అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో.. ప్రిలిమ్స్‌లో గట్టెక్కేందుకు వంద రోజుల ప్రిపరేషన్ ప్రణాళిక...
- అక్టోబర్ 16న టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1 ప్రిలిమ్స్
- అభ్యర్థులకు సదవకాశంగా అందివచ్చిన సమయం
- నిర్దిష్ట ప్రణాళికతో ప్రిలిమ్స్‌లో విజయం పక్కా
- 503: టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1 పోస్ట్‌ల సంఖ్య
- 3,80,202: గ్రూప్–1కు వచ్చిన దరఖాస్తుల సంఖ్య
- 756: సగటున ఒక్కో పోస్ట్‌కు పోటీ పడే అభ్యర్థుల సంఖ్య
- 25,150: ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్య.
- గ్రూప్–1కు నెలకొన్న పోటీకి.. అదే విధంగా ప్రిలిమ్స్‌కు ఉన్న ప్రాధాన్యాన్ని తెలిపే వివరాలివి. అయితే.. ఈ దరఖాస్తుల సంఖ్యను, పోటీని చూసి అభ్యర్థులు ఆందోళన చెందక్కర్లేదని.. ప్రిలిమ్స్‌లో ఆయా అంశాలపై పట్టు సాధిస్తే.. మెయిన్స్‌కు ఎంపికయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు
డిగ్రీ నుంచి పీహెచ్‌డీ వరకు
- గ్రూప్–1 కనీస అర్హతగా పేర్కొన్న బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు మొదలు పీహెచ్‌డీ స్కాలర్స్ వరకు పోటీ పడుతున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో గ్రాడ్యుయేట్లు 2,53,490 మంది, పోస్ట్ గ్రాడ్యుయేట్లు 1,22,826 మంది, ఇంటిగ్రేటెడ్(డిగ్రీ+పీజీ) పీజీ ఉత్తీర్ణులు 1,781 మంది, ఎంఫిల్ ఉత్తీర్ణులు 424 మంది, పీహెచ్‌డీ ఉత్తీర్ణులు 1,681 మంది ఉన్నారు.
- దరఖాస్తుల సంఖ్యను, పోటీని చూసి ఆందోళన చెందకుండా.. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందుకు కదలాలని నిపుణులు సూచిస్తున్నారు.
సమయ పాలన.. ఎంతో కీలకం
గ్రూప్–1 ప్రిపరేషన్ లో అభ్యర్థులు సమయ పాలనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమ్స్ పరీక్ష తేదీ అక్టోబర్ 16. అంటే.. ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్న సమయం మూడున్నర నెలలు. ప్రిపరేషన్ చివరి దశలో రివిజన్ కోసం ఒక వారం రోజులు మినహాయిస్తే.. అభ్యర్థులు ఇప్పటి నుంచి నికరంగా వంద రోజులు ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌కు కేటాయించుకోవచ్చు.
చదవండి: Group 1 Preliminary Exam: 60 డేస్ ప్రిలిమ్స్ ప్లాన్.. సిలబస్, సబ్జెక్ట్ అంశాలు..
ప్రతి సబ్జెక్ట్ చదివేలా
అభ్యర్థులు వంద రోజుల ప్రిపరేషన్ ప్రణాళికలో భాగంగా ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్ చదివేలా సమయ పాలన పాటించాలి. ప్రిలిమినరీ పరీక్ష సిలబస్‌లో మొత్తం 12 అంశాలను పేర్కొన్నారు. వీటిలో కొన్ని ఉమ్మడిగా అనుసంధానం చేసుకుంటూ చదివే టాపిక్స్ కూడా ఉన్నాయి. (ఉదా: కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్; భారత రాజ్యాంగం విధానం, పరిపాలన తదితర). వీటన్నింటిని బేరీజు వేసుకుంటే..అభ్యర్థులు ప్రతి రోజు సగటున 8 నుంచి 10 గంటల సమయం ప్రిపరేషన్‌కు కేటాయించేలా టైమ్ టేబుల్ రూపొందించుకోవాలి.

తొలి అడుగులు ఇలా
కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభించే అభ్యర్థులు.. తొలుత సిలబస్‌ను ఆకళింపు చేసుకోవాలి. ప్రిలిమినరీ పరీక్షకు నిర్దేశించిన సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. దాని ఆధారంగా చదవాల్సిన ముఖ్యమైన టాపిక్స్ స్పష్టత ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత అభ్యర్థులు తమకున్న సామర్థ్యం, ఆయా అంశాలపై అప్పటికే ఉన్న నైపుణ్యం ఆధారంగా.. ప్రిపరేషన్ సమయంలో ఏ అంశానికి ఎంత సమయం కేటాయించుకోవాలో నిర్ణయించుకోవాలి. అదే విధంగా టీఎస్‌పీఎస్సీ ఇటీవల కాలంలో నిర్వహించిన ఇతర నియామక పరీక్షల జనరల్ స్టడీస్ పేపర్లను పరిశీలించడం కూడా మేలు చేస్తుంది. దీనివల్ల పరీక్షలో ప్రశ్నలు అడిగే తీరుతోపాటు ముఖ్యమైన అంశాలను గుర్తించవచ్చు. అన్ని పరీక్షలకు సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్‌లో సిలబస్ ఒకే మాదిరిగా ఉంటుంది.
