UGC NET - 2022: పరిశోధనల్లో అడుగుపెట్టేలా..!
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. జాతీయ స్థాయిలో.. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేరుతో.. నిర్వహించే పరీక్ష.. యూజీసీ–నెట్! పీజీ అర్హతగా నిర్వహించే..యూజీసీ నెట్‌లో.. ఉత్తీర్ణత సాధించి.. మెరిట్ జాబితాలో నిలిస్తే.. దేశంలోని ప్రసిద్ధ సంస్థల్లో పీహెచ్‌డీ చేసే అవకాశం లభిస్తుంది! వీరికి ఆర్థిక ప్రోత్సాహకం సైతం అందుతుంది! అంతేకాకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాతో.. అధ్యాపక వృత్తిలో కెరీర్ ప్రారంభించే వీలు కూడా ఉంది. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న యూజీసీ నెట్‌కు ఇటీవల నోటిఫికేషన్ వెలువడింది. యూజీసీ–నెట్ డిసెంబర్–2021, జూన్–2022లకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. యూజీసీ నెట్ వివరాలు, ప్రయోజనాలు, పరీక్ష విధానం, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై విశ్లేషణ...
- యూజీసీ–నెట్ డిసెంబర్–2021, జూన్–2022లకు సంయుక్త ప్రకటన
- విజయం సాధిస్తే.. జేఆర్‌ఎఫ్‌కు అర్హత
- అధ్యాపక వృత్తికి కూడా మార్గం.. యూజీసీ–నెట్
- నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్‌టీఏ
పరిశోధనలు, పీహెచ్‌డీ çపట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. పరిశోధన రంగంలో ప్రవేశించాలని ఉవ్విళూరుతున్నారు. ఇలాంటి వారికి చక్కటి మార్గం..యూజీసీ నెట్. ఈ పరీక్షలో ప్రతిభ చూపడం ద్వారా పరిశోధనలే కాకుండా.. అధ్యాపక వృత్తిలోనూ అడుగులు వేయొచ్చు. యూజీసీ–నెట్‌ను ప్రస్తుతం జాతీయ స్థాయిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
డిసెంబర్–2021, జూన్–2022 సంయుక్తంగా
- వాస్తవానికి ఏటా రెండుసార్లు డిసెంబర్, జూన్ నెలల్లో యూజీసీ–నెట్ నిర్వహిస్తారు. గత ఏడాది కోవిడ్ పరిస్థితుల కారణంగా డిసెంబర్–2021 సెషన్ నిర్వహించడానికి వీలు పడలేదు. దీంతో డిసెంబర్–2021,జూన్–2022లను కలిపి సంయుక్తంగా నిర్వహించాలని నిర్ణయించారు.
- తాజా నోటిఫికేషన్ ప్రకారం–మొత్తం 82 సబ్జెక్ట్‌లలో యూజీసీ నెట్ డిసెంబర్–2021, జూన్–2022ను నిర్వహించనున్నారు. ఎకనామిక్స్, హిస్టరీ, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, ఇండియన్ కల్చర్ తదితర ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, లింగ్విస్టిక్ సబ్జెక్ట్‌లతోపాటు కంప్యూటర్ సైన్స్, క్రిమినాలజీ, మేనేజ్‌మెంట్ వంటి ప్రొఫెషనల్ సబ్జెక్ట్‌లు కూడా ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా హిందూ స్టడీస్ సబ్జెక్ట్‌ను చేర్చారు. పీజీ స్థాయిలో చదివిన స్పెషలైజేషన్‌కు అనుగుణంగా ఆయా పేపర్లకు హాజరయ్యే అర్హత లభిస్తుంది.
రెండు కేటగిరీలుగా పరీక్ష
- యూజీసీ–నెట్‌ను అసిస్టెంట్ ప్రొఫెసర్,జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే రెండు కేటగిరీల్లో నిర్వహిస్తారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు తాము ఏ కేటగిరీ పరీక్షకు హాజరుకాదలచారో స్పష్టం చేయాలి.
- పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న వారు.. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకోవాలి.
- అధ్యాపక వృత్తిలో స్థిరపడాలనే ఉద్దేశం ఉన్న వారు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.
రెండు పేపర్లుగా పరీక్ష
- యూజీసీ నెట్ పరీక్ష.. రెండు పేపర్లుగా ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహించనున్నారు.
- పేపర్–1 అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్.. అభ్యర్థులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి.
- పేపర్–2.. ఇది అభ్యర్థుల పీజీ స్పెషలైజేషన్ ఆధారంగా యూజీసీ నెట్‌లో పేర్కొన్న సబ్జెక్ట్‌కు సంబంధించిన పరీక్ష. ఉదాహరణకు పీజీ స్థాయిలో హిస్టరీ స్పెషలైజేషన్ చదివిన అభ్యర్థులు హిస్టరీ సబ్జెక్ట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
మొత్తం 300 మార్కులు
యూజీసీ నెట్‌ను మొత్తం 300 మార్కులకు రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు.
పేపర్ | అంశం | ప్రశ్నలు | మార్కులు |
---|---|---|---|
పేపర్–1 | టీచింగ్/రీసెర్చ్ ఆప్టిట్యూడ్ | 50 | 100 |
పేపర్–2 | సబ్జెక్ట్ సంబంధిత పేపర్ | 100 | 200 |
మొత్తం మార్కులు | 300 |
కనీస అర్హత మార్కులు
యూజీసీ నెట్‌లో(జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్) ఉత్తీర్ణత సాధించాలంటే.. అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లలో కలిపి కనీసం 40 శాతం మార్కులు, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. ఈ సడలింపు(35 శాతం మార్కులు) జనరల్– ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా ఉంటుందని పేర్కొన్నారు.
