ఈవెంట్స్‌లో విజయం సాధించండిలా...
సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ప్రాథమిక పరీక్ష ఫలితాలను ఇటీవల వెల్లడించింది. మొత్తం 1,217 ఎస్‌ఐ పోస్టులకు ఆగస్టు 26న నిర్వహించిన రాతపరీక్షకు 1,77,992 మంది హాజరు కాగా, అందులో 1,10,635 మంది ఉత్తీర్ణత సాధించారు. అర్హులైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలునిర్వహించనున్నారు. అందులోనూ అర్హత సాధిస్తే తుది రాత పరీక్షకు పిలుస్తారు.
ఎస్‌ఐ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పార్ట్-2 ఆన్‌లైన్ దరఖాస్తు సౌకర్యం www.tslprb.in అధికారిక వెబ్‌సైట్లో త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ దరఖాస్తు ప్రక్రియలో పొందుపరిచే వివరాల ఆధారంగా ఈవెంట్స్ తేదీలు, నిర్వహించే ప్రదేశం తదితర వివరాలు అభ్యర్థులకు తెలియజేస్తారు. పార్ట్ 2 దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ధ్రువప్రతాలు...
- పదో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు.
- డిగ్రీ ఉత్తీర్ణులు కాని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణత మెమోతోపాటు మూడేళ్ల డిగ్రీ స్టడీ/బోనఫైడ్ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలి.
- కుల ధ్రువీకరణ పత్రం.
- నాన్ క్రిమీలేయర్‌కు చెందిన బీసీ విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన సదరు సర్టిఫికెట్.
- ఆదివాసీ ప్రాంతాలకు చెందిన ఎస్టీ అభ్యర్థులు ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్.
- ప్రభుత్వ ఉద్యోగులైతే సంబంధిత సర్వీస్ సర్టిఫికెట్.
- ఇతర స్పెషల్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు.. సంబంధిత స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయాలి.
- ఎన్‌సీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ కేటగిరీల వారు సంబంధిత సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలి.
- త్రివిధదళాల్లో పనిచేసే సిబ్బంది నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాలి.
- స్టడీ/బోనఫైడ్ సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.
ఈవెంట్స్ ఒక్కసారే :
ప్రభుత్వం భారీ సంఖ్యలో పోలీసు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్‌ఐ-1217, కానిస్టేబుల్-16,925 కొలువులతోపాటు మరికొన్ని ఇతర పోలీసు ఉద్యోగాలకు కూడా ప్రకటన విడుదల చేసింది. కొందరు అభ్యర్థులు కానిస్టేబుల్, ఎస్‌ఐ, కమ్యూనికేషన్, ఫింగర్‌ప్రింట్ ఏఎస్‌ఐ వంటి పలు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి ఉమ్మడిగా ఒకేసారి ఈవెంట్స్ నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థులు ఈవెంట్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. దేహదారుఢ్య పరీక్షల్లో ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), తర్వాత ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ) నిర్వహిస్తారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఈవెంట్స్ ఒకేవిధంగా ఉంటాయి. పీఈటీ దశ దాటడం చాలా కీలకం. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు తుదిదశలో రాత పరీక్ష నిర్వహిస్తారు.
- 800 మీటర్ల రన్నింగ్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలి.
- సివిల్ ఎస్‌ఐ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్, సివిల్ కానిస్టేబుల్స్, ఫైర్‌మెన్, వార్డర్స్ పోస్టులకు మిగతా 4 (100 మీటర్ల రన్నింగ్, లాంగ్‌జంప్, షాట్‌పుట్, హైజంప్) ఈవెంట్స్‌లో.. రెండు ఈవెంట్స్‌లో అర్హత సాధిస్తే సరిపోతుంది.
- టీఎస్‌ఎస్‌పీ, ఏఆర్, ఎస్‌ఏఆర్ సీపీఎల్ కేటగిరీ ఎస్‌ఐ, కానిస్టేబుల్స్ పోస్టులకు అన్ని ఈవెంట్స్‌లో అర్హత తప్పనిసరి. తుది జాబితా రూపకల్పనలో వీటికి వెయిటేజీ ఉంటుంది. ఈవెంట్స్ మెరిట్ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. ఈ పోస్టులకు ఫిజికల్ టెస్ట్‌లోని మెరిట్, రాత పరీక్షలోని మార్కులు.. రెండింటి ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- 100 మీటర్ల పరుగు తప్పనిసరి. మిగతా రెండు (లాంగ్‌జంప్, షాట్‌పుట్) ఈవెంట్లలో ఒకదాంట్లో అర్హత సాధించినా సరిపోతుంది.
- ఏఆర్ పోస్టులకు ఒక్కో ఈవెంట్‌కు 25 మార్కులు చొప్పున మూడు ఈవెంట్స్‌కు 75 మార్కులు కేటాయించారు. ఏఆర్ పోస్టులకు అన్ని ఈవెంట్లలో తప్పనిసరిగా అర్హత సాధించాలి.
- సివిల్ ఎస్‌ఐ, కానిస్టేబుల్స్ పోస్టులకు రాత పరీక్షలో మార్కుల అధారంగా ఎంపిక ఉంటుంది. ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ, ఎస్‌ఏఆర్ సీపీఎల్ పోస్టులకు ఫిజికల్ టెస్ట్‌లోని మెరిట్, రాత పరీక్షలోని మార్కులు రెండింటి ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
- ఈసారి సివిల్‌తోపాటు ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ, ఎస్‌ఏఆర్ సీపీఎల్ పోస్టుల ఖాళీలు ఎక్కువగా ఉండటం వల్ల ఫిజికల్ ఈవెంట్స్‌లో మెరిట్ సాధించిన అభ్యర్థులు కొంత సులువుగానే ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు.
పురుష అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షలు (పీఈటీ) (ఎస్‌ఐ, కానిస్టేబుల్స్)...
అంశం |
అర్హత సమయం/దూరం |
1. 100 మీ. రన్నింగ్ |
15 సెకన్లు |
2. లాంగ్‌జంప్ |
3.80 మీ. |
3. షాట్‌పుట్ (7.26 కిలోలు) |
5.60 మీ. |
4. హైజంప్ |
1.20 మీ. |
5. 800 మీ. రన్నింగ్ |
170 సెకన్లు |
మహిళా అభ్యర్థుల శారీరక సామర్థ్య పరీక్షలు (ఎస్‌ఐ, కానిస్టేబుల్స్) :
అంశం |
అర్హత సమయం/దూరం |
1.100 మీ. రన్నింగ్ |
20 సెకన్లు |
2.లాంగ్‌జంప్ |
2.50 మీ. |
3.షాట్‌పుట్ (4 కిలోలు) |
3.75 మీ. |
ప్రణాళిక ప్రకారం సాధన :
- శారీరక పరీక్షలు గట్టెక్కడం అత్యంత కీలకం. కష్టపడి ప్రాక్టీస్ చేస్తేనే ఈవెంట్లు దాటతారనే విషయాన్ని గుర్తించి ప్రణాళిక ప్రకారం సాధన చేయాలి.
- అభ్యర్థులు ముందుగా పరుగులో వేగం పెంచుకోవడానికి శ్వాసపై నియంత్రణా సామర్థ్యాన్ని పెంచుకోవాలి. రోజూ 30 నుంచి 40 నిమిషాల పాటు పరుగును క్రమేణా ప్రాక్టీస్ చేయాలి. పరుగును ప్రారంభించే ముందు వామప్స్ వల్ల శరీరం వేడెక్కి దేహ దారుఢ్య సాధన తేలికవుతుంది.
- వారంలో ఒకసారి తప్పనిసరిగా లాంగ్న్ ్ర5-6 కిలోమీటర్లకు తగ్గకుండా సాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
800 మీటర్ల పరుగు :
అభ్యర్థులు తొలుత 200 మీ. పరుగును సాధన చేయాలి. రోజుకు ఆరుసార్లు చేయాలి. తర్వాత రోజుకు మూడుసార్లు 400 మీటర్లు, తర్వాత మూడుసార్లు 1000 మీటర్లను సమయంతో సంబంధం లేకుండా పరుగెత్తాలి. ఇలా మొదటి రెండు వారాల వరకు సమయ నిబంధన లేకుండా సాధన చేయాలి. తర్వాత సమయం పెట్టుకొని 200 మీ., 400 మీ., 800 మీ. ప్రాక్టీస్ చేయాలి. తర్వాత 800 మీటర్ల పరుగును 170 సెకన్లలోపు వచ్చేలా ప్రాక్టీస్ చేయడం వల్ల తుదిదశలో విజయం సాధించేందుకు వీలుంటుంది.
లాంగ్ జంప్ :
లాంగ్ జంప్‌కు ముందుగా పవర్ లెగ్‌ను సరిచూసుకోవాలి. జంప్‌కు టేకాఫ్ తీసుకోవడానికి అభ్యర్థులకు కుడికాలు లేదా ఎడమకాలు ఏది అనువుగా ఉందో పరీక్షించుకోవాలి. 7 అడుగులు, 15 అడుగులు, 21 అడుగులు.. ఇలా దూరం పెంచుతూ సాధన చేయాలి. రోజూ అయిదు నుంచి పదిసార్లు సాధన చేయడం మంచిది.
హైజంప్ :
హైజంప్‌లో 1.20 మీటర్ల ఎత్తును అర్హతగా నిర్ణయించారు. ఈ ఎత్తును జంప్ చేయడానికి మూడుసార్లు అవకాశమిస్తారు. అభ్యర్థులు బెల్లీ పద్ధతిలో సాధన చేయడం ద్వారా ఎక్కువ ఎత్తు జంప్ చేయొచ్చు. హైజంప్ ప్రాక్టీస్‌ను ముందుగా 100 సెం.మీ., 1.10 మీ., 1.20 మీ., 1.30 మీ., ఫైనల్‌గా 1.40 మీ.కు పెంచుకుంటూ ప్రాక్టీస్ చేయాలి.
100 మీటర్ల పరుగు :
100 మీటర్ల పరుగు.. ముందుగా 30 మీటర్ల పరుగును రోజుకు ఆరు నుంచి పదిసార్లు; 80 మీటర్ల పరుగును రోజుకు ఎనిమిదిసార్లు.. ఇలా పెంచుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. రోజూ రన్నింగ్ చేస్తూ, రోజు విడిచి రోజు ఈవెంట్స్‌ను సరిచూసుకోవాలి.
షాట్‌పుట్ :
షాట్‌పుట్ ప్రాక్టీస్‌కు ముందు రిస్ట్ ఎక్సర్‌సైజ్, వామప్స్ తప్పనిసరి. షాట్‌పుట్‌ను చేత్తో పట్టుకునే విధానం ముఖ్యం. చేత్తో షాట్‌పుట్‌ను తీసుకున్నప్పుడు చేతి వేళ్ల మధ్య గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. షాట్‌పుట్‌ను కుడిచేత్తో విసిరే ముందు అభ్యర్థి ఎడమ చేయి తప్పనిసరిగా ముందుకు చూపించాలి. షాట్‌పుట్ వేయడంలో బాడీబెండ్ చేయడం, ఎడమ చేతిని ముందుకు చాపడం, కుడి చేతి ద్వారా విసరడం, ఎడమ కాలు ముందుకు, కుడి కాలు వెనక్కు ఉంచడం ముఖ్యమైనవి. ఇలా రోజూ పదిసార్లు చేయాలి.
- అభ్యర్థులు రన్నింగ్ కోసం బ్రాండెడ్ స్పోర్ట్స్ షూను ఉపయోగించాలి. తప్పనిసరిగా టీ షర్టు ధరించి, ప్రాక్టీస్ ప్రారంభించాలి.
- సిగరెట్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి.
- రోజూ ఉడికించిన గుడ్లు, డ్రైఫ్రూట్స్, మొలకెత్తిన గింజలు.. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
- సెలక్షన్స్‌లో ఒకేరోజు అన్ని ఈవెంట్స్ నిర్వహిస్తారు. కాబట్టి రోజు విడిచి రోజు తప్పనిసరిగా ఈవెంట్స్‌ను సరిచూసుకోవాలి.
- అభ్యర్థులు గ్రౌండ్‌కు ప్రాక్టీస్‌కు వెళ్లే ముందు తప్పనిసరిగా సపోర్టర్ ధరించాలి.
- రోజూ ఉదయం 5 గంటల నుంచి 7.30, సాయంత్రం 5 గంటల నుంచి 7 వరకు ప్రాక్టీస్ కోసం కేటాయించాలి. మిగతా సమయంలో రాతపరీక్షకు ప్రిపరేషన్ కొనసాగించాలి.
పీఈటీలో రాణింపుతోనే ఉద్యోగావకాశం... గత నోటిఫికేషన్‌లో 80 వేల మంది అభ్యర్థులు ప్రాథమిక దశ దాటితే.. వారిలో సుమారు 50 వేల మంది ఈవెంట్స్‌లో వెనుదిరిగారు. కాబట్టి అభ్యర్థులు గ్రౌండ్‌లో శ్రమిస్తేనే ఉద్యోగ అవకాశం ఉంటుంది. ఈవెంట్స్‌లో మెరిట్ సాధిస్తే ఏఆర్, టీఎస్‌ఎస్‌ీపీ, ఎస్‌ఏఆర్ సీపీఎల్ పోస్టులను సులువుగా దక్కించుకోవచ్చు. ఈ దశ దాటితేనే తుది రాత పరీక్షకు అర్హత లభిస్తుంది. పరీక్ష పేపర్లు కూడా కఠినంగా ఉంటున్నా యి. తుది పరీక్షలో లాంగ్వేజ్ పేపర్లు కూడా ఉంటాయి. కాబట్టి గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూనే చదువుకు సమయం కేటాయించాలి. - మాల్యాద్రి రెడ్డి, డెరైక్టర్, భాగ్యనగర్ ఇన్‌స్టిట్యూట్. |