Skip to main content

TS LAWCET 2023 Notification: టీఎస్‌ లాసెట్‌-2023 వివరాలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

న్యాయం చేసే 'లా' కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. న్యాయశాస్త్ర నైపుణ్యాలను అందించే కోర్సు ఎల్‌ఎల్‌బీ. ఇందులో ప్రవేశానికి నిర్వహించే లాసెట్‌కు.. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. ఈ ఎంట్రన్స్‌ ద్వారా మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో.. టీఎస్‌ లాసెట్‌-2023 వివరాలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..
TS LAWCET 2023 Notification
  • టీఎస్‌ లాసెట్‌-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
  • మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీల్లో ప్రవేశం
  • భవిష్యత్తు లీగల్‌ ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దే ఎల్‌ఎల్‌బీ కోర్సు
  • పీజీ లా సెట్‌కు కూడా నోటిఫికేషన్‌ విడుదల

ఇటీవల కాలంలో న్యాయ శాస్త్రం కొత్త పుంతలు తొక్కుతోంది. లా గ్రాడ్యుయేట్‌లకు న్యాయవాద వృత్తి మాత్రమే కాకుండా.. కార్పొరేట్‌ రంగంలోనూ డిమాండ్‌ నెలకొంది. అందుకే ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగావకాశాలు, ఉపాధి మార్గాల విషయంలో ఎలాంటి ఢోకా లేదు అంటున్నారు నిపుణులు. 

'లా'సెట్‌ ద్వారా ప్రవేశాలు

తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీ కళాశాలలు, అనుబంధ కాలేజీల్లో ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి 'లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (లాసెట్‌)'ను నిర్వహిస్తుంది. ఇందులో పొందిన ర్యాంకు ఆధారంగా.. మూడేళ్లు, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హతలు

  • మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఓసీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఓబీసీ వర్గాల వారు 42 శాతంతో, ఎస్‌సీ/ఎస్టీ వర్గాల వారు 40 శాతం మార్కులతో ఉతీర్ణత సాధించాలి.
  • అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సులో 45 శాతం మార్కులతో(ఓసీ, బీసీ) ఉత్తీర్ణత సాధించాలి. ఓబీసీ విద్యార్థులు 42 శాతంతో, ఎస్‌సీ,ఎస్టీ విద్యార్థులు 40 శాతంతో ఉత్తీర్ణత పొందాలి.
  • ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

మూడు విభాగాలు.. 120 మార్కులు

  • టీఎస్‌ 'లా' సెట్‌ పరీక్షను మొత్తం మూడు విభాగాల్లో 120 మార్కులకు నిర్వహిస్తారు. 
  • జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ విభాగం నుంచి 30 ప్రశ్నలు, కరెంట్‌ అఫైర్స్‌ విభాగం నుంచి 30 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ లా విభాగం నుంచి 60 ప్రశ్నలు చొప్పున అడుగుతారు.
  • ఆప్టిట్యూడ్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ లా విభాగంలోని 60 ప్రశ్నల్లో 10 ప్రశ్నలు కాంప్రహెన్షన్‌ విధానంలో ఉంటాయి. న్యాయ సంబంధ అంశాలతో కూడిన ప్యాసేజ్‌లు ఇచ్చి.. వాటి ఆధారంగా సమాధానాలు ఇవ్వాల్సిన విధంగా ప్రశ్నల అడుగుతారు.
  • మూడేళ్లు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ.. ఈ రెండు కోర్సులకు ఎంట్రన్స్‌ ఒకే మాదిరిగా ఉంటుంది. కాని ప్రశ్నల క్లిష్టత మూడేళ్ల కోర్సుకు డిగ్రీ స్థాయిలో, అయిదేళ్ల కోర్సుకు ఇంటర్మీడియెట్‌ స్థాయిలో ఉంటుంది.
  • ఎంట్రన్స్‌ పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే ఉంటుంది. మూడేళ్ల లాసెట్‌ను రెండు సెషన్లలో నిర్వహిస్తారు.

‘లా’కు చక్కటి మార్గం లాసెట్..

బెస్ట్‌ ర్యాంకు సాధించేలా

మొత్తం మూడు విభాగాల్లో నిర్వహించే లాసెట్‌లో మంచి ర్యాంకు పొందాలంటే.. నిర్దిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగించాలి. 

జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ

  • ఈ విభాగంలో అభ్యర్థులు స్టాక్‌ జీకే అంశాలకు కొంత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా చరిత్ర, వార్తల్లోని వ్యక్తులు, ముఖ్యమైన ప్రదేశాలు, సదస్సులు, చారిత్రక కట్టడాలు, స్వాతంత్య్రం అనంతర కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకోవాలి. కళలు, సంస్కృతి, జాతీయ ప్రాధాన్యత కలిగిన చారిత్రక అంశాలపై దృష్టి పెట్టాలి. ప్రధానంగా జాతీయోద్యమంలో కీలక ఘట్టాలపై దృష్టి పెట్టాలి. భారత రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ రూపకల్పన నుంచి తాజా సవరణల వరకు అన్నీ తెలుసుకోవాలి. 
  • అదే విధంగా మెంటల్‌ ఎబిలిటీలో వెర్బల్, నాన్‌-వెర్బల్‌ రీజనింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. బ్లడ్‌ రిలేషన్స్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, టైమ్‌ అండ్‌ వర్క్, కోడింగ్, డీ-కోడింగ్, గ్రాఫ్స్, ఫ్లోచార్ట్స్‌ విశ్లేషణ వంటి అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి.

Latest Current Affairs

కరెంట్‌ అఫైర్స్‌

కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ద్వైపాక్షిక ఒప్పందాలు, ముఖ్యమైన సంఘటనలు, సదస్సులు, జాతీయ పరిణామాలు, ప్రాంతీయ సమకాలీన అంశాలు, వార్తల్లో వ్యక్తులు, ముఖ్యమైన సంఘటనలు తదితరాల గురించి పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రామాణిక జనరల్‌ నాలెడ్జ్‌ పుస్తకాలతోపాటు, ప్రతిరోజు దిన పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. 

అప్టిట్యూడ్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ లా

ఈ విభాగంలో న్యాయ విద్య అభ్యసించడంపై అభ్యర్థులకున్న ఆసక్తిని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మంచి మార్కులు సాధించాలంటే..న్యాయపరమైన దృక్పథం, సహేతుక ఆలోచన ధోరణి, నిర్ణయ సామర్థ్యాలను పరిశీలించే నైపుణ్యాలు అవసరం. నిర్దిష్టంగా ఒక సంఘటన, వివాదాన్ని పరిష్కరించేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనే నైపుణ్యం పొందాలి. ముఖ్యమైన చట్టాలు, న్యాయ శాఖకు సంబంధించి ఇటీవల కాలంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, లీగల్‌ టెర్మినాలజీపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా ఇటీవల కాలంలో వెలువడిన కీలక తీర్పులు, వాటి పరిణామాలు-ప్రభావం వంటి తాజా అంశాలపైనా దృష్టి పెట్టాలి. 

ఉపాధి అవకాశాలు

ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసుకుంటే.. ఉజ్వల కెరీర్స్‌ సొంతమవడం ఖాయం. న్యాయవాద వృత్తితోపాటు కార్పొరేట్‌ కొలువులు కూడా దక్కించుకోవచ్చు. ప్రస్తుతం ప్రతి సంస్థ కూడా తమకంటూ ఒక ప్రత్యేక న్యాయ విభాగం ఉండాలని, వాటి ద్వారా కార్పొరేట్‌ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించి, ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగాలని భావిస్తోంది. అందుకోసం లా కోర్సులు పూర్తి చేసిన వారిని నియమించుకుంటున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు, ఆర్‌ అండ్‌ డీ సంస్థలు, బ్యాంకులు వీరికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రతి ఏటా క్యాంపస్‌ నియామకాలు చేపడుతున్నాయి. పీజీ స్థాయిలో కార్పొరేట్‌ లా, సైబర్‌ లా, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ లా, ఇంటర్నేషనల్‌ లా వంటి స్పెషలైజేషన్స్‌ పూర్తి చేసుకుంటే.. బహుళ జాతి సంస్థల్లో సైతం అవకాశాలు అందుకోవచ్చు.

అయిదు వేలకు పైగా సీట్లు

టీఎస్‌ లాసెట్‌ ద్వారా భర్తీ చేసే ఎల్‌ఎల్‌బీ, ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీకి సంబంధించి గత ఏడాది కౌన్సెలింగ్‌ గణాంకాల ప్రకారం-మూడేళ్ల లా కోర్సులో 3,597, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సులో 1,580 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎల్‌ఎల్‌ఎంకు సంబంధించి 620 సీట్లు ఉన్నాయి. 

పీజీ లాసెట్‌ ఇలా

  • ఎల్‌ఎల్‌బీ అర్హతగా.. ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశానికి పీజీ లాసెట్‌ నిర్వహిస్తారు. ∙-పీజీ లా సెట్‌ రెండు విభాగాలుగా 120 మార్కులకు ఉంటుంది.
  • పార్ట్‌-ఎలో.. జ్యూరిస్పుడెన్స్‌ నుంచి 20 ప్రశ్నలు, కాన్‌స్టిట్యూషనల్‌ లా నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి.
  • పార్ట్‌-బిలో.. పబ్లిక్‌ ఇంటర్నేషనల్‌ లా నుంచి 16 ప్రశ్నలు; మర్కంటైల్‌ లా నుంచి 16 ప్రశ్నలు; లేబర్‌ లా నుంచి 16 ప్రశ్నలు; క్రైమ్స్‌ అండ్‌ టార్ట్స్‌ నుంచి 16 ప్రశ్నలు; అదర్‌ 'లా'స్‌ నుంచి 16 ప్రశ్నలు అడుగుతారు. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: మార్చి 2 - ఏప్రిల్‌ 6, 2023
  • రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 12 వరకు; రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 19 వరకు, రూ.2,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 26 వరకు; రూ.4,000 ఆలస్య రుసుముతో మే 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: మే 16 నుంచి
  • లాసెట్‌ పరీక్ష తేదీ: మే 25, 2023
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://lawcet.tsche.ac.in/
Last Date

Photo Stories