ఆరు శాతం మంది ఎంపిక
యూజీసీ నెట్‌కు హాజరైన మొత్తం అభ్యర్థుల్లో ఆరు శాతం మందిని మాత్రమే నెట్ ఉత్తీర్ణులుగా ప్రకటించనున్నారు. జేఆర్‌ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగాలకు సంబంధించి కనీస అర్హత మార్కుల ఆధారంగా ఉత్తీర్ణులను ప్రకటించనున్నారు.
యూజీసీ నెట్‌తో ప్రయోజనాలు
- యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణత సాధించి తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు పలు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అవి..
- అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాతో అధ్యాపక వృత్తిలో సులభంగా అడుగుపెట్టొచ్చు. యూజీసీ నిబంధనల ప్రకారం–నెట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో ఉత్తీర్ణత సాధించిన వారినే ఈ పోస్ట్‌లకు ఎంపిక చేయాలి. ఏడో పీఆర్‌సీ సిఫార్సుల ప్రకారం–యూజీసీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ పే స్కేల్‌ను ఈ హోదాలో ప్రారంభంలోనే నెలకు రూ. 67 వేలు బేసిక్ పే చెల్లించే విధంగా నిర్ణయించింది.
- జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే.. ప్రముఖ రీసెర్చ్ లేబొరేటరీల్లో మూడేళ్లపాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేయొచ్చు. ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో పీహెచ్‌డీ, రీసెర్చ్ అభ్యర్థుల ఎంపికలో నెట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది.
- మొదటి రెండేళ్లు జేఆర్‌ఎఫ్ హోదాలో నెలకు రూ.31వేల ఫెలోషిప్ లభిస్తుంది.
- జేఆర్‌ఎఫ్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత లభిస్తుంది. ఈ దశలో రెండేళ్లపాటు నెలకు రూ.35 వేల స్కాలర్‌షిప్ అందుతుంది.
- జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు పూర్తి చేసుకున్న వారికి సైంటిస్ట్‌లుగా ప్రభుత్వ విభాగాల్లో కెరీర్ ప్రారంభించే అవకాశం లభిస్తుంది.
- సైంటిస్ట్‌లుగా ఎంపికైన వారికి.. వారి గ్రేడ్ ఆధారంగా ప్రారంభంలోనే నెలకు రూ.80 వేల వేతనం పొందే అవకాశాలున్నాయి.
- ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్‌లలో జేఆర్‌ఎఫ్‌కు ఎంపికై పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పురావస్తు శాఖ, ఆర్థిక గణాంక శాఖలు, సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖ వంటి పలు ప్రభుత్వ శాఖల్లో రీసెర్చ్ స్కాలర్స్‌గా అవకాశాలు లభిస్తాయి.
విజయానికి సన్నద్ధత ఇలా
కేవలం ఆరు శాతం మందిని మాత్రమే తుది జాబితాకు ఎంపిక చేసే నెట్ జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీల్లో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు పరిశోధనల పట్ల తమకున్న ఆసక్తి మొదలు, సబ్జెక్ట్ పరంగా సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవడం ముఖ్యం. పేపర్ వారీగా అనుసరించాల్సిన ప్రిపరేషన్ విధానం..
పేపర్–1
- అభ్యర్థులందరికీ ఉమ్మడి పేపర్‌గా నిర్దేశించిన పేపర్–1లో.. టీచింగ్, రీసెర్చ్ ఆసక్తులను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి.
- మొత్తం పది విభాగాలు(టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్,ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ అండ్ ఎన్విరాన్‌మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్–గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్)నుంచి ఒక్కో విభాగంలో అయిదు ప్రశ్నలు అడుగుతారు.
పేపర్–2.. సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలు
- పేపర్–2లో అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్ నుంచే ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ప్రశ్నలు.. పీజీ స్పెషలైజేషన్ సిలబస్ స్థాయిలో ఉంటాయి. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి.. ఇంటర్మీడియెట్ నుంచి పీజీ వరకూ.. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
- ఆయా అంశాలను అప్లికేషన్ ఓరియెంటేషన్, ప్రాక్టికల్ అప్రోచ్‌తో అభ్యసించాలి. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు ప్రాక్టికల్ థింకింగ్, అప్లికేషన్ ఓరియెంటేషన్ అవసరమవుతుంది. అభ్యర్థులు క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ అప్రోచ్ అలవరచుకోవాలి. ఫలితంగా ప్రశ్నలు ఏ తీరులో అడిగినా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
యూజీసీ నెట్– ముఖ్య సమాచారం
- డిసెంబర్–2021,జూన్–2022 రెండూ కలిపి సంయుక్తంగా జూన్‌లో యూజీసీ–నెట్ నిర్వహణ.
- మొత్తం 82 సబ్జెక్ట్‌లలో పరీక్ష.
- అర్హత: పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం సడలింపు లభిస్తుంది.
- పీజీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయో పరిమితి: జేఆర్‌ఎఫ్ అభ్యర్థులు జూన్ 1, 2022 నాటికి 31ఏళ్లు మించకూడదు. ఓబీసీ–ఎన్‌సీఎల్, ఇతర రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో మరో అయిదేళ్ల సడలింపు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థుల విషయంలో ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
దరఖాస్తు విధానం
- అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్ 30 నుంచి మే 20 వరకు;
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ: మే 21 నుంచి మే 23 వరకు;
- పరీక్ష తేదీ: జూన్ రెండు లేదా మూడో వారంలో నిర్వహించే అవకాశం;
- ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: https://ugcnet.nta.nic.in, www.nta.ac.in
చదవండి: UGC NET 2022: యూజీసీ నెట్-2022(జూన్) నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు ఇవే..