UPSC Mains Cutoff 2023: సివిల్స్ మెయిన్.. కటాఫ్ 750–800!
- ఎస్సే, జీఎస్–1 పేపర్లు క్లిష్టం అంటున్న అభ్యర్థులు
- తాత్వికత మొదలు తాజా పరిణామాల వరకు ప్రశ్నలు
- అన్ని అంశాలపై అవగాహన స్థాయి తెలుసుకునేలా పరీక్షలు
‘గత రెండు, మూడేళ్లుగా లేని రీతిలో ఈ సారి సివిల్స్ మెయిన్ పరీక్ష పేపర్లు అభ్యర్థులను కొంత ఇబ్బందికి గురి చేశాయని చెప్పొచ్చు. ఇక్కడ ఇబ్బంది అంటే.. వారు ఊహించిన దానికి భిన్నంగా ప్రశ్నలు అడగడమే. ముఖ్యంగా జనరల్ ఎస్సేలో ఈ తీరు ప్రస్ఫుటించింది’ అంటున్నారు నిపుణులు. మొత్తం 1,105 పోస్ట్‌ల భర్తీకి నిర్వహించిన సివిల్స్ మెయిన్స్‌కు దేశవ్యాప్తంగా 14,624 మంది అర్హత సాధించగా.. పరీక్షకు దాదాపు 80 శాతం మంది హాజరైనట్లు అంచనా.
చదవండి: Civils Guidance
మిశ్రమ స్పందన
సివిల్స్ మెయిన్స్–2023 పరీక్షలపై అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. జనరల్ ఎస్సే, జనరల్ స్టడీస్ నాలుగు పేపర్లు, రెండు ఆప్షనల్ పేపర్లు కలిపి మొత్తం ఏడు పేపర్లుగా 1,750 మార్కులకు మెయిన్స్ జరిగింది. వీటిల్లో కొన్ని పేపర్లు క్లిష్టంగా, కొన్ని పేపర్లు సులభంగా ఉన్నాయని.. మొత్తంగా చూస్తే పర్సనాలిటీ టెస్ట్‌కు చేరుకోవాలంటే.. మెయిన్స్‌లో 750 మార్కులు కటాఫ్‌గా నిలిచే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పేపర్–1 జనరల్ ఎస్సే
సివిల్స్ మెయిన్‌లో అత్యంత కీలకం జనరల్ ఎస్సే. ఈ పేపర్ ఈ ఏడాది చాలా కష్టంగా వచ్చిందనేది కొంతమంది అభ్యర్థులు, సబ్జెక్ట్ నిపుణుల వాదన. అభ్యర్థుల్లోని తాత్విక దృక్పథం, తార్కిక విశ్లేషణను పరిశీలించేలా ప్రశ్నలు కనిపించాయి. రెండు సెక్షన్లుగా నిర్వహించిన ఈ పేపర్‌లో ఒక్కో సెక్షన్‌లో నాలుగు ప్రశ్నలు అడిగి.. ఏదైనా ఒక ప్రశ్నకు ఎస్సే రాయాలని పేర్కొన్నారు. ఈ రెండు సెక్షన్లలోనూ అభ్యర్థుల్లోని తార్కిక విశ్లేషణ నైపుణ్యం, నైతిక విలువలకు సంబంధించిన దృక్పథాన్ని ప్రశ్నించే విధంగా ఎదురయ్యాయి. ఉదాహరణకు.. సెక్షన్–ఎలో.. నాట్ ఆల్ హూ వాండర్ ఆర్ లాస్ట్, విజినరీ డెసిజన్ మేకింగ్ హ్యాపెన్స్ ఎట్ ద ఇంటర్‌సెక్షన్ ఆఫ్ ఇన్‌ట్యూషన్ అండ్ లాజిక్ వంటి ప్రశ్నలు; అదేవిధంగా సెక్షన్–బిలో.. మ్యాథమెటిక్స్ ఈజ్ ద మ్యూజిక్ ఆఫ్ రీజన్స్ వంటి ప్రశ్నలు అడిగారు.
ఇవన్నీ అభ్యర్థుల్లోని తార్కిక విశ్లేషణ, సామాజిక విలువలకు సంబంధించినవి. దీంతో సబ్జెక్ట్, సమకాలీన అంశాలపై ప్రశ్నలు వస్తాయని భావించిన అభ్యర్థులు కొంత ఇబ్బందికి గురయ్యారని చెబుతున్నారు. ఈ పేపర్‌లో 250 మార్కులకు 120 నుంచి 130 మధ్య స్కోర్ ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.
