SBI CBO Notification 2023: 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు.. ఆన్‌లైన్ టెస్ట్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక
- 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్ట్‌లకు ఎస్‌బీఐ ప్రకటన
- డిగ్రీ అర్హతతో పోటీ పడే అవకాశం
- ప్రారంభంలో రూ.36 వేల వేతనం, ఇతర భత్యాలు
- రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ
16 సర్కిల్స్.. 5,447 పోస్ట్‌లు
ఎస్‌బీఐ తాజా నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 16 సర్కిల్స్‌లో 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్ట్‌లను భర్తీ చేయనుంది. వీటిల్లో 167 బ్యాక్‌లాగ్ పోస్టు కూడా ఉన్నాయి. గతేడాది 1,422 సీబీవో పోస్ట్‌లకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ సంవత్సరం 5,447 పోస్ట్‌లకు ప్రకటన ఇవ్వడం విశేషం.
అర్హతలు
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు ఆయా సర్కిళ్ల పరిధిలోని రాష్ట్రాల్లో ఏదైనా ఒక రాష్ట్రంలోని ఖాళీలకే దరఖాస్తు చేసుకోవాలి.
- పని అనుభవం: 31.10.2023 నాటికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్‌గా కనీసం రెండేళ్ల ఉద్యోగ అనుభవం తప్పనిసరి. నిబంధనల ప్రకారం డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాతే ఈ అనుభవం పొంది ఉండాలి.
- వయసు: 31.10.2023 నాటికి 21–30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
- వేతనం: ప్రారంభ వేతన శ్రేణి రూ.36,100–రూ.63,840గా ఉంటుంది.
ఎంపిక విధానం
సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్ట్‌లకు చేపట్టే నియామక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. తొలుత ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత సర్టిఫికెట్ల స్క్రీనింగ్ ఉంటుంది. చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
రాత పరీక్షకు 120 మార్కులు
ఎంపిక ప్రక్రియ తొలి దశలో రాత పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు–30 మార్కులు, బ్యాంకింగ్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు–40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్/ఎకానమీ 30 ప్రశ్నలు–30 మార్కులు, కంప్యూటర్ అప్టిట్యూడ్ 20 ప్రశ్నలు–20 మార్కులు.. ఇలా మొత్తం 120 ప్రశ్నలు–120 మార్కులకు ఆన్‌లైన్ టెస్ట్ జరుగుతుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు. నెగిటివ్ మార్కుల విధానం లేదు.
చదవండి: IB ACIO Notification 2023: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 పోస్టులు.. పరీక్ష విధానం ఇదే..
డిస్క్రిప్టివ్ టెస్ట్
మొదటి దశలోని రాత పరీక్షలో భాగంగానే ఆబ్జెక్టివ్ పరీక్ష ముగిసిన తర్వాత ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై 50 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ 50 మార్కులకు ఉంటాయి. ఈ పరీక్షకు కేటాయించిన సమయం 30 నిమిషాలు.
సర్టిఫికెట్ల స్క్రీనింగ్
ఎంపిక ప్రక్రియ రెండో దశలో.. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల దరఖాస్తులను, సర్టిఫికెట్లను ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది. అప్పటికే వారు చేస్తున్న ఉద్యోగం, ఇతర అర్హతల వివరాలను పరిశీలిస్తారు.
పర్సనల్ ఇంటర్వ్యూ
రాత పరీక్ష, స్క్రీనింగ్ దశల్లో మెరిట్ జాబితాలో నిలిచిన వారికి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను గుర్తించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఖాళీలకు అనుగుణంగా.. ఒక్కో పోస్ట్‌కు ముగ్గురిని చొప్పున చివరి దశ పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి 50 మార్కులు కేటాయించారు. అభ్యర్థులకు బ్యాంకింగ్ రంగంపై ఉన్న ఆసక్తి, సమకాలీన పరిణామాలపై అవగాహన, బ్యాంకింగ్ రంగ పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా ఈ ఇంటర్వ్యూ ఉంటుంది.
చదవండి: Bank Exam Preparation: 8,773 జూనియర్ పోస్టులు.. పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్ వివరాలు ఇవే..
వెయిటేజీ విధానం
తుది ఎంపికలో వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తారు. రాత పరీక్షలో ప్రతిభకు 75 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూలో సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పిస్తారు. అంటే..170 మార్కులకు నిర్వహించే రాత పరీక్షలో పొందిన మార్కులను 75 శాతానికి.. 50 మార్కులకు జరిపే ఇంటర్వ్యూలో పొందిన మార్కులను 25 శాతానికి మదింపు చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రాల వారీగా తుది విజేతలను ఖరారు చేస్తారు.
లాంగ్వేజ్ టెస్ట్
అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి చెందిన భాషకు సంబంధించిన పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూల్లో విజయం సాధించి.. మెరిట్ జాబితాలో నిలిచిన వారికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే నియామకం ఖరారు చేస్తారు. పదో తరగతి, 12వ తరగతిని సంబంధిత రాష్ట్రానికి చెందిన మాతృ భాషలో చదివిన వారికి ఈ లాంగ్వేజ్ టెస్ట్ నుంచి మినహాయింపు కల్పిస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 12.12.2023
- ఆన్‌లైన్ టెస్ట్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2024 జనవరిలో
- ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 2024 జనవరిలో
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
- ఆన్‌లైన్ దరఖాస్తు, పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://bank.sbi/web/careers
విజయం సాధించాలంటే
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఈ విభాగంలో రాణించాలంటే.. ఇంగ్లిష్‌లో బేసిక్ గ్రామర్‌తో మొదలు పెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
జనరల్ ఎవేర్‌నెస్/ఎకానమీ
ఆర్థిక, వాణిజ్య, వ్యాపార పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్జ్‌లో ఆర్థిక సంబంధ వ్యవహారాల(ఎకానమీ,ప్రభుత్వ పథకాలు) కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఎకానమీకి సంబంధించి జీడీపీ మూల భావనలు,సమ్మిళిత వృద్ధి, మైక్రో, మాక్రో ఎకనామిక్స్ భావనలు తెలుసుకోవాలి.
చదవండి: Groups Preparation Tips: 'కరెంట్ అఫైర్స్'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!
బ్యాంకింగ్ నాలెడ్జ్
బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో తాజా పరిణామాలు, బ్యాంకుల విధి విధానాల్లో మార్పులు, అవి కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్‌కు సంబంధించి చట్టాలు, విధానాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటిపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలి.
కంప్యూటర్ ఆప్టిట్యూడ్
కంప్యూటర్ ఆపరేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్ షాట్ కట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర) గురించి తెలుసుకోవాలి. అదే విధంగా కంప్యూటర్ పదజాలం, బ్యాంకింగ్ రంగంలో వినియోగించే సాఫ్ట్‌వేర్‌ల గురించి అవగాహన ఏర్పరచుకోవాలి.
డిస్క్రిప్టివ్ టెస్ట్
డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో ఉండే లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్‌లో రాణించడానికి బిజినెస్ లెటర్స్, అఫిషియల్ లెటర్స్, పర్సనల్ లెటర్స్‌ను రాయడం అలవర్చుకోవాలి. ఎస్సే రైటింగ్‌కు సంబంధించి బ్యాంకింగ్ రంగ పరిణామాలకు ప్రాధాన్యమిస్తూ వ్యాసాలు రాయగలిగే నేర్పు సాధించాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దిన పత్రికల్లో ప్రచురించే బిజినెస్ న్యూస్, అనాలిసిస్‌లను పరిశీలించడం ఉపయుక్తంగా ఉంటుంది. వాటిని విశ్లేషించి సారాంశాన్ని గ్రహించి ఎస్సే రాయగలిగే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
జేఎంజేఎస్–1 హోదా
సీబీఓ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన వారికి జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్–1 హోదాలో కొలువు ఖరారు చేస్తారు. ఆరు నెలల పాటు ప్రొబేషన్ ఉంటుంది. ఈ ప్రొబేషన్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా శాశ్వత నియామకం ఖరారు చేస్తారు. ఇలా శాశ్వత నియామకం ఖరారు చేసుకున్న వారికి జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్–1 హోదా కల్పిస్తారు. రూ.36 వేల మూల వేతనంతో కెరీర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ప్రతిభ, పనితీరు ఆధారంగా చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు.
Qualification | GRADUATE |
Last Date | December 12,2023 |
Experience | 2 year |
For more details, | Click here |
Tags
- SBI CBO Notification 2023
- bank jobs
- sbi circle based officer jobs
- State Bank of India
- SBI Recruitment 2023
- Personal interview
- english language
- latest notifications
- Govt Jobs
- New Vacancy 2023
- Employment News
- Job Opening in SBI
- JobNotification
- saksi education jobnotifications
- SelectionProcess
- InterviewTips
- EducationalQualification
- Recruitment
- latest jobs in 2023