UGC NET Notification 2023: ఈ సబ్జెక్ట్‌పై పట్టుతోనే బోధన, పరిశోధన రంగాల్లో ప్రవేశానికి మార్గం మరియు సక్సెస్
- యూజీసీ నెట్ డిసెంబర్ 2023 నోటిఫికేషన్ విడుదల
- డిసెంబర్ 6 నుంచి 22 వరకు పలు స్లాట్లలో పరీక్షలు
- నెట్‌లో ఉత్తీర్ణతతో జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అర్హత
- 80కు పైగా సబ్జెక్ట్‌లలో నెట్ నిర్వహణ
సైన్స్, టెక్నాలజీ తదితర విభాగాల్లో పరిశోధనలకు మార్గాలు అనేకం. కానీ హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ విభాగాల్లో మాత్రం ఆశించిన మేరకు రీసెర్చ్ అవకాశాలు లేవు. ఈ సమస్యకు పరిష్కారంగా అందుబాటులోకి తెచ్చిన విధానమే.. యూజీసీ-నెట్. దీనిద్వారా సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ విభాగాల్లో పరిశోధన అవకాశాలు అందుకోవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలో అధ్యాపక వృత్తిలో ప్రవేశించాలనుకునే వారికి యూజీసీ-నెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి.
చదవండి: CSIR UGC NET Study Material
83 సబ్జెక్టుల్లో నెట్
యూజీసీ నెట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహిస్తోంది. తాజాగా 2023 డిసెంబర్ సెషన్‌కు సంబంధించి ప్రకటన ఇచ్చింది. 83 సబ్జెక్ట్‌లలో డిసెంబర్ 6 నుంచి 22 వరకు పరీక్షలను నిర్వహించనుంది. దీని ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్), అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రెండు కేటగిరీలుగా
- యూజీసీ-నెట్‌ను సాధారణంగా రెండు కేటగిరీల్లో నిర్వహిస్తారు. అవి.. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తాము ఏ కేటగిరీ పరీక్షకు హాజరు కావాలనుకుంటున్నారో స్పష్టం చేయాలి.
- రీసెర్చ్/జేఆర్‌ఎఫ్ పట్ల ఆసక్తి ఉన్న వారు.. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకోవాలి.
- అధ్యాపక వృత్తికి మాత్రమే పరిమితమవ్వాలనుకునే వారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.
- అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ప్రాథమ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రశ్నలు అడుగుతారు.
రెండు పేపర్లలో పరీక్ష
- యూజీసీ నెట్‌ను ఆన్‌లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 300 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పేపర్-1.. 50 ప్రశ్నలు-100 మార్కులకు ఉంటుంది.
- ఇందులో టీచింగ్/రీసెర్చ్ ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్, భిన్నమైన ఆలోచన సరళిపై ప్రశ్నలు అడుగుతారు.
- పేపర్-2.. 100 ప్రశ్నలు-200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇది అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్ పేపర్. ఇందులో అభ్యర్థుల డొమైన్ నాలెడ్జ్ పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. రెండు పేపర్లకు కలిపి మొత్తం మూడు గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ నిబంధన లేదు.
చదవండి: Model and Previous Papers
పేపర్ ఎంపిక ఎలా
- అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులందరూ..పేపర్-1కు తప్పనిసరిగా హాజరు కావాలి.
- అభ్యర్థులు తమ పీజీ స్పెషలైజేషన్ ఆధారంగా ఎంపిక చేసుకున్న సబ్జెక్టుపై నిర్వహించే పరీక్ష పేపర్ 2. ఉదాహరణకు పీజీ స్థాయిలో ఎకనామిక్స్ స్పెషలైజేషన్ చదివిన అభ్యర్థులు ఎకనామిక్స్ సబ్జెక్ట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
కనీస అర్హత మార్కులు
యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే.. కనీస అర్హత మార్కులు పొందాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లలో కలిపి 40 శాతం మార్కులు, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాలి. ఈ సడలింపు (35 శాతం మార్కులు)ను జనరల్-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా ఉంటుందని పేర్కొన్నారు.
ఆరు శాతం మంది మాత్రమే
మొత్తం హాజరైన అభ్యర్థుల్లో ఆరు శాతం మందినే నెట్ ఉత్తీర్ణులుగా (అసిస్టెంట్ ప్రొఫెసర్) ప్రకటిస్తారు. అదేవిధంగా జేఆర్‌ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీ అభ్యర్థుల ఎంపికలోనూ కనీస అర్హత మార్కుల ఆధారంగా ఉత్తీర్ణులను ప్రకటించనున్నారు. ఇందుకోసం పలు స్లాట్లలో నిర్వహించనున్న పరీక్షను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా నార్మలైజేషన్ ప్రక్రియ చేపడతారు.
నెట్‌తో ప్రయోజనాలు
- అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాతో అధ్యాపక వృత్తిలో అడుగు పెట్టొచ్చు. యూజీసీ నిబంధనల ప్రకారం-నెట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో ఉత్తీర్ణత సాధించిన వారినే ఈ పోస్ట్‌లకు ఎంపిక చేయాలి. ఏడో పీఆర్‌సీ సిఫార్సుల ప్రకారం-అసిస్టెంట్ ప్రొఫెసర్ పే స్కేల్‌ను ప్రారంభంలోనే నెలకు రూ.67 వేలు బేసిక్ పే చెల్లించాలని ∙యూజీసీ నిర్దేశించింది.
- జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే.. ప్రముఖ రీసెర్చ్ లేబొరేటరీల్లో రెండేళ్లపాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోగా, ఆ తర్వాత మరో రెండేళ్లు సీనియర్ రీసెర్చ్ ఫెలోగా అవకాశం లభిస్తుంది.
- జేఆర్‌ఎఫ్ హోదాలో మొదటి రెండేళ్లు నెలకు రూ.31 వేల ఫెలోషిప్ అందుతుంది.
- జేఆర్‌ఎఫ్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత లభిస్తుంది. ఈ దశలో రెండేళ్లపాటు నెలకు రూ.35 వేల స్కాలర్‌షిప్ అందుతుంది.
- జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు పూర్తి చేసుకున్న వారు సైంటిస్ట్‌లుగా కెరీర్ ప్రారంభించొచ్చు.
- ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో పీహెచ్‌డీ, రీసెర్చ్ అభ్యర్థుల ఎంపికలో నెట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది.
- ఆర్ట్స్,హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్‌లలో జేఆర్‌ఎఫ్‌కు ఎంపికై పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పురావస్తు శాఖ, ఆర్థిక గణాంక శాఖలు, సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖ వంటి పలు ప్రభుత్వ శాఖల్లో రీసెర్చ్ స్కాలర్స్‌గా అవకాశాలు లభిస్తాయి.
సబ్జెక్ట్‌పై పట్టుతోనే సక్సెస్
ఆరు శాతం మందిని మాత్రమే తుది జాబితాకు ఎంపిక చేసే యూజీసీ నెట్‌లో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు పరిశోధనల పట్ల తమకున్న ఆసక్తి మొదలు, సబ్జెక్ట్ పరంగా సంపూర్ణ అవగాహన పెంచుకునేందుకు కృషి చేయాలి.
పేపర్-1కు ఉమ్మడిగా
రెండు కేటగిరీల అభ్యర్థులకు ఉమ్మడిగా నిర్వహించే పేపర్-1లో అభ్యర్థుల టీచింగ్, రీసెర్చ్ ఆసక్తులను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం పది విభాగాలు (టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ అండ్ ఎన్విరాన్‌మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్-గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్) నుంచి ఒక్కో విభాగంలో అయిదు ప్రశ్నలు అడుగుతారు.
పేపర్-2 సబ్జెక్ట్ పేపర్
పేపర్-2లో ప్రశ్నలు పీజీ స్పెషలైజేషన్ సిలబస్ స్థాయిలో ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి ఇంటర్మీడియెట్ నుంచి పీజీ వరకు.. అన్ని అంశాలపై పట్టు సాధించాలి.
అన్వయ దృక్పథం
ఆయా అంశాలను చదివేటప్పుడే అప్లికేషన్ ఓరియెంటేషన్, ప్రాక్టికల్ అప్రోచ్‌ను అనుసరించాలి. ఎందుకంటే.. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు అప్లికేషన్ ఓరియెంటేషన్ కీలకంగా మారుతోంది.
చదవండి: UGC NET December 2023 Notification : యూజీసీ నెట్-2023 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఇదే.. ఇంకా..
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేది: 28.10.2023
- దరఖాస్తు సవరణ తేదీలు: 30, 31 అక్టోబర్ 2023
- పరీక్ష తేదీలు: 06.12.2023 నుంచి 22.12.2023 వరకు
- వెబ్‌సైట్: https://ugcnet.nta.ac.in/
Tags
- UGC NET Notification 2023
- UGC NET 2023 Syllabus
- UGC NET Benefits in Telugu
- UGC NET Exam Pattern
- National Eligibility Test
- Assistant Professor Posts
- Science and Technology
- Careers
- Preparation Tips
- UGC NET notification
- UGC NET study materials
- UGC NET previous year papers
- sakshi education study materials