పేపర్–2 (జీఎస్–1)కూడా క్లిష్టంగానే
రెండో పేపర్ జనరల్ స్టడీస్ పేపర్–1 కూడా క్లిష్టంగానే ఉందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఆయా టాపిక్స్‌కు సంబంధించి లోతైన అవగాహన, సంపూర్ణ పరిజ్ఞానం ఉంటేనే సమాధానాలు ఇచ్చేలా ప్రశ్నలు అడిగారు. ప్రపంచ చరిత్రకు సంబంధించి, జాగ్రఫీ, భారత చరిత్ర అన్నింటికి సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రశ్నలు అడిగారు. ఆధునిక భారత చరిత్రకు సంబంధించిన ప్రశ్నల క్లిష్టత స్థాయి ఓ మోస్తరుగా ఉండటంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారనే చెప్పొచ్చు. ఇదే సమయంలో జాగ్రఫీకి ఎక్కువ వెయిటేజీ కల్పిస్తూ ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా ఎకనామిక్ జాగ్రఫీ సంబంధిత ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇవి ఆయా అంశాలపై అభ్యర్థులకున్న ప్రాథమిక అవగాహనను పరీక్షించే విధంగా ఉన్నాయి. సొసైటీ విభాగానికి సంబంధించి కూడా విశ్లేషణ నైపుణ్యాన్ని, భారత సమాజంపై అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడగడంతో అభ్యర్థులు సులభంగా భావించారు. మొత్తంగా ఈ పేపర్‌లో 150 నుంచి 170 మార్కుల వరకు సాధించే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
పేపర్–3(జీఎస్–2).. ఓ మోస్తరు క్లిష్టత
జనరల్ స్టడీస్ పేపర్–2లో పరిపాలన, న్యాయపరమైన అంశాలు, అంతర్జాతీయ సంబంధాలపై అవగాహనను పరిశీలించే ప్రశ్నలు అడిగారు. క్లిష్టత స్థాయి ఓ మోస్తరుగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం 20 ప్రశ్నల్లో.. రాజ్యాంగ సిద్ధాంతాలు,న్యాయపరమైన అంశాలు, పరిపాలన, స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రశ్నలు కనిపించాయి. అదే విధంగా.. కేస్ స్టడీ ఆధారిత ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఈ పేపర్‌లోనే ఆయా అంశాలకు సంబంధించిన అభ్యర్థుల పరిజ్ఞానాన్ని అన్ని కోణాల్లో పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగారు. మొత్తం 20 ప్రశ్నలు అడిగిన ఈ పేపర్‌లో.. రైటింగ్ ప్రాక్టీస్, సబ్జెక్ట్‌పై పట్టు, కరెంట్ అఫైర్స్ నైపుణ్యం ఉన్న అభ్యర్థులు 15 ప్రశ్నలు సమాధానాలు ఇచ్చే అవకాశం ఉందని సబ్జెక్ట్ నిపుణులు తెలిపారు. మొత్తంగా చూస్తే ఈ పేపర్‌లో కూడా 150 నుంచి 175 మార్కులను బెస్ట్ స్కోర్‌గా భావించొచ్చని అంచనా.
చదవండి: Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే .. ప్రిపరేషన్ కింగ్
పేపర్–4(జీఎస్– 3).. సిలబస్ పరిధిలోనే
మెయిన్స్ అభ్యర్థులకు జీఎస్–3 (పేపర్–4)లో కలిసొచ్చిన అంశం.. ఇందులో అడిగిన ప్రశ్నలన్నీ సిలబస్ పరిధిలోనే ఉండడం. ఆర్థిక వృద్ధి, డిజిటలైజేషన్, వ్యవసాయం, భూ సంస్కరణలు, టెక్నాలజీ, పర్యావరణం, సామాజిక అంశాల నుంచి ప్రశ్నలు అడిగారు. ప్రశ్నలన్నీ డైరెక్ట్‌గా ఉండడం కూడా అభ్యర్థులకు ఉపశమనం కలిగించింది. కొన్ని ప్రశ్నలను సమకాలీన అంశాలతో ముడిపెడుతూ అడగడంతో కరెంట్ అఫైర్స్‌పై పట్టు ఉన్న అభ్యర్థులే సమాధానం ఇచ్చి ఉంటారనే వాదన వినిపిస్తోంది. ఈ పేపర్‌లో.. ఇండియన్ ఎకానమీ సంబంధిత ప్రశ్నలు ఓ మోస్తరు క్లిష్టంగా ఉన్నాయి. కొన్ని ప్రశ్నలు వ్యవసాయం, ఆహార సరఫరాకు సంబంధించినవిగా సమకాలీన అంశాల సమ్మిళితంగా అడిగారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అడిగిన ప్రశ్నలు సులభంగానే ఉన్నాయి. ఇటీవల కాలంలో కీలకంగా మారిన హెల్త్‌కేర్ రంగం, అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్రపై ప్రశ్నలు అడిగారు. ఇతర సామాజిక సమకాలీన అంశాలకు(ఉదా: నిరుద్యోగం, నిరుద్యోగాన్ని గణించే విధానం, ఎలక్ట్రిక్ వెహికిల్స్ తదితర) ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తంగా చూస్తే ఈ పేపర్‌లోనూ అభ్యర్థులు 170 మార్కుల వరకు స్కోర్ చేసే అవకాశాముందని అంచనా.
