Skip to main content

RIE CEE 2022:ఆర్‌ఐఈల్లో టీచింగ్‌ కోర్సులు.. అర్హతలు, సీఈఈ పరీక్ష విధానం ఇలా..

rie cee notification 2022

సమాజంలో గౌరవప్రదమైన వృత్తి బోధన. మానసిక సంతృప్తిని అందించే అధ్యాపక వృత్తిలో చేరాలని చాలామంది ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి యువత బోధన రంగంలో ప్రవేశించాలంటే.. డీఎడ్‌ లేదా బీఎడ్‌ వంటి కోర్సులను పూర్తి చేయాల్సి ఉంటుంది. చిన్న వయసులోనే ఇంటర్‌తోనే బోధన రంగంలో కెరీర్‌ కోరుకునే వారికి కోసం దేశంలోని ప్రతిష్టాత్మక రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(ఆర్‌ఐఈ)లు చక్కటి కోర్సులను అందిస్తున్నాయి. ఈ సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ..కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(సీఈఈ)కు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. ఆర్‌ఐఈలు అందించే కోర్సులు, ప్రవేశ విధానం, సీఈఈ పరీక్ష విధానంపై ప్రత్యేక సమాచారం...

 • ఆర్‌ఐఈల్లో టీచింగ్‌ కోర్సులు చదివే అవకాశం 
 • ఆర్‌ఐఈ సీఈఈ 2022 నోటిఫికేషన్‌ విడుదల

ఆర్‌ఐఈ–సీఈఈ

రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌.. సంక్షిప్తంగా ఆర్‌ఐఈ అంటారు. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌(ఎన్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తుంది. ఆర్‌ఐఈ సంస్థకు దేశవ్యాప్తంగా ఆజ్మీర్, భోపాల్,  భువనేశ్వర్, మైసూర్‌లలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఒక్కో సంస్థను రాష్ట్రాల వారీగా, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా విభజించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లు.. మైసూర్‌ ఆర్‌ఐఈ పరిధిలోకి వస్తాయి. ఈ సంస్థ నిర్వహించే సీఈఈ పరీక్ష ద్వారా నాలుగేళ్ల బీఏ/బీఎస్సీ ఎడ్, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎడ్, బీఎడ్, ఎంఎడ్, ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌–ఎంఎడ్‌ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.

అందించే కోర్సులు–అర్హతలు

 • బీఎస్సీ బీఈడీ: ఇది నాలుగేళ్ల కాలవ్యవధి గల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌(పీసీఎం స్ట్రీమ్‌); ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ లేదా కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ(సీబీజడ్‌ స్ట్రీమ్‌)లతో ఇంటర్‌/తత్సమాన(10+2) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్ట్రీమ్‌కు 44 సీట్లు చొప్పున రెండు స్ట్రీములకు కలిపి 88 సీట్లు ఉన్నాయి.ఇందులో ఒక్కో స్ట్రీమ్‌లో తెలంగాణకు 05, ఆంధ్రప్రదేశ్‌కు 07 సీట్లు కేటాయించారు.
 • బీఏ బీఈడీ: ఇది కూడా నాలుగేళ్ల కాల వ్యవధి కలిగిన ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌. ఆర్ట్స్‌/కామర్స్‌/సైన్స్‌ స్ట్రీమ్‌తో ఇంటర్‌ లేదా తత్సమాన(10+2) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో మొత్తం 44 సీట్లు ఉన్నాయి. వీటిలో తెలంగాణకు–05, ఆంధ్రప్రదేశ్‌కు–07 సీట్లను కేటాయించారు.
 • బీఈడీ: ఈ ప్రోగ్రామ్‌ కాలవ్యవధి రెండేళ్లు. సైన్స్‌ అండ్‌ మ్యాథ్స్, ఇంగ్లిష్‌ అండ్‌ సోషల్‌ సైన్స్‌ స్పెషలైజేషన్‌లతో ఈ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది. బీఏ/బీఎస్సీ/ఎంఏ/ఎమ్మెస్సీలలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 55 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో తెలంగాణకు 07, ఆంధ్రప్రదేశ్‌కు 08 సీట్లు ప్రత్యేకించారు.
 • ఎంఈడీ: ఈ ప్రోగ్రామ్‌ కాలవ్యవధి రెండేళ్లు. డిగ్రీ(ఆర్ట్స్‌/సైన్స్‌) ఉత్తీర్ణతతోపాటు బీఈడీ/బీఏఈడీ/బీఎస్సీఈడీ పూర్తిచేసి ఉండాలి. మొత్తం 35 సీట్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణకు 04, ఆంధ్రప్రదేశ్‌కు 06 సీట్లు కేటాయించారు. 
 • ఎమ్మెస్సీ ఈడీ: ఇది ఆరేళ్ల కాలవ్యవధి కలిగిన ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ స్పెషలైజేషన్‌లతో ఈ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులుగా ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన (10+2) విద్యార్హతలో ఉత్తీర్ణులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి స్పెషలైజేషన్‌కు 18 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
 • పై అన్నీ కోర్సులకు ఇంటర్, డిగ్రీల్లో కనీసం 50శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు 45శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. అలాగే ఏ కోర్సుల్లో చేరాలన్నా.. 2020, 2021 సంవత్సరాల్లో ఇంటర్, డిగ్రీ పూర్తిచేసినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ప్రస్తుతం చివరి ఏడాది పరీక్షలకు సిద్దమవుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


EAMCET 2022: టీఎస్‌ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తులకు చివరి తేదీ...​​​​​​​

ఎంపిక విధానం

సీఈఈ పరీక్షలో చూపిన ప్రతిభ, అకడమిక్స్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రాత పరీక్షకు 60 శాతం వెయిటేజీ, ఇంటర్‌ /డిగ్రీ/బీఈడీ మార్కులకు 40 శాతం వెయిటేజీ లభిస్తుంది. అన్ని కోర్సులకు పరీక్ష ఒకే విధంగా ఉంటుంది. భాషా నైపుణ్యాలు, టీచింగ్‌ అప్టిట్యూడ్, రీజనింగ్‌ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.


AP Ed CET 2022: ఏపీ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు..

సీఈఈ పరీక్ష విధానం

ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో 160 మార్కులకుగాను 80 ప్రశ్నలకు నిర్వహిస్తారు. లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ ఇన్‌ ఇంగ్లిష్‌–20, టీచింగ్‌ అప్టిట్యూడ్‌/అటిట్యూడ్‌–30, రీజనింగ్‌ ఎబిలిటీల నుంచి 30 చొప్పున ప్రశ్నలను అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయిస్తారు. తప్పుగా గుర్తించిన సమాధానానికి అర మార్కు కోత విధిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్షకు కేటాయించిన సమయం 2 గంటలు. ఎంపిక చేసుకునే ప్రోగ్రామ్‌ను బట్టి ఇంటర్, డిగ్రీ, పీజీ స్థాయి నుంచి ప్రశ్నలుంటాయి.

ముఖ్య సమాచారం

 • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 • దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 30, 2022
 • పరీక్ష తేదీ: జులై 24, 2022
 • వెబ్‌సైట్‌: https://cee.ncert.gov.in


​​​​​​​AP ICET 2022: ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఎంబీఏ/ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు..

Last Date

Photo Stories