Books for Groups Preparation: కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..
గ్రూప్–1, 2 సర్వీసులు.. తెలుగు రాష్ట్రాల్లో.. ప్రభుత్వ కొలువుల్లో అత్యంత క్రేజ్ నెలకొన్న సర్వీసులు! వీటిని దక్కించుకోవాలని.. సర్వీస్‌లు చేజిక్కించుకోవాలని.. లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు! ఇందుకోసం.. కోచింగ్ సెంటర్లు, ఇతర మెంటారింగ్ విధానాల్లో.. సన్నద్ధత పొందుతున్నారు. కాని ఇప్పటికే ఉద్యోగంలో స్థిరపడి.. వివిధ వృత్తుల్లో కొనసాగుతున్నవారు సమయాభావం, ఇతర కారణాల వల్ల కోచింగ్ తీసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో..కోచింగ్ తీసుకునే వారితో పోల్చుకొని తాము రాణించలేమనే ఆందోళన మొదలైంది! సరైన ప్రణాళికతో వ్యవహరిస్తే.. శిక్షణ తీసుకోకున్నా.. గ్రూప్స్ గెలుపు బాటలో పయనించే అవకాశం ఉందంటున్నారు గత విజేతలు, సబ్జెక్ట్ నిపుణులు. తాజాగా తెలంగాణలో గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదలైంది. త్వరలో గ్రూప్–2 నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. ఏపీలోనూ గ్రూప్–1, 2 నోటిఫికేషన్ల దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. శిక్షణ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం...
- పోటీ పడుతున్న లక్షల మంది అభ్యర్థులు
- ఫ్రెషర్స్, ఉద్యోగులు కూడా పోటీ పడే పోస్ట్‌లు
- కోచింగ్ తీసుకోకుండా సన్నద్ధతపై సందిగ్ధత
- సరైన ప్రణాళిక అనుసరిస్తే.. సాధ్యమే అనే అభిప్రాయాలు
‘గ్రూప్1, 2లకు కోచింగ్ తీసుకోవాలా? వద్దా? అనేది అభ్యర్థుల వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి కోచింగ్ అనేది అభ్యర్థులను మార్గనిర్దేశం చేసే సాధనం. గెలుపు పయనంలో తమ అడుగులు తడబడకుండా ముందుకు సాగేందుకు కొంత తోడ్పడుతుంది. అంతమాత్రానా కోచింగ్‌తోనే విజయం సాధ్యం అనే అపోహ వీడాలి. కోచింగ్ తీసుకోలేని అభ్యర్థులు కూడా సరైన ప్రణాళిక, వ్యూహాలతో విజయ బావుటా ఎగుర వేయొచ్చు’ అనే అభిప్రాయం నిపుణల నుంచి వ్యక్తమవుతోంది.
సిలబస్‌పై అవగాహన
గ్రూప్–1, 2లను శిక్షణ లేకుండా, స్వీయ అభ్యసనంతో సన్నద్ధత పొందాలని భావించే అభ్యర్థులు ముందుగా.. సదరు పరీక్షల విధానం, సిలబస్, ఎంపిక ప్రక్రియ వంటి వాటిపై సమగ్ర అవగాహన ఏర్పరచుకోవాలి. ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ రెండూ కూడా గ్రూప్–1, 2లకు సంబంధించి సిలబస్‌ను, పరీక్ష విధానాన్ని అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చాయి. వీటిని లోతుగా అధ్యయనం చేసి.. పరీక్ష విధానం, సిలబస్‌పై అవగాహన పెంచుకోవాలి. తమ లక్ష్యానికి అనుగుణంగా.. తాము పోటీ పడదలుచుకున్న సర్వీసులకు సంబంధించి పేర్కొన్న నిర్దేశిత సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించాలి. దాని ఆధారంగా తాము సన్నద్ధత పొందాల్సిన అంశాలపై ఒక అంచనాకు రావాలి.
చదవండి: TSPSC Groups Success Tips: కోచింగ్‌కు వెళ్లడం శుద్ధ దండగ.. ఇలా చదివితే నెలలో ‘గ్రూప్స్’ కొట్టొచ్చు..
