AP Teacher Recruitment 2022: టీచర్ కొలువు.. పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్
ఉపాధ్యాయ వృత్తిలో స్థిర పడాలనే లక్ష్యంతో బీఈడీ, డీఈడీ వంటి కోర్సులు పూర్తి చేసుకుని.. ప్రభుత్వ కొలువు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు విభాగాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో.. మొత్తం 502 టీచర్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతేకాకుండా పరీక్ష తేదీని సైతం ప్రకటించడం విశేషం! దీంతో టీచర్ కొలువుల అభ్యర్థులు తమ లక్ష్య సాధనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన టీచర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వివరాలు, అర్హతలు, పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్..
- 502 స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ, ఎస్‌జీటీ, మ్యూజిక్ టీచర్ పోస్ట్‌లు
- ప్రభుత్వ, మున్సిపల్, మోడల్ స్కూల్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్‌లో ఉద్యోగాలు
- కొనసాగుతున్న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారంప్రభుత్వ పాఠశాలలు(ఎంపీపీ, జడ్‌పీపీ, మున్సిపల్), మహాత్మ జ్యోతిబా పులే ఏపీ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ పరిధిలోని మోడల్ స్కూల్స్, అదే విధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్‌లోని ఎస్‌జీటీ, ఎస్‌ఏ, పీజీటీ, టీజీటీ, మ్యూజిక్ టీచర్ స్థాయిలో..మొత్తం 502 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు
- ప్రభుత్వ, జడ్‌పీపీ, ఎంపీపీ, జీపీఏ పాఠశాలల్లో - సెకండరీ గ్రేడ్ టీచర్స్: 69, స్కూల్ అసిస్టెంట్స్: 123, మ్యూజిక్ టీచర్స్: 7.
- మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్స్ పాఠశాలల్లో ఎస్‌జీటీలు: 5
- మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్స్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్స్: 10
- మోడల్ స్కూల్స్‌లో 176 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 31 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు.
- స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్‌లో.. 81 స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌లు.
- వీటికోసం వేర్వేరుగా మూడు నోటిఫికేషన్లు విడుదల చేశారు.
చదవండి: AP Teacher Jobs: ఏపీ ప్రభుత్వ జడ్పీ, ఎంపీ పాఠశాలల్లో 214 టీచర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
అర్హతలు
- దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌లను అనుసరించి సంబంధిత సబ్జెక్ట్‌లతో ఇంటర్మీడియెట్, డిగ్రీ, బీఈడీ, డీఈడీ,స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడీ తదితర అర్హతలు ఉండాలి.
- వయసు: జూలై 1, 2022 నాటికి 18-44 ఏళ్లు (ఎస్‌సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు లభిస్తుంది)
ఎంపిక విధానం
- ఆయా విభాగాల పరిధిలోని పాఠశాలల్లో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్, మ్యూజిక్ టీచర్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్స్ పోస్ట్‌లను భర్తీ చేసే క్రమంలో టెట్, టెట్ కమ్ టీఆర్‌టీ విధానంలో రాత పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని పోస్ట్‌ల పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు.
- స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌లకు నిర్వహించే టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష నాలుగు విభాగాలుగా 80 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షకు 80శాతం, టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు.
- ఎస్‌జీటీలకు సంబంధించి 100 మార్కులకు టెట్ కమ్ టీఆర్‌టీ పేరుతో పరీక్ష నిర్వహిస్తారు.
- మ్యూజిక్ టీచర్ రాత పరీక్షకు 70 మార్కులు, స్కిల్ టెస్ట్‌కు 30 మార్కులు కేటాయిస్తారు.
మోడల్ సూల్స్.. ఎంపిక ఇలా
- మోడల్ స్కూల్స్‌లోని పీజీటీ, టీజీటీ పోస్టులకు కూడా రాత పరీక్ష ఆధారంగానే ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీ) పోస్ట్‌లకు రెండు పేపర్లుగా పరీక్ష ఉంటుంది.
- పేపర్-1ను ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌గా 100 ప్రశ్నలు-100 మార్కులకు నిర్వహిస్తారు. పీజీటీ, టీజీటీ స్థాయిలో నాన్-లాంగ్వేజెస్ సబ్జెక్ట్‌ల అభ్యర్థులకు ఈ పరీక్ష ఉంటుంది. పేపర్2ను టీఆర్‌టీ పేరుతో నాలుగు విభాగాలుగా 100 మార్కులకు నిర్వహిస్తారు.
- టీజీటీ పోస్టులకు కూడా రెండు పేపర్లుగా పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1ను ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌గా 100మార్కులకు 100ప్రశ్నలతో నిర్వహిస్తారు. పేపర్-2 నాలుగు విభాగాలుగా 80 మార్కులకు ఉంటుంది. మిగతా 20 మార్కులు ఏపీ టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఇస్తారు.
- రెండు పోస్ట్‌లకు సంబంధించి పేపర్-1ను అర్హత పేపర్‌గా నిర్దేశించారు. ఈ పేపర్‌లో కనీస అర్హత మార్కులు(జనరల్ కేటగిరీ అభ్యర్థులు 60శాతం,రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 50శాతం) సాధిస్తేనే పేపర్-2 మూల్యాంకన చేస్తారు.
- పేపర్-1ను గంటన్నర, పీజీటీ పేపర్-2 మూడు గంటలు, టీజీటీ పేపర్-2 రెండున్నర గంటల వ్యవధిలో నిర్వహిస్తారు.
- స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పరీక్ష ఇలా: ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ ఎట్ సెకండరీ స్టేజ్ కేటగిరీలో స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలోని స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌లకు 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. సమగ్ర శిక్ష అభియాన్‌లో ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్చ్ టీచర్‌గా పనిచేస్తున్న వారికి.. వారి సర్వీస్ పిరియడ్ ఆధారంగా అయిదు మార్కుల వెయిటేజీ ఇస్తారు.
ఏపీ టీచర్ రిక్రూట్‌మెంట్ - ముఖ్య సమాచారం
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 18, 2022
- ఆన్‌లైన్ మాక్‌టెస్ట్ సదుపాయం: అక్టోబర్ 17 నుంచి
- అన్ని పోస్ట్‌లకు పరీక్ష తేదీ: అక్టోబర్ 23 నుంచి (ప్రతి పోస్ట్‌కు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://cse.ap.gov.in
గెలుపు మార్గమిదే
ఎస్‌జీటీ
జీకే, కరెంట్ అఫైర్స్‌లో సిలబస్‌పై పూర్తిస్థాయి అవగాహన ఏర్పరచుకోవాలి. సబ్జెక్టుల వారీ వ్యూహాత్మక ప్రణాళికతో అధ్యయనం సాగించాలి. స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్‌పై ప్రత్యేక దృష్టిసారించాలి. అదే విధంగా భౌగోళిక నామాలు, నదీతీర నగరాలు, దేశాలు-రాజధానులు, ప్రపంచంలో మొట్టమొదట చోటుచేసుకున్న సంఘటనలు, అవార్డులు, సదస్సులు, వార్తల్లో వ్యక్తులు, బడ్జెట్, అంతర్జాతీయ రాజకీయ అంశాలు, శాస్త్రసాంకేతిక అంశాలు వంటి వాటి గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి.
విద్యా దృక్పథాలు
దేశంలో విద్యా చరిత్ర, కమిటీలు; వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధిత అంశాలు; ఉపాధ్యాయ సాధికారత; చట్టాలుహక్కులు; జాతీయ పాఠ్యప్రణాళికా చట్టం(ఎన్‌సీఎఫ్-2005); విద్యాహక్కు చట్టం, నూతన విద్యా విధానం తదితర అంశాలపై పట్టు సాధించాలి.
