Skip to main content

UGC NET 2023 Notification: బోధన, పరిశోధనలకు మార్గాలు.. యూజీసీ నెట్‌తో ప్రయోజనాలివే..

పరిశోధనల పట్ల ఆసక్తి ఉందా.. అధ్యాపక వృత్తిలో బోధన రంగంలో స్థిరపడాలని కోరుకుంటున్నారా.. అయితే మీకు సరైన మార్గం.. యూజీసీ-నెట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)!! జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలో విజేతగా నిలిస్తే.. జేఆర్‌ఎఫ్‌ సొంతం చేసుకొని పరిశోధనల దిశగా అడుగులు వేయొచ్చు. మరోవైపు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హోదాలో అధ్యాపక వృత్తిలో కెరీర్‌ ప్రారంభించే అవకాశం కూడా ఉంది. ఇటీవల యూజీసీ-నెట్‌ 2023(జూన్‌) నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. యూజీసీ నెట్‌ వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రయోజనాలు, ప్రిపరేషన్‌పై ప్రత్యేక కథనం..
UGC NET 2023 Notification
  • యూజీసీ-నెట్‌ 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
  • జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కోసం నెట్‌ పరీక్ష
  • జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే నెలకు రూ.31 వేల ఫెలోషిప్‌

83 సబ్జెక్ట్‌లలో యూజీసీ నెట్‌:

యూజీసీ-నెట్‌ 2023ను మొత్తం 83 సబ్జెక్ట్‌లలో నిర్వహించనున్నారు. వీటిలో ఆంత్రోపాలజీ, ఆర్కియాలజీ, కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్‌ వంటి సంప్రదాయ సబ్జెక్ట్‌లతోపాటు.. డిఫెన్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్, ఫోరెన్సిక్‌ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, క్రిమినాలజీ, కంప్యూటర్‌ సర్వీస్‌ అండ్‌ అప్లికేషన్‌ తదితర సైన్స్‌ సంబంధిత సబ్జెక్ట్‌లు సైతం ఉన్నాయి. అదేవిధంగా మేనేజ్‌మెంట్, లాంగ్వేజెస్, ఫారెన్‌ లాంగ్వేజెస్‌కు సంబంధించిన సబ్జెక్ట్‌ల్లోనూ యూజీసీ నెట్‌ను నిర్వహించనున్నారు. 

జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

యూజీసీ నెట్‌ ద్వారా జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌)తోపాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌కు ఎంపిక ప్రక్రియ చేపడతారు. ఈ పరీక్షలో ప్రతిభ చూపిన వారు జేఆర్‌ఎఫ్‌ ఆధారంగా పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా యూనివర్సిటీల్లో అధ్యాపకుడిగా బోధన రంగంలో చే రేందుకు అర్హత లభిస్తుంది.

UGC NET Study Material

అర్హతలు

  • పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం సడలింపు లభిస్తుంది. -పీజీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • వయసు: జేఆర్‌ఎఫ్‌ అభ్యర్థుల వయసు జూన్‌ 1, 2023 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. ఓబీసీ-ఎన్‌సీఎల్, ఇతర రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు ఉంటుంది.
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి లేదు.

రెండు కేటగిరీలుగా పరీక్ష

  • జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అనే రెండు కేటగిరీల్లో యూజీసీ-నెట్‌ను నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తాము ఏ కేటగిరీ పరీక్షకు హాజరవ్వాలనుకుంటున్నారో స్పష్టం చేయాలి. 
  • పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న వారు.. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ అండ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 
  • అధ్యాపక వృత్తిలో స్థిరపడాలనుకుంటే.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను తమ ప్రాథమ్యంగా ఎంచుకోవాలి. 

Model and Previous Papers

రెండు పేపర్లు-300 మార్కులు

  • యూజీసీ నెట్‌ పరీక్ష ఆన్‌లైన్‌ విధానం(కంప్యూటర్‌ బేస్ట్‌ టెస్ట్‌)లో రెండు పేపర్లుగా జరుగుతుంది. మొత్తం 300 మార్కులకు ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. 
  • పేపర్‌-1 టీచింగ్‌/రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు-100 మార్కులకు; పేపర్‌-2 సబ్జెక్ట్‌ సంబంధిత పేపర్‌ 100 ప్రశ్నలు-200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు.
  • పేపర్‌-1కు అసిస్టెంట్‌ ప్రొఫెసర్, జేఆర్‌ఎఫ్‌ అండ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అభ్యర్థులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి. 
  • పేపర్‌-2ను అభ్యర్థుల పీజీ స్పెషలైజేషన్‌ ఆధారంగా యూజీసీ నెట్‌లో అర్హత ఉన్న సబ్జెక్ట్‌కు సంబంధించిన పరీక్షగా నిర్వహిస్తారు.