చదవండి: Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!
జాతీయం నుంచి స్థానిక అంశాల వరకు
అభ్యర్థులు ప్రిపరేషన్‌లో భాగంగా జాతీయ పరిణామాలు మొదలు స్థానిక అంశాల వరకూ.. అన్నింటిపైనా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రాధాన్య పరిణామాలను అవపోసన పట్టాలి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆవిర్భావ దశ, మలి ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా తెలంగాణ చరిత్రలో తెలంగాణ సామాజిక ముఖ చిత్రాన్ని తెలియజేసే అన్ని అంశాలను చదవాలి. సాహిత్యం, కళలు, కవులు, సంస్థానాలు, భౌగోళిక స్వరూపం, వనరులు, ప్రభుత్వ పథకాలు, తెలంగాణ ఏర్పాటు తర్వాత అమలు చేస్తున్న కొత్త పథకాలు.. ఇలా.. అన్ని అంశాలను చదవాలి.
నోట్స్‌లో ముఖ్యాంశాలు
ఆయా విభాగాలను చదువుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలను పాయింట్ల వారీగా నోట్స్ తయారు చేసుకొని చదవాలి. అన్ని సబ్జెక్టుల్లోనూ అలాగే చేయాలి. ఇలా చదువుతూ అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. మతాలు, సామాజిక వర్గాలు, గిరిజన సమస్యలు, ప్రాంతీయ సమస్యలు వంటి స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా ఒక అంశాన్ని చదివేటప్పుడు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ఉదాహరణకు సామాజిక వర్గాలనే పరిగణనలోకి తీసుకుంటే.. ఆ వర్గాల నిర్వచనానికే పరిమితం కాకుండా.. వాటి ఆవిర్భావ చరిత్ర, విస్తరణ, తాజా పరిస్థితులు.. ఇలా అన్నిటినీ చదవాలి. అప్పుడే ఒక అంశంపై సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది.
చదవండి: Geography Notes for Group 1, 2: రాణిగంజ్.. దేశంలోని అతిపెద్ద బొగ్గు క్షేత్రం
జాతీయ పరిణామాలు
జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో.. సామాజిక సమస్యలు, ప్రభుత్వ విధానాలపై కచ్చితంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ విధానాలపై అధికారిక సమాచారం ఆధారంగా అవగాహన పెంపొందించుకోవాలి. ఇందులో మహిళా సాధికారత వంటివి ముఖ్యమైనవి. మహిళల సాధికారత కోసం జాతీయస్థాయిలో రకరకాల పథకాలు తెచ్చారు. మైనారిటీ, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమం కోసం కొత్త విధానాలు ప్రవేశ పెట్టారు. అదే విధంగా పలు నూతన పాలసీలు రూపొందుతున్నాయి. వాటి గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలి. ఉదాహరణకు నూతన విద్యా విధానాన్నే పరిగణనలోకి తీసుకుంటే..నూతన విద్యా విధానం ముఖ్యాంశాలతోపాటు ఇప్పటి వరకు తీసుకొచ్చిన విద్యా విధానాలు, ప్రస్తుత విధానానికి వాటికి మధ్య ఉన్న వ్యత్యాసం, ఉద్దేశం, ప్రధానాంశాలు, లక్ష్యాలు.. ఇలా అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి.

తెలంగాణపై పత్యేక దృష్టి
తెలంగాణ ప్రత్యేక ప్రాధాన్యం ఉన్న అంశాల విషయంలో... పరీక్షలో కొన్ని ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా తెలంగాణ పాలసీలపై అవగాహన పెంచుకోవాలి. తెలంగాణ ఏర్పాటు, దానికి సంబంధించి ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్న నీళ్లు.. నిధులు.. నియామకాలు.. వంటి వాటిపై ఎలాంటి విధానాలు తెచ్చారో తెలుసుకోవాలి. అదే విధంగా రాష్ట్రంలో ఆయా వర్గాల కోసం అమలు చేస్తున్న నూతన విధానాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, గిరిజనులకు సంబంధించిన విధానాలపై ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారో తెలుసుకోవాలి.
చదవండి: Books for Groups Preparation: కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..
విభిన్న కోణాల్లో అధ్యయనం
అభ్యర్థులు ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి. ముఖ్యంగా డిస్క్రిప్టివ్ విధానంలో చదివితే సదరు అంశానికి సంబంధించి అన్ని విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. ఉదాహరణకు సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా గురించి అడిగితే.. వాటిపై బిట్ బ్యాంకులకు పరిమితం కాకుండా.. డిస్క్రిప్టివ్ విధానంలో చదవాలి. ఫలితంగా ఏ కోణంలో ప్రశ్న అడిగినా జవాబు గుర్తించగలుగుతారు. ఇది భవిష్యత్తులో మలి దశలో వ్యాసరూప విధానంలో ఉండే మెయిన్ పరీక్షకు కూడా ఉపయుక్తంగా నిలుస్తుంది.
పుస్తకాల ఎంపిక.. అప్రమత్తంగా
గ్రూప్ 1 అభ్యర్థులు పుస్తకాల ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పోటీ, క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పలు పబ్లికేషన్స్ పుస్తకాలను ప్రచురిస్తున్నాయి. దీంతో వేటిని ఎంపిక చేసుకోవాలో తెలియక అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. అయితే అభ్యర్థులు యూనివర్సిటీల ప్రచురణలు, ఆయా విభాగాల్లో నిష్ణాతులైన ప్రొఫెసర్లు రాసిన పుస్తకాలు, తెలుగు అకాడమీ ప్రచురణలు చదవడాని ప్రాధాన్యం ఇవ్వాలి.
చదవండి: Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!
క్షుణ్నంగా చదివేలా
ఆయా పుస్తకాలు ఎంపిక చేసుకున్న అభ్యర్థులు.. వాటిని క్షుణ్నంగా చదవాలి. ఒక టాపిక్‌కు సంబంధించి నిర్వచనం మొదలు తాజా పరిణామాలకు వరకూ.. సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి. అభ్యర్థులు పరీక్షలో విజయం కోసం నిర్ణయాత్మక సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యం పెంచుకోవాలి. దీనివల్ల ఆబ్జెక్టివ్‌తోపాటు డిస్క్రిప్టివ్ విధానంపైనా పట్టు లభిస్తుంది. అదే విధంగా నిర్దిష్టంగా ఆయా టాపిక్స్‌ను వాస్తవ పరిస్థితుల్లో అన్వయిస్తూ చదవాలి. ఫలితంగా ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది.

మెయిన్స్‌కు కూడా సిద్దమవ్వొచ్చా
గ్రూప్స్ అభ్యర్థుల్లో చాలా మందిలో నెలకొనే సందేహం.. ప్రిలిమ్స్‌తోపాటు మెయిన్స్‌కు కూడా చదవొచ్చా? అనేది. ప్రస్తుత సిలబస్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ అవకాశం ఉందనే చెప్పాలి. మెయిన్స్ డిస్క్రిప్టివ్ విధానంలో, ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు మెయిన్స్, ప్రిలిమ్స్ అంశాల సిలబస్‌ను బేరీజు వేసుకుని.. వ్యాసరూప విధానంలో చదివే నేర్పు సొంతం చేసుకోవాలి. ఫలితంగా ఒకే సమయంలో రెండింటికీ సన్నద్ధత లభిస్తుంది.
ప్రస్తుత సమయంలో ఇలా
- అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్, మెయిన్ సిలబస్‌ను పరిశీలించాలి.
- ఆయా అంశాలపై ఉన్న అవగాహన స్థాయి, నైపుణ్యం ఆధారంగా సమయ పాలన రూపొందించుకోవాలి.
- ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్ చదివేలా ప్లాన్ చేసుకోవాలి.
- ప్రతి రోజు కనీసం 8 నుంచి 10 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
- ప్రిలిమ్స్, మెయిన్స్ కలిపి ఉమ్మడి అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.
- ప్రిలిమ్స్ పరీక్ష తేదీకి నెల రోజుల ముందు నుంచి పూర్తిగా ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌కే సమయం కేటాయించాలి.
- ఈ సమయంలో మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లు వంటి వాటికి హాజరై.. వ్యక్తిగత సామర్థ్యాన్ని తెలుసుకోవాలి.
- పరీక్షకు వారం రోజుల ముందు రెడీ రెకనర్స్, తాము రాసుకున్న షార్ట్ నోట్స్ ఆధారంగా పూర్తిగా రివిజన్‌కే కేటాయించాలి.
- ఇలా.. ప్రతి దశలోనూ సమయ పాలనకు ప్రాధాన్యమిస్తూ.. నిర్దిష్ట ప్రణాళికతో చదివితే మలి దశ మెయిన్స్‌కు అర్హత సాధించొచ్చు.
చదవండి: Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్