పేపర్–5 (జీఎస్–4)..
నైతికత, చిత్తశుద్ధి, వైఖరి ఆధారిత అంశాలపై ప్రశ్నలు అడిగే పేపర్.. జీఎస్–4. ఇందులో మొత్తం రెండు సెక్షన్లుగా 12 ప్రశ్నలు అడిగారు. వీటిలో మొదటి సెక్షన్‌లో ఇంటెగ్రిటీ, ఎథిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. అభ్యర్థుల్లోని నిర్ణయ సామర్థ్యాన్ని, అదే విధంగా మోరల్ జడ్జ్‌మెంట్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమిస్తారో తెలుసుకునేలా ప్రశ్నలు ఉన్నాయి. మొదటి సెక్షన్‌లో ప్రతి ప్రశ్నలోనూ రెండు ఉప ప్రశ్నలు, ఆరో ప్రశ్నలో మూడు ఉప ప్రశ్నలు ఉండటంతో అభ్యర్థులు సమాధానాలు ఇవ్వడంలో సమయాభావం ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. ప్రశ్నలన్నీ డైరెక్ట్ కొశ్చన్స్‌గా ఉండడం అభ్యర్థులకు కొంత కలిసొచ్చింది.
సెక్షన్–బిలో అడిగిన కేస్ స్టడీ ఆధారిత(ప్యాసేజ్ ఆధారిత) ప్రశ్నల్లో కొన్ని సుదీర్ఘంగా ఉండడమే కాకుండా.. మరికొన్ని కేస్ స్టడీస్‌కు సంబంధించినవి. అడిగిన ప్రశ్నలకు సదరు ప్యాసేజ్‌లో సంబంధిత సమాచారం లేకపోవడం వంటివి కొంత సమస్యగా మారాయి. మొత్తంగా ఈ పేపర్‌ను విశ్లేషిస్తే.. ఒక సివిల్ సర్వెంట్ మాదిరిగా ఆలోచించి సమాధానాలు ఇవ్వాల్సి విధంగా ప్రశ్నలు అడిగారని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పేపర్‌లో కూడా 150 నుంచి 170 వరకు మార్కులు సాధించేందుకు ఆస్కారం ఉందని అంటున్నారు.
చదవండి: Groups Preparation Tips: 'కరెంట్ అఫైర్స్'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!
ఆప్షనల్స్.. సబ్జెక్ట్ + సమకాలీనంగా
సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలో కీలకంగా భావించే పేపర్లు.. ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లు. పేపర్–6, పేపర్–7లుగా.. అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్ నుంచి రెండు పేపర్లులో పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్–2023లో ప్రతి ఆప్షనల్‌కు సంబంధించి సమకాలీన అంశాలను కోర్ సబ్జెక్ట్‌తో అనుసంధానం చేసుకుంటూ సమాధానాలివ్వాల్సిన విధంగా ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జాగ్రఫీలలో ఈ ధోరణి కనిపించింది. హిస్టరీ ఆప్షనల్‌కు సంబంధించి అధిక శాతం సబ్జెక్ట్ నైపుణ్యం ఆధారిత ప్రశ్నలే వచ్చాయి.
చదవండి: Civil Services (Preliminary) Examination 2023: ప్రిలిమ్స్ కటాఫ్.. 88-95!
750–800 కటాఫ్ అంచనా
సివిల్స్ మెయిన్స్ 2023 పరీక్ష శైలిని విశ్లేషిస్తే.. కటాఫ్ మార్క్ ఓపెన్ కేటగిరీలో 750 నుంచి 800 మధ్యలో ఉండొచ్చనేది నిపుణుల అంచనా. దీంతో.. ఈ స్థాయిలో మార్కులు పొందుతామని భావిస్తున్న అభ్యర్థులు పర్సనాలిటీ టెస్ట్‌లో విజయానికి ఇప్పటి నుంచే సన్నద్ధత ప్రారంభించాలని సూచిస్తున్నారు.
గత ఏడాది కటాఫ్‌లను పరిగణనలోకి తీసుకుంటే.. జనరల్ కేటగిరీలో 748 మార్కులు; ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 715 మార్కులు; ఓబీసీ కేటగిరీలో 714 మార్కులు; ఎస్‌సీ కేటగిరీలో 699 మార్కులు; ఎస్‌టీ కేటగిరీలో 706 మార్కులు కటాఫ్ మార్కులుగా నమోదయ్యాయి.
Qualification | GRADUATE |
Experience | Fresher job |