రెండు సర్వీసులు.. సారూప్యతలు
- గ్రూప్ 1, 2లు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో నిర్వహించే పరీక్షలు. కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులు రెండు సర్వీసులకు పోటీపడాలనే ఉద్దేశంతో ఉంటారు. ఇలాంటి అభ్యర్థులు ఈ రెండు సర్వీసులకు సంబంధించి పేర్కొన్న సిలబస్ అంశాల సారూప్యతలను పరిశీలించాలి.
- ప్రస్తుతం గ్రూప్–1, 2 సిలబస్‌లను పరిశీలిస్తే.. అధిక శాతం అంశాలు రెండింటిలోనూ ఉమ్మడిగా ఉంటున్నాయి.
- హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ..ఇలా అన్ని సబ్జెక్ట్‌లోనూ ఒకే విధమైన అంశాలు రెండు పరీక్షల్లోనూ ఉంటున్నాయి.
- అభ్యర్థులు రెండు పరీక్షల సిలబస్‌లను పరిశీలించి..సారూప్యత ఉన్న అంశాలు, ఆయా పరీక్షలకు ప్రత్యేకంగా పేర్కొన్న టాపిక్‌లను గుర్తించి.. వాటిని జాబితా రూపంలో పొందుపర్చుకోవాలి.
- ఈ జాబితా ఆధారంగా.. ప్రత్యేకంగా చదవాల్సిన అంశాల విషయంలో.. ప్రత్యేక సమయ పాలన పాటించే విధంగా వ్యవహరించాలి.
స్వీయ సామర్థ్య అంచనా
పరీక్ష శైలి, సిలబస్‌లపై స్పష్టత ఏర్పరచుకున్నాక.. స్వీయ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. అంటే.. సిలబస్‌లోని అంశాలపై ప్రస్తుతం తమకున్న అవగాహన స్థాయి.. ఇంకా మెరుగుపరచుకోవాల్సిన తీరుపైనా స్పష్టత తెచ్చుకోవాలి. అదే విధంగా ఆయా సబ్జెక్ట్‌లను చదివేందుకు తమ సామర్థ్యం ఆధారంగా ఏ సబ్జెక్ట్‌కు ఎంత సమయం కేటాయించాలి.. ఏ సబ్జెక్ట్‌కు ప్రిపరేషన్ సమయంలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.. అనే అంశాలపై ముందుగానే ఒక అంచనాకు రావాలి. దాని ఆధారంగా ప్రిపరేషన్‌కు సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి.
అకడమిక్స్ నుంచి కాంపిటీటివ్ దిశగా
గ్రూప్స్ అభ్యర్థులకు, ముఖ్యంగా శిక్షణ లేకుండా సన్నద్ధమయ్యే వారికి ఎదురయ్యే ప్రధాన సమస్య ఏ పుస్తకాలు చదవాలి? అనేది. వారు ముందుగా ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి అకడమిక్ పుస్తకాలతో తమ అభ్యసనాన్ని ప్రారంభించాలి. ఆ తర్వాత ఆయా పోటీ పరీక్షలకు ఉద్దేశించిన మెటీరియల్‌వైపు దృష్టిపెట్టాలి. అకడమిక్ పుస్తకాలను ముందుగా చదవడం ద్వారా.. ఆయా అంశాల అవలోకనం తేలిక అవుతుంది. సదరు అంశాలకు సంబంధించి.. అన్ని కోణాల్లో అవగాహన ఏర్పడుతుంది. శిక్షణ తీసుకోకుండా సన్నద్ధమవ్వాలనుకునే వారు తప్పనిసరిగా ఈ సూత్రాన్ని పాటించాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు కొన్నేళ్లపాటు అకడమిక్స్‌కు దూరమై ఉంటారు. ఇలాంటి వారు ముందుగా అకడమిక్ పుస్తకాలను చదవడం ద్వారా.. ఆయా సబ్జెక్ట్‌పై ప్రాథమిక అవగాహన వస్తుంది. తదుపరి దశలో ప్రిపరేషన్‌ను వేగవంతంగా సాగించే అవకాశం ఉంటుంది.
టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్, మోడల్‌పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, గైడెన్స్, ఆన్‌లైన్ టెస్టులు, సక్సెస్ స్టోరీలు మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి
డిస్క్రిప్టివ్ విధానం
గ్రూప్స్ ప్రిపరేషన్‌లో అభ్యర్థులకు ఎదురయ్యే మరో ప్రధాన సమస్య.. ఆయా అంశాలను ఎలా చదవాలి? అనేది. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని నిపుణులు అంటున్నారు. ఒక అంశాన్ని ప్రశ్న–సమాధానం విధానంలో కాకుండా.. దానికి సంబంధించి పూర్తి అవగాహన వచ్చేలా డిస్క్రిప్టివ్ విధానంలో చదవాలి. ఇది పరీక్షలో మంచి ప్రతిభ చూపడానికి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. చాలామంది అభ్యర్థులు బిట్ బ్యాంక్స్ లేదా గైడ్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని.. ముఖ్యంగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే గ్రూప్–1 ప్రిలిమ్స్, గ్రూప్–2 విషయంలో ఈ విధానాన్ని పాటిస్తున్నారని.. కానీ ఇది ఎంత మాత్రం సరికాదని సూచిస్తున్నారు. ఈ విధానం పోటీ పరీక్షల్లో అంతగా లాభించదని.. దీనివల్ల సంబంధిత అంశాలపై సంపూర్ణ అవగాహన పొందడం కష్టమే అంటున్నారు. కాబట్టి అభ్యర్థులు ఆయా అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించే డిస్క్రిప్టివ్ తరహా ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలని సూచిస్తున్నారు.
మెటీరియల్ కీలకం
స్వీయ ప్రిపరేషన్ విధానంలో అభ్యర్థులు ఎంపిక చేసుకునే మెటీరియల్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అకడమిక్ పుస్తకాలతోపాటు, మార్కెట్లో లభించే ప్రామాణిక మెటీరియల్‌ను సేకరించుకోవాలి. ఈ ప్రామాణిక మెటీరియల్ విషయంలో వివిధ ప్రచురణలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. సదరు మెటీరియల్‌ను ఆసాంతం పరిశీలించి.. పరీక్ష సిలబస్‌కు అనుగుణంగా అందులోని అంశాలు ఉన్నాయా.. లేదా.. అని గుర్తించాలని, పరీక్ష సిలబస్‌కు సరితూగే మెటీరియల్‌నే ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు.
మెంటారింగ్ ఏర్పాటు
స్వీయ ప్రిపరేషన్‌తో ముందుకుసాగాలనుకునే అభ్యర్థులు వీలైతే మెంటారింగ్ సదుపాయాన్ని కూడా ఏర్పాటుచేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే.. ఆయా సబ్జెక్ట్ నిపుణులు, ఇప్పటికే పరీక్షకు హాజరైన వారు, గత విజేతలు వంటి వారితో సంప్రదిస్తూ.. ఎప్పటికప్పుడు తమ ప్రిపరేషన్ స్థాయిపై తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలని చెబుతున్నారు. అదే విధంగా ఇంకా పట్టు సాధించాల్సిన అంశాలు, తమకు కష్టంగా భావించే టాపిక్స్ విషయంలో తమ సామర్థ్యాన్ని వారికి తెలియజేస్తూ.. ఎలా ముందుకు సాగాలో సూచనలు తీసుకోవాలి.
గ్రూప్-1,2,3,4 ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
ముఖ్యాంశాల కూర్పు
స్వీయ ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు సబ్జెక్ట్‌లకు సంబంధించి ముఖ్యాంశాల కూర్పు వ్యూహాన్ని పాటించాలి. ప్రతి సబ్జెక్ట్‌లోనూ ముఖ్యాంశాలతో సొంత నోట్స్ తయారు చేసుకోవాలి. దీనివల్ల పునశ్చరణ కోణంలో సమయం ఎంతో ఆదా అవుతుంది. పరీక్షకు కొద్దిరోజుల ముందు పూర్తిగా పునశ్చరణకే కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సొంత నోట్స్ విధానం ఫలితంగా తాము అప్పటికే సన్నద్ధత పొందిన అంశాలను మళ్లీ ఆసాంతం చదవకుండా.. సినాసిప్స్ చదివి జ్ఞప్తికి తెచ్చుకునేలా ఉపయుక్తంగా ఉంటుంది.
ఆన్‌లైన్ సదుపాయాలు
సొంతంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇప్పుడు అందుబాటులో ఉన్న మంచి సదుపాయం.. డిజిటల్ మాధ్యమం. ప్రస్తుతం అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి ఆన్‌లైన్‌లో విస్తృత సమాచారం లభిస్తోంది. దీన్ని వినియోగించుకోవాలి. సదరు సమాచారంలో తమకు ఉపయోగపడే సమాచారాన్ని గుర్తించి.. వాటిని ప్రత్యేకంగా జాబితా ఏర్పరచుకోవాలి.
ప్రతిరోజు నిర్దిష్ట సమయం
ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు ప్రతిరోజు కచ్చితంగా నిర్దిష్ట సమయం కేటాయించేలా తమ రోజువారీ ప్రణాళిక రూపొందించుకోవాలి. కనీసం ఆరు గంటల సమయం కేటాయించుకోవాలి. ఇలా కేటాయించుకున్న సమయంలోనే అన్ని సబ్జెక్ట్‌లు ప్రతిరోజు చదివే విధంగా వ్యవహరించాలి. ఒక సబ్జెక్ట్ పూర్తయ్యాక మరో సబ్జెక్ట్ వైపు దృష్టి పెడదామనే విధానం తదుపరి దశలో కొంత ప్రతికూలతకు దారితీయొచ్చు. ప్రిపరేషన్ సమయంలో ఏదైనా సబ్జెక్ట్‌ను చదువుతున్నప్పుడు విసుగు అనిపిస్తే.. కొద్దిసేపు దాన్ని పక్కనపెట్టి.. తమకు ఆసక్తి అనిపించే సబ్జెక్ట్‌లవైపు దృష్టి పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ప్రిపరేషన్ ఒత్తిడి నుంచి ఉపçశమనం లభిస్తుందని చెబుతున్నారు. అర్థం కాని సబ్జెక్ట్‌ను అదేపనిగా చదవడం సరికాదన్నారు. ప్రిపరేషన్‌పైనే ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందంటున్నారు.
నమూనా పరీక్షలు
స్వీయ ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు ఎప్పటికప్పుడు తమ సామర్థ్య స్థాయి అంచనాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ఇందుకోసం క్రమం తప్పకుండా నిర్దిష్ట వ్యవధిలో నమూనా పరీక్షలకు హాజరవడం, ఆయా పరీక్షల ఫలితాల ఆధారంగా తమ సామర్థ్య స్థాయిని అంచనా వేసుకోవాలి. ఇంకా పట్టు సాధించాల్సిన అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతిరోజు పునరావలోకనం
అభ్యర్థులు ప్రతి రోజు ప్రిపరేషన్‌కు ఉపక్రమించే ముందు.. అంతకుముందు రోజు చదివిన అంశాల అవలోకనానికి కొంత సమయం కేటాయించాలి. ఫలితంగా సదరు అంశానికి సంబంధించి తదుపరి దశలో అంతర్గత సంబంధం ఉండే విషయాలను అభ్యసించడం, అవగాహన ఏర్పరచుకోవడం తేలిక అవుతుంది. ముఖ్యంగా హిస్టరీ, పాలిటీ వంటి సబ్జెక్ట్‌ల విషయంలో ఈ అప్రోచ్ ఎంతో కలిసొస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
పరీక్షకు ముందు పూర్తి సమయం
- స్వీయ ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు, ముఖ్యంగా ఉద్యోగం చేస్తూ ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులు పరీక్షకు కనీసం నెల రోజుల ముందు నుంచైనా పూర్తి సమయం కేటాయించేలా చూసుకోవాలి. సెలవు పెట్టి ప్రిపరేషన్ సాగించేందుకు వీలు కాని పరిస్థితుల్లో కనీసం పరీక్షకు వారం, పది రోజుల ముందు నుంచైనా పూర్తి సమయం కేటాయించుకునేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సమయంలో తాము రాసుకున్న షార్ట్ నోట్స్, రెడీ రెకనర్స్ వంటి వాటి ద్వారా రివిజన్‌కు సమయం కేటాయించి పరీక్షకు సిద్ధం కావాలని పేర్కొంటున్నారు.
