24,369 Constable Jobs In SSC: ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్ అంశాలు, విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్...
- 24,369 కానిస్టేబుల్ పోస్ట్‌ల భర్తీకి ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్
- పదో తరగతి అర్హతతోనే పోటీ పడే అవకాశం
- రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్‌లలో ప్రతిభ ఆధారంగా ఎంపిక
- ఎంపికైతే నెలకు రూ.40వేలకు పైగా వేతనం
పోలీస్ ఉద్యోగాలంటే.. యువతలో ఎంత క్రేజ్ నెలకొందో తెలిసిందే. పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణుల వరకు.. అర్హతలతో సంబంధం లేకుండా.. పోలీస్ కొలువులకు పోటీ పడుతున్నారు. అలాంటి వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజా ప్రకటన అత్యంత అనుకూలమైన పరిణామం.
ఎనిమిది దళాలు.. 24,369 పోస్టులు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కేంద్ర సాయుధ బలగాలు సహా.. మొత్తం ఎనిమిది దళాల్లో 24,369 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్-10,947; సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-100; సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్-8,911; సశస్త్ర సీమాబల్-1,284; ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీస్-1,613; అస్సాం రైఫిల్స్(రైఫిల్‌మెన్)-1,697; సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ -103; నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(సిపాయి)-164; మొత్తం పోస్ట్‌లలో 2,790 ఉద్యోగాలు మహిళలకు కేటాయించడం విశేషం. అస్సాం రైఫిల్స్ విభాగంలో రైఫిల్ మెన్ హోదాలో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయి పేరుతో ఖాళీలను పేర్కొన్నారు.
చదవండి: SSC Recruitment 2022: పదోతరగతి అర్హతతో 24,369 పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అర్హతలు
- జనవరి 1, 2023 నాటికి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- వయసు: జనవరి 1, 2023 నాటికి 18-23 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు లభిస్తుంది.
వేతనం
ఎంపిక ప్రక్రియలో విజేతలుగా నిలిస్తే.. కొలువులో చేరినప్పటి నుంచిపే లెవల్-1 (రూ. 18,000-56,900), పే లెవల్-3 (21,700-69,100)తో నెల వేతనం అందుకోవచ్చు. పే లెవల్-1ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయి పోస్ట్‌లకు ఎంపికైన వారికి నిర్ధారించగా.. మిగతా విభాగాలకు పే లెవల్-3ను పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే అన్నీ కలుపుకొని నెలకు రూ.40వేల వరకూ వేతనం అందుకునే అవకాశం ఉంది.
మూడంచెల ఎంపిక ప్రక్రియ
ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) ఎంపిక ప్రక్రియ మూడంచెల విధానంలో జరుగుతుంది. అవి.. రాత పరీక్ష; ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్; ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఈ మూడు దశల తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్‌లను కూడా నిర్వహిస్తారు.
తొలి దశ రాత పరీక్ష
ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. గంటన్నర వ్యవధిలో నాలుగు విభాగాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు-40 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్/హిందీ 20 ప్రశ్నలు-40 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు నెగెటివ్ మార్కింగ్ నిబంధన విధించారు. పరీక్షను ఇంగ్లిష్ లేదా హిందీ మీడియంలలో మాత్రమే రాయాలి.
రెండో దశ.. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
- రాత పరీక్షలో చూపిన ప్రతిభ, పొందిన మార్కుల ఆధారంగా.. రెండో దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌కు అర్హత పొందాలంటే..రాత పరీక్షలో తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధించాలి. జనరల్ కేటగరీ అభ్యర్థులు 30 శాతం మార్కులు; ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 25 శాతం మార్కులు, ఇతర రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 20 శాతం మార్కులు పొందాలి.
- పురుష అభ్యర్థులు అయిదు కిలోమీటర్లను 24 నిమిషాల్లో, మహిళా అభ్యర్థులు 1.6 కిలో మీటర్ల దూరాన్ని ఎనిమిదిన్నర నిమిషాల్లో చేరుకునే విధంగా పరుగు పందెం నిర్వహిస్తారు.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లోనూ ప్రతిభ చూపిన వారికి తదుపరి దశలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది.
- పురుష అభ్యర్థులు 170 సెంటీ మీటర్లు, మహిళా అభ్యర్థులు 157 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలి.
- పురుష అభ్యర్థులకు కనీస ఛాతి కొలత 80 సెంటీ మీటర్లు.. శ్వాస తీసుకున్నప్పుడు అయిదు సెంటీ మీటర్లు విస్తరించాలి.
తుది ఎంపిక ఇలా
మొత్తంగా.. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌లుగా సాగే అన్ని ప్రక్రియల్లోనూ అభ్యర్థులు చూపిన ప్రతిభ, పొందిన మార్కులు, ఇతర రిజర్వేషన్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని తుది విజేతలను ప్రకటిస్తారు. అదే విధంగా మొత్తం నాలుగు దశల్లో కనీస మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
చదవండి: AP Police Exams Study Material
కానిస్టేబుల్ రాత పరీక్షలో విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్..
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్
ఇందులో రాణించేందుకు వెర్బల్, నాన్-వెర్బల్ రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి. స్పేస్ విజువలైజేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, విజువల్ మెమొరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్ సిరిస్, కోడింగ్-డీకోడింగ్, నంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వర్డ్ బిల్డింగ్, వెన్ డయాగ్రమ్స్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్
అభ్యర్థుల్లోని సామాజిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే..భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి.
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్
ఈ విభాగంలో రాణించాలంటే.. ప్యూర్ మ్యాథ్స్‌తోపాటు అర్థ గణిత అంశాలపై దృష్టి పెట్టాలి. డెసిమల్స్, ప్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజస్, ప్రాఫిట్ అండ్ లాస్, అల్జీబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఇంగ్లిష్/హిందీ సబ్జెక్ట్‌కు సంబంధించి అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న భాషను ఎంచుకోవచ్చు. అధిక శాతం మంది ఇంగ్లిష్‌నే ఎంచుకుంటున్నారు. ఈ విభాగంలో రాణించడానికి బేసిక్ గ్రామర్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, మిస్-స్పెల్ట్ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్ /ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూటషన్స్, ప్యాసేజ్ కాంప్రహెన్షన్‌లను ప్రాక్టీస్ చేయాలి.
ఇతర పరీక్షల ప్రిపరేషన్‌తో అనుసంధానం
ఇప్పటికే పలు పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు..ఆ ప్రిపరేషన్‌తోనే ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్‌కు హాజరుకావచ్చు. సిలబస్‌లోని అంశాలు కూడా దాదాపు ఒకే విధంగా ఉన్న నేపథ్యంలో దీన్ని సద్వినియోగం చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 30, 2022
- రాత పరీక్ష తేదీ: జనవరి, 2023లో
- తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in
చదవండి: జీకే, కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి
Qualification | 10TH |
Experience | Fresher job |
For more details, | Click here |