Skip to main content

AP Police Recruitment 2022: 6,511 పోలీస్‌ కొలువులకు సిద్ధమా.. పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగార్థులకు మరో తీపి కబురు అందించింది. యూనిఫామ్‌ సర్వీసులో చేరాలనుకునే యువత తమ స్వప్నం సాకారం చేసుకునే సమయం వచ్చింది. పోలీస్‌ శాఖలో ఏకంగా 6,511 పోస్ట్‌ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది! మరికొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్‌ వెలువడే అవకాశముంది. అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ కసరత్తును ముమ్మరం చేసుకుంటే..కలల కొలువును సొంతం చేసుకోవచ్చు! ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భర్తీ చేయనున్న పోలీస్‌ పోస్ట్‌లు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌ తదితర అంశాలతో ప్రత్యేక కథనం..
ap police notification and exam pattern and syllabus and guidance
  • 6,511 పోలీస్‌ పోస్ట్‌ల భర్తీకి ఏపీ ప్రభుత్వ ఆమోదం
  • ఎస్‌ఐ 411 పోస్ట్‌లు, 6,100  ఉద్యోగాల భర్తీకి కసరత్తు
  • డిగ్రీతో ఎస్‌ఐ, ఇంటర్‌తో కానిస్టేబుల్‌ పోస్ట్‌లకు అవకాశం
  • మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం-పోలీస్‌ శాఖలో మొత్తం 6,511 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. వీటిల్లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌- సివిల్‌ పోస్టులు: 315; రిజర్వ్‌డ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఆర్‌ఎస్‌ఐ) పోస్టులు: 96; కానిస్టేబుల్‌-సివిల్‌ పోస్టులు: 3,580; కానిస్టేబుల్‌(ఏపీఎస్పీ) పోస్టులు: 2,520 ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియను ఏపీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ చేపట్టనుంది.

అర్హతలు

  • ఎస్‌ఐ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 
  • కానిస్టేబుల్‌ పోస్టులకు ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
  • గమనిక: గత నోటిఫికేషన్‌లో ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్మీడియెట్‌ రెండేళ్లు పూర్తి చేసుకుంటే(ఉత్తీర్ణత సాధించినా, సాధించకపోయినా) కానిస్టేబుల్‌ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.తాజా నియా మకాల విషయంలో ఈ వెసులుబాటుపై నోటిఫికేషన్‌లో స్పష్టత లభించే అవకాశం ఉంది.

చ‌ద‌వండి: AP Police Exams Study Material

నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ మొత్తం నాలుగు దశల్లో నిర్వహించనున్నారు. అవి.. తొలిదశ: ప్రిలిమినరీ రాత పరీక్ష; రెండో దశ: ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌; మూడో దశ: ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌; నాలుగో దశ: ఫైనల్‌ రిటెన్‌ ఎగ్జామినేషన్‌.

ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష

ఎస్‌ఐ పోస్ట్‌లకు తొలిదశ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు వందల మార్కులకు ఉంటుంది. రెండు పేపర్లుగా పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్‌1 అర్థమెటిక్‌ అండ్‌ టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీ 100 ప్రశ్నలు-100 మార్కులకు;పేపర్‌2 జనరల్‌ స్టడీస్‌ 100ప్రశ్నలు-100మార్కులకు జరుగుతుంది.

చ‌ద‌వండి: AP Police Exams Bitbank

రెండో దశ ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌

  • రెండో దశలో ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అభ్యర్థులు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగుండాలి.
  • పురుషులు: 167.6 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలి. ఛాతీ 86.3 సెంటీ మీటర్లు ఉండాలి. శ్వాస తీసుకున్నప్పుడు కనీసం మూడు సెంటీమీటర్లు పెరగాలి. మహిళలకు శారీరక ప్రమాణాల్లో సడలింపులు ఉంటాయి. వారికి కనీస ఎత్తును 152.5 సెంటీ మీటర్లుగా పేర్కొనే అవకాశం ఉంది.

 
ఫిజికల్‌ ఎఫిషీయన్సీ టెస్ట్‌

తొలిదశ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించి, ఆ తర్వాత ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌లోనూ విజయం సాధించిన వారికి తదుపరి దశలో ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌ వంద మార్కులకు ఉంటుంది. ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌లో భాగంగా నిర్వహించే ఈవెంట్లలోని 1600 మీటర్ల పరుగు పందెంలో తప్పనిసరిగా ఉత్తీర్ణత(నిర్దేశిత సమయంలో పూర్తి చేయడం) సాధించాలి.

చ‌ద‌వండి: AP Police Model Papers

ఫైనల్‌ రాత పరీక్ష

  • ప్రిలిమ్స్, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ మూడింటిలోనూ విజయం సాధించి.. మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి.. చివరగా ఫైనల్‌ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష నాలుగు పేపర్లలో ఉంటుంది. పేపర్‌ 1లో తెలుగు వంద మార్కులకు, పేపర్‌ 2లో ఇంగ్లిష్‌ వంద మార్కులకు; పేపర్‌ 3లో అర్థమెటిక్‌ అండ్‌ టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీ 200 మార్కులకు, పేపర్‌ 4లో జనరల్‌ స్టడీస్‌ 200 మార్కులకు ఉంటాయి. 
  • గమనిక: ఎస్‌ఐ పోస్ట్‌లకు గతంలో పేపర్‌-3,4లను 100 మార్కులకే నిర్వహించారు.
  • పేపర్‌-1, పేపర్‌-2లు ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ ప్రశ్నల కలయికగా, పేపర్‌-3, పేపర్‌-4లు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి.
  • పేపర్‌-1, పేపర్‌-2లను కేవలం అర్హత పేపర్లుగానే పేర్కొంటారు. 
  • పేపర్‌-3, పేపర్‌-4లలో పొందిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జాబితా రూపొందించి, నియామకాలు ఖరారు చేస్తారు.

చ‌ద‌వండి: ఈవెంట్స్‌లో విజయం సాధించండిలా...

కానిస్టేబుల్‌ ఎంపిక ప్రక్రియ ఇలా

  • కానిస్టేబుల్‌ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియ కూడా ఎస్‌ఐ పోస్ట్‌ల మాదిరిగానే నాలుగు దశల్లో ఉంటుంది. తొలిదశ ప్రిలిమినరీ పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తారు.
  • రెండో దశలో ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ ఉంటుంది. పురుష అభ్యర్థులు 167.6 సెం.మీ ఎత్తు, 86.3 సెం.మీ. ఛాతి కలిగుండాలి. మహిళా అభ్యర్థులు 152.5 సెం.మీ ఎత్తు ఉండాలి. 
  • ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ విజేతలకు ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. 
  • ఈ టెస్ట్‌ కూడా ఎస్‌ఐ పోస్ట్‌లకు నిర్వహించే ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ 100 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్, 1600 మీటర్ల పరుగు ఈవెంట్లలో ఉంటుంది. అభ్యర్థులు 1600మీటర్ల పరుగు పందెంలో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. 
  • ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ విజేతలకు చివరగా తుది రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష మూడు గంటల వ్యవధిలో 200 ప్రశ్నలు-200 మార్కులకు ఉంటుంది. ఏపీఎస్సీ కానిస్టేబుల్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు మాత్రం 200 ప్రశ్నలతో 100 మార్కులకే పరీక్ష నిర్వహిస్తారు.
  • ప్రిలిమినరీ, ఫైనల్‌ రాత పరీక్షల్లో.. ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్‌ సైన్స్, హిస్టరీ, కరెంట్‌ అఫైర్స్, రీజనింగ్, మెంటల్‌ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

చ‌ద‌వండి: AP Police Exams Study Material

విజయం సాధించాలంటే

ఏపీ పోలీస్‌ శాఖ చేపట్టే నియామకాలకు భారీగా పోటీ నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే రాత పరీక్షలో, ఫిజికల్‌ టెస్ట్‌లలో రాణించేందుకు కసరత్తు చేయాలి. 

అర్థమెటిక్‌

అభ్యర్థులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన విభాగం.. అర్థమెటిక్‌ అండ్‌ టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో ఈ విభాగం నుంచే వంద ప్రశ్నలు అడుగుతారు. అర్థమెటిక్‌లోని ముఖ్యాంశాలుగా భావించే సగటులు, కసాగు, గసాభా, సంఖ్యలు, వర్గ మూలాలు, ఘన మూలాలు, నిష్పత్తులు, భాగస్వామ్యం, వయసులు, శాతాలు, లాభ-నష్టాలు, చక్ర వడ్డీ, సరళ వడ్డీ, కాలం-దూరం, కాలం-పని వంటి వాటిపై పట్టు సాధించాలి. అదే విధంగా మ్యాథమెటిక్స్‌లోని ప్రాథమిక అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, మ్యాట్రిసెస్, సెట్స్‌-రిలేషన్స్‌ను ప్రత్యేకంగా ప్రాక్టీస్‌ చేయాలి. 

రీజనింగ్‌

అభ్యర్థులు మంచి మార్కులు సొంతం చేసుకునే అవకాశం ఉన్న విభాగం.. రీజనింగ్‌. ఇందులో నంబర్‌ సిరీస్, మిస్సింగ్‌ నెంబర్స్, కోడింగ్‌-డీకోడింగ్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, బ్లడ్‌ రిలేషన్స్‌ వంటి వాటిపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. వెన్‌ డయాగ్రమ్స్, అసెంప్షన్‌ అండ్‌ రీజన్, ఆర్గ్యుమెంట్, సిలాజిజమ్, డేటా సఫిషియన్సీ విభాగాల్లో పట్టుతో వెర్బల్‌ రీజనింగ్‌లో రాణించే అవకాశం ఉంది. ఆడ్‌మన్‌ ఔట్, డైస్‌ అండ్‌ క్యూబ్స్,వెన్‌ డయాగ్రమ్స్‌లపై పట్టుతో నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌లో వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నైపుణ్యం లభిస్తుంది. మెంటల్‌ ఎబిలిటీ విభాగంలో రాణించేందుకు టాబ్యులేషన్, డేటా సమీకరణ, డేటా విశ్లేషణలపై పట్టు సాధించాలి.

జనరల్‌ స్టడీస్‌

  • హిస్టరీకి భారత, ఏపీ చరిత్రకు సంబంధించి ముఖ్యమైన ఘట్టాలు, చరిత్ర గతిని మార్చిన సంఘటనలు, భారత స్వాతంత్య్ర ఉద్యమంలోని ప్రధాన ఘట్టాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి.
  • జాగ్రఫీలో భారత, ఏపీ భౌగోళిక స్వరూపం, సహజ వనరులు, నదులు, సముద్ర తీర ప్రాంతాలు, అడవులు, పంటలు, సాగు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • ఎకానమీకి సంబంధించి కోర్‌ ఎకనామీతోపాటు సమకాలీన అంశాలు, ఆర్థిక రంగంలో అమలవుతున్న కొత్త విధానాలపై స్పష్టత పెంచుకోవాలి.
  • పాలిటీకి సంబంధించి రాజ్యాంగం, రాజ్యాంగ రూపకర్తలు, రాజ్యంగంలోని ముఖ్యమైన అధికరణలు వంటి అంశాలతోపాటు తాజా రాజ్యాంగ సవరణలు, వాటి ఉద్దేశం, ప్రభావం వంటివి తెలుసుకోవాలి.
  • కరెంట్‌ అఫైర్స్‌లో జాతీయంగా,అంతర్జాతీయం గా ప్రాధాన్యం సంతరించుకున్న తాజా పరిణామాలు(ఉదా: క్రీడలు-విజేతలు, సదస్సులు, సమావేశాలు-తీర్మానాలు తదితర) గురించి అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా జాతీయ భద్రతకు సంబంధించి ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలు; భారత, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, ఆర్థికాభివృద్ధి అంశాలు, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం, పునర్విభజన సమస్యల గురించి అధ్యయనం చేయాలి.
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లక్షిత వర్గాలు, లబ్ధిదారులు, బడ్జెట్‌ కేటాయింపుల గురించి తెలుసుకోవాలి.

'ఉమ్మడి' అభ్యర్థులు

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ రెండు పోస్ట్‌లకు పోటీ పడే అభ్యర్థులు ఉమ్మడి వ్యూహాలు అనుసరించడం ఉపయుక్తంగా ఉంటుంది. రెండు శాఖల్లోని పోస్ట్‌లకు ఉమ్మడి పేపర్‌గా ఉన్న జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ పేపర్‌కు ఈ విధానం మరింత ఉపయుక్తంగా ఉంటుంది.ఉమ్మడి ప్రిపరేషన్‌ సాగిస్తూనే.. వేర్వేరు సబ్జెక్ట్‌లలో నిర్వహించే మిగతా పేపర్లకు ప్రత్యేక సమయం కేటాయించుకోవాలి. ఆ తర్వాత సిలబస్‌లోని అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తూ..ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధత పొందేలా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. 

Published date : 05 Nov 2022 01:22PM

Photo Stories