Skip to main content

1,207 Jobs in SSC: ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి,డి ఎగ్జామినేషన్‌–2023 వివరాలు.. రాత పరీక్ష.. 200 మార్కులు

ఇంటర్మీడియెట్‌తోనే కేంద్ర ప్రభుత్వ కొలువు సొంతం చేసుకునేందుకు చక్కటి అవకాశం! స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ).. తాజాగా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 1,207 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ద్వారా స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టనుంది.ఈ నేపథ్యంలో..ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి,డి ఎగ్జామినేషన్‌–2023 వివరాలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్‌ తదితర వివరాలు..
ssc stenographer grade c and d exam preparation tips in telugu
  • కేంద్ర ప్రభుత్వ శాఖల్లో స్టెనో పోస్ట్‌లకు నోటిఫికేషన్‌
  • గ్రేడ్‌–సి, గ్రేడ్‌–డి స్థాయిలో 1,207 కొలువులు
  • ఇంటర్మీడియెట్‌ అర్హతతో పోటీ పడే అవకాశం
  • రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌.. సంక్షిప్తంగా ఎస్‌ఎస్‌సీ. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసి, ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది. ఇటీవల స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌–సి, గ్రేడ్‌–డి పోస్ట్‌ల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. 

మొత్తం 1,204 పోస్ట్‌లు
ఎస్‌ఎస్‌సీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం–గ్రేడ్‌–సి, గ్రేడ్‌–డి స్థాయిలో మొత్తం 1,204 స్టెనోగ్రాఫర్‌ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ఇందులో గ్రేడ్‌–సి హోదాలో 12 శాఖలు/విభాగాల్లో 49 పోస్ట్‌లు, గ్రేడ్‌–డి హోదాలో 37 విభాగాలు/శాఖల్లో 1,114 పోస్ట్‌లు ఉన్నాయి.

అర్హతలు
23.08.2023 నాటికి ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి.

వయసు
ఆగస్ట్‌ 1, 2023 నాటికి గ్రేడ్‌–సి పోస్ట్‌లకు 18–30 ఏళ్లు; గ్రేడ్‌–డి పోస్ట్‌లకు 18–27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

షార్ట్‌హ్యాండ్‌ అవసరం లేదు
స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగం, విధులను పరిగణనలోకి తీసుకుంటే.. షార్ట్‌హ్యాండ్‌/ టైపింగ్‌లో ఉత్తీర్ణత ఉండాలని భావిస్తారు. ఎస్‌ఎస్‌సీ తాజా నోటిఫికేషన్‌లో ఇలాంటి అర్హత నిబంధన ఏదీ లేదు. కాని ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే స్కిల్‌ టెస్ట్‌లో మాత్రం స్టెనోగ్రఫీ టెస్ట్‌ ఉంటుంది.

రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ
ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌–సి, గ్రేడ్‌–డి పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియను రెండు దశల్లో నిర్వహిస్తారు. అవి..రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌. నియామకాలు ఖరారు చేసే క్రమంలో రాత పరీక్షలో ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటారు. స్కిల్‌ టెస్ట్‌లోనూ నిర్దేశిత మార్కుల విధానాన్ని అనుసరిస్తారు. ఈ రెండింటినీ క్రోడీకరించి తుది జాబితా రూపొందించి ఎంపిక చేస్తారు. 

ssc stenographer grade c and d exam preparation tips in telugu
రాత పరీక్ష.. 200 మార్కులు

ఎంపిక ప్రక్రియలో తొలిదశ రాత పరీక్ష మూడు విభాగాల్లో 200 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌100 ప్రశ్నలు–100 మార్కులు.. ఇలా మొత్తం 200 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కులు కోత విధిస్తారు. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు.

తదుపరి దశ.. స్కిల్‌ టెస్ట్‌

  • రాత పరీక్ష తర్వాత దశలో నిర్వహించే పరీక్ష.. స్కిల్‌ టెస్ట్‌. ఇందులో అభ్యర్థులకు ఇంగ్లిష్, హిందీ భాషల్లో స్టెనోగ్రఫీ టెస్ట్‌ ఉంటుంది. 
  • ఇంగ్లిష్‌ భాషలో నిమిషానికి 100 పదాలు, హిందీ భాషలో నిమిషానికి 80 పదాలు ప్రాతిపదికగా డిక్టేషన్‌ ఇస్తారు. అభ్యర్థులు ఆ డిక్టేషన్‌ను నోట్‌ చేసుకుని.. దాన్ని కంప్యూటర్‌పై క్షుణ్నంగా టైప్‌ చేయాల్సి ఉంటుంది.
  • ఇంగ్లిష్‌ కంప్యూటర్‌ టైపింగ్‌కు సంబంధించి స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌–డి పోస్ట్‌ల అభ్యర్థులు 50 నిమిషాల్లో, గ్రేడ్‌–సి పోస్ట్‌ల అభ్యర్థులు 40 నిమిషాల్లో సదరు డిక్టేషన్‌ టైపింగ్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • హిందీకి సంబంధించి స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌–డి అభ్యర్థులు 65 నిమిషాల్లో, గ్రేడ్‌–సి అభ్యర్థులు 55 నిమిషాల్లో.. సదరు డిక్టేషన్‌ను క్యంపూటర్‌పై టైపింగ్‌ చేయాల్సి ఉంటుంది. 
  • అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమ భాష ప్రాధాన్యాన్ని పేర్కొనాల్సి ఉంటుంది.

గెజిటెడ్‌ హోదా
స్టెనో గ్రాఫర్‌ గ్రేడ్‌–సి(గ్రూప్‌–బి నాన్‌ గెజిటెడ్‌), స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌–డి(గ్రూప్‌–సి) పోస్ట్‌లకు ఎంపికైన వారు భవిష్యత్తులో పదోన్నతుల ద్వారా గెజిటెడ్‌ హోదాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఆయా శాఖల్లో సూపరింటెండెంట్‌ స్థాయి వరకు పదోన్నతులు లభిస్తాయి. ప్రారంభంలో గ్రేడ్‌–సి ఉద్యోగాలకు నెలకు రూ.9,300 – రూ.34,800 వేతన శ్రేణి, గ్రేడ్‌–డి పోస్టులకు నెలకు రూ.5,200–రూ.20,200 వేతన శ్రేణి లభిస్తుంది.

ssc stenographer grade c and d exam preparation tips in telugu
ప్రాక్టీస్‌తో సక్సెస్‌

ఎంపిక ప్రక్రియలో రాత పరీక్షలో ప్రతిభే కీలకం కానుంది. కాబట్టి అభ్యర్థులు సిలబస్‌ అంశాలను సమగ్రంగా పరిశీలించి పూర్తి స్థాయిలో ప్రిపరేషన్‌పై దృష్టిపెట్టాలి. కాన్సెప్ట్‌లపై అవగాహన పెంచుకోవడంతోపాటు ఎక్కువగా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌
ఈ విభాగంలో వెర్బల్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రాణించాలంటే.. సిరీస్‌(నంబర్‌/ఆల్ఫా న్యుమరిక్‌), అనాలజీస్, ఆడ్‌ మెన్‌ ఔట్, సిలాజిజమ్, మ్యాట్రిక్స్, డైరెక్షన్, వర్డ్‌ ఫార్మేషన్, బ్లడ్‌ రిలేషన్స్, నాన్‌ వెర్బల్‌ (వాటర్‌ ఇమేజ్, మిర్రర్‌ ఇమేజ్‌), కోడింగ్‌–డీకోడింగ్‌ అంశాలపై పట్టు సాధించాలి. అర్థగణిత అంశాలైన సింపుల్‌ ఇంట్రెస్ట్, కంపౌండ్‌ ఇంట్రెస్ట్, లాభ నష్టాలు, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, శాతాలను ప్రాక్టీస్‌ చేయాలి. అదే విధంగా త్రికోణమితి, అల్జీబ్రా, జామెట్రీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, టైం అండ్‌ వర్క్, టైం అండ్‌ డిస్టెన్స్‌లకు సంబంధించిన ప్రశ్నలను కూడా ప్రాక్టీస్‌ చేయాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌
జనరల్‌ అవేర్‌నెస్‌లో జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు మొదలు జనరల్‌ సైన్స్, ఎకానమిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ విభాగాలపై పట్టు సాధించాలి. హిస్టరీకి సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. జాగ్రఫీలో సహజ వనరులు, నదులు, పర్వతాలు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ఎకనామిక్స్‌కు సంబంధించి ఇటీవల కాలంలో ఆర్థిక వాణిజ్య రంగాల్లో కీలక పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైన పదజాలంపైనా పట్టు సాధించాలి.

ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. స్టాక్‌ జీకేలో ముఖ్యమైన వ్యక్తులు, తేదీలు, సదస్సులు, సమావేశాలు–వాటి తీర్మానాలు, అవార్డులు–విజేతలు వంటి సమాచారాన్ని ఔపోసన పట్టాలి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌
ఇందులో ముఖ్యంగా బేసిక్‌ గ్రామర్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్, యాక్టివ్‌/ప్యాసివ్‌ వాయిస్, డైరెక్ట్‌–ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్, స్పెల్లింగ్స్, స్పాటింగ్‌ ద ఎర్రర్స్‌ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. కాంప్రహెన్షన్‌కు సంబంధించి పేరా రీడింగ్‌పై పట్టు సాధించాలి. దినపత్రికలోని ఎడిటోరియల్స్, ముఖ్యాంశాలతో కూడిన వ్యాసాలను చదవాలి.

స్కిల్‌ టెస్ట్‌కు సంసిద్ధంగా
అభ్యర్థులు స్కిల్‌ టెస్ట్‌కు కూడా సంసిద్ధత పొందాలి. ఇందుకోసం ప్రతి రోజు నిర్దేశిత సమయంలో ప్రాక్టీస్‌ చేయాలి. ఆడియో, వీడియో మాధ్యమాల ద్వారా వ్యాఖ్యానాలను పది నిమిషాల్లో రాసుకుని.. వాటిని పరీక్షకు నిర్దేశించిన సమయంలో టైప్‌ చేయడాన్ని ప్రాక్టీస్‌ చేయాలి. ఇలా మొదటి నుంచే ప్రాక్టీస్‌ చేస్తే.. స్కిల్‌ టెస్ట్‌ సమయానికి పూర్తి సంసిద్ధత లభిస్తుంది.


ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 23.08.2023
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ: ఆగస్ట్‌ 24, 25 తేదీల్లో
  • ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేదీ: అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌.
  • వెబ్‌సైట్‌: https://ssc.nic.in/
Qualification 12TH
Last Date August 23,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories