Skip to main content

UGC Fellowships 2023: విద్యార్థులకు యూజీసీ గుడ్ న్యూస్, ఫెలోషిప్‌ సాయం పెంపు... ఎంతంటే..

పరిశోధనల దిశగా యువతను ప్రోత్సíß ంచేలా.. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) పలు చర్యలు చేపడుతోంది. తాజాగా సైన్స్, హ్యుమానిటీస్, సోషల్‌సైన్సెస్‌ విభాగాల్లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌), సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(ఎస్‌ఆర్‌ఎఫ్‌) మొత్తాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో.. యూజీసీ అందిస్తున్న రీసెర్చ్‌ ఫెలోషిప్‌లు, తాజా పెంపుదల, అర్హతలు తదితర వివరాలు..
UGC Research Fellowship Schemes, UGC Fellowship Qualifications, Social Sciences Research Fellowship, UGC Fellowships 2023, Junior Research Fellowship (JRF) in Science, Senior Research Fellowship (SRF) in Humanities,
  • తాజాగా జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌ల పెంపు
  • పలు స్కీమ్‌ల పరిధిలోని రీసెర్చ్‌ స్కాలర్స్‌కు మేలు
  • ఆర్ట్స్, సైన్స్, సోషల్‌ సైన్సెస్‌లో పరిశోధనలకు ఊతం 

పీహెచ్‌డీలో చేరి పరిశోధనలు సాగించే విద్యార్థులకు యూజీసీ ఫెలోషిప్‌ల రూపంలో పలు స్కీమ్‌ల ద్వారా ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తోంది. రీసెర్చ్‌ వ్యవధికి అనుగుణంగా జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ల పేరిట ఈ ఆర్థిక ప్రోత్సాహకాల్ని అందిస్తోంది. ముఖ్యంగా ఆర్ట్స్, సైన్స్, సోషల్‌ సైన్సెస్‌ విభాగాల్లో ఫెలోషిప్‌లను ఇస్తోంది. తాజాగా పలు స్కీమ్‌ల పరిధిలో ఫెలోషిప్‌ మొత్తాలను పెంచింది.

ఫెలోషిప్‌ మొత్తాల పెంపు

  • యూజీసీ.. తాజాగా 2023, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఫెలోషిప్‌ మొత్తాలను పెంచింది. సైన్స్, హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌లో జేఆర్‌ఎఫ్‌ను నెలకు రూ.31 వేల నుంచి రూ.37 వేలకు పెంచింది. ఇలా రెండేళ్ల పాటు నెలకు రూ.37 వేలు చొప్పున జేఆర్‌ఎఫ్‌ అందిస్తారు.
  • జేఆర్‌ఎఫ్‌ తర్వాత సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌న(ఎస్‌ఆర్‌ఎఫ్‌)కు ఎంపికైన వారికి ప్రస్తుతం ఇస్తు­న్న రూ.35 వేల ఫెలోషిప్‌ను రూ.42 వేలకు పెంచారు. ఈ మొత్తాన్ని నిర్దిష్ట వ్యవధి వరకు ఇస్తారు.
  • కుటుంబంలో ఒక ఆడపిల్ల మాత్రమే ఉన్న విద్యార్థినులకు ఉద్దేశించిన సావిత్రి జ్యోతిబా పూలే ఫెలోషిప్‌ ఫర్‌ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ ఫెలోషిప్‌ పరిధిలో జేఆర్‌ఎఫ్‌ను రూ.31 వేల నుంచి రూ.35 వేలకు; ఎస్‌ఆర్‌ఎఫ్‌ను రూ.37 వేల నుంచి రూ.42 వేలకు పెంచారు.
  • డాక్టర్‌.డి.ఎస్‌.కొఠారి పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ పరిధిలోనూ పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌లను పెంచారు. మొదటి ఏడాది నెలకు రూ.47 వేలుగా ఉన్న మొత్తాన్ని రూ.58 వేలకు; రెండో ఏడాది నెలకు రూ.49 వేలుగా ఉన్న ఫెలోషిప్‌ను రూ.­61 వేలకు; మూడో ఏడాది నెలకు రూ. 54 వేలు­గా ఉన్న ఫెలోషిప్‌ను రూ. 67 వేలకు పెంచారు.
  • అదే విధంగా హయ్యర్‌ పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ పేరిట మొత్తం వ్యవధికి ప్రస్తుతం నెలకు రూ.54 వేలను ఫెలోషిప్‌గా ఇస్తుండగా.. దానిని రూ.67 వేలకు పెంచారు.
  • డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్, పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ఫర్‌ ఎస్‌సీ/ఎస్‌టీ, పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ ఉమెన్‌లకు ఇస్తున్న ఫెలోషిప్‌లను కూడా పెంచారు. మొద­టి ఏడాది నెలకు రూ.47 వేల నుంచి రూ.58 వేలకు; రెండో ఏడాది నెలకు రూ.49 వేల నుంచి రూ.61 వేలకు; మూడో ఏడాది నుంచి నెలకు రూ.54 వేల నుంచి రూ.67 వేలకు పెంచారు.

నెట్‌తో జేఆర్‌ఎఫ్‌

  • ఆర్ట్స్, సోషల్‌ సైన్సెస్‌ పీజీ ఉత్తీర్ణులు ఎన్‌టీఏ నిర్వహించే యూజీసీ-నెట్‌లో అర్హత సాధించడం ద్వారా జేఆర్‌ఎఫ్‌ పొందొచ్చు. 
  • సైన్సెస్‌లో పీహెచ్‌డీలో చేరి జేఆర్‌ఎఫ్‌ పొందాలంటే..యూజీసీ-సీఎస్‌ఐఆర్‌లు సంయుక్తంగా నిర్వహించే సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. 
  • యూజీసీ మార్గనిర్దేశాల ప్రకారం-మొదటి రెండేళ్లు జేఆర్‌ఎఫ్‌ను అందిస్తారు. ఈ సమయంలో అభ్యర్థుల ప్రతిభను పరిశీలించి వారికి ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత కల్పిస్తారు. ఈ ఎస్‌ఆర్‌ఎఫ్‌ను గరిష్టంగా మూడేళ్లపాటు అందిస్తారు.

నెట్‌కు అర్హత

  • ఆర్ట్స్, సోషల్‌సైన్సెస్‌లో జేఆర్‌ఎఫ్‌కు అవకాశం కల్పించే యూజీసీ-నెట్‌కు హాజరవ్వాలంటే.. 55 శాతం మార్కులతో పీజీలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం సడలింపు ఇస్తారు.
  • సైన్సెస్‌ విభాగంలో జేఆర్‌ఎఫ్‌కు దారి చూపే సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌కు హాజరవ్వాలంటే.. ఎమ్మెస్సీ/ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌-ఎంఎస్‌/బీఎస్‌/బీటెక్‌/బీఫార్మసీ/ ఎంబీబీఎస్‌ కోర్సుల్లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

సావిత్రి జ్యోతిబాపూలే ఫెలోషిప్‌ ఫర్‌ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌

  • యూజీసీ పరిధిలోని ప్రముఖమైన ఫెలోషిప్‌ స్కీమ్‌.. సావిత్రి జ్యోతిబా పూలే ఫెలోషిప్‌ ఫర్‌ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌. కుటుంబంలో ఏకైక సంతానంగా ఉన్న మహిళా విద్యార్థులు ఈ ఫెలోషిప్‌నకు అర్హులు. గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్స్, యూనివర్సిటీల్లో పీహెచ్‌డీలో నమోదు చేసుకుని ఉండాలి లేదా ఇప్పటికే పీహెచ్‌డీ చేస్తూ ఉండాలి. జనరల్‌ కేటగిరీలో 40 ఏళ్ల లోపు, ఎస్‌సీ/ఎస్‌టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ కేటగిరీలో గరిష్టంగా 45 ఏళ్లలోపు ఉండాలి.
  • గరిష్టంగా అయిదేళ్ల వ్యవధికి ఫెలోషిప్‌ ఇస్తారు. తొలి రెండేళ్లు నెలకు రూ.37 వేలు చొప్పున జేఆర్‌ఎఫ్, తర్వాత మూడేళ్ల నెలకు రూ.42 వేలు చొప్పున అందిస్తారు. 
  • హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌ పీహెచ్‌డీ అభ్యర్థులకు తొలి రెండేళ్లు ఏడాదికి రూ.పది వేలు చొప్పున, మిగతా మూడేళ్లకు ఏడాదికి రూ.20,500 చొప్పున కాంటింజెన్సీ గ్రాంట్‌ అందిస్తారు. సైన్సెస్‌ విభాగాల్లో ఈ మొత్తాలు తొలి రెండేళ్లు ఏడాదికి రూ.12 వేలు, మిగతా మూడేళ్లకు రూ.25 వేలు చొప్పున నిర్ణయించారు.
  • అభ్యర్థులు పీహెచ్‌డీలో చేరిన మూడు నెలలలోపు యూజీసీ వెబ్‌సైట్‌ ద్వారా ఫెలోషిప్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

డాక్టర్‌ ఎస్‌.రాధాకృష్ణన్‌ పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌
పీహెచ్‌డీ పూర్తి చేసుకుని.. పోస్ట్‌ డాక్టోరల్‌ రీసెర్చ్‌ కార్యకలాపాలు నిర్వహించే వారికి అందుబాటులో ఉన్న ఫెలోషిప్‌ స్కీమ్‌.. డాక్టర్‌ ఎస్‌.రాధాకృష్ణన్‌ పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌. సైన్సెస్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్, లాంగ్వేజెస్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసుకున్న వారికి ఈ ఫెలోషిప్‌నకు అర్హత లభిస్తుంది. దీని ద్వారా అభ్యర్థులు సొంతంగా పరిశోధనలు సాగించే అవకాశం లభిస్తుంది. ప్రతి ఏటా మొత్తం 900 మందికి ఈ ఫెలోషిప్‌ను అందిస్తారు. తాజా నిర్ణయం ప్రకారం మొదటి ఏడాది నెలకు రూ.58 వేలు; రెండో ఏడాది నెలకు రూ. 61 వేలు, మూడో ఏడాది నెలకు రూ. 67 వేలు చొప్పున ఫెలోషిప్‌ అందిస్తారు. వీటితోపాటు ఏటా రూ.50 వేలు చొప్పున కాంటింజెన్సీ గ్రాంట్‌ మంజూరు చేస్తారు. దరఖాస్తు చేసుకునే నాటికి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 35 ఏళ్లలోపు, రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 40ఏళ్ల లోపు ఉండాలి. 

డాక్టర్‌.ఎస్‌ కొఠారి రీసెర్చ్‌ గ్రాంట్‌
యూజీసీ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్స్, యూనివర్సిటీలు, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో కొత్తగా అధ్యాపకులుగా నియమితులైన వారికి ఉద్దేశించిన ఫెలోషిప్‌ స్కీమ్‌.. డాక్టర్‌ ఎస్‌.కొఠారి రీసెర్చ్‌ గ్రాంట్‌. ఆయా ఇన్‌స్టిట్యూట్స్, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమితులైన వారు ఈ ఫెలోషిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం అయిదేళ్ల వ్యవధిలో పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియామకం పొందిన తేదీ నుంచి రెండేళ్ల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే మొదటి ఏడాది నెలకు రూ.58 వేలు చొప్పున, రెండో ఏడాది నెలకు రూ.61 వేలు చొప్పున, మూడో ఏడాది నెలకు రూ.67 వేలు చొప్పున ఫెలోషిప్‌ మంజూరు చేస్తారు. ప్రతి ఏటా 167 మందికి ఈ ఫెలోషిప్‌ను అందిస్తారు.

పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ ఉమెన్‌
పీహెచ్‌డీ పూర్తి చేసి ఎలాటి ఉపాధి లేకుండా ఉన్న మహిళలను పరిశోధన కేంద్రాల్లో కార్యకలాపాలు నిర్వహించేలా ప్రోత్సహించే ఉద్దేశంతో యూ­జీసీ ప్రవేశపెట్టిన స్కీమ్‌.. పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ ఉమెన్‌. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, హ్యు­మానిటీస్, సోషల్‌ సైన్సెస్‌ విభాగాల్లో రీసెర్చ్‌ సెంటర్లలో పోస్ట్‌ డాక్టోరల్‌ కార్యకలాపాలు నిర్వహించే వారికి ఈ ఫెలోషిప్‌ను అందిస్తారు. ప్రతి ఏటా 100 మందిని ఈ స్కీమ్‌కు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి మొదటి ఏడాది నెలకు రూ.58 వేలు; రెండో ఏడాది నెలకు రూ.61 వేలు; మూడో ఏడాది నుంచి రూ.67 వేలు చొప్పున ఫెలోషిప్‌ ఇస్తారు. దీంతోపాటు అయిదేళ్ల పాటు ఏడాదికి రూ.50 వేలు చొ­ప్పున కాంటింజెన్సీ గ్రాంట్‌ మంజూరు చేస్తారు. ఓ­పెన్‌ కేటగిరీలో 55 ఏళ్ల లోపు వారు, రిజర్వ్‌డ్‌ కేటగిరీలలో 60ఏళ్ల లోపువారు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ ఎస్‌సీ/ఎస్‌టీ
సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌ విభాగాల్లో పోస్ట్‌ డాక్టోరల్‌ రీసెర్చ్‌ చేయాలనుకునే ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలకు చెందిన వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్కీమ్‌.. పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ ఎస్‌సీ/ఎస్‌టీ. పీహెచ్‌డీ పూర్తి చేసి.. 50ఏళ్ల లోపు ఉన్న ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీల అభ్యర్థులు ఈ ఫెలోషిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఏటా 100మందికి ఈ ఫెలోషిప్‌ కల్పిస్తారు. ఎంపికైన వారికి తొలి ఏడాది నెలకు రూ. 58 వేలు; రెండో ఏడాది నెలకు రూ.61 వేలు; మూడో ఏడాది నుంచి రూ.67 వేలు చొప్పున ఫెలోషిప్‌ ఇస్తారు. దీంతోపాట ఏడాది రూ. 50 వేలు చొప్పున కాంటింజెన్సీ గ్రాంట్‌ మంజూరు చేస్తారు.

ఎంపిక ఇలా
యూజీసీ అందిస్తున్న ఫెలోషిప్‌ స్కీమ్‌లకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు సంబంధించిన ప్రకటనలను యూజీసీ విడుదల చేస్తుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు యూజీసీ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. వీటిలో విజయం సాధించిన వారిని ఫెలోషిప్‌నకు ఎంపిక చేస్తారు.
 

Photo Stories