కనీస అర్హత మార్కులు

యూజీసీ నెట్‌కు హాజరైన అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించాలి. అప్పుడే ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లలో కలిపి 40 శాతం మార్కులు, రిజర్వ్‌డ్‌ కేటగిరీ, జనరల్‌-ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాలి. హాజరైన మొత్తం అభ్యర్థుల్లో ఆరు శాతం మందినే నెట్‌ ఉత్తీర్ణులుగా ప్రకటించనున్నారు. 

బెస్ట్‌ స్కోర్‌కు మార్గాలివే

జాతీయ స్థాయిలో నిర్వహించే యూజీసీ నెట్‌లో విజయం సాధించాలంటే..అభ్యర్థులు సబ్జెక్ట్‌పై సంపూర్ణ అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. 

పేపర్‌-1 ఉమ్మడిగా

 అభ్యర్థులందరికీ ఉమ్మడి పరీక్ష..పేపర్‌-1. ఇందులో టీచింగ్, రీసెర్చ్‌ ఆసక్తులను పరిశీలించే విధంగా ప్రశ్నలుంటాయి. మొత్తం పది విభాగాల(టీచింగ్‌ ఆప్టిట్యూడ్, రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్, రీడింగ్‌ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, లాజికల్‌ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, పీపుల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌-గవర్నెన్స్, పాలిటీ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌) నుంచి.. ఒక్కో విభాగంలో అయిదు ప్రశ్నలు అడుగుతారు.

పేపర్‌-2.. సబ్జెక్ట్‌ సంబంధిత ప్రశ్నలు

పేపర్‌-2లో అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్‌ నుంచే ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ప్రశ్నలు పీజీ స్పెషలైజేషన్‌ సిలబస్‌ స్థాయిలో ఉంటాయి. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి ఇంటర్మీడియెట్‌ నుంచి పీజీ వరకు అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. 

ప్రాక్టికల్‌ అప్రోచ్‌

అభ్యర్థులు ప్రిపరేషన్‌ సమయంలో ఆయా అంశాలను చదివేటప్పుడు అప్లికేషన్‌ ఓరియెంటేషన్, ప్రాక్టికల్‌ అప్రోచ్‌ను అనుసరించాలి. కారణం..పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉన్నప్పటికీ.. ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు ప్రాక్టికల్‌ థింకింగ్, అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌లు ఎంతో అవసరమవుతున్నాయి. క్రిటికల్‌ థింకింగ్, అనలిటికల్‌ అప్రో­చ్‌ మెరుగుపరచుకుంటే.. ప్రశ్నలు ఏ విధంగా అడిగినా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.

యూజీసీ నెట్‌తో ప్రయోజనాలివే

  • యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణత సాధించి తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు పలు అవకాశాలు లభిస్తున్నాయి. 
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హోదాతో అధ్యాపక వృత్తిలో అడుగు పెట్టొచ్చు. యూజీసీ నిబంధనల ప్రకారం-నెట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేటగిరీలో అర్హత సాధించిన వారినే ఈ పోస్ట్‌లకు ఎంపిక చేయాలి. 
  • జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే.. ప్రముఖ రీసెర్చ్‌ లేబొరేటరీల్లో మూడేళ్లపాటు జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోగా పనిచేయొచ్చు. తొలిæరెండేళ్లు జేఆర్‌ఎఫ్‌ హోదాలో నెలకు రూ.31 వేల ఫెలోషిప్‌ పొందొచ్చు.
  • జేఆర్‌ఎఫ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారి­కి ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత లభిస్తుంది. ఈ దశలో రెండేళ్లపాటు నెలకు రూ.35 వేల స్కాలర్‌షిప్‌ అందుతుంది. 
  • ఐఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, ఇతర రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో పీహెచ్‌డీ, రీసెర్చ్‌ అభ్యర్థుల ఎంపికలో నెట్‌ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది.
  • జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు పూర్తి చేసుకున్న వారికి సైంటిస్ట్‌లుగా ప్రభుత్వ విభాగాల్లో కెరీర్‌ ప్రారంభించే అవకాశం లభిస్తుంది. 
  • ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌ సబ్జెక్ట్‌ల్లో జేఆర్‌ఎఫ్‌కు ఎంపికై పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పురావస్తు శాఖ, ఆర్థిక గణాంక శాఖలు, సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖ వంటి పలు ప్రభుత్వ విభాగాల్లో రీసెర్చ్‌ స్కాలర్స్‌గా అవకాశాలు దక్కుతాయి.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: మే 31, 2023
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ: జూన్‌ 2, 3 తేదీల్లో
  • యూజీసీ నెట్‌ తేదీలు: జూన్‌ 13 నుంచి 22 వరకు (ప్రతి రోజు ఉదయం 9 నుంచి 12:30 వరకు; మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు)
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: https://ugcnet.nta.nic.in/, https://www.nta.ac.in/
Published date : 23 May 2023 04:31PM

Photo Stories