విద్యా మనోవిజ్ఞానశాస్త్రం
శిశు వికాసం అభివృద్ధి్ధ, వైయక్తిక భేదాలు, అభ్యసనం, మూర్తిమత్వం.. అంశాలు చాలా ముఖ్యమైనవి. శిశు వికాసంలో.. వికాసం, పెరుగుదల, పరిపక్వత భావన -స్వభావం, వికాస నియమాలు, వికాసంపై ప్రభావం చూపే కారకాలు, వికాస దశలు తదితర అంశాలపై దృష్టి సారించాలి. ముఖ్య భావనలకు సంబంధించిన అనువర్తనాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. కాన్సెప్టులపై పట్టుసాధించాలి.
కంటెంట్
- తెలుగు(ఆప్షనల్), ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల కంటెంట్‌లో సన్నద్ధతకు పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి. తెలుగులో కవులు-కావ్యాలు, అర్థాలు, పర్యాయపదాలు, జాతీయాలు తదితరాలతోపాటు భాషాంశాలను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ తదితరాలపై పట్టు సాధించాలి.
- గణితంలో.. అర్థమెటిక్, సంఖ్యా వ్యవస్థ, క్షేత్ర గణితం, రేఖా గణితం, బీజ గణితం, సాంఖ్యక శాస్త్రం అంశాలపై పట్టు సాధించాలి. పదో తరగతి స్థాయిలోని మ్యాథమెటిక్స్‌ను అధ్యయనం చేయడం లాభిస్తుంది.
- సైన్స్‌లో.. జీవ ప్రపంచం, మొక్కలు, జంతువులు, ఆహారం, పోషణ, ఆహార పిరమిడ్, మానవ శరీరం, పదార్థాలు, కొలతలు, ప్రమాణాలు, ఆమ్లాలుక్షారాలు, శక్తి రూపాలు, పునరుత్పాదక ఇంధన వనరులు తదితర అంశాలపై దృష్టి సారించాలి.
- ధ్వని, విద్యుత్, కాంతి, ఉష్ణం చాప్టర్లలోని ముఖ్య భావనలు, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలపై పట్టుసాధించాలి. అదే విధంగా జీవవైవిధ్యం, ఆవరణ వ్యవస్థలు, పర్యావరణ సమస్యలు, భూతాపం తదితర అంశాలు ముఖ్యమైనవి.
- సోషల్ స్టడీస్‌లో.. స్థానిక భౌగోళిక అంశాలు, ఖండాలు, పారిశ్రామిక విప్లవం, మనీబ్యాంకింగ్, ప్రభుత్వం; రాజకీయ వ్యవస్థలు, జాతీయ ఉద్యమం, భారత రాజ్యాంగం, పరిపాలన, సాంఘిక సంస్థలు, అసమానతలు, మతం-సమాజం, సంస్కృతి, కమ్యూనికేషన్ తదితర అంశాలపై అవగాహన అవసరం.
స్కూల్ అసిస్టెంట్
- ఆయా సబ్జెక్టుల కంటెంట్ ప్రిపరేషన్‌కు ఆరు నుంచి ఇంటర్మీడియెట్ వరకు.. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను చదవాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ప్రధానంగా బీజగణితం, సదిశా బీజగణితం, వైశ్లేషిక రేఖాగణితం, కలన గణితం, త్రికోణమితి అంశాలపై పట్టు సాధించాలి. బయాలజీలో జీవ ప్రపంచం, సూక్ష్మజీవుల ప్రపంచం, జీవశాస్త్రం-ఆధునిక పోకడలు, జంతు ప్రపంచం తదితర పాఠ్యాంశాలు కీలకం.
- సోషల్ స్టడీస్‌లో భారత స్వాతంత్య్ర ఉద్యమం, ప్రపంచ యుద్ధాలు-అనంతర పరిస్థితులు; రాజ్యాంగం, యూఎన్‌వో, సమకాలీన ప్రపంచ అంశాలు; జాతీయ ఆదాయం, భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు తదితర అంశాలపై దృష్టి సారించాలి. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీలనూ ప్రత్యేకంగా చదవాలి.
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Experience | Fresher job |
For more details, | Click here |