- ఇలా..పరీక్ష తీరుపై ప్రాథమిక అవగాహన మొదలు పరీక్ష రోజు వరకూ..నిర్దిష్ట వ్యూహంతో వ్యవహరిస్తే.. కోచింగ్ తీసుకోకపోయినా విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చని గత విజేతలు, నిపుణులు సూచిస్తున్నారు.
గ్రూప్–1 సెల్ఫ్ ప్రిపరేషన్.. ముఖ్యాంశాలు
- పరీక్ష శైలి, ఆయా టాపిక్స్ వెయిటేజీపై అవగాహనతో ముందుకు సాగే అవకాశం.
- ప్రతిరోజు నిర్దిష్ట సమయం కేటాయించుకునేలా ప్రణాళిక రూపొందించుకోవడం.
- మెంటారింగ్ సదుపాయం ఏర్పాటు చేసుకోవడం.
- మోడల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం.
- ప్రామాణిక మెటీరియల్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం.
- యూనిట్‌ల వారీగా ప్రాక్టీస్ బిట్స్ ఆన్సర్ చేయడం.
- సబ్జెక్టులను పునశ్చరణ చేయడం.
- గ్రాండ్ మోడల్ టెస్ట్‌లకు హాజరు కావడం. వీటిలో కనీసం 90 శాతం మార్కులు సాధించేలా కృషి చేయడం.
చదవండి: Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!
గ్రూప్–1,2 రిఫరెన్స్ బుక్స్
- ఆరు నుంచి 12 వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు.
- ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి అకాడమీ పుస్తకాలు.
- కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఇయర్ బుక్స్.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సర్వే గణాంకాలు,బడ్జెట్.
- బిపిన్ చం ద్ర(హిస్టరీ),లక్ష్మీకాంత్(పాలిటీ)పుస్తకాలు.
అన్ని సబ్జెక్ట్‌లకు ప్రాధాన్యం
గ్రూప్స్ అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో అన్ని సబ్జెక్టులకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇండియన్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్‌లు చదవడం ఎంతో లాభిస్తుంది. అకాడమీ పుస్తకాలను చదువుతూనే..వాటికి సమకాలీన అంశాలను జోడిస్తూ సొంత నోట్స్ సిద్ధం చేసుకోవడం కూడా లాభిస్తుంది. అదే విధంగా ప్రిపరేషన్ సమయంలోనే రైటింగ్ ప్రాక్టీస్ చేయడం కూడా అలవాటు చేసుకోవాలి.
–ఎ.నిశాంత్ రెడ్డి, గ్రూప్–1 గత విజేత (డిప్యూటీ కలెక్టర్)
ఆబ్జెక్టివ్ కూడా పూర్తి అవగాహన
ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే గ్రూప్–2 పరీక్షకు కూడా పూర్తి అవగాహనతో ముందుకు సాగాలి. ఆయా అంశాలకు సంబంధించి విశ్లేషణలను చదవాలి. దీనికోసం డిస్క్రిప్టివ్ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి. ఫలితంగా ప్రశ్నలను ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ముఖ్యంగా సొంతగా ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు సమయం ఆదా అవుతుందనే ఉద్దేశంతో బిట్ బ్యాంక్స్, గైడ్స్‌కు పరిమితమవుతుంటారు. కానీ ఇది సరికాదు. ప్రతి అంశానికి సంబంధించి భావనల నుంచి తాజా పరిణామాల వరకూ.. అన్నింటిపై అవగాహన పొందేలా వ్యవహరించాలి.
–కె.సుధాకర్, గ్రూప్–2 గత విజేత (ఈఓ–ఎండోమెంట్స్)
ఏపీపీఎస్సీ పరీక్ష స్టడీమెటీరియల్, మోడల్‌పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, సిలబస్, గైడెన్స్, సక్సెస్ స్టోరీలు మొదలైన వాటి కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి