Skip to main content

Scholarship: ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్‌లకు ప్రకటన విడుదల.. ఎంపికైతే ఏటా రూ.50వేలు ఉపకార వేతనం

Graduation Success with Pragathi Scholarship, AICTE Pragati Scholarship Scheme for Girl Students,  Pragathi Scholarship Award - Financial Support for Higher Education,
  • ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్‌లకు ప్రకటన విడుదల
  • ఎంపికైతే ఏటా రూ.50వేలు ఉపకార వేతనం
  • డిప్లొమా, ఇంజనీరింగ్‌ విద్యార్థినులు అర్హులు


ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక చేయూతలేక చాలా మంది అమ్మాయిలు చదువులకు దూరమవుతున్నారు. ఇటువంటి విద్యార్థినులు ఉన్నత విద్యను కొనసాగించేలా  ఆర్థిక భరోసాను ఇస్తూ అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) స్కాలర్‌షిప్‌లను ఇస్తోంది. ప్రగతి స్కాలర్‌షిస్‌ స్కీమ్‌ పేరిట ఏటా అర్హులైన విద్యార్థినులకు రూ.50వేల ఉపకార వేతనాన్ని అందిస్తోంది. డిప్లొమా, ఇంజనీరింగ్‌ చదువుతున్న వారు ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 10,000. డిప్లొమా స్థాయిలో 5000 మందికి, ఇంజనీరింగ్‌ స్థాయిలో 5000 మందికి చొప్పున వీటిని అందిస్తారు.

తెలుగు రాష్ట్రాలకు
దేశ వ్యాప్తంగా అందించే ఈ స్కాలర్‌షిప్‌లకు రాష్ట్రాలవారీ కోటా ఉంటుంది. దీని ప్రకారం-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డిప్లొమా చదివే 318 మందికి, తెలంగాణలో 206 మందికి వీటిని అందిస్తారు. అలాగే ఇంజనీరింగ్‌ విభాగంలో ఏపీ నుంచి 566 మందిని, తెలంగాణ నుంచి 424 మందిని ఈ స్కాలర్‌షిప్స్‌ కోసం ఎంపిక చేస్తారు. ఈ స్కాలర్‌షిప్స్‌ కూడా రిజర్వేషన్‌ ప్రకారం అందిస్తారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటాయింపులు చేస్తారు.

అర్హతలు

  • ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో డిప్లొమా లేదా బీటెక్‌ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి.
  • ఆయా కోర్సులో ఫస్ట్‌ ఇయర్‌ లేదా లేటరల్‌ ఎంట్రీలో సెకండ్‌ ఇయర్‌లో చేరినవాళ్లే  ఈ స్కాలర్‌షిప్‌ దరఖాస్తుకు అర్హులు. 
  • ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలకు మాత్రమే దరఖాస్తుకు అవకాశం ఉంటుంది.
  • తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8 లక్షలకు మించి ఉండరాదు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జతచేయాల్సి ఉంటుంది.

ఏటా రూ.50వేలు
ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన విద్యార్థినులకు ఏటా రూ.50 వేలను అందిస్తారు. డిప్లొమా వారికి మూడేళ్ల పాటు, ఇంజనీరింగ్‌ కోర్సులు చదువుతున్నవారికి నాలుగేళ్ల పాటు ఉపకార వేతనం చెల్లిస్తారు. లేటరల్‌ ఎంట్రీలో చేరిన డిప్లొమా కోర్సుల విద్యార్థినులకు రెండేళ్లు, లేటర్‌ ఎంట్రీ ఇంజనీరింగ్‌లో చేరితే మూడేళ్ల పాటు స్కాలర్‌షిప్‌ అందుతుంది. ఈ మొత్తం నేరుగా విద్యార్థిని బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తారు. దీన్ని ఫీజు, వసతి, పుస్తకాలు, కంప్యూటర్‌ తదితర ఖర్చుల కోసం వెచ్చించుకోవచ్చు. అకడెమిక్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా తర్వాతి ఏడాది వీటిని కొనసాగిస్తారు.

ఎంపిక ఇలా
డిప్లొమా అభ్యర్థులైతే పదోతరగతిలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంజనీరింగ్‌లో చేరినవారైతే ఇంటర్‌లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుని ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపిక చేస్తారు.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 31.12.2023
  • వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/
Last Date